Saturday, December 31, 2011
Thursday, December 29, 2011
ప్రయాణం
అటక మీద పెట్టెలన్నీ
నట్టింటికి చేరాయి!
పయనమయ్యే వస్తువులేవో
పెట్టెలోన కూర్చున్నాయి!
అలసి సొలసిన ఇస్త్రీపెట్టె
పగటి నిద్రకు జోగుతోంది!
గోడుకున్న కిటికీలన్నీ
తెరల మాటున తప్పుకున్నాయి!
అరలోని తాళం కప్ప
తలుపు గడియను చేరింది!
ఒంటరియైన ఇల్లు మాత్రం
దిగులు మొహం వేసుకుంది!!
నట్టింటికి చేరాయి!
పయనమయ్యే వస్తువులేవో
పెట్టెలోన కూర్చున్నాయి!
అలసి సొలసిన ఇస్త్రీపెట్టె
పగటి నిద్రకు జోగుతోంది!
గోడుకున్న కిటికీలన్నీ
తెరల మాటున తప్పుకున్నాయి!
అరలోని తాళం కప్ప
తలుపు గడియను చేరింది!
ఒంటరియైన ఇల్లు మాత్రం
దిగులు మొహం వేసుకుంది!!
Friday, December 23, 2011
పసి మనసులు
ఆకాశం మబ్బుపట్టి
ఇప్పుడో ఇంకాసేపటికో వర్షం వచ్చేలా ఉంది.
చీకటి, నగరానికి నల్ల దుప్పటి కప్పుతోంది. రాజు, వెంకట్రావ్ డాబా మీద రాజు
గదిలో కూర్చుని వున్నారు.
“రేఖా థియేటర్ లో
కొత్త ఇంగ్లిష్ సినిమా ఉంది వెళ్దామా?” అడిగాడు రాజు.
“ఇప్పుడా? ఫస్ట్ షో
మొదలై ఉంటుందిగా,” స౦దేహం వెలిబుచ్చాడు వెంకట్రావ్.
“ఫస్ట్ షోకి కాదు
సెకండ్ షోకి వెళ్దా౦” అన్నాడు రాజు కిటికీ తరుపు తెరిచి ఆకాశం వైపు చూస్తూ..
“సెకండ్ షోకా! ఇవాళ
కోణార్క్ కి మా ఆవిడ వస్తుంది, స్టేషన్‌కి వెళ్ళాలి, పోనీ రేపెళదామా?” అంటూ
సిగిరెట్ వెలిగించాడు వెంకట్రావ్.
“అలాగేలే ముందు
బాబాయి హోటలకి వెళ్లి భో౦చేద్దాం పద”. అరలో ఉన్న తాళం చేతిలోకి తీసుకుని తలుపు
తెరిచి పట్టుకున్నాడు రాజు. వెంకట్రావ్ లేచి లైటర్ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చి
చెప్పులు వేసుకున్నాడు. తలుపు తాళం వేసాక ఇద్దరూ మెట్లు దిగి వీధిలోకి వచ్చారు. రోడ్డు మీద పడుకున్న నల్లకుక్క ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ ముడుచుకుని పడుకుంది.
ఇద్దరూ హోటలకి వెళ్లి కూర్చుని రెండు మీల్స్
ఆర్డరిచ్చారు. సర్వర్ గ్లాసులు పెట్టి నీళ్ళు పోశాడు. “ఆ సినిమా చాలా భయంకరంగా ఉందట్రా,”
పక్క టేబుల్ దగ్గర మాటలు వినిపించి అటువైపుగా చూసాడు రాజు. నలుగురు కుర్రాళ్ళు
కూర్చుని ఉన్నారు. ఎర్ర చొక్కా వేసుకున్న అబ్బాయి చెప్తున్నాడు. “దయ్యాలు, సినిమా చూసిన
వాళ్ళను కూడా వదలడం లేదట. నిన్న రాత్రి మా వీధిలో రవణా రెడ్డి వెళ్లాడు. రాత్రి
నుంచి భయంతో మంచం దిగట్లేదు.” “నువ్వు మరీ చెప్తావ్ సినిమా చూసి ఎవరన్నా జ్వరం
తెచ్చుకు౦టారా? మాకు పిరికి మందు పోయకు,” అన్నాడు పచ్చ చొక్కా. “కాదురా అందులో
దెయ్యాలు, సినిమా చూసిన వాళ్ళను పట్టి పీడిస్తున్నాయట. ఎవరైనా వంటరిగా వెళితే ఇంటి వరకూ
వెంబడించి మారీ చంపేస్తున్నాయట.” అన్నాడు నీలం చొక్కా.
సర్వర్ రెండు ప్లేట్ లు తెచ్చి రాజు వాళ్ళ
ముందు పెట్టాడు. “వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఇందాక నువ్వు వెళ్దామన్న సినిమా గురించేనా?”
అన్నాడు వెంకట్రావ్ అన్నంలో సా౦బారు కలుపుతూ.
“ఆ..ఆ అదే అనుకుంటా”
ఇద్దరు భోజనం పూర్తయ్యి
బయటకు వచ్చారు. “ఎనిమిదవుతోంది నీకు టైమవుతు౦దేమో, స్టేషన్ కు వెళ్ళడానికి ఓ అరగంట
పడుతు౦దిగా” అంటూ దారిన పోతున్న రిక్షాని ఆపాడు రాజు. “రేపుదయం నీ గదికి వస్తాను మనం కలిసే ఆఫీసుకి
వెళ్దాం,” అంటూ ఎక్కి కూర్చున్నాడు వెంకట్రావ్. రిక్షా వీధి మలుపు తిరిగే వరకూ
చూసి ఇంటి దారి పట్టాడు రాజు.
“ఇంకా ఎనిమిదే ఇప్పుడే వెళ్లి చేయల్సినదేమీ లేదు. పోనీ సినిమాకే వెళ్దామని” హాలు వైపు తిరిగాడు రాజు. మబ్బు పట్టి ఉందేమో దారంతా గుడ్డి
వెలుగు. థియేటర్ దగ్గరకు వెళ్ళేసరికి నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే సినిమా మొదలయ్యిందే
అనుకుంటూ ఒక టికెట్ కొనుక్కుని లోపలి వెళ్లాడు. లోపలంతా చీకటిగా ఉంది, వెతుక్కుంటూ
వెళ్లి ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
సినిమా సగంయ్యాక తలనొప్పిగా అనిపించి బయటకు
వచ్చాడు రాజు. బయట గేట్ దగ్గర ఎవరూ లేరు. ఎప్పుడూ ఉండే షాపు కూడా మూసేసి ఉంది. ఇక సినిమా
చూడాలనిపించక, తలనొప్పి టాబ్లెట్ వేసుకు౦టే కాని తగ్గేలా లేదని ట్రంక్ రోడ్డు మీదకు
వచ్చి ‘విష్ణు మెడికల్స్’ వైపు చూసాడు. షాపు కొంచెం సేపట్లో మూసేస్తారన్నదానికి గుర్తుగా షట్టర్ సగం వేసి ఉంది. త్వరత్వరగా అడుగులు వేస్తూ షాపులోకెళ్ళి ‘అనాసిన్’
కొన్నాడు. రాత్రి పదకొండు కావొస్తు౦దేమో అన్ని
షాపులు మూసేసి ఉన్నాయి. అతని గది నాలుగు వీధులవతలే.
రోడ్డు మీద ఒక్క వీధిలైటు వెలగడంలేదు. ఆ వీధిలో
అన్నీ పెంకుటిళ్ళు ఉన్నట్లునాయి. ఒక ఇంటి ముందు వేపచెట్టు గాలికి ఊగుతూ ఉంది. చీకటిలో
జాగ్రతగా నడుస్తూ వెళ్తున్నాడు రాజు. తనకు సమాంతరంగా ఎవరో వస్తున్నట్లనిపించి ఆగి
చూశాడు. తన పక్కన కాదు పక్కనున్న ఇంటి పె౦కుల మీద తెల్లని ఆకారం గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. రాజుకు నీలం చొక్కా అబ్బాయి మాట్లలు గుర్తొచ్చాయి. ఒక్కసారి తల విదిలించి మళ్ళీ
చూసాడు, పక్షి ఒకటి ఎగురుతూ వెళ్ళింది. అప్పుడప్పుడూ పైకి చూస్తూ
ఇంటి దగ్గరకు వచ్చాక, తాళం తీసి లోపలకు వెళ్లాడు.
తరువాత రోజు ఉదయం ఆఫీసు వెళ్ళడానికి
వెంకట్రావ్ వచ్చి తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుంది..లోపలకి వెళ్లి చూసేసరికి
గదంతా చిందరవందరగా ఉంది. మంచం మీద కనుగుడ్లు బయటకు వచ్చి చలనం లేకుండా పడి ఉన్నాడు
రాజు.
*******
కథ చెప్పడం
పూర్తయినా ఆ క్లాసులో ఎవరూ కదలలేదు. ఆఖరి బెంచీలో కూర్చున్న గీత మొహంలో భయం
స్పష్టంగా కనిపిస్తోంది.
“టీచర్ దెయ్యాలు
నిజంగా ఉంటాయా?” గీత పక్కన కూర్చున్న రేష్మ అడిగింది.
“ఆ..నిజంగా ఉంటాయి”
నాన్సీ టీచర్.
“అవి అర్ధరాత్రి
పన్నెండు గంటలకు వస్తాయట” అమాయకమైన పెద్ద కళ్ళతో భయంగా చూస్తూ చెప్పాడు కృష్ణ.
“అవును దెయ్యాలు
వచ్చేప్పుడు గజ్జెల శబ్దం కూడా వినిపిస్తుంది” చెప్పి౦ది టీచర్.
“దెయ్యాలకు కాళ్ళు
ఉండవట, మా బామ్మ చెప్పింది” చెప్పాడు సత్య.
“ఏం కాదు, వాటికి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయట” ముందు బెంచీలోని రాణి
చెప్పింది.
“సరే సరే ఇక
దెయ్యాల గురించి చాలు పుస్తకాలు లోపల పెట్టుకోండి”. తను చెప్పిన విషయాలు ఆ ఆరేళ్ళ
పిల్లల మనసులో ఎలాంటి భయాలు రేపుతాయో తెలియని టీచర్ పిల్లలందరినీ దగ్గరుండి బస్సు
ఎక్కించింది.
********
“ఒళ్ళు కాలిపోతుంది,
రెండు రోజుల్నించీ మూసిన కన్ను తెరువడం లేదు పైగా ఒకటే కలవరింతలు. రేపు డాక్టర్
దగ్గరకు తీసుకెళదాం.” అంది అమ్మ . ఆ మాటలు వింటూ పక్కకు తిరిగి పడుకుంది గీత. అమ్మ
తలుపులన్నీ వేసి గీతకు దుప్పటి కప్పి లైటు ఆర్పి పడుకుంది. ఆ ఇంటి వరండాలో అటూ ఇటూ
అమ్మా నాన్న మంచాలు, మధ్యలో గీత మంచం. నాన్న దగ్గర తమ్ముడు పడుకున్నాడు.
దాహంగా అనిపించి
కళ్ళు తెరిచింది గీత. తనెక్కడు౦దో అర్ధం కాలేదు, ఎదురుగా ప్రహరీ గోడమీద తెల్లని
ఆకారం కూర్చుని, తల ముదుకు వెనక్కూ ఊపుతూ..గట్టిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి౦ది..అదే
ఆకారం. భయంతో గట్టిగా అరిచాననుకుంది, మాట బయటకు వినిపించలేదు. ఎప్పుడు
నిద్రపోయిందో...
అప్పటినుండీ గీతకు
దెయ్యాల కథలన్నా, ఒంటరిగా ఇంట్లో ఉండడమన్నా విపరీతమైన భయం.
Wednesday, December 21, 2011
జెన్ వై (jenaration y)
మా పిన్ని కూతురు ప్రసూనకు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే మంచి సంబంధ౦
వచ్చిందని పెళ్లి చేశారు. ఆ అబ్బాయి ఉండేది కూడా మేం ఉన్న ఊరికి దగ్గర్లోనే అని తెలిసి అందరం చాలా సంతోషించాం. పెళ్ళయిన రెండు
నెలలకు ప్రసూన కాపురానికి వచ్చింది.
"అక్కా ఇండియన్ షాప కి వెళ్లి గ్రాసరీస్
తెచ్చుకుందామా?” వచ్చిన రెండు రోజుల తరవాత ఫోన్ చేసింది.
“అలాగే మధ్యాన్నం లంచ్ అయ్యాక వెళదాం” అన్నాను.
ఆ మధ్యాహ్నం ఇద్దరం చెరొక కార్ట్ తీసుకుని షాప్ లోకి వెళ్ళాము. “లిస్టు
రాసుకుని వచ్చావా?” అడిగాను.
“అమ్మనడిగి అన్నీ రాసుకుని వచ్చాను.” అంది పెద్ద లిస్టు పర్సులోనుంచి
తీస్తూ.
బియ్యం దగ్గరనుండి మొదలుపెట్టాము. అక్కడ పదిహేను రకాల బియ్యం ఉన్నాయి. ఏవి కొనాలో చెప్పి బాగ్ తీసి కార్ట్ లో పెట్టాను. లిస్టులో తరువాతది కందిపప్పు. పప్పులు
ఉన్న సెక్షన్ లోకి వెళ్ళాము. అక్కడ నా ఫ్రెండ్ రాధిక కనిపించింది. పరిచయాలయ్యాయి. తనేదో
రైస్ నూడిల్స్ కోసం వచ్చిందట ఏ బ్రాండ్ కొనాలో తెలియలేదంటే, మా ప్రసూనను పప్పులు
తీసుకోమని తనతో వెళ్లి ఆ సేమ్యా ఏదో చూసి వచ్చాను. అప్పటికి పది నిముషాలైంది. ప్రసూన
పప్పులను పరీక్షగా గమనిస్తూ నిలబడి ఉంది. కార్ట్ లో బియ్యం తప్ప మరేమీ లేవు.
“ఏం తీసుకోలేదేం ప్రసూనా?” అని అడిగాను.
“అక్కా పేర్లన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి.” అంటూ అయోమయంగా చూసింది.
అప్పటికి నాకర్ధం అయింది. మా అమ్మాయికి ఏ పప్పులు ఏవో తెలియవని. సరే,
ఏ పప్పేదో వివరించి చెప్పాను.
“ఇంకేమన్నా ఉన్నాయా తీసుకోవలసినవి?” అడిగాను.
“రవికి రైస్ కంటే చెపాతీలే ఇష్టం అట. మనం మైదాపిండి తీసుకోవాలి?
అంది.
“మైదాతో చపాతీలా?” అన్నాను వచ్చేనవ్వాపుకుంటూ.
“ఓ కాదా అయితే శనగ పిండి తీసుకుందా౦” అంది. ఇక నవ్వకుండా ఉండడం నా
వల్ల కాలేదు.
* * * *
ఆ తరువాత ఇంట్లో పనులు
చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఒక్కోసారి వెళ్ళేసరికి ఏడుపు మొహంతో ఉండేది. అప్పటికీ
రవి ఓపిగ్గా అన్నీ దగ్గరుండి చూపించేవాడు, పనులన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు.
మా
పిన్ని ప్రసూనను వంటగదిలోకి అడుగు పెట్టనిచ్చేది కాదు. తనకు అన్నీ అవలవాటు
అవడానికి దాదాపుగా సంవత్సరం పట్టింది. తన వైవాహిక జీవితపు తొలినాళ్ళన్నీ ఇలా పనులు
నేర్చుకోవడానికే సరిపోయినట్లనిపించింది. పెళ్లై ఎవరి సంసారం వాళ్ళు చూసుకోవాలని తెలిసినా పిల్లలకు ఏమీ అలవాటు
చెయ్యకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మా ప్రసూన లాంటి వాళ్ళను చూసాక తెలిసింది. భార్యా భర్తలకు ఒకరిమీద ఒకరికి ఎంత ప్రేమున్నా నిద్ర లేచేసరికి ఆకలిదేగా రాజ్యం.
తనింకా ఓ సంవత్సరం
ఖాళీగా ఉంది. వచ్చిన వెంటనే ఉద్యోగంలో చేరే వాళ్ళు, లేకపోతే వెంటనే ప్రగ్నేన్సీ వచ్చినవాళ్ళ
కష్టాలు చెప్పనే అఖ్ఖర్లేదు. ఇక మొగపిల్లలైతే చదువులకోసమో, ఉద్యోగారీత్యానో
ఇక్కడకు వస్తారు. ఏమీ చేసుకోవడం రాక ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడతారు. ఫలితం
ఊబకాయం, ఆరోగ్యం పాడవడం. ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు వేరువేరుగా పెట్టుకోవాలని కూడా
తెలియని పిల్లల్ని చూశాక, పిల్లలకు చదువుతో పాటు, చిన్న చిన్న పనులు చిన్నప్పట్నుంచే ఓ ఆటలా నేర్పితే బావుంటుందనిపించింది.
Monday, December 19, 2011
సరదా సరదా దసరాలు...మావూరి సంబరాలు
అమెరికాలో దసరా సంబరాలను జరుపుకోని ఊరు, జరుపని తెలుగు అసోసియేషన్ వుండదు. మా తెలుగు తరగతి పిల్లల్ని "దసరా అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటాం?" అని అడిగాను. పండుగ గురించి చెప్పలేకపోయారు, కానీ పండుగ సంబరాలుగా వారు స్టేజి మీద వేసే 'గంతులు' గురించి చెప్పారు. పిల్లలకు ఈ పండుగ పుట్టు పూర్వోత్తరాలు గురించి చెప్పి, మనం చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళమో వాళ్లకు చూపించాలనిపించింది. ఆ ప్రయత్నమే ఈ 'దసరా సంబరాలు' .
'ఉగాది వేడుకలు' వేసిన పిల్లలందరూ మాం..ఛి ఉత్సాహంగా 'సై' అన్నారు. ఇక్కడో చిన్న ఇబ్బంది ఎదురైంది. ఉగాది వేడుకలు వేసినప్పుడు తరగతిలో పన్నెండు మంది పిల్లలున్నారు, ఇప్పుడు ఇరవై ఐదు మ౦ది అయ్యారు. వీళ్ళు కాక ఫ్రెండ్స్ పిల్లలు ఓ ఏడెనిమిది మంది ఎవరిని కాదన్నా బావుండదు. "మరి ఇంతమందితో నాటకం... " చూద్దాం మరో ప్రయత్నం అనుకుంటూ, ఓ ఇద్దరు పిల్లలు కథ చెప్పే లాగానూ, మరో ఇద్దరు వినే లాగాను స్క్రిప్ట్ మొదలు పెట్టాను. ఇక కథలోకి ఈ సారి సీతా సమేతంగా రాములవారూనూ, తోడుగా లక్ష్మణుడూ, ఇక హనుమంతులవారు సరేసరి రాముడు ఎక్కడుంటే వారిక అక్కడేగా మరీ, వచ్చేశారు... సంబరాల విషయానికి వస్తే పంతులు గారూ, పిల్లలూ, పులి వేషాల వాళ్ళూ. అబ్బో.. తలచుకుంటేనే భలే ఉత్సాహంగా ఉందిలే. చకా చకా వ్రాశేసి స్నేహితులకి చూపించేశా.
స్క్రిప్ట్ వైపు నా మొహం వైపు మార్చి మార్చి చూశారు. చూశారంటే చూడరు మరీ... పోయినసారి "మీ ఇంట్లో కవ్వముందా, పాలకేనుందా?" అని వాళ్ళను అటకలూ అవీ ఎక్కి౦చేశానుగా...చూడ్డం అయిన తరువాత "పోయినసారంటే ఏవో దొరికేశాయి. ఇప్పుడీ కిరీటాలు, పూలదండలూ, పట్టుపీతా౦బరాలూ, గధలూ ఇవన్నీ ఎలా? ఇదేమన్నా ఇండియానా" అని మెత్తమెత్తగా చీవాట్లేశారు. "ఏదో చేద్దాంగా" అన్నా నమ్మకంగా, మనసులో పీచు పీచు మంటూనే ఉంది.
ఎవరెవరికి ఏ ఏ వేషాలు ఇవ్వాలో నిర్ణయించి, వారితో ఆమోదముద్ర వేయించుకుని పిల్లల వాయిస్ రికార్డింగ్ మొదలు పెట్టాం. రాక్షసులు ఆ రోజుల్లో ప్రజలను నానా బాధలూ పెట్టడం కథల్లో చదువుకున్నాం. కాని ఈ ఇరయై శతాబ్దంలోకి కూడా వచ్చి బాధ పెడతారని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. 'మహిషాసురుడు' అని పలకడానికి పిల్లల్ని ఎన్నెన్ని బాధలు పెట్టాడని! కొన్ని సార్లు ఆ బాధ భరించలేక 'మైషాసురుడ'ని, అది కూడా కుదరనప్పుడు 'మహిషుడు' అనికూడా అనిపించాం. ఇక కథకు ముఖ్యమైన డయలాగ్స్ దుర్గాదేవి మహిషాసురిడివి. “అవి సరిగ్గా చెప్పాలంటే పిల్లలకు కష్టం ఎవరైనా పెద్దవాళ్ళతో రికార్డు చేయిద్దాం” అన్నా. "ఎందుకమ్మడూ మన ముచ్చట్లు గ్రాంధికంలో మార్చి చెప్పేస్తేపోలా" అని శ్రీవారన్నారు. "అలాక్కానీయండన్నా".
ఇక మధ్య మధ్యలో దేవతలొచ్చేప్పుడు పెట్టిన మ్యూజిక్ లవీ 'యు ట్యూబ్' వారి సౌజన్యంతో. అన్నింటికన్నా ముఖ్యమైన పాట 'ధరణికి సంబరాలు' సిలికాన్ ఆంధ్ర వారి అనుమతితో వారి పాటను తీసుకున్నాము. ఆడియో రికార్డింగ్ పూర్తయ్యింది.
ఇక ఆక్ససరీస్..అదేనండీ వస్తుసామాగ్రి. ము౦దస్తుగా కిరీటాలు: మైకేల్స్ లో గోల్డ్ కలర్ గిఫ్ట్ రాప్, జువల్స్, గ్లిట్టర్ గ్లూ, కన్ఫెట్టి లాంటి వన్నీ తెచ్చాం. గిఫ్ట్ రాప్ పోస్టర్‌కి అంటించి కిరీటం డిజైన్ వేసి కట్ చేసాం. ఇప్పుడు ర౦గుల రంగుల రాళ్ళు అంటించి గ్లూతో అందంగా అలంకరించా౦. టడా.... అందమైన కిరీట౦ రెడీ, తలకు పెట్టుకుని చూడగానే కళ్ళు కనిపించలా, ముందు అర్చ్ కట్ చేయడం మరచాం. ఇంకా నయం, అన్నీ అలా చేశా౦ కాదు. అలా౦టి పొరపాటు రాకుండా మిగిలినవన్నీ జాగ్రత్తగా చేశా౦లెండి. అందమైన కిరీటాలు తయారయ్యాయ్.
స్ట్రీమర్స్ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మాలలు అల్లేశా౦. ఇక బాణాలు 'హోం డిపో' లో కర్రలకి గోల్డ్ ఫాయిల్ రాపింగ్. ఇకపోతే పట్టు పీతాంబరాలు....ఉన్నారుగా మన భారతనాట్యం అమ్మాయిలు, వాళ్ళ డ్రెస్ కొంచెంగా మార్చితే మంచి పంచెలు తయారు.
మా హనుమంతుడ్ని మీరు చూసి తీరాల్సిందే. ఆ అలంకరణలో నా ప్రమేయమెంత మాత్రం లేదు సుమండీ..మొత్తం వాళ్ళ అమ్మగారు చూసుకున్నారు. అలాగే దుర్గాదేవి, మహిషాసురుడు, గద, బతుకమ్మ కూడా....ఇక పులులు, ఈ కాస్ట్యూమ్ కోసం వెతకని షాపూ, వెబ్సైటు లేదు. చివరాఖరకి అమ్మాయిల సెక్షన్లో చిరుతపులులు దొరికాయి. 'జోయాన్స్' లో బట్ట తెచ్చి తోకలు కుట్టాం. సరంజామా అంతా పూర్తయ్యింది కదా. అమ్మాయిలకు పోచ౦పల్లి చీరలు కట్టాలనుకున్నాం. తెలిసినవారందరూ వారి పెట్టెలన్నీ వెతికి చీరలిచ్చారు.
ముందు నాటిక అనుభవంతో సీనుల వారీగా రిహార్సిల్స్ మొదలుపెట్టాం. ఐయిగిరినందిని పిల్లలు, పులివేషం పిల్లలు, ధరణికి సంబరాలు పిల్లలూ, అయోధ్యవాసులూ, కథకులూ, చివరగా మహిషాసురుడూ, దుర్గాదేవీనూ. ఈ నాటిక రిహార్సిల్స్ జరిగినన్ని రోజులూ మా మెయిల్ సబ్జక్ట్స్ పేర్లన్నమాట. బావున్నై కదూ. డాన్స్ వేస్తున్న పిల్లలు ఎక్కువ మంది అవడం వల్ల స్థలాభావం, సమయాభావం కలిగింది. ఒక్క నెల్లాళ్ళు సాయంత్రం ఐదు ను౦డి ఆరు మధ్యలో ఎవరొస్తే వాళ్ళకు డాన్స్ నేర్పించడంవల్ల దాన్ని అధిగమించాం. అలా నాటిక రిహార్సల్స్ పూర్తయ్యాయి.
ఈ నాటికవేయడానికి ముందు నాటిక అంత ఆదుర్దా లేదు. మా పిల్లల అభినయం తెలిసిందిగా మరీ. మా పిల్లలు మరోసారి మా ఊరి ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి౦చేశారు. అన్నట్టు ఈ పిల్లల్లో ఒక్క నులుగురైదుగురు తప్ప మిగిలిన వారందరూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలేనండోయ్..
కొస మెరుపు
పిల్లలకు దసరా పండుగ గురించి తెలిసింది. మహిషాసురుడు దుర్గాదేవి స్టేజికి ఆ చివర ఒకరు, ఈ చివర ఒకరు నిలబడి వీడియో గ్రాఫర్ లను అయోమయంలో పడేశారు.
రామ లక్ష్మణులు పాపం అడవి నుండి సరాసరి ఇటే వచ్చినట్లున్నారు, కాళ్లు నొప్పెట్టి స్టేజికి మధ్యకు రాలేకపోయారు.
మొదటి భాగం
రెండొవ భాగం
Sunday, December 11, 2011
నేనూ దిగనా...
కనిపించినంత మేరా అటూ ఇటూ పెద్ద చెట్లు.... ఎండ పడకుండా రోడ్డుకు గొడుగు పడుతున్నాయి. జీప్ లో పొల౦
చూడడానికి వెళుతున్నాం. మట్టిరోడ్డు పట్టేసరికి సాయ౦త్రమైంది. జీప్ వెనక లేచిన ఎర్రమట్టి, నీరండతో కలసిపోయింది. పొలాల్లో పనిచేస్తున్న మనుషులు జీప్ శబ్దానికి ఆగి
చూస్తున్నారు. గతుకుల రోడ్డు మీద జీప్ మెల్లగా వెళుతుంది.
“బుజ్జమ్మా మనమిప్పుడు ఎక్కడకెళ్తున్నామో తెలుసా?” అడిగింది
నాన్నమ్మ .
“తోతకు నాన్నమ్మా?”
“గుండూస్ తోటలో ఏముంటయ్ రా?” మామయ్య.
“తోతలో మత్తిలు, చెత్తులు ఉంతయ్”.
“హహహ ‘మత్తిలు, చెత్తులు’ ఉంటాయా, ఎవరు చెప్పారు సుబ్బులూ?” బాబాయ్.
“అమ్మ చెప్పింది బాబాయ్”.
“ఇంకా ఏము౦టాయ్?” బాబాయ్.
“...........”
“చెప్పమ్మా ఇంకా ఏముంటాయి?” తాతయ్య.
“అందలూ నన్నే అదుగుతున్నాలు మీతు తెలీదా?”
“హ హ హ” అందరూ..
చిట్టితల్లి వాళ్ళనాన్న భుజంపై తలవాల్చి పడుకుంది.
ఇంకొంచెం దూరం వెళ్ళాక..
“ఇవేం చెట్లయ్యా?” తాతయ్య.
“పామాయిల్ చెట్లు, ఇప్పుడివి బాగా వేస్తున్నారు.” ఇంకో
తాతయ్య.
“జ్యోతీ, పాపకు ఇంకో డ్రెస్ పెట్టావా?” అమ్మమ్మ.
“ఆ... రెండు డ్రెస్ లు పెట్టాను. నీళ్ళు చూస్తే అసలాగదు
మొత్తం తడిపేసుకుంటుంది.” అమ్మ.
ము౦దున్నదంతా ఎగువ
ప్రాంతం....జీపు పైకి ఎక్కుడం కష్టంగా ఉంది.
“ఏమైంది మస్తాన్?” నాన్న.
“అప్ లో జీప్ ఎక్కలేకపోతుంది సార్?” మస్తాన్.
“బరువెక్కువైనట్లుంది, కొంచెం జీప్ ఆపు మస్తాన్, మేం దిగుతాం.” బాబాయి.
బాబాయి, నాన్న,
మామయ్య దిగారు.
తాతయ్య దిగబోతుంటే “మీరు దిగొద్దులే మామయ్యా” అన్నాడు నాన్న.
జీపు మరికొంచెం ముందుకు పోయింది.
“అమ్మలూ,
అక్కడేవో కనిపిస్తున్నయ్ చూడు.” తాతయ్య.
“ఎత్తల తాతయ్యా?”
“దూరంగా...అక్కడ” తాతయ్య.
“బల్లెలు?”
“హ హ హ “ అందరూ..
“అబ్బో..మా అమ్మకి బర్రెలు కూడా తెలుసే” నాన్నమ్మ.
“చిట్టికన్నలూ, బర్రెల్ని ఇంగ్లిష్ లో ఏమంటార్రా?” అమ్మమ్మ
“ఇంగ్లీచులో....ఇంగ్లీచులో.....”
“బఫెలోస్” అందించాడు తాతయ్య.
“బఫెలోచ్”.
జీపు పైకెక్కడం ఇంకా కష్టమైంది.
“మస్తాన్ జీప్ ఆపయ్యా ఇంకాస్త బరువు తగ్గిద్దాం." తాతయ్య
“నేను కూడా దిగనా?” ఇంకో తాతయ్య. తాతయ్యలిద్దరూ కిందకు దిగుతున్నారు.
అమ్మ దగ్గర నుండి కిందకు జారి “నేనూ దిగనా?” చిట్టితల్లి.
“హహహ” అందరు.
Friday, December 9, 2011
'కడలి' సుభ గారికి పుట్టినరోజు 'సుభా'కాంక్షలు
"‘కడలి' అని పేరు పెట్టాను కదా అని ఇందులో ముత్యాలేవో ఉంటాయనుకునేరు అలాంటిదేమీ లేదండోయ్"....అంటూనే అందమైన బొమ్మలతో ముత్యాల్లాంటి కవితలు వ్రాసిన మన ‘సుభ’ గారు నిండు నూరేళ్ళు సుఖః శాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ..సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Monday, December 5, 2011
మా బుజ్జోడి భోజనం
“బుజ్జి పండూ అన్నం తిందువు రా నాన్నా...”
“నాకన్నమొద్దు..”
“బంగారు కదూ.. రామ్మా. కథ చెప్తాగా”. తీసుకొచ్చి హై చైర్ లో కూర్చోపెట్టాను.
ప్లేట్ వైపు చూసి “నాకు బెండంకాయ వద్దు.”
“బె౦డకాయ కాదు ఇది టమోటా కూర”
“నాకు టంటంమ్మో వద్దు.”
“సరే టమోటో వద్దులే కథ విను.”
“ఒక సారి ఏమయ్యిందో తెలుసా! ఒక ముద్ద నోట్లో పెట్టాను. “పెద్ద గాలొచ్చింది....చెట్లన్నీ ఊగిపోతున్నాయి“ రెండో ముద్ద, చిన్నగా వర్షం మొదలయ్యింది.” మూడో ముద్ద పెట్టబోతుండగా..
“నాకు ట౦ట౦మ్మో వద్దూ..”
వర్షం కాస్తా పెద్దదయింది. చెట్లు, పక్షులూ, జంతువులూ అన్నీ తడిసిపోతున్నాయి. ఇంకో రెండు ముద్దలు పెట్టేసాను.
“చైకిలు కూదానా?”
“ఆ సైకిలు కూడా”...ఇంకో ముద్ద పెట్టేసా.
“అప్పుడు నువ్వెక్కదున్నావ్?”
“నేను, అమ్మమ్మ, మామయ్య, తాతయ్య అందరం ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా చీకటి.” ఇంకో రెండు ముద్దలు.“మరి నాన్న ఎక్కద వున్నాలు?”
“నాన్న అప్పుడు నాకు తెలీదుగా.” ఇంకో ముద్ద..
“ఎందుత్తెలీదు?”
“ఎందుకంటే అప్పుడు నేను చిన్నదాన్ని కదా అందుకని.” ఇంకో ముద్ద...
“మలి నేను చిన్న నాకు నాన్న తెల్చుగా..”
ఈ నేపధ్య౦లో కూరన్నం పెట్టడం పూర్తయ్యింది.
“పెరుగన్నం పెట్టనా?”
“నాకు పెలుగొద్దు.”
“అదికాదు నాన్నా అప్పుడేమో ఒక పెద్ద వేపచెట్టు ఉండేది మా ఇంటి వెనుక.” అన్నం కలుపుతూ..
“వేప చెత్త౦తే?”
“వేప చెట్టంటే బే ట్రీ లాగా అదో పే....ద్ద చెట్టు. నీకు ఇండియా వెళ్ళినప్పుడు చూపిస్తాలే.” ఒక ముద్ద పెడ్తూ...
“నిమ్మతాయి పెత్తావా?”
“ఆ నిమ్మకాయ పెట్టాను, నువ్వు తిను మరీ..”
“అప్పులేమైంది?”
“అప్పుడూ గాలికి చెట్టు ఊగుతుందా..ఎప్పుడు ఇంటి మీద పడుతుందో అని భయం. రాత్రంతా వర్షం గాలి తగ్గలా..” ఇంకో ముద్ద....
“ఆ వర్షం రాత్రి అలానే నిద్ర పోయాం.” అమ్మయ్య అన్నం పెట్టడం పూర్తయ్యింది.
“నిద్ర లేచిసరికి గాలివాన తగ్గింది. ఆ చేట్టేమో వేరేవైపుకు పడిపోయింది."
"ఇంతి మీద పదలేదా?"
"లేదు వేరేవైపు పడిపోయింది." అన్నాను మూతి తుడుస్తూ.
"పాపం చెత్తు."
"అవును నాన్నా పాపం చెట్టు".
వాడికి నాలుగు నిండేదాకా ఈ విధంగా ఉండేది ప్రతి పూటా మా బుజ్జోడి భోజన కార్యక్రమం. కథలో మునిగిపోయి ఏం పెట్టినా తినేసేవాడు. మా కథల్లోకి భూకంపాలు, వాల్కనోలు, వరదలు వచ్చేస్తు౦డేవి. అప్పుడప్పుడూ పిల్లి, నక్క, ముసలి, ఎలుగుబంటి లాంటివి, మరికొన్ని రోజులు మర్యాద రామన్నలు, లవకుశులు..వీరు కూడా వచ్చేవార౦డోయ్. ఇలా మాట్లాడబట్టేమో మా పిల్లలిద్దరికీ భాషతో సమస్య రాలేదు. వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు కూడా అందరితో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడగలుతున్నారు.

Sunday, December 4, 2011
ఎప్పటికీ నాతోనే ఉండిపోవా
ప్రియమైన నీకు,
శ్రావణంలో వచ్చి వెళ్ళావు, కార్తీకం కూడా వెళ్ళిపోయింది. నీ దగ్గర నుంచి చిన్న కబురు కూడా లేదు. వెన్నెల వెలుగులతో వస్తావు, నీవున్నన్నాళ్ళు వసంతాలు పూయిస్తావు. నువ్వు నా దగ్గర్నున్నంత సేపూ నన్ను నేల మీద నడవనీయవు కదా! కాళ్ళు కందిపోతాయనా? నువ్వు వస్తూ తెచ్చిన బహుమతులన్నీ పదిలంగా దాచాను. మనసు మూగవోయినపుడు నాకవే ప్రియనేస్తాలు. ఎప్పటినుంచో నీకో విషయం చెప్పాలని చూస్తున్నాను. తెలియని సంకోచమేదో అడ్డుతెర వేస్తోంది.
మొన్నోరోజు బయటకు వెళ్ళాను. అందరూ అడగడమే నీ గురించి, నువ్వు లేని లోటు నా ముఖంలో కనిపిస్తూందట. నలుగురిలో మరీ ఒంటరితనం భరించలేక వెనక్కు వచ్చేశాను. మనం చేతిలో చేయి వేసుకుని చేసిన విహారాలు నీకు గుర్తున్నాయా? నాకా రోజులన్నీ కళ్ళ ముందే మెదలుతున్నాయి, ఆ జ్ఞాపకాల్లోనే నేను నేనుగా మనగలిగేది. పండుగేదో వస్తున్నట్లుంది. అయినా నువ్వులేందే అది పండుగెలా అవుతుంది! తోడుగ నువ్వుంటే అమావాస్య కూడా పండువెన్నెలే నాకు. నీకోసం ఎన్ని రోజులని ఎదురుచూడను?
నా విన్నపాన్ని మన్నించి దరిచేరవా. అయినా నీకెక్కడ తీరుతుందిలే, వెయ్యిళ్ళ పూజారివి. అందరికీ నువ్వంటే ఎంతో ఇష్టమట, నీకోసం ఎదురుచూస్తూ ఉంటారట, నీకోసం ఏమైనా చేస్తారట. ఏం మాయ చేశావో అందర్నీ ఇలా వశపరచుకున్నావు. నిన్ను చూస్తే ఒక్కోసారి ఎంత అసూయగా ఉంటుందో తెలుసా! మొన్న నువ్వెళ్ళాక, తిరిగి చూస్తే ఏము౦దీ అంతటా శూన్యమే. ‘అన౦దమా’ అత్యాశ అనుకోక ఎప్పటికీ నాతోనే ఉండిపోవా..నా బ్రతుకు దారంతా నాతోనే నడుస్తావని ఆశిస్తూ..
నీ
నేను

Friday, December 2, 2011
ఎంచక్కా లాప్ టాప్ ముందు కూర్చున్నానా, అప్పుడూ....
“అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా”
“ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా....అంతా..”
“అబ్బా...ఆపండీ, ఇంత విషాదగీతమా?”
“మా మీద ఎంతటి ప్రేమ దేవేరీ! మా గానములోని విషాదము మిమ్ము కదిలించినదా?”
“గానములోన రాగము, గళమున మాధుర్యము లోపించినవి ప్రాణనాధా....ఇంతకూ ఆ గీతమాలపించిన కారణంబెట్టిది?”
“హా.....దేవీ కారణము నడుగుచు౦టివా! మా ప్రాణేశ్వరి బ్లాగోగుల మాయలో నుండి మా బాగోగులు మరచిన, మేమిక ఏలాటి పాటలు పాడగలము దేవేరీ..”
"శివ శివా... ఈ అపవాదు మాకేల? ఇదంతా చవితి చంద్రుని గాంచిన దోషము కాబోలు....”ఇంతకూ మా వలన జరిగిన అపరాధము యేమియో సెలవీయుము స్వామీ..”
“ఈ దేవేరి వంటింటి సామ్రాజ్యమునేలి ఎన్ని యుగములైనది?....అ౦దునూ మా అనుంగు చెక్కలను సృష్టించి ఎన్ని దినములైనదియో జ్ఞాపకముయున్నదా దేవీ?”
ఓ శ్రీవారికి ‘చెక్కల’ మీద మనసాయనా....లేశమాత్రము ఆలసించక మొదలిడుదును...
“మేము చెంతనేయుండి మీ తయారీ విధంబును గాంచవచ్చునా.. మీ సృష్టి యందు మాకాసక్తి బహుమెండుగ నున్నది.”
“అటులనే స్వామీ కాంచవచ్చును, చేయందించ వచ్చును కూడా...”
కాంతులీను స్టీలు గిన్నెయందు పచ్చని శనగపప్పును, తగినంత జలమును ఉంచిన అవి కొంతసేపు ముచ్చటించుకొనును. అవ్విధ౦భుగనే సగ్గుబియ్యము, మజ్జిగ కలయికకు కూడా ఏర్పాట్లు గావి౦చవాలయును.
“స్వామీ మన 'హిమసందుక' నందు బందీలైయున్న ‘చక్కనైన మిరపకాయల’కు, ‘సొగసరి అల్లము’నకు బంధ విముక్తము గావి౦పుడు.”
“అటులనే దేవీ..”
మేము వయ్యారాల జీలకర్రతో వాటిని కలిపి ఈ రాతిబండలో వేసి.....
“దేవీ... ఆకుపచ్చని వర్ణములో బహు సుందరముగ నున్నది ఈ మిశ్రమము. ఆ, అటుపిమ్మట?”
పండు వెన్నెల వంటి బియ్యప్పిండికి నవనీతమును జోడించి మిగిలిన దినుసులన్నియు కలిపి చక్కని గోపురము నిర్మి౦పవలెను. సైంధవ లవణము బహు ముఖ్యము సుమా!
“దేవేరీ మా మాతామహులు ఇందున ఉల్లి, వేరుసెనగ లను కూడా జోడి౦చెదరు.”
మీకవి ప్రియములైన మాకునూ ప్రియములే...అటులనే కానింతుము.
చిన్ని చిన్ని కుడుములను వరుసగా నమర్చి వాటిని సుతారముగా గిన్నెతో......
“వా..దేవీ వా.. ఆహా! ఏమి మీ చేతి మహత్యము, కుడుములు అందమైన చందమామలైపోయెనే .. భళి దేవీ..భళి."
“స్వామీ మనమిప్పుడు యమధర్ముల వారి కార్యమొనరించవలె.”
“ఏమది దేవీ?”
"వేడి వేడి నూనెలో వీటిని పడవేయాలి స్వామీ.”
“అంత అపరాధమూలేమి చేసినవి దేవీ?”
“పూర్వజన్మ కర్మఫలము స్వామీ, దోషపరిహారార్ధము.”
“అటులనా.... అయినాచో వేగిరము కానిమ్ము.”
“దేవేరీ ఈ పరిసరములలో అమృతము లేదు కదా”
“లేదు నాధా.”
“మరి ఈ చెక్కలకా రుచియేల అబ్బినది?”
“ఊరుకోండి మీరు మరీనూ....”
“ఏమైంది తమరికివాళ?”
“ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా....అంతా..”
“అబ్బా...ఆపండీ, ఇంత విషాదగీతమా?”
“మా మీద ఎంతటి ప్రేమ దేవేరీ! మా గానములోని విషాదము మిమ్ము కదిలించినదా?”
“గానములోన రాగము, గళమున మాధుర్యము లోపించినవి ప్రాణనాధా....ఇంతకూ ఆ గీతమాలపించిన కారణంబెట్టిది?”
“హా.....దేవీ కారణము నడుగుచు౦టివా! మా ప్రాణేశ్వరి బ్లాగోగుల మాయలో నుండి మా బాగోగులు మరచిన, మేమిక ఏలాటి పాటలు పాడగలము దేవేరీ..”
"శివ శివా... ఈ అపవాదు మాకేల? ఇదంతా చవితి చంద్రుని గాంచిన దోషము కాబోలు....”ఇంతకూ మా వలన జరిగిన అపరాధము యేమియో సెలవీయుము స్వామీ..”
“ఈ దేవేరి వంటింటి సామ్రాజ్యమునేలి ఎన్ని యుగములైనది?....అ౦దునూ మా అనుంగు చెక్కలను సృష్టించి ఎన్ని దినములైనదియో జ్ఞాపకముయున్నదా దేవీ?”
ఓ శ్రీవారికి ‘చెక్కల’ మీద మనసాయనా....లేశమాత్రము ఆలసించక మొదలిడుదును...
“మేము చెంతనేయుండి మీ తయారీ విధంబును గాంచవచ్చునా.. మీ సృష్టి యందు మాకాసక్తి బహుమెండుగ నున్నది.”
“అటులనే స్వామీ కాంచవచ్చును, చేయందించ వచ్చును కూడా...”
* * *
* * *
కాంతులీను స్టీలు గిన్నెయందు పచ్చని శనగపప్పును, తగినంత జలమును ఉంచిన అవి కొంతసేపు ముచ్చటించుకొనును. అవ్విధ౦భుగనే సగ్గుబియ్యము, మజ్జిగ కలయికకు కూడా ఏర్పాట్లు గావి౦చవాలయును.
“స్వామీ మన 'హిమసందుక' నందు బందీలైయున్న ‘చక్కనైన మిరపకాయల’కు, ‘సొగసరి అల్లము’నకు బంధ విముక్తము గావి౦పుడు.”
“అటులనే దేవీ..”
మేము వయ్యారాల జీలకర్రతో వాటిని కలిపి ఈ రాతిబండలో వేసి.....
“దేవీ... ఆకుపచ్చని వర్ణములో బహు సుందరముగ నున్నది ఈ మిశ్రమము. ఆ, అటుపిమ్మట?”
పండు వెన్నెల వంటి బియ్యప్పిండికి నవనీతమును జోడించి మిగిలిన దినుసులన్నియు కలిపి చక్కని గోపురము నిర్మి౦పవలెను. సైంధవ లవణము బహు ముఖ్యము సుమా!
“దేవేరీ మా మాతామహులు ఇందున ఉల్లి, వేరుసెనగ లను కూడా జోడి౦చెదరు.”
మీకవి ప్రియములైన మాకునూ ప్రియములే...అటులనే కానింతుము.
చిన్ని చిన్ని కుడుములను వరుసగా నమర్చి వాటిని సుతారముగా గిన్నెతో......
“స్వామీ మనమిప్పుడు యమధర్ముల వారి కార్యమొనరించవలె.”
“ఏమది దేవీ?”
"వేడి వేడి నూనెలో వీటిని పడవేయాలి స్వామీ.”
“అంత అపరాధమూలేమి చేసినవి దేవీ?”
“పూర్వజన్మ కర్మఫలము స్వామీ, దోషపరిహారార్ధము.”
“అటులనా.... అయినాచో వేగిరము కానిమ్ము.”
“దేవేరీ ఈ పరిసరములలో అమృతము లేదు కదా”
“లేదు నాధా.”
“మరి ఈ చెక్కలకా రుచియేల అబ్బినది?”
“ఊరుకోండి మీరు మరీనూ....”
Wednesday, November 30, 2011
కౌముదిలో నా కవిత 'నిర్వేదం'
చెట్టు మీద పిట్ట ఒకటి జాలిగా చూసింది
ఒంటరి నక్షత్రం బాధగా నిట్టూర్చింది!
ఆనవాలు లేని అలజడేదో...
తొంగి తొంగి చూస్తోంది!
ముక్కలైన రోజులన్నీ...
చీకటి మాటున మెసలుతున్నై!
నిన్న మానిన గాయం
కొత్త మందును కోరుతోంది!
మరచిపోయిన సంగతేదో...
దిగులుకు తోడై వచ్చింది!
అంతులేని విషాదానికి
పాత చిరునామా దొరికింది !
నిలకడలేని ఆలోచన
అంధకారాన్ని ఆశ్రయమడిగింది!
రాలిపోయే ఉల్కను చూసి
ఎగిసే అల విరిగి౦ది!!
నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'డిసెంబర్ 'సంచికలో ప్రచురితమైంది. నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

Monday, November 28, 2011
ప్రియమైన అమ్మకు,
చాలా ఏళ్ళయి౦ది కదూ నీకు ఉత్తరం
రాసి. అప్పుడెప్పుడో... “ఫోన్ లో మాట్లాడితే నాకు గుర్తు
చేసికోవడానికేం ఉండదు, నువ్వు రాసిన ఉత్తరం అయితే నేను చాలసార్లు చదువుకుంటాను.” అన్నావు కదా, అది గుర్తొచ్చి ఈ ఉత్తరం వ్రాస్తున్నా.
ఇక్కడ
అందరం బావున్నాం. పిల్లలిద్దరూ బాగా చదువుకుంటున్నారు. ఇవేకాక ఇంకా ఆటలు, పాటలు, స్నేహితులు, ఇప్పటి పిల్లలకు అస్సలు తీరికే వుండదు, వారి ప్రపంచంలో వారుంటారు. చిన్నప్పుడు నువ్వు వంట చేస్తుంటే నేను
బియ్యంలో రాళ్ళేరుతూనో, చిక్కుళ్ళు తు౦చుతూనో పక్కనే
ఉండేదానిని. నేను చదువుతున్నప్పుడు నువ్వు కూడా పేపర్లు దిద్దుతూనో, పాఠం చెప్పడానికి పుస్తకం చదువుతూనో ఆ పక్కనే కూర్చునేదానివి.
నువ్వూ, నాన్నా ఏ 'మిస్సమ్మ' గురించో, 'గుండమ్మ కథ' గురించో మాట్లాడుతుంటే
తెలియకుండానే మాక్కూడా వాటి మీద ఇష్టం కలిగింది. ఇప్పటికీ ఆ సినిమాలు చాలా నచ్చుతాయి, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మీ మాటలు కూడా
గుర్తొస్తుంటాయి. ఈ పిల్లల్ని పదేళ్ళ క్రితం సినిమా చూడమన్నా ‘ఓల్డ్ మూవీ’ అనేస్తున్నారు. జీవితంలో మార్పులు చాలా
వేగంగా వస్తున్నాయి, అందుకోవడానికి పరుగులు
పెట్టాల్సివస్తుంది.
ఇంటి
ముందున్న తోటలోని గులాబీలు ఈ వేసవిలో చాలా బాగా పూశాయి. గులాబీరంగు
పువ్వులయితే ఎంతందంగా ఉన్నాయో! వర్షం పడుతున్నప్పుడు ఫోటో తీశాను, చాలా బాగా వచ్చింది. ఈ సారి దారి పక్కనంతా బంతి మొక్కలు నాటాం. మొన్నటి వరకు
పూజకు అవే పెట్టాను. చలికాలం వచ్చిందిగా కరివేప, మల్లెమొక్కల్ని ఇంట్లో పెట్టాము.
పిల్లల బట్టల కోసం మొన్న
షాపింగ్ కి వెళ్ళాము. స్కూల్ తెరిచే ముందు వేసవిలో మనం అలానే వెళ్ళేవాళ్ళం కదూ!
ఎక్కువ బట్టలు అప్పుడే కొనేవాళ్ళం, ప్రతి పండక్కీ దాచుకుని
వేసుకునేదానిని. పండగంటే గుర్తొచ్చిందీ, సంక్రాంతికి నువ్వు
ముగ్గులు వేస్తుంటే నేను రంగులు వేసేదాన్ని కదూ! ఇప్పుడా ముగ్గులూ, ర౦గులూ రెండూ లేవు.
మొన్నోరోజు
నువ్వు చేసినట్లే ‘మైసూర్ పాక్’ చేద్దామని
మొదలెట్టాను. నీ అంత బాగా రాలేదు గానీ... పిల్లలకు నచ్చింది. పాపకు ‘ఆల్జీబ్రా’ చెప్తుంటే 'యు అర్ సో స్మార్ట్’ అని సర్టిఫికేట్ ఇచ్చింది.
అమ్మమ్మ అయితే ఇంకా బాగా చెప్పేదని చెప్పాను. అప్పుడు నువ్వు నేర్పిందే... నాకిప్పటికీ గుర్తుంది, ఒక్కొక్క చాప్టర్ ఎన్నిసార్లు
చేసేవాళ్ళమో! చాలా సరదాగా ఉండేది.
నేనీ మధ్య కొన్ని
నాటికలు రాశాను. పిల్లలతో వేయిస్తుంటే సరదాగా అనిపించింది. నువ్వు దగ్గరుండి
చూస్తే నాకు తృప్తిగా ఉండేది. నేను కొత్త అడుగు వేసినప్పుడల్లా ఆలోచన నీవైపే సాగుతుంది. ఈ మధ్యే బ్లాగ్ మొదలు పెట్టాను. కొంచెం రాయడం
అలవాటయింది. నువ్వు నెట్ చూడవుగా, అన్నీ నీకు
చూపించాలనిపిస్తుంది. బ్లాగ్ లో విజిటర్స్ ని చూసినప్పుడల్లా ఇంటికి చుట్టాలొచ్చినట్లు ఎంత సంబరంగా ఉంటుందో!
కొన్ని కొన్ని కామెంట్లు ఎంత సరదాగా ఉంటాయనుకున్నావు... మనతో మాట్లాడుతున్నట్లే
అనిపిస్తుంది.
చాలా
సంవత్సరాలయ్యింది, ఇలా నీతో కబుర్లు చెప్పి. ఎన్నో చెప్పాలి
నీకు. నా కవితలూ, నాటికలు అన్నీ చూపించాలి. అవునూ, ఇవాళ నీ పుట్టినరోజు కదూ! శుభాకాంక్షలు చెప్దామంటే చిరునామా ఇవ్వకుండా
వెళ్ళిపోయావు. ఈ కబుర్లన్నీ నిన్ను చేరేదెలా...
ప్రేమతో
నీ
జ్యోతి
నీ
జ్యోతి
Saturday, November 26, 2011
చుక్కల కింద చక్కని రోజులు..తరువాయి భాగం
తరువాత రోజు నిద్రలేచి టెంట్ బయటకు రాగానే అత్భుతమైన దృశ్యం, తెలిమంచు తెరల్లో ప్రకృతి. చెట్ల మధ్యలో దోబూచులాడుతూ రవి కిరణాలు ఎంత అందంగా వున్నాయో! కాళ్ళ కింద మెత్తగా తగులుతున్న మట్టినేల, స్వాగతమంటున్న చల్లగాలి, చూపులు సాగినంత మేరా నిర్మలమైన ఆకాశం. రాత్రి చీకట్లో కనిపించలేదు కానీ, మధ్యలో స్థలం వదిలి, చుట్టూ టెంట్లు వేసికున్నాం, ఒక పక్కగా కారు దగ్గరకు వెళ్ళడానికి దారి, మరో పక్క పిక్నిక్ టేబెల్, బార్బిక్యూ గ్రిల్, కొంచెం దూరంగా షెల్టర్,
మాలాగే కా౦పింగ్ కి వచ్చిన వాళ్ళ టెంట్స్ దూరదూరంగా కనిపిస్తున్నాయి. ఓ ఇరవయ్ అడుగుల దూరంలో రెస్ట్ రూమ్స్, ఓ ఫర్లాంగ్ దూరంలో బాత్రూమ్స్ ఉన్నాయి. సైట్ మొదట్లో ఓ చిన్న స్టోర్, అందులో ఫైర్ వుడ్, సాల్ట్, వాటర్, మెడిసిన్స్, స్నాక్ పాకెట్స్ లాంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అన్నీ అధిక ధరల్లోనే ఉన్నాయనుకోండి. అన్ని సైట్లకూ మధ్యగా వాలీబాల్ కోర్ట్. చెట్ల మధ్యగా వాకింగ్ ట్రైల్స్ కనిపిస్తున్నాయి.

ఇవన్నీ చుట్టేసి వచ్చి ఇక పనిలో పడ్డాం. ఒకళ్ళు సిలిండర్ బిగిస్తే, ఇంకొకరు దోశపిండిని ఐస్ బాక్స్ లోంచి తీశారు, మరొకరు టేబుల్స్ సర్దారు ఇలా తలా ఒక పని ఆడుతూ పాడుతూ చేశాసామన్నమాట. ముందుగా దోశెల కార్యక్రమం మొదలు పెట్టాం. చిరుచలిలో వేడివేడి కారం దోసలు, ఆమ్లెట్ దోసెలు, ఉల్లిదోసెలు ఇలా రకరకాల దోసెలు. మాలో
బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళు కొందరు. వాళ్ళు అవి కూడా వేయడం మొదలు పెట్టారు. ఇలా టిఫిన్ సెక్షన్ ఎంజాయ్ చేశాం. తరువాత హికింగ్ పేరుతో చెట్టూ, పుట్టా తిరిగేసి పిట్టల్ని పలకరించి వచ్చి, కే౦పింగ్ చైర్స్ లో సెటిల్ అయ్యాం. ఉత్సాహం కాస్త ఎక్కువ పాళ్ళలో వున్నవాళ్ళు బైక్ రైడింగ్ కెళ్ళారు.
మధ్యాహ్నం దేశవాళీ వంటలు తిన్నాంగా, సాయంత్రం బార్బిక్యూ గ్రిల్ మీద ముష్రూమ్స్, కాప్సికమ్స్, ఆనియన్స్, కార్న్, యాం లాంటి వాటిని గ్రిల్ చేశాం. పాటీస్ గ్రిల్ మీద పెట్టి లెటస్, టొమాటోస్, మేయొనైజ్ లతో బర్గర్ ఫిక్స్ చేసి డిన్నర్ కానిచ్చాం. అన్నీ సర్దేసరికి సందెపొద్దు నల్లనై౦ది. ఆ చీకట్లో అంత్యాక్షరి పేరుతో ఇష్టమైన పాటలన్నీ పాడుకున్నా౦. ఘంటసాల గారు ముఖ్య అతిధి.
ఆరుబయట పండువెన్నెల.....వెలుగులు చి౦దుతూ అందాల చందమామ...చుక్కలచీర కట్టిన నల్లని ఆకాశం... చిత్తరువులై నిలిచిన పొడవాటి చెట్లు...చుట్టూ నిశ్శబ్దం... మంచుకురుస్తూ చిరుచలి....ఆ వెన్నెలరాత్రి ఎంత బావుందో! అమెరికా సిటీస్ లో ఆకాశం, అర్ధరాత్రికూడా నీలంగానే ఉంటుంది నియాన్ లైట్ల మహిమేమో. ఇలా అందమైన నక్షత్రాల్ని చూడడానికైనా సంవత్సరానికోసారి క్యాంపింగ్ కి వెళ్ళాలనుకున్నాం.
బ్రేక్ ఫాస్ట్ తరువాత ఔత్సాహికులందరూ వాలీబాల్ ఆడి, బాల్ భరతం పట్టారు. కొందరేమో పిల్లల్తో కలసిపోయి గుజ్జనగూళ్ళూ, కోతికొమ్మచ్చి ఆడారు. ఆ మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ కుర్మాతో భోజనం. భుక్తాయాసం తీరగానే అందరం సరదాసరదాగా 'డంషార్ ఆర్ట్స్' ఆడాం, ‘జూ లకటక’ సినిమా ఆ రోజు హైలైట్. ఇక రాత్రికి పావుభాజీ పలహారం. ఆ విధంగా కాలం వైపన్నా చూడక ఆ రోజు కూడా గడిపేశాం.
ఇక ఆదివారం, మెల్లగా కదిలింది కాలం. వస్తువులన్నీ సర్ది తిరగి కార్లెక్కించేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఆ ప్రదేశాన్ని వదలడం కార్లక్కూడా ఇష్ట౦లేనట్లు భారంగా కదిలాయి. తిరిగి వచ్చేదారిలో ఒక అత్భుతాన్ని చూశాం. అదే 'షా౦డ్లియర్ ట్రీ', సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల వయసున్న చెట్టు. పంతొమ్మిది వందల ముప్ఫైలో ఆ చెట్టుబెరడుని తొలిచారట. అందులోనుండి కార్లు కూడా వెళ్ళొచ్చు. అంత పెద్దపెద్ద చెట్లున్న ఆ పార్క్ చాలా నచ్చింది.
అందరం ఇలా కలసి మెలసి మూడు రోజులు ఒక కుటు౦బంలా మెలగడం ఎక్కువ ఎంజాయ్ చేసామో..కేంపింగ్ ఎక్కువ ఎంజాయ్ చేసామో చెప్పడం కష్టం. పిల్లలకు అమ్మ నాన్నలు కాకుండా మిగిలిన వారితో అనుబంధం ఏర్పడడానికి నాంది ఇలాంటి విహారాలనే చెప్పొచ్చేమో! అలా మా తొలి కేంపింగ్ అనుభవాల్ని పదిలంగా మూట కట్టుకుని ఇంటికి చేరాం. తరువాత ప్రతి సంవత్సరం కేంపింగ్ కి వెళ్తున్నాం కాని, ఈ కేంపింగ్ మాత్రం చాల ప్రత్యేకంగా మా మనుసుల్లో నిలిచిపోయింది.