Thursday, November 29, 2012

అనగనగనగనగా ఓసారి...

"ఈ కార్తీకంలో పంచమి గురువారం నాడు సత్యన్నారాయణ స్వామి వ్రతం జేసుకుంటున్నామొదినా. మీరందర్రావాల." అంటూ ఊర్లో నలుగురినీ పిలిచింది సావిత్రమ్మ. వ్రతం రోజున చుట్టాలు, పక్కాలు, చుట్టూ వున్న నాలుగిళ్ళవాళ్ళు సాయానికొచ్చారు. అందరూ సరదాగా కబుర్లాడుకుంటూ కలసి పనిచేస్తున్నారు.

                   *              *               *                *

"అమ్మాయ్ ఆ దబర ఇటు అందుకోవే"
"దిట్టంగుంది. యాడగొన్నావొదినా?"
"నేనేడగొన్నానా, నాయుడిగారి రాంసుబ్బులు మొన్న టౌనుకు బోయినప్పుడు సుబకార్యాలకు పనికొస్తుందని గొనిందంట. ఇవాళ మనకక్కరకొచ్చింది."
"చిట్టెమ్మావ్ చిక్కుళ్ళు మరీ అంత చిన్నగా తుంచబాకే. కూరముక్కలు కోసే సరికే పోద్దుగూకేటట్టుంది. కొంచెం పెద్దముక్కలు జెయ్." 
"చేసే వాళ్ళకు అడ్డంగాకపోతే నీకేం వంటొచ్చనిమే పోతండావా, అన్నాడక్కా" ముక్కలు తరుగుతూ కాస్త నిష్టూరంగా చెప్పింది జయ. 
"ఎవరుమే అనింది?" అడిగింది పెద్దొదిన.
"ఇంకెవరా, మీ తమ్ముడే"
"అందరూ ఒండేవాళ్ళయితే రుజ్జూసేదెవరని జెప్పలా నువ్వు" మేలమాడింది జానకి. 
"నువ్వుగూడా అట్టనే అంటావేందొదినా" ఉడుక్కుంది జయ. 
"గమ్మునుండండిమే, మనందరమూ కాపురానికొచ్చిన ఇన్నేళ్ళగ్గదా చేస్తండావ, ఆ పిల్లగూడా నేర్చుకుంటదిలే. అయినా ఆ పిల్ల గోసినట్టు కూరగాయలు ఎవరైనా కొయ్యగలరా అంట" సాయానికొచ్చింది పెద్దత్త. 

"పప్పుకు ఇన్ని మావిడికాయలు ఎందుకకా, అసలే ఈ కాయలు పులుసు రొడ్డు. రెండు జాలు." 
"సోలెడు పప్పుకు రెండు కాయలేడ జాల్తాయక్కా?"
"నువ్వట్ట జూస్తావుండు. పప్పుదిన్నాక అదే కరట్టనొప్పుకుంటావు"
"వదినా బూందీకి తోకలొస్తండాయ్ ఇటొచ్చి జూడోసారి." పెరట్లోంచి చిన్నక్క కేకేసింది.
"కాసిని నీళ్ళు చిలకరించి పల్సన జేద్దాం. సరోజా ఆ స్టీలు గిన్నెలో నీళ్ళు దీసకరా!" అని పిండిలో మరికాసిని నీళ్ళు కలిపింది జానకి.
"ఆ..ఆ..పిండి మరీ అలా రైలింజన్లా తొందరతొందరగా దిప్పమాకు. గూడ్సుబండిలా కాస్త మెల్లంగా దిప్పు జయమ్మా."
"ఆ ఇప్పుడు గుండ్రంగా ముత్యాల్లాగా వస్తున్నాయొదినా."
"అకా, ఈ పాకం సరిపోద్దా?"
"ఆ సరిపోద్ది, పాకం ముదిరితే లడ్డు పైన చక్కెర తెల్లంగా పేరుకు పోద్ది. తొందరగా పూస పోసెయ్ అందులో."
"దాన్నట్టా ఒదిలేసి ఇటు రండి, పచ్చడి నూరదాం. వేడిమింద చెయ్యి గాల్తది, బాగా ఆరినాక లడ్లు జుట్టొచ్చులే తొందర్లా."

"ఒదినా ఈ అల్లం, కొబ్బరా, మిరపకాయలూ కాస్త రోట్లో మెత్తంగా దంచీ."
"జానకా ఈ బీన్స్ కూర రుజ్జూడవే."
"నువ్వు బీన్సూ, చనగలు కలిపి కూరచేద్దాం అంటే "ఇదేం కూరా" అని కాస్త ఇచిత్రంగా అనిపించింది గానొదినా, కూర బెహ్మాడంగా కుదిరిందనుకో."
"పెదమ్మా పులుసుకిన్ని ముక్కల్జరిపోతయ్యా?"
"ఆ..అ.. చాల్లే, రాధమ్మోవ్ పులుసుగాస్త చింతపండు నానెయ్"
"రసంగూడా తీసి పెట్టానత్తా. నువ్వింక పొయ్యిమింద బాండలి పెట్టు."
"పిన్నీ ఇదిగో ఈ కొత్తిమీరాకు దుంచి చారులోఎయ్యి కమ్మని వాసనొస్తది." అందించింది జయ.
"ఆ గోంగోరపచ్చట్లో కాసిని ఎరగడ్డలేసి దంచు, కమ్మంగుంటది."
"పన్నెండు గావొస్తుంది, ఈ బీరకాయలకు చెక్కుదీసి చక్రాల్లా గుండ్రంగా కొయ్యి జయమ్మా." 
"బీరకాయ కూర మా అత్త బ్రహ్మాడంగా జేస్తది. అత్తచేతి వంట తిని శానా రోజులైంది. ఆ కూర నువ్వు చెయ్యత్తా." అప్పుడే వచ్చిన అత్తనడిగింది నిర్మల.
"తమ్ముడూ మరదలూ ఒస్తున్నారంటనా"
"ఇంట్లో వ్రతం జేసుకుంటా వుంటే వాళ్ళు రాకుంటే ఎట్టా"

               *                   *                   *                *

"ఏం జేస్తండారు. పనంతా ఐపోయిందా?" అంటూ వచ్చింది పద్మావతమ్మ.
"ఇచిత్రంగా మాట్టాడతండావే. నువ్వురాకుండా పనెట్టా పూర్తవుద్దా."
"నిన్నటినుండి వద్దామనుకుంటున్నానొదినా, యాడా పన్దేమిల్తేగా, ఆ పెద్దగిన్నిటీ కాసిని బంతిపూలు గోసుకొచ్చి మాలగడతా."
"నీ వొక్కదానివల్ల  యాడవద్ది, చెట్లానిండా ఇరగబూసుండాయు. పద నేంగూడొస్తా."
"శానా పూలైనాయే. మాల నేన్గడతాగాని నువ్వు ఇంటి ముందుర నీళ్ళుజల్లి ముకర్ర గీ."
"ఈ మామిడాకులు దీసకపొయ్యి గుమ్మానికి తోరణం కట్టన్నా."
"అందరూ కూర్చునేదానికి కుర్చీలు, బల్లలూ తేను బోతుండాం. ఇంకేమన్నుంటే ఇట్టీండి, కట్టేసి తొందరగ బొయ్యొస్తం."
"పూజ సామానంతా దీసుకొచ్చినట్టేనా! ఆ టెంకాయిటీ పీచు దీస్తా."
"పేరంటాల కివ్వడానికి జాకెట్ ముక్క, పుసూగుంకం, ఆకులు, వక్క రెండరిటిపళ్ళు పొట్లాలలో యేసినం. అంతేనా ఇంకేమైనా ఎయ్యల్నా"
"ఇచ్చేటప్పుడు స్వామికాడ పువ్వోటేసివ్వు. కాస్త నీళ్ళుబోసుకునొచ్చి అక్షింతల బియ్యం ఆ గిన్నెలో గలిప్పెట్టు. అట్టనే సాయంకాలం ప్రసాదానికి, పులుసన్నానికి రవ్వ, బియ్యం అన్నీ పక్కన కొల్చిపెట్టుకో. పనంతా అయినట్టేగా, ఇంక తొందరగా తయారవ్వండి. మేం ఇంటికిబోయి పిలకాయల్ని దీసుకొస్తాం."
"వచ్చినంక రొంత ఎసట్లో బియ్యం బొయ్యడం మర్చిపోబాక."
"అట్నేలె."

                   *                 *             *                *
         ఈ సందడంతా ఇరవై ఏళ్ళ క్రితం మా నాయనమ్మా వాళ్ళింట్లో అనుకుంటున్నారా...కాదండీ పోయిన వారం మేం వ్రతం చేసుకున్నాం. పిలుపులే తేడా సంభాషణలన్నీఅవే. ఈ కాలంలో అమెరికాలోకూడా ఇలాంటి వారి మధ్య ఉన్నామంటే ఎంతదృష్టమో కదా! సుమారుగా వంద మందికి ఇలా ఇంట్లోనే వంటలు చేసేశాం. ఆహుతులందరూ కూడా ఏదో ఒక సాయం అందించిన వారే! వంట, వడ్డన, కుర్చీలు, బల్లలు తేవడం, చివరకు మిగిలిన కూరలు సర్దడం వరకూ అన్ని పనుల్లో సహాయం చేశారు. మా ఊర్లో ఎవరింట్లో ఏ శుభకార్యమైనా ఇలాగే చేసుకుంటాం. పుజారిగారు శాస్త్రోక్తంగా పూజ చేయించారు. వ్రతానికి వచ్చినవారి గోత్రనామాలు అడిగి మరీ వారిని కూడా ఆ దేవుడికి పరిచయం చేశారు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుని అందరికీ తాంబూలాలివ్వడంతో వ్రతం పూర్తయ్యింది. 

               *                   *                   *                *

ఇంతకూ వ్రతానికొచ్చిన బంధు మిత్రులేమన్నారో చెప్పలేదు కదూ...

"వంటలన్నీ బ్రహ్మాడంగా కుదిరాయి."
"లడ్లు రుచి అమోఘం."
"వ్రతం చాలా బాగా చేయించారు. ఈ పూజారి గారిని మనూర్లో ఎప్పుడూ చూడలేదే."
"కొత్తగా వచ్చారండీ తెలుగు పూజారి కదా మన పద్దతులు అవీ వారికి బాగా తెలుసు."
"ముఖ్యంగా కథ చదవమని పేపర్లు మన చేతిలో పెట్టకుండా ఆయన చెప్పడం చాలా నచ్చింది."
"కార్తీక పౌర్ణమినాడు పూజారి గారికి మా ఇంట్లో వ్రతం చేయించడానికి  వీలవుతోందేమో కనుక్కోవాలి."












Monday, November 12, 2012

నరకచతుర్దశి

       "రేపెకొంజావునే లేవాల తొందరగా పడుకోండి" రాత్రి పదైనా కూడా నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్న మమ్మల్ని హెచ్చరించి౦దమ్మమ్మ. ఇంకా కబుర్లు చెప్పుకోవాలని వున్నా ఉదయన్నే లేస్తే కొన్ని టపాసులు కాల్చుకోవచ్చని పడుకున్నాం. నరకచతుర్దశి నాడు పూర్తిగా తెల్లవారిపోతే కాల్చనీయరుగా, అప్పుడు కాకపోతే టపాకాయలు కాల్చడానికి మళ్ళీ దీపావళి రోజు సాయంత్రం వరకూ ఆగాలి.

       ఉదయం లేచేప్పటికి ఇంకా చీకటిగానే వుంది. కొబ్బరాకుల మధ్యన ఆకాశం గులాబి రంగులో కనబడుతోంది. మేడపైన రాత్రి నా పక్కన పడుకున్న వాళ్ళెవరూ కనిపించలేదు, కిందకు దిగి వచ్చేసరికే ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయి. అసలయితే ఇల్లంతా లైట్లు వేయడం అమ్మమ్మకు ఇష్టం ఉండదు. "ఎందుకమ్మా కరెంటు కర్చా, కిటికీ తలుపుల్దెరిస్తే పోలా" అంటుంది కాని ఇవాళ తెల్లవారకుండానే లేచామేమో కిటికీ అవతల కూడా చీకటిగానే వుంది.

      సందులో పొయ్యి మీద పే...ద్ద జర్మన్ సిల్వర్లో దబరలో నీళ్ళు కాగుతున్నాయి. నారింజ రంగులో పైకి లేచిన మంట భగాభగా మండుతూ దబర చుట్టూ మూత దాకా పాకుతోంది. ఉదయం చలికి ఆ మంట దగ్గర వెచ్చగా కూర్చుని అరచేతులకు సెగ చూపిస్తుంటే "నీళ్ళు కాగినాయి నాయనా, మావయ్యనా బావిలోంచి నీళ్ళు తోడి గంగాళంలో పొయ్యమన్జెప్పు" చెప్పిందమ్మమ్మ. "మావయ్యా" అని పిలుస్తూ బావి దగ్గరకు వెళ్ళేసరికే గంగాళం నిండుగా నీళ్ళు తోడున్నాయి. పక్కనే వున్న బిందెల్లో, బక్కెట్లల్లో కూడా నిండుగా నీళ్ళున్నాయి.

      "అమ్మమ్మా మామయ్య నీళ్ళు తోడేశాడు" అక్కడ్నుంచే  అరిచాను.
"దబర కాలిపోతావుంది, వేడ్నీళ్ళు తెస్తన్నానడ్డ౦ రాబాకండి" అంటూ సందులోంచి వేడి నీళ్ళు తెచ్చిందమమ్మ. "అన్నిట్లో నిండా తోడ్నారు ఎక్కడ్నే వేడి నీళ్ళు పోసేదా...వాకిట్లో నీళ్ళు జల్లను పిన్ని బక్కెనెత్తుకపోయింది, ఖాళీ అయిందేమో జూసి తీసకరా నాయనా" అని మళ్ళీ నన్నే పంపింది. ఒక బక్కెనలో సగం నీళ్ళు కింద పొయ్యొచ్చుగా! ఊహు..పొయ్యదు. పైగా నేను కనుక చెప్పాననుకోండి "ఎందుకమ్మా ఉర్దాగా పారబొయ్యడమా" అంటుంది. వాకిలి దగ్గరకు వెళ్ళేసరికి పిన్ని నీళ్ళు చల్లేసి ముగ్గేస్తూ వుంది. అప్పటికే పిన్ని స్నానం చేసి తలకు తెల్ల టవల్ చుట్టుకుని వుంది. ఖాళీ బక్కెన తీసుకుని బావిదగ్గరకు వెళ్ళగానే అమ్మమ్మ సగం వేడ్నీళ్ళు సగం చన్నీళ్ళు ఆ బక్కెట్లో పోసి వేళ్ళు తగిలించి చూసింది. "అబ్బ...ఖాలి పోతన్నాయే" అంటూ ఇంకో రెండు చెంబులు పోసి మళ్ళీ పరీక్ష చేసి "ఇజ్యమ్మా పాపకు తలకు బోద్దువురా" అని అమ్మను పిలిచింది.

     అమ్మ ఆనంద కలరు కొత్త పావడా, జాకెట్టు తీసుకుని వచ్చింది. నాకైతే పట్టులంగా వేసుకోవాలని వుంది కాని, అది దీపావళికని చెప్పిందిగా అమ్మ, అందుకని స్నానం అవగానే ఆ కొత్తబట్టలు వేసుకున్నాను. అమ్మ తమ్ముడికి బావి గట్టుమీదే నీళ్ళు పోసినట్టుంది, మధ్యగదిలో పలుచని టవల్ చుట్టుకుని ఎగురుతున్నాడు. దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుని వరండాలోకి వెళ్ళేసరికి వీధిలో కొద్దిగా వెలుతురు కనిపిస్తోంది. వాకిట్లో గేటు పక్కనున్న రెండు స్థంభాల మీద రెండు దీపాలు వెలుగుతున్నాయి. వరండాలో కాకరప్పూవ్వొత్తులు, సీమ టపాకాయలు, లక్ష్మీ బాంబులు పెట్టి వున్నాయి

      నేను తమ్ముడూ కాకరప్పూవ్వొత్తులు వరండా గట్టుమీద నిలుచుని దూర౦గా పట్టుకుని కాలుస్తుంటే మామయ్యలిద్దరూ లక్ష్మీ బాంబులు ఇంటిముందు వీధిలో పెట్టి కాకరపువ్వొత్తితో పేలుస్తున్నారు. ఎంత ధైర్యమో! పిన్ని కూడా భయ౦ లేకుండా సీమటపాకాయల్ని కొవ్వొత్తితో అంటించి వీధిలోకి విసిరేస్తే టపాటపా, ఢమాఢమా అని ఒకటే శబ్దం. మామయ్య తమ్ముడ్ని ఎత్తుకుని వీధిలోకి తీసుకెళ్ళి లక్ష్మీ బాంబు పేలిస్తే, వాడు భయ౦తో కెవ్వున ఏడవడం మొదలెట్టాడు. "పసిపిలకాయల్ని ఎందుకురా ఏడిపిస్తారా, మీ పాటికి మీరు కాల్చుకోకుండా" అని తాతయ్య అంటే, "వాడికి భయం పోగొట్టాలన్లే బాబా" అని నవ్వేశాడు శేష్మావయ్య

      సాయ౦త్రం నేను, తమ్ముడు, శ్యామ్మావయ్య, శేష్మావయ్య రచ్చబండ దగ్గరకు వెళ్ళాం. అక్కడ గడ్డి నరకాసురుణ్ణి కాలుస్తారుగా! నరకాసురుడు తగలబడిపోతుంటే అందరం చప్పట్లు కొడ్తాం. అసలైతే అలాంటి పని చేస్తే పెద్దవాళ్ళు కోప్పడతారు. కాని నరకాసురుడు రాక్షసుడు, పైగా అందర్నీ బోలెడు బాధలు పెడుతున్నాడని సత్యభామా దేవి అప్పుడెప్పుడో చంపేసిందిట. ప్రజలకు రాక్షసుని బాధ తొలగినందుకు సంతోషించి అందుకు గుర్తుగా ఇప్పుడు ఇలా నరకాసురుడు తగలబడిపోతున్నందుకు చప్పట్లు కొడతామన్నమాట. గడ్డి నరకాసురుడిలో పెట్టిన టపాసులన్నీ ఢా౦ఢా౦ అని పేలిపోయి అక్కడా ఇక్కడా పడి గడ్డి పూర్తిగా కాలిపోయేదాకా చూసి ఇంటికొచ్చేశా౦. రేపే అసలు పండుగ దీపావళి.