Friday, March 19, 2021

ఆచారాలు వ్యవహారాలు

ఇంతకు ముందు చెప్పుకున్న పెళ్ళి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.

పెళ్ళంటే రెండు కుటుంబాలు జీవితాంతం గుర్తుంచుకునే అతి ముఖ్యమైన వేడుక. మరి మగపెళ్ళి వాళ్ళతో పెళ్ళి ఇలా చేద్దామని మాట్లాడాలంటే అసలు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో, ఏమిటో మనకు కొంచెం అన్నా తెలిసి ఉండాలిగా. మా పెళ్ళి వీడియో పెట్టుకుని ఈసారి అత్తామామల కళ్ళతో చూడడం మొదలు పెట్టాం. కొంత సమాచారం తెలిసింది, అది పట్టుకుని ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడా౦. అమ్మావాళ్ళ వైపు ఒక అలవాటు, నాన్నవాళ్ళ వైపు మరో పద్దతి, అత్తగారి వైపు మరోటి. పైగా మా రోజుల్లో ఇలా చేసేవాళ్ళం ఇప్పుడంతా మారిపోయిందనే సమాధానాలు. సరే, ప్రస్తుతం పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారా అని పరిశోధన మొదలు పెట్టాం.

తెలుగు పెళ్ళి అని యూ ట్యూబ్ లో వెతికితే బోలెడు వీడియోలు కనిపించాయి కానీ, అన్నీ షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నట్లుగా ఉన్నాయి. అబ్బో కథ చాలా ఉందే, తెలిసిన దానికంటే తెలుసుకోవలసినదే ఎక్కువని అర్థమైంది. పెళ్ళి పీటలు, ఉంగరాల బిందెలు, తలంబ్రాల పళ్ళాలు అన్నీ చక్కని డిజైన్స్ తో అందంగా ఉన్నాయి. ఇక అలంకరణలు సరేసరి. అందులో తొంభై శాతం వస్తువులు ఇండియాలో దొరికేవే.

ఇక పెళ్ళికి సంబంధించిన ఆచారాలు, పసుపు కొట్టడం, ముహూర్తాలు పెట్టుకోవడం, నిశ్చితార్థం, నలుగు, మంగళ స్నానం, ప్రదానం , సత్యన్నారాయణ వ్రతం ఇవి సాధారణంగా జరిగేవి. ఇవి కాక మెహందీ, సంగీత్ వేడుకగా చేసుకోవడం అలవాటుగా మారింది. ఇంట్లో వాళ్ళతోనే అయినా ఇవన్నీ వేడుకగా జరిపించాలని నిర్ణయించుకున్నాం. డిసెంబర్ ఆరవ తేదీ నిశ్చితార్థానికి, పదవ తేదీ పెళ్ళికి బావుందని పూజారి గారు చెప్పారు.

పెళ్ళి పద్దతుల గురించి కొంచెం అవగాహన వచ్చాక పసుపు కొట్టే రోజు ఏమి చేయాలి? నలుగు ఎలా పెట్టాలి? నలుగు పెట్టడానికి ఏమేమి వస్తువులు కావాలి? ఒడిబియ్యం అంటే ఏమిటి? తలంబ్రాలు ఎలా కలపాలి? ఇలాంటివన్నీ తెలుసుకుంటూ వివరాలన్నీ వ్రాసి పెట్టుకున్నాం.

ఇరువురు కలసి జీవించటానికి ఇవన్నీ అవసరమా అనిపిస్తూ ఉంటుంది కానీ, ఇది రెండు కుటుంబాల కలయిక కదా! ఒకరి ఇష్టాఇష్టాలు నమ్మకాలు మరొకరు గౌరవిస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అవతల వారి ఆచార వ్యవహారాలు ఏమిటో తెలియదు. రెండు నెలల పరిచయంతో కేవలం నాలుగైదు సార్లు మాట్లాడి పూర్తిగా అర్థం అయింది అనుకోవడం కూడా కష్టం. ఆ మాటకొస్తే మన పిల్లల మనసులో ఏమేమి కోరికలున్నాయో కూడా మనకు పూర్తిగా తెలియదు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పద్దతులను అనుసరిస్తే కొంత తేలిగ్గా ఉంటుంది. ఏమంటారు?

ఫలానా రోజు పసుపు కొడదాం అనుకున్నాక ఆ విషయం మా తమ్ముడు వాళ్ళతో చెప్పాము. “అత్తా వాళ్ళిoట్లో ఫంక్షన్ అయితే మనం వెళ్ళకపోతే ఎలా” అని మా మేనకోడలు పట్టుబట్టిందట. మా తమ్ముడు వాళ్ళు రావడానికి నిర్ణయించుకున్నారు. ఈ కరోనా టైమ్ లో ఏడు గంటల ప్రయాణం చేసి రావడమన్నది ధైర్యంగా తీసుకున్న నిర్ణయమనే చెప్పొచ్చు.

మా వారి కజిన్ కి, మరో ఇద్దరు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి”ఫలానా రోజు పసుపు కొడుతున్నాం. మీకు ఇబ్బంది లేకపోతేనే రండి. పరిస్థితి ఇలా ఉంది కాబట్టి రాకపోయినా ఏమీ అనుకోము, మొహమాట పడకండి” అని చెప్పాము. రాకపోవడమా భలేవాళ్ళే మాస్క్ లవీ పెట్టుకుని వచ్చేస్తాం అన్నారు.

పసుపు కొట్టడ౦ అని యు ట్యూబ్ లో వెతికితే బోలెడు వీడియోలు వచ్చాయి. వాటిలో చాలా వీడియోలలో “నాయుడోళ్ళి౦టికాడ నల్ల తుమ్మ చెట్టు కింద’ పాటకు మగువలు రోకలి పట్టుకుని అటు ఇటూ తిరుగుతూ డాన్స్ చేస్తున్నారు. ఏమిటి ఈ మధ్య ఇలా కూడా పసుపు దంచుతున్నారా అనుకున్నాం.

ఇంట్లో ఉన్న మా బుజ్జి రోలుకే పసుపు రాసి బొట్లు పెట్టాం. ‘లోవ్స్’ అనే హార్డ్ వేర్ షాప్ నుండి రెండు కర్రలు తెచ్చి వాటినే రోకళ్ళుగా అలంకరించాం. తమలపాకులూ, అరటిపళ్ళూ సిధ్ధం చేసుకున్నాం. వస్తామన్న నలుగురూ వచ్చారు.

పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య వదిన కూడా ఈ ఊర్లోనే ఉంటారని చెప్పాను కదా. ఈ ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్’ తో పెళ్ళికొడుకు కూడా వాళ్ళదగ్గరే ఉంటున్నాడు. ఇండియాలో వాళ్ళ అమ్మా వాళ్ళు పసుపు కొట్టడం చూడలేక పోయారు కానీ, ఇక్కడ చక్కగా మాతో కలసిపోయారు.

పసుపు కొమ్ములు రోట్లో వేసి, అందరం కాసేపు దంచి ఫోటోలు తీసుకున్నాం. ఈ కార్యక్రమ౦ అవగానే వచ్చిన వాళ్ళకు తాంబూలం ఇచ్చాను.

 
                                          












                                                                          
మరిచేపోయాను మా గుంటూరు అత్తయ్య వడియాలు పెట్టమంటే బయట ఫైర్ పిట్ మీద కొత్త బ్లౌస్ పీస్ పరిచి వడియాలు కూడా పెట్టాం. పసుపు దంచడం, వడియాలు పెట్టడం ఈ సరదా అంతా అమ్మాయిలకేనా మేమూ చేస్తాం అంటూ బుజ్జిపండు, మా మేనల్లుడు, ఇంట్లో ఉన్న మిగిలిన మగవాళ్ళు కూడా పసుపు దంచి వడియాలు పెట్టారు.




పసుపు కొట్టడం అయిందిగా ఇక మిగిలిన పెళ్ళి పనులు మొదలు పెట్టాము.

పెళ్ళి కోసం హోటల్ బాల్ రూమ్స్ చూస్తున్నప్పుడు అర్థమైన విషయం ఏమిటంటే హాల్ తో పాటు భోజనం, వాళ్ళు ఎంపిక చేసిన రెస్టారెంట్ నుండే తీసుకోవాలిట, దానికోసం ప్లేట్ కి దాదాపుగా ఎనభై డాలర్లు కట్టాలిట. భోజనం వాళ్ళు ఇండియన్ రెస్టారెంట్ నుండే తెప్పించినా, అవి సాధారణంగా పనీర్ బటర్ మసాలా, ఫూల్ మఖానీ టైప్ లో ఉంటాయి. మనకేమో గోంగూర పచ్చడి, పులిహోర, సాంబారు లాంటివి పెళ్ళి భోజనంలో తప్పనిసరిగా ఉండాలి. ఇలా సౌత్ ఇండియన్ ఫుడ్ ఇచ్చే రెస్టారెంట్స్ ఏవీ వాళ్ళ లిస్ట్ లో లేవు. భోజనం తీసుకోక పోయినా సగం డబ్బులు కడతామని, మాకు నచ్చిన రెస్టారెంట్ నుండి భోజనం తెచ్చుకునేలా హోటల్ వాళ్ళతో మాట్లాడాము. మిలియన్ డాలర్స్ ఇన్సూరెన్స్ కట్టే పక్షంలో మా ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. ఈ ఒప్పించిన ప్రతిభ ఇంటాయనదే. ఆ విధంగా ‘లే మెరిడియన్’ హోటల్ లో బాల్ రూమ్ పెళ్ళికీ, మరో రూమ్ భోజనాలకూ బుక్ చేసుకున్నాం. సంగీత్ కోసం 'ఆర్కిడ్ బ్యాంకెట్ హాల్' బుక్ చేసుకున్నాం.

అప్పుడే ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ, ఈవెంట్ డెకరేషన్స్, డిజే ఇలా అన్నిటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఫోటోస్, వీడియోస్ మీద పెళ్ళికొడుక్కి మా వారికి మంచి అవగాహన ఉంది. వాళ్ళిద్దరూ రీసెర్చ్ చేసి డేవ్ భౌమిక్ అనే అతన్ని ఎంపిక చేసారు. అతనికి తెలుగు రాదు కానీ, సౌత్ ఇండియన్ పెళ్ళిళ్ళ గురించి కొంత అవగాహన ఉందట. పెళ్ళి, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తీస్తానన్నాడు. ఈ ఫోటో షూట్ కోసం పెళ్ళి కూతురిని, పెళ్ళి కొడుకునీ ఏ అట్లాంటానో మరో ఊరికో, లేదా ఏ సముద్రపు ఒడ్డుకో తీసుకుని వెళ్తాడాట. పెళ్ళికి ముందు ఇలా తిరుగుతూ ఉంటే కరోనా ఎక్కడైనా అంటుకుంటే పెళ్ళికి వస్తున్న వంద మందినీ రిస్క్ లో పెట్టినట్టు, ఈ పరిస్థితిని అర్ధం చేసుకుని పిల్లలు పెళ్ళి తరువాతే ఫోటో షూట్ కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.

డిజే సంగీత్ కీ, పెళ్ళికీ మాట్లాడుకున్నాం. పెళ్ళికా, డిజేనా? అనుకోకండి. ఇక్కడ మేళం దొరకదుగా, ‘మరి గట్టిమేళం’ అని పంతులుగారు గట్టిగా అనగానే ఆ మేళాల శబ్దం వినిపించాలంటే డిజె కావాలి. వాళ్ళ దగ్గర మంచి స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. మెహందీ పెట్టడానికి పెళ్ళి కూతురికి ఇంట్లో మిగలిన పిల్లలకు మేకప్ చేయించడానికి కూడా అప్పుడే చూడడం మొదలు పెట్టాం. ఈ సబ్జట్ నాకు పూర్తిగా గ్రీక్ అండ్ లాటిన్. ఈ బాధ్యత అంతా మా పాప ఫ్రెండ్ తీసుకుంది.

అన్ని ఈవెంట్స్ కి డెకరేషన్ దేనికదే వేరుగా ఉంటే బావుంటుందని అనుకున్నాం. ఆరవ తేదీన ముహూర్తాలయితే, ఎనిమిదవ తేదీ ఉదయం మెహందీ, సాయంత్రం సంగీత్. తొమ్మిది ఉదయం నలుగు, మంగళ స్నానాలు సాయంత్రం ప్రదానం , పది సాయంత్రం పెళ్ళి, చివరగా పదకొండు ఉదయం వ్రతం.

పెళ్ళికి, సంగీత్ కి డెకరేషన్స్ బయట ఇచ్చాం. మిగిలిన వేడుకలన్నీ ఇంట్లోనే అయినా దేనికదే ప్రత్యేకంగా ఉండాలంటే ప్రతి పూటా డెకరేషన్ మారాలి. వేరే డెకరేటర్స్ ని కలిశాం. మార్చ్ నుండి పెద్దగా పెళ్ళిళ్ళు లేకపోవడంతో అప్పటినుండీ వెయిట్ చేసినవాళ్ళంతా నవంబర్, డిసెంబర్ లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. మేం కలిసిన డెకరేటర్స్ దాదాపుగా ఈ పెళ్ళిళ్ళన్నింటికీ డెకరేట్ చేస్తున్నారు. అయితే మాటల్లో అర్థం అయిందేమిటంటే వాళ్ళు మాలాంటి వాళ్ళని దాదాపుగా రోజూ కలుస్తున్నారనీ చాలా మంది ఇళ్ళకు వెళ్ళి కూడా డెకరేట్ చేస్తున్నారనీ.

పెళ్ళికి మా మరిది వాళ్ళూ, తమ్ముడు వాళ్ళూ ఓ రెండు వారాల ముందే వస్తున్నారని చెప్పాను కదా! ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు మరో ఐదారుగురు హోటల్ లో ఉన్నా ప్రతి అకేషన్ కీ ఇంటికి వస్తారు. కొన్ని ఆకేషన్స్ కి మగపెళ్ళి వాళ్ళు కూడా వస్తారు. ఈ కరోనా లో ఇంతమంది ఉన్న ఇంటికి ఆ డెకరేటర్స్ రావడం అంటే రిస్క్ తో కూడిని పని. ఇవన్నీ ఆలోచించి ఇంట్లో చేసే ఈవెంట్స్ అన్నింటికీ డెకరేషన్ మేమే స్వంతంగా చేసుకోవాలనుకున్నాం. చాలా పెద్ద నిర్ణయం. డెకరేషన్స్ చేయడం మాకు అలవాటే, ప్రతి ఏడాది ఆరు, ఏడు వందల మందితో పాఠశాల వార్షికోత్సవం చేస్తూ ఉంటాం కదా! అయితే మామూలు రోజుల్లో సై సై అనే ఉత్సాహవంతులు మా చుట్టూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఈ కరోనా వలన ఎవరి సహాయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము.

సరే ఎలాగో చూద్దాం అనుకుంటూ, ఇంటర్నెట్ అంతా వెతికి డిజైన్స్ ఎంచుకుని, మార్పులూ, చేర్పులూ చేసి స్వంత డిజైన్స్ తయారు చేసుకున్నాం.

పెళ్ళికి కావలసిన వస్తువులేమిటో అవి ఇక్కడకు ఎలా వచ్చాయో ఇక్కడ చదవొచ్చు.  

2 comments:

  1. చదువు తుంటే చూస్తున్నట్టు ఉంది

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.