Tuesday, July 16, 2024

ఏటిగట్టున గాలిపాట

రోజులన్నీ అలాగో ఇలాగో ఎలాగో నడుస్తూ ఉంటాయి కానీ అనుకోని అదృష్టం పట్టినప్పుడు మాత్రం పువ్వుల పల్లకిలో ఊరేగుతాయి. నా వరకు నాకు గడిచిన మూడు రోజులు అట్లాంటివే. అదెట్లాగంటారా, నాలుగేళ్ళ క్రితం ఒకరోజు

"ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే
తియ్యాతియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా"

అంటూ పసివాళ్ళలో పసివాడై పాటలు పాడుతున్న సి.యె.ప్రసాద్ గారిని ఫేస్ బుక్ లో చూసాను. అరవైలో ఇరవైలాగా ఉండాలని అనుకునేవారిని చూశాను కానీ అరవైయేళ్ళ వయస్సుని పదుల్లోకి మళ్ళించడం ఎట్లా సాధ్యమయ్యింది? ఆసక్తిగా అనిపించి ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని సింగరాయకొండలోని వారి ఇంటికి వెళ్ళాను. ఊరికి చివరగా ఉన్న కాలనీలో వేపచెట్టు కింద చల్లని నీడలో ఉందా ఇల్లు. అక్కడ వసారాలో కూర్చుని ఆయన మాటలు, పాటలు, కథలు వింటూ ఉన్న నాకు మూడు గంటలు ఎట్లా గడిచిపోయాయో తెలియలేదు. అప్పుడు అర్థం అయ్యింది నేను కలిసింది పసివాడిని కాదు మాటల మాంత్రికుడిని అని. ఆశ కలిగింది ప్రసాద్ గారు మా ఊరికి వచ్చి పాఠశాల పిల్లలతో అటలు అడి, మా టీచర్లకు పిల్లలను ఆకట్టుకునే విద్యేదో కాస్త నేర్పిస్తే బావుంటుంది కదా అని.

సరే ప్రస్తుతం కథలోకి వస్తే విఎ.ఎన్.ఆర్.ఐ అసోసియేషన్ ఈవెంట్ కోసం ప్రసాద్ గారు సెయింట్ లూయిస్ కు వస్తున్నట్లుగా తెలిసింది. అప్పటి ఆశ చివుర్లు తొడిగింది. అయితే ఇక్కడో ఇబ్బంది ఉంది. జులై అంటే ఒకపక్క ఉద్యోగం, మరోపక్క ఇంట్లో కొత్త సందడ్లు, ఇంకోవైపు పాఠశాల ప్లానింగ్ సెషన్స్. వీటన్నింటితో ఆ నెలలో జడకోలాటం లాంటిదేదో ఆడవలసి వస్తుందని ముందే తెలుసు. మరి ఆ సమయంలో ప్రసాద్ గారి కార్యక్రమాన్ని మా ఊరిలో ఏర్పాటుచేయడం కష్టమైనపని. పాఠశాల టీమ్ తో చర్చిస్తే మురళి గారు మరేం పరవాలేదు ప్రసాద్ గారి వసతి, ఈవెంట్ ఏర్పాట్లు తాను చూసుకుంటాను అన్నారు. అలా ప్రసాద్ గారిని షార్లెట్ కు తీసుకుని రావడానికీ, మా పాఠశాల పిల్లలకు, పెద్దలకు ప్రసాద్ గారిని కలిసే అవకాశం కలిగించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.

అంతవరకు బాగానే ఉంది. మా పాఠశాల వారికి ప్రసాద్ గారు ఎవరో ఏమిటో తెలిస్తేనే కదా వారు ఆయన్ని కలవడానికి ఆసక్తి చూపించేది. తెలుసుగా మాదంతా కమ్యూనిటీ విద్యా విధానం. అంటే టీచర్స్ ఎక్కడెక్కడో ఉంటారు, వారి ఇళ్ళలోనే తరగతులు జరుగుతాయి. ఆ తరగతి విద్యార్థులు వారి చుట్టు పక్కలే ఉంటారు. వీరినంతా మేము కలిసేది వార్షికోత్సవం రోజునే. పేరెంట్స్ కు కానీ టీచర్స్ కు కానీ ఒక విషయం తెలియజేయలంటే వాట్స్ ఆప్ మెసేజో, ఇమెయిలో మాత్రమే మాకున్న సాధనం. ప్రసాద్ గారు ఎవరో ఏమి చేస్తుంటారో తెలిస్తేనే కదా వాళ్ళకు తనను కలవాలనే ఆసక్తి కలిగేది. వారి గురించి చూపించడానకి వారి ఫేస్ బుక్ ప్రొఫైల్ తప్ప, యూ ట్యూబ్ వీడియోస్ లాంటివి లేవు. సరే ఆ ఫేస్ బుక్ ప్రొఫైల్ కే కొన్ని మాటలు జోడించి మా రాజు గారు 'గాంధీ హాల్ లో జులై పదమూడవ తేదీన 'ఇంటరేక్టివ్ తెలుగు వర్క్ షాప్ ఉంటుంది తప్పకుండా రండి' అంటూ పేరెంట్స్ కు తెలియజేసారు. ఇంతకూ ప్రసాద్ గారు ఎవరని కదూ మీ సందేహం కూడా, మీకూ పరిచయం చేస్తాను.

వారు ఎస్ సిఇఆర్ టి (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్) సభ్యులు. పూర్వం జన విజ్ఞాన వేదికలో కూడా పనిచేసారు. నయీతాలీమ్ లో నేషనల్ కమిటీ మెంబర్. ఇంతకూ నయితాలీమ్ అంటే ఏమిటో తెలుసా? గాంధీ గారు ప్రతిపాదించిన విద్యావిధానం. నయి అంటే కొత్త, తాలీమ్ అంటే విద్య. మాతృభాషలోనే చదువు చెప్పాలని, చదువు, పని రెండూ కలిపే నేర్పించాలని ఆ విద్యావిధానం చెప్తోంది. దగ్గర దగ్గరగా మాంటిస్సోరి విధానం అని చెప్పవచ్చు. ఆయన ప్రజా సైన్స్ వేదిక లో స్టేట్ ప్రెసిడెంట్. అయినా ప్రసాద్ గారి గురించి ఇలా చట్రంలో కుదించి చెప్పాలంటే కుదరదు. తాను ఏటిగట్టున గాలిపాట. తన సమక్షాన్ని అనుభవిస్తేనే తెలుస్తుందా విషయం. నా మాట నిజమో కాదో తెలుసుకోవలంటే మూడు రోజులు పూర్తిగా తనతోనే ఉంటున్న మురళి గారిని, వారి కుటుంబాన్ని అడగండి.

మళ్ళీ కథలోకి వద్దాం, ప్రసాద్ గారు పోయిన శుక్రవారం సాయంత్రం షార్లెట్ కు వచ్చారు. తను వచ్చే ముందు రోజు అంటే గురువారం అర్ధరాత్రి నాకొక ఆలోచన వచ్చింది. ప్రసాద్ గారికి మా పాఠశాల సిలబస్ చూపించి తన సలహా తీసుకుంటే బావుంటుందేమో అని. మా సిలబస్ ఏమైనా పుస్తకాల్లో ఉందా తనకు ఇచ్చి చదవమనడానికి, మేము పిడిఎఫ్ పంపిస్తే విద్యార్ధులు ప్రింట్ తీసి బై౦డర్ లో పెట్టుకోవడమేగా చేస్తున్నది.వెంటనే టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, 'నాకో చిన్న సాయం కావాలి. మీరు కానీ, మీ తరగతి పేరెంట్స్ కానీ నాలుగు తరగతుల బై౦డర్స్ తీసుకెళ్ళి మురళి గారి ఇంట్లో ఇచ్చిరాగలరా' అని.

ఏమడిగినా నేను చేస్తా అని వెంటనే చెయ్యి పైకెత్తే మా టీచర్ హిమ 'అడ్రస్ ఇవ్వండి ఇవాళ లంచ్ టైమ్ లో వెళ్ళి నా దగ్గరున్న నాలుగవ తరగతి బై౦డర్ ను ఇచ్చి వస్తాను' అన్నారు. బంగారు తల్లి కదూ! నార్త్ లో ఉన్న టీచర్స్ తాము రాలేము చాలా దూరం అన్నారు. మిగిలిన వారు ఎవరూ కూడా ఊ, ఉప్పరాయి అనలేదు, మరి మిగిలిన తరగతుల బై౦డర్స్ ఎలా? సాయంత్రం వరకూ చూసి విశాఖ టీచర్ కు ఫోన్ చేసి పరిస్థితి ఇదీ అని చెప్పాను. పాపం రెండు రోజుల నుండీ జ్వరంతో ఉన్నా కూడా తానే స్వయంగా మిగిలిన మూడు తరగతుల బై౦డర్స్ సేకరించి మురళి గారి ఇంట్లో ఇచ్చేసి వచ్చారు. మొత్తానికి ఆ విధంగా మా సిలబస్ శుక్రవారం రాత్రికి ప్రసాద్ గారికి చేరింది.

శనివారం సాయంత్రం కదా ప్రోగ్రామ్. ఆ మధ్యాహ్నం కాసేపు వారి దగ్గర టీచింగ్ మెథడ్స్ తెలుసుకుంటేనో అనిపించి ఆసక్తి ఉన్నటీచర్స్ ను శనివారం మధ్యాహ్నం మా ఇంటికి రావలసిందిగా టీచర్స్ గ్రూప్స్ లో మెసేజ్ పెట్టాము. ఊహించినట్లే మెసేజ్ చూసిన వెంటనే 'నేనొస్తా' అంటూ హిమ చెయ్యి పైకెత్తారు. వాహిని గారు జ్వరంగా ఉందని, మరి కొంత మంది తమకు కుదరదని చెప్పారు. కొంతమంది అసలు ఏమీ చప్పలేదు. సరే నేనూ, హిమా, అనురాధా ప్రసాద్ గారిని మా ఇంటి దగ్గర కలుద్దామని అనుకున్నాము.

ఇంటి ముందుగా దేవుడి ఊరేగింపు వెళ్తుంటే తలుపులు మూసి గది లోపల కూర్చున్నట్లుగా ఉంది పరిస్థితి, చాలా వెలితిగా అనిపించింది. ఎంతో దూరం నుండి మాకోసం షార్లెట్ కు వచ్చిన ప్రసాద్ గారిని కలవడానికి కేవలం ముగ్గురికే వీలవుతుందా అని. అట్లా కాదని శనివారం ఉదయాన్నే పాఠశాల నిర్వాహకులలో మా ఇంటికి దగ్గరగా ఉన్న వారికి వాట్స్ ఆప్ లో మెసేజ్ పెట్టాను మనమంతా ప్రోగ్రామ్ ముందు ప్రసాద్ గారిని కలుద్దామా అన్నాను. అందరూ వెంటనే సరే అని అప్పటికప్పుడు సరోజిని, సంధ్య, అనురాధ, స్నేహ, హిమ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వండేసి మధ్యాహ్నానికల్లా వచ్చేసారు. విజయ్ గారు వాళ్ళింట్లో చుట్టాలున్నారని కాసేపు వచ్చి వెళ్తామన్నారు. అలా ఆరు కుంటుంబాల వాళ్ళం ప్రసాద్ గారి కబుర్లు వింటూ భోజనాలు చేశాం.
 

సాయంత్రం నాలుగింటికి ప్రోగ్రామ్, మూడు గంటలకల్లా బయలుదేరాలి, అక్కడ రెండు గంటలు మాట్లాడాలి. ముందు రోజు రాత్రి కూడా వాళ్ళంతా ఆలస్యంగా పడుకున్నారని మురళి గారు చెప్పారు. ప్రసాద్ గారిని కాసేపు విశ్రాంతి తీసుకుంటారా అని అడిగాము. అబ్బే అవసరం లేదమ్మా అంటూ కబుర్లలో కథలు, పాటలు కలిపేసి బాలాంత్రపు రజనీకాంత రావు గారిని, కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి గారిని, సైకిల్ డాక్టర్ గారిని ఇంకా ఎందరెందరినో పరిచయం చేసారు. అందులో రజనీకాంతారావు గారు తెలుసు. ఆయన రాసిన 'అలుసుగా నన్నైతే అంటావుగానీ ఏమి చేసిన కాని నాన్నారి ననవే' అనే పాటను మా పిల్లలతో నాటిక వేయించా౦ కదా. అన్నట్లు ప్రాసాద్ గారు మా పాఠశాలకు బహుమతులు కూడా తెచ్చారు. 
సరే మూడు ముప్పావుకంతా వెన్యూ దగ్గరకు చేరిపోయాం. అక్కడకు దేవిక గారి కుటుంబం, మురళి గారు, వెంకట్ గారు, టీచర్ శ్రవణ్ గారు ముందుగా వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశారు. నాలుగుంబావుకంతా శోభ, రాధిక, శ్రావణ్, అమృత, జయరామ్, ఉష, స్వాతి కొంతమంది పేరెంట్స్ పిల్లలు, నాన్నమ్మలు, తాతయ్యలు వచ్చారు. మా టీచర్ జ్యోతి గారు ప్రసాద్ గారిని పరిచయం చేసారు. ప్రసాద్ గారు మైక్ తీసుకుని "నేను వేదిక మీద కాకుండా ఇలా మీ దగ్గరగా ఉంటే ఏమైనా అభ్యంతరమా" అంటూ అక్కడ మెట్ల మీదే కూర్చున్నారు. 'మీరంతా పిల్లలు బావుండాలి అనుకుంటారు కదా, అసలు బావుండడం అంటే ఏమిటి? భాష నేర్పించాలని అనుకుంటున్నారు కదా, భాషకు చదువుకూ ఉన్న సంబంధం ఏమిటి? అసలు చదువంటే ఏమిటి? అంటూ సంభాషణ మొదలు పెట్టారు. ఆ రోజు తెలుసుకున్న అంశాలు

చదువు వలన ఉపయోగం ఏమిటంటే మనలో అంతర్గతంగా ఉన్న శక్తిని బయటకు తీసుకురావడం. భాష నేర్చుకోవడానికి పాటలు, కథలు చాలా ఉపయోగపడతాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం లేనిదే ఏ స్కూల్ కూడా పిల్లలకు భాష నేర్పించలేదు. పిల్లలకు ఏమి నేర్పించినా ఒక ఆటలా ఉండాలి, కానీ పాఠంలాగా చెప్తే వారు నేర్చుకోరు. పాటలను పేరడీ చేసి, పిల్లలతో చేయించి వారిలో భాష పట్ల ఆసక్తిని పెంచవచ్చు.


అంతేనా పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఏమి చెయ్యాలని అడిగిన ప్రశ్నకు మీరెవరమ్మా చెప్పడానికి? అన్నారు. అదేమిటండీ మనం చెప్పక పోతే ఎలా నేర్చుకుంటారు అంటే "రెండు మొహాలు, రెండు నాలుకలు ఉన్న మనమా చెప్పేది? పిల్లలు పుట్టగానే ఈ అబ్బాయి ఇట్లా, ఈ అమ్మాయి అట్లా అంటూ వారి మీద లేబుల్ వేసి వారిని మానికల్లో గిద్దల్లో సర్దేసి ఎదగనీయకుండా చేసే మనకు తెలుసా పిల్లల్ని ఎట్లా పెంచాలో అన్నారు. వారిని నడవనీయండి, పడనివ్వండి, లేవనివ్వండి, తెలుసుకోనివ్వండి, ఎదగనివ్వండి" అని చెప్పారు.



ఆ రెండు గంటల పాటు పిల్లలంతా ఆయన చుట్టూనే ఉన్నారు. ఆ పిల్లలతో ఆడారు, పాడారు, వారికి బొమ్మల పుస్తకాలలోని చిన్న చిన్న కథలు చదివి వినిపించారు. పాఠాలెలా చెప్పాలో మాకు ప్రత్యేకంగా చెప్పలేదు, చూపించారు. అక్కడకు రాని పేరెంట్స్ టీచర్స్ ఎంత కోల్పోయారో కదా అనిపించింది. ఆ కార్యక్రమ౦ జరిగిన రెండు గంటలూ ఆయన దాదాపుగా నిలబడో పిల్లల చుట్టూ తిరుగుతూనో ఉన్నారు. అంతా వెళ్ళిపోయాక కూడా ఒక గంట మాతో కబుర్లు చెపుతూ నిలబడే ఉన్నారు. ఆ వయస్సులో ఆ ఓపికకు ఆశ్చర్యపోయాము. మీరు చెప్పమంటే రేపు ఒక రెండు గంటల పాటు పాటు సైకాలజీ పాఠం చెప్తాను అంటూ మాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతకంటేనా అనుకుని సరే అన్నాము.
ఆదివారం ఉదయం పదిగంటలకు పాఠం మొదలయి దాదాపుగా ఒంటి గంటకు పూర్తయ్యింది. మరికొంత సేపు కబుర్లు చెప్పుకుని దాదాపుగా రెండు గంటల ప్రాంతంలో మురళి గారింటికి భోజనానికి వెళ్ళాము. 
భోజనం చేసాక ప్రసాద్ గారితో సిలబస్ రివ్యూ మొదలు పెట్టాను. ఆ రెండు రోజులూ పూర్తిగా మాతోనే ఉన్నారా, మరి సిలబస్ ఎప్పుడు చూసారో కానీ అప్పటికే చక్కగా నోట్స్ రాసి పెట్టుకున్నారు. ఇంతకూ మా సిలబస్ చూసి ఏమన్నారో తెలుసా "భాష నేర్పడం సంభాషణల రూపంలో ఉండడం సరైన పద్దతి, అది మీ సిలబస్ లో చక్కగా ఉంది కానీ అమ్మా" అంటూ ఏమి మార్పులు చేయాలో చెప్పారు. అట్లాగే మాట్లాడడానికి ఇచ్చిన పదాలు, రాయడానికి ఇచ్చిన వాక్యాలలో ఎక్కడెక్కడ మార్పులు చేయవచ్చో, ఎక్కువగా వాడని పదాలను ఏ పాఠాలలో చెప్పాలో వివరంగా చర్చించారు. దాదాపుగా నాలుగు గంటల పాటు సిలబస్ రివ్యూ చేసారు.

తాను అమెరికాలో చూడాలని అనుకున్నదేమిటో తెలుసా? స్కూళ్ళు, లైబ్రరీలు. మురళి గారు లైబ్రరీకి తీసుకునివేళ్ళారు. ఇది వేసవి కాలం కదా స్కూల్ తెరిచి ఉండదు అందుకని అనురాధ డేకేర్ కు తీసుకుని వెళ్ళారు. తనకు ఆ డేకేర్, లైబ్రరీ చాలా చాలా నచ్చాయట. ప్రసాద్ గారు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారు, దాంతో అక్కడ పనిచేసే వాళ్ళతో మాట్లాడగలిగారు. 

అలా ప్రసాద్ గారితో గడిపిన మా రోజులు పువ్వుల పల్లకిలో ఊరేగాయి. నిన్న సాయంత్రమే తనను శివ జాస్తి గారి దగ్గరకు వెళ్ళడానికి మినియాపోలిస్ కు వెళ్ళే ఫ్లైట్ ఎక్కించాము. తనతో గడిపిన ఈ మూడు రోజులలో ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అనే హద్దులేవీ లేకుండా ఎన్నో ప్రశ్నలు అడిగాను, ఆయన ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరికాయి. ఆటా ఇటా అంటూ ఎటూ తేల్చుకోలేని మనసు బరువు దించుకుని స్వేచ్ఛగా గాలిలో గిరికీలు కొట్టింది.

మనకు కావలసినదేమిటో, ఎలా ఉంటే సంతోషంగా ఉండగలమో తెలుసుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది, బహుశా జీవితకాలం పడుతుందేమో! ఒకవేళ తెలిసినా కూడా అలా బ్రతకలేము, అలా ఉండలేక పోవడానికి బోలెడు కారణాలని చెప్పుకుంటాము. తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం తనకు నచ్చిన దారిలో జీవితాన్ని మలుచుకున్న ప్రసాద్ గారిని కలవడం ఒక గొప్ప అనుభవం. తెలుసుకోవాలన్న తపన, తెలిసింది చెప్పాలన్న ఉత్సాహం తప్ప తనకు మరే దానిమీద కోరిక లేదు. ప్రతిఫలాపేక్ష లేని మనిషి, ఎవరైనా తన గురించి ఒక్క మంచి మాట చెప్పాలని కూడా కోరుకోని గొప్ప వ్యక్తి. అందరికీ ఉండేది రోజుకు ఇరవై నాలుగు గంటలే. ఇలా ఎన్నో రోజులు, వారాలు, నెలలు కుటుంబానికి దూరంగా ప్రసాద్ గారు తనకు నచ్చిన దారిలో నడవడానికి సహకారం ఇస్తున్న వారి సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఆదివారం మా పాఠం పూర్తయ్యాక, ఆయన ఏమైనా ప్రశ్నలు అడగమంటే మా మొదటి ప్రశ్న ఏమిటంటే " ప్రసాద్ గారిని షార్లట్ లో ఉంచెయ్యాలంటే ఏమి చెయ్యాలి?" అని. అట్లా కుదరదు కదమ్మా, పండగ రోజూ ఉంటే బావుండదు కదా అన్నారు. నిజమే పండగ రోజూ ఉండాలనుకోవడం అత్యాశే. అయితే  ఇలాంటి పండుగలు మహా అరుదు. 

తాను పాడిన పాటలు, చెప్పిన కబుర్లు అన్నీ ఇంకా గదిలోనే తిరుగుతున్నాయి. గుండె తడి తెలుస్తోంది, ఈ మధ్య కాలంలో ఇది అరుదైన అనుభవం, మంచిదే. మనం శ్వాస తీసుకుంటోంది బ్రతకడానికి మాత్రమే కాదు జీవించడానికని గుర్తు చేసేది ఇదే కదా! థాంక్యూ సర్.

ప్రసాద్ గారు ఇక్కడకు వచ్చినప్పటి ఫోటోలు, వారి ప్రసంగాలు ఇక్కడ ఉన్నాయి. సైకాలజీ ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు.