Saturday, October 1, 2011

కౌముదిలో నా కవిత 'ఎడబాటు'


ఈ దారిలోనే కదూ నా చిన్నారి
బుల్లి బుల్లి అడుగులతో పరుగులు తీసింది!
అదిగో ఆ తోటలోనే మునుపెన్నడో
ఊయల ఊగిన సందడి!

ముచ్చటైన సైకిలును చూసి
మోమున మెరిసిన సంతోషం!
చారడేసి కళ్ళతో బెంగగా
స్కూలుకు వెళ్ళిన వైనం!

శాంతాతో ఫోటోలు, జింజెర్ బ్రెడ్ హౌసులు,
హాలోవీన్ డ్రస్సులు, ఈస్టర్ ఎగ్ హంట్లు,
కోరస్ పాటలు, టెన్నిస్ ఆటలు
ఓహ్! ఎన్నెన్నో!
అవన్నీ నిన్న మొన్నలా లేదూ!

ప్రతి మలుపులో వేలు పట్టుకుని నడిపించాను!
మలుపులన్నీ దాటి చూద్దును కదా
ఆ చివర మలుపు తిరుగుతూ
ప్రగతి పథంలో తాను!

తన జ్ఞాపకాల బాసటగా
ఈ చివర నేను!

నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'అక్టోబర్ 'సంచికలో ప్రచురితమైంది.

నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.