Monday, April 30, 2012

మువ్వల పట్టీలు

      పసిమొగ్గలతో, పువ్వులతో హాయిగా నవ్వుతున్న ఈ సన్నజాజికి తెలుసా నన్నిక రోజూ చూడలేదని. ఆ పసిమొగ్గలు వికసి౦చగనే నాకోసం వెతుకుతాయి కాబోలు! రేపటి నుండి ఈ తీగకు రోజూ నీళ్లెవరు పోస్తారో...మేడ మీదకు వాలిన కొబ్బరాకు నా మాట వినిపించక బెంగ పెట్టుకోదూ... బంతి మొక్క కొత్త చివురులు తొడుగుతోంది, ఆకులు వచ్చే సమయానికి చూడడానికి నేను౦డను కదూ!

     ము౦గిట వేసిన ముగ్గు ఈ రోజెందుకో కలత పడినట్లుంది. ఎన్నడూ లేనిది గాలి కూడా జాలిగా వీస్తోంది. మాలతీమాధవం పక్కనున్న ఈ మెట్టుమీద కూర్చుని ఎన్నెన్ని పుస్తకాలు చదివానో! నేను లేక ఇది ఒంటరిదైపోతుందా... వీధి చివర కానుగ చెట్టు బస్సు రాగానే నన్ను పిలుస్తుంది కాబోలు..నేనిక రానని తెలియదు పాపం.

       ఇంటికి రాగానే నన్ను పిలిచే నాన్న ఇకనుండి ఎవరిని పిలుస్తారు? కబుర్లెవరితో చెపుతారు? రాత్రి భోజనాలు వడ్డించేప్పుడు మంచి నీళ్లెవరు పెడతారు? రేపట్నుండి నాన్నమ్మ తన కాళ్ళద్దాలు, తనే వెతుక్కుంటుంది కాబోలు! ఎప్పుడూ నాతో పోట్లాడే తమ్ముడు ఈ మధ్య నాతో మునుపటిలా ఉండడం లేదు. ఒక్కసారి పోట్లాడితే బావుణ్ణు. 
కుయ్యి, కుయ్యి మంటూ నా చుట్టూ తిరుగే ఈ కుక్కపిల్ల కొన్నాళ్ళకు నన్ను మరచిపోతుందేమో..

     ఇంటి ముందున్న ఆ వేపచెట్టుకే, అట్లతద్దినాడు ఊయల వేసి ఊగింది. పెరట్లో ఆ చివరగా పందిరిమీద పూసిన మల్లెలతోనే కదూ అమ్మ నాకు ప్రతి
వేసవిలో పూలజడలల్లింది. తొలిసారి ఓణీ వేసుకున్నరోజు, ఈ మందారమొక్కే నాతో ఫోటో కావాలని సరదా పడింది. ఆ జ్ఞాపకం గోడమీద బొమ్మై నిలిచింది కూడానూ. రోజూ పూజకోసం పువ్వులిచ్చే నందివర్ధన౦ ఈవేళ ఒక్క పువ్వైనా పూయలేదే! నేను వెళుతున్నానని కోపమేమో. 

      రేపు తెల్లవారి తలుపులు తెరువగానే రోజూ కనిపించే ఈ తురాయిచెట్టు, కువకువలాడే బుల్లిపిట్టలు, సైకిలు మీద నుంచి పేపర్ వేసే అబ్బాయి, పూల బుట్టతో ఇల్లిల్లూ తిరిగే రంగమ్మ నాకిక కనిపించరు కదూ. ఆకాశంలో మబ్బెక్కడా కనిపించలేదు కానీ, వర్షం మాత్రం ధారగా చెంపపై కురుస్తోంది. ఈ ముసురు ఈ వేళ ఆగేలా లేదు.

     ఇప్పటి వరకూ నాతో గడిపిన రోజులన్నీ వీడ్కోలిచ్చి గత౦లోకి జారిపోనున్నాయి. తెలియని లోకంలోకి, కొత్త జీవితంలోకి ఈ రాత్రికే నా ప్రయాణం. అన్నం తినని రోజున కేకలు వేసేవాళ్ళు ఉండరు. 'మా ఇంటి మహలక్ష్మి' అంటూ మురిసి మెటికెలు విరిచే వారు కనిపించరు. ఏ వేళ ఇంటికొచ్చినా నాకోసం వెతికే చల్లని చూపులు నన్ను చేరవిక.

      ఇక నుండి ఈ ఇల్లూ, నా వాళ్ళూ అంతా నాకు పరాయేనా. నాది అనుకున్న నా ప్రంపంచం, కాదని చెప్తున్న పెద్దరికం. ఏది నిజమో ఏది భ్రమో తెలియని అయోమయం. పక్షం క్రితమే నా మెడలో చేరిన మాంగల్యం ఈ వేళ మరీ బరువుగా ఉంది. ఓ మంత్రదండంలా నా సొంతమైన ప్రంపంచాన్ని పరాయిగా మార్చేసింది. అయినా ఎందుకో మరి కోపం రావడంలేదు. జీవితాంతం తోడుంటానని భరోసా ఇచ్చినందుకా, కష్టమైనా సుఖమైనా ఇకనుంచి ఇద్దరిదీ అని పలికినందుకా! వెండి మెట్టెలతో పాటు 
మువ్వల పట్టీలు కూడా భారంగా పుట్టింటి గడప దాటాయి.