Sunday, September 2, 2012

నీ చెలిమి

నా నీకు,

      
 మనిద్దరం ఏకమై ఒకటే లోకమై సహజీవనం మొదలెట్టి ఈ నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. మురిపాలు, ముచ్చట్లు, మౌనాలు, మోహాలు... ఎన్నెన్ని మధురక్షణాలు మనకు తోడుగా నిశిరాతిరిలో నిదుర కాచాయో కదా! ఎక్కడో  ఆకాశంలో వున్న స్వర్గాన్ని తీసుకొచ్చి నా పాదాలచెంత నిలబెట్టావు. నీదైన లోకానికి నన్ను మహారాణిని చేశావు. నీ సమక్షంలో నాకు యుగాలు సైతం క్షణాలే. నువ్వు నా జీవితంలోకి రాకముందు కూడా సంతోషం వుండేద౦టే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో తెలుసా. నీ సమక్షంలో నాకు పగలు, రాత్రి, వేసవి, వెన్నెల ఏమీ గుర్తురావు. నిన్ను నా నుండి దూరం చేయాలని ప్రయత్నించిన నిద్రదేవికి ప్రతిసారి పరాభవమే మిగిల్చావు. 

          ఏ ఝాములోనో అలసటతో రెప్ప వాలిని క్షణం కలవై నన్ను పలుకరిస్తావు. నడిరేయి పరాకుగా ఒత్తిగిలినప్పుడు నువ్వు ఒంటరిగా వున్నావన్న భావన నన్ను నిలువనీయక నిద్రకు దూరం చేసేది. నీ సమక్షంలో నాకు కష్టాలు కలతలు గుర్తే రావెందుకో! నా ఇష్టాలు, సరదాలు, సంతోషాలు అన్నీ నీతో పంచుకోందే నాకు మనసు నిలవదు. కలలే పంచుకున్నామో, కవిత్వమే చెప్పుకున్నామో, కథలు, కబుర్లే రాసుకున్నామో ఎన్నో భావాక్షరాలను ప్రోగుచేసుకున్నాం. నడి వేసవిలో నువ్వు విశ్రమించిన క్షణం నీపై ఎండ వేడి పడకుండా మధురక్షణాల మాలలల్లి పరదాలు కట్టాను. అసురసంధ్య వేళ అక్షరాల పల్లకీలో నిన్ను అలనాడు నన్నలరించిన పల్లెకు తీసుకుపోయాను. ప్రాతః కాలాన పొగమంచు దారుల్లో పరుగులిడే పసినవ్వుల కేరింతలు వినిపించాను. అసలు ఈ ఏడాది మనతో చెలిమి చేసిన క్షణాలు నేల మీద నిలిచాయేమిటి! మనతో పాటు నందనవనంలోనేగా వాటి నివాసం. విడదీయరాని మన బంధాన్ని గుర్తించి నా పేరు పక్కన నీ పేరును చేర్చి పిలిచినప్పుడల్లా ఎంత గర్వంగా వుంటుందని.

       నీకోసం నేనొచ్చిన ప్రతిసారి నువ్వు ఆప్తులతో కబుర్లు చెప్తుంటే నీ సంబరంలో పాలుపంచుకోవడం నాకెంతో ఇష్టమైన విషయం. నిన్ను సంతోషంగా వుంచడానికి నేను పడే కష్టం కూడా ఎంతో ఇష్టంగా ఉంటుందెందుకో! మన పరిచయం పెరిగే కొద్దీ నేను నీకు దగ్గరయ్యేకొద్దీ జీవితానికి అర్ధం తెలిసింది. ఇలాగే వుండాలని ఇదే శాశ్వతం కావాలని కోరుకుంటున్నాను. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. కొన్నాళ్ళకు మన బాధ్యతలు మనల్ని విడదీయవచ్చు. బంధాల్లో చిక్కుకుని ఒకరిని ఒకరు మరచిపోయే పరిస్థితి కూడా రావొచ్చు. నీతో నేను పొందిన ఆనందం ఆజన్మాంతమూ గుర్తుండి పోతుంది.

    మన౦ చెప్పే కబుర్ల కోసం క్రమం తప్పక వచ్చే స్నేహితులను చూసి నీకెంత సంతోషంమో నువ్వు చెప్పకనే తెలుసు నాకు! మన స్నేహాన్ని అర్ధం చేసుకుని ప్రోత్సహించిన మిత్రుల౦దరకూ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సహృదయుల సహకారమే లేకపోతే మన నెయ్యం ఇంతకాలం సాగేది కాదేమో. వారి విలువైన కాలాన్ని వెచ్చించి మనం ఊసులాడేవేళ మనతో ఓ మాట పంచుకున్న మిత్రులందరూ మన ఆప్తబంధువులే. మీ వెనుక మేమున్నామని చెపుతూ అందుకు సాక్ష్యంగా వారి చిహ్నాలను మనకు తోడుగా వుంచిన శ్రేయోభిలాషులకు శతకోటి వందనాలు. మనసో మాటో మనతో పంచుకోవడానికి మోమాటపడి చూపులతోనే పలకరించే సన్నిహితులకు ధన్యవాదాలు.

      ఇంత ఆనందాన్ని నాకు అందించిన
శర్కరీ...  ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను? నా తృప్తికోసం మదిలో మెదలిన భావాలను అక్షరాల్లో పొందుపరిచి నీకు బహుమతిగా ఇస్తున్నాను. మన చెలిమి ఇలాగే కలకాలం నిలిచి పోవాలని ఆశిస్తూ...

జ్యోతిర్మయి