Thursday, April 25, 2019

పాటషాల

ఈ రోజు ఉదయం కాఫీ లేదు. ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్ లో పాలు లేని విషయం నిన్న సాయంత్రం  అంత ముఖ్యమైన విషయంగా తోచలేదు మరి. సరే ఉద్యోగం ఒకటి ఉందిగా ఉదయం ఆరున్నరకల్లా ఇంటి దగ్గర బయలుదేరితేగాని ఏడుగంటల ట్రైన్  దొరకదు. ఇవాళ హడావిడిగా లేచి పరుగులు పెడుతూ వచ్చి ట్రైన్ లో కూర్చున్నాను. రాత్రి కిక్ ఇంకా దిగలేదు, ఫుల్  హాంగ్ ఓవర్. 

"ఏమిటీ ఈ కోణం కూడా ఉందేమిటి" అని అపనమ్మకమూ, ఆశ్చర్యమూ కలిపేసి అలా కోపంగా చూడకండి. సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి మత్తులో ఉంటానో మా వాళ్ళందరకూ తెలుసు. అర్ధరాత్రుళ్ళు మెయిల్స్, వాట్స్ ఆప్ మెసేజెస్ వెళ్తుంటాయ్ కదా! సిలబస్ మీద పనిచేస్తుంటే నిద్రెలా పడుతుంది? సరే ఇదంతా మాకెందుకు చెప్తున్నట్లు అనుకుంటున్నారా?

నేపథ్యం తెలియకపోతే విషయం పూర్తిగా అర్ధం కాదుగా అందుకని.

ఇంతలో ఒకావిడ ట్రైన్  ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లన్నీ వదిలేసి నా పక్కన వచ్చి కూర్చున్నారు.

"ఆర్ యు జ్యోతి? ”
"యా, సారీ ఐ డోంట్ రిమెంబర్ యు, డిడ్ వుయ్ మీట్ సంవేర్? " అడిగాను. 
"పాటషాల" అన్నారు. 

మత్తు కొంచెం దిగింది. పాఠషాల అయితే. చి, ఛీ పాఠశాల అయితే నన్ను గుర్తుపట్టాలిగా, నేనేనా అని  ఎందుకడుగుతున్నట్లు. సందేహం వచ్చింది. అవున్లే పట్టుదో, కాటన్ దో ఏదో ఒక చీర కట్టుకుని ఎప్పుడూ ఇంత బొట్టూ, కాటుకతో కనిపించే నేను ఇలా తెల్ల చొక్కా, నల్ల పేంట్ వేసుకుని, మొహాన బొట్టూ అదీ లేకుండా బరువు కళ్ళతో ట్రైన్ లో ఓ మూల కూర్చునుంటే ఎవరు మాత్రం గుర్తు పట్టగలరు? ఎందుకైనా మంచిదని

"డు యు స్పీక్ తెలుగు?" అని అడిగాను.
"పాటషాల అంటుంటే" అన్నారావిడ. 

మత్తుపూర్తిగా దిగింది.  
"ఓ మీ పిల్లలు పాఠశాలలో ఉన్నారా? ఒకటవ తరగతా?" అడిగాను. 
"లేదండీ నాలుగవ తరగతి" చెప్పారు. 
😭

సిలబస్ రివ్యూ చేస్తున్నప్పుడు ప్రతివారం డిక్టేషన్ లో పాఠశాల, భారతదేశము ఉండాలని లక్ష్మి గారు  ఎందుకన్నారో అప్పుడర్ధం అయ్యింది.

ఈ సారి సమ్మర్ వర్క్ లో శలు, ళలు, ణాలు.. ఇంకా ఫలు, ఠలు, ఢలు...... 😡😡😡