Saturday, April 10, 2021

వివాహ మహోత్సవం

ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. సాయంత్రం ఏడుగంటల పదిహేను నిముషాలకు పెళ్ళి. 

పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ పురోహితులు లిస్ట్ ఇచ్చారు. అందులో పెళ్ళి పీటలు, తలంబ్రాల పళ్ళాలు, ఉంగరాల బిందె లాంటి పెద్ద పెద్ద వస్తువులన్నీ ముందుగానే అట్టపెట్టెలలో పెట్టేసాము. మిగిలిన వస్తువులు అంటే పసుపు, కుంకుమ, కర్పూరం లాంటి పూజా సామగ్రి, గంధపు చెక్క, సాన, ఎండు కొబ్బరి చిప్పలు, కొత్త టవల్స్ లాంటి పెళ్ళికి కావలసినవి వస్తువులు అన్నీ చూసి పక్కన పెట్టుకున్నాము. గరిక ముంతలు లాంటివి జాగ్రత్తగా పాక్ చేసాము.

ఇక ఆ రోజు సర్దుకోవలసినవి తమలపాకులు, పువ్వులు, పూల దండలు, మామిడాకులు లాంటివి. అంతకు ముందురోజు అట్లాంటా లో ఉన్న వివేక్ ఫ్లవర్స్ నుండి తెలిసిన వాళ్ళు పూల మాలలు, పువ్వులను తీసుకుని ట్రక్ లో పెట్టి గ్రీన్స్ బరో వరకు పంపిస్తే, ఆ రాత్రి ఒక ఫ్రెండ్ వెళ్ళి అక్కడినుండి తీసుకొనివచ్చారు.

పెళ్ళి సమయంలో కావలసినవి అన్నీ పంతులుగారికి అందించే బాధ్యత తీసుకున్న ఫ్రెండ్ ఆ రోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా వచ్చేసారు. లిస్ట్ తీసుకుని తాను మళ్ళీ అన్నీ సరిచూసుకుని అట్టపెట్టెలలో సర్దేసారు. ఈలోగా మరో నలుగురు ఫ్రెండ్స్ వచ్చి పెళ్ళి మండపానికి తీసుకుని వెళ్ళవలసినవి అన్నీ వాన్ లలో పెడుతున్నారు. 

ముందు అన్నీ ఎంత ఆర్గనైజ్డ్ గా సర్దిపెట్టినా డెకరేషన్ సామన్లు, సంగీత్ కోసం కొన్న వాటిలో మిగిలిపోయిన సామాన్లు ఇంకా రకరకాల వస్తువులతో, అట్ట పెట్టెలతో గరాజ్ అంతా నిండి పోయి ఉంది. అందుకే కావలసినవి అన్నీ మరో సారి జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఒక్క వస్తువు మరచిపోయినా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళడానికి ఒకటిన్నర గంట పడుతుంది. పెళ్ళి జరిగే సమయంలో అది వీలుపడదు. కావలసినవన్నీ తీసుకుని పది గంటలకంతా నలుగురు ఫ్రెండ్స్, మా వారు పెళ్ళి మండపానికి వెళ్ళారు.

పెళ్ళి కూతురికి మేకప్ చేయడానికి 'ఎమి పటేల్' అనే మేకప్ ఆర్టిస్ట్ ముందు రోజే అట్లాంటా నుండి వచ్చారు. ఆవిడ పెళ్ళిరోజు ఉదయం పదిగంటలకే మేకప్ చేయడం మొదలు పెట్టారు కానీ పూర్తయ్యేసరికి ఒంటిగంట అయ్యింది. మిగిలిన పిల్లలకు పూలజడలు వేయడానికి, మేకప్ చేయాడానికి ఒకరిద్దరిని చూసాం కానీ నచ్చలేదు. ఇంకెవరినైనా చూద్దామన్నా ఈ కరోనా ఒకటి. ఒక్కొక్కళ్ళు ఇంటికి వస్తుంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంది కదా! మా మరిది వాళ్ళ చిన్నపాప అందరికీ చక్కగా మేకప్ వేసింది. ఎక్కడ నేర్చుకున్నావురా అంటే యూట్యూబ్ పెద్దమ్మా అంది. "మనందరం సేమ్ స్కూల్, మీ పెదనాన్న, నేనూ యూ ట్యూబ్ నుండే పెళ్ళి చేయడం నేర్చుకున్నాము". అని నవ్వుకున్నాము. 

మా తోడికోడలు, పిల్లలకు జడలు వేసి వేణీలు పెట్టింది. ఏ గదిలో చూసినా పువ్వులు, జడ బిళ్ళలు, జడ పిన్నులు, పిన్నీసులు, వేణీలు, పట్టు చీరలు, ఓణీలు, వడ్రాణాలు. “అత్తా నాకు జడ వెయ్యవా?, పిన్నీ నాకు పిన్ పెట్టవా? పెద్దమ్మా పాపిటి బిళ్ళ సరిగ్గానే ఉందా? అత్తా నా నెక్లెస్ ఎక్కడుంది?” ఇలా ఇల్లంతా సందడే సందడి. మరి ఐదుగురు ఆడపిల్లలు పెళ్ళికి తయారవుతుంటే ఇంట్లో ఆ మాత్రం సందడి ఉండదూ?

రెండు గంటలకల్లా పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకు మండపం దగ్గరకు వెళ్ళాలి. ఆ తరువాత వాళ్ళకు ఫోటో షూట్ ఉంటుందిట. పెళ్ళి కొడుకు వాళ్ళను మండపానికి తీసుకుని రావడానికి మా తమ్ముడు పూలకారు తీసుకుని పన్నెండు గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. 
పెళ్ళి కూతురు కోసం మరో పూల కారు సిధ్దం. మా అమ్మాయి మంగళవారం పుట్టింది. శుక్రవారం, మంగళవారం అమ్మాయి పుడితే లక్ష్మీ దేవి పుట్టినట్లట. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్ళేప్పుడు ఒక రూపు కనుక తన తల్లికి కడితే ఆ లక్ష్మి ఆ ఇంటి దగ్గరే ఉంటుందిట. భలే ఉంటాయి కదూ ఇలాంటి ఆచారాలు, నమ్మకాలు.

మండపానికి బయలుదేరుతున్న పెళ్ళి కూతురికి ఆడపడుచులు హారతి చ్చారు.

మిగలిన వాళ్ళను మండపం దగ్గరకు తీసుకొచ్చే బాధ్యతను మా తమ్ముడికి, బుజ్జిపండుకి అప్పగించి నేనూ, మావారూ పెళ్ళికూతురిని తీసుకుని బయలుదేరాము. పెళ్ళి కొడుకు వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి మాతో పాటే మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బయలుదేరారు.  

పూలు ఎక్కడ రాలి పోతాయో అని ఫ్రీవే లో కాకుండా మామూలు రోడ్స్ లో వెళ్ళాము. పక్కన ఉన్న కార్లు మా కార్ వైపు చూసి నవ్వుతూ థంబ్స్ అప్ చెపుతూ ఉంటే భలే సరదాగా ఉన్నది. ఓ అరగంటలో హోటల్ దగ్గరకు చేరుకున్నాము. కెమెరా మెన్ పెళ్ళి కూతురినీ పెళ్ళి కొడుకునీ ఫోటో షూట్ కి తీసుకుని వెళ్ళాడు. మేమంతా హాల్ దగ్గరకు వెళ్ళాము.

హాల్ ముందు వినాయకుడి విగ్రహం పెట్టారు. పెద్ద హాలులో ఒక గోడవైపు మధ్యలో మండపం ఉంది. దాని ముందు రెండు వరుసలలో దూరదూరంగా కుర్చీలు అమర్చి ఉన్నాయి. మధ్యలో తెల్లని దారి దానికి ఇరువైపులా అక్కడక్కడా స్తంభాలు, వాటి మీద చిన్న పూల కుండీలు పెట్టారు. దారికి ఇరువైపులా వేజెస్ లో ఫ్లోటింగ్ కాండిల్స్ పక్కనంతా ఎర్రని గులాబీ రేకులు పరిచారు. పైన నక్షత్రాల్లా చిన్న చిన్న బల్బులు, అక్కడక్కడా షాండ్లియర్స్, చుట్టూ గోడలపై ఫోకస్ చేసిన లైటింగ్స్ అప్పుడప్పుడూ రంగులు మారుతూ వింత శోభతో వెలిగిపోతున్నాయి. కుర్చీలు ఇక్కడ కూడా బాగా దూరదూరంగా వేయించాము. సింపుల్ గా అందంగా ఉంది ఆ మండపం. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అలాగే కావాలనుకున్నారు.
   
సాయంత్రం ఆరుగంటలకు పూజారిగారు మండపంపైనే ఒక పక్కగా మమ్మల్ని ముగ్గురినీ కూర్చోబెట్టి, పెళ్ళికూతురితో గౌరి పూజ చేయించారు.



పెళ్ళంటే వధూవరులకు బాసికం కట్టడం, జీలకర్ర బెల్లం పెట్టించడం, తాళిబొట్టు, తలంబ్రాలు ఇలా చాలా ఉంటాయి కదా వాటి అర్థాలు తెలుసుకుని పిల్లలకు అర్థం అయ్యే భాషలో వ్రాయడానికి ప్రయత్నించాను.     ఎక్కడైనా పొరపాటుగా చెప్పి ఉంటే దయచేసి సవరించ వలసినదిగా పెద్దలను కోరుకుంటున్నాను.

ఫోటో షూట్ అవగానే వధూవరులిద్దరికీ బాసికం కట్టాము. మన శరీరం లోని నాడులలో(వెయిన్స్) ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవట. వీటిలో సుషుమ్న అనే నాడి కి కుడివైపు సూర్య నాడి, ఎడమ వైపు చంద్ర నాడి ఉంటాయట. ఈ రెండు నాడుల కలయిక అర్ధచంద్రాకారంలో వుంటుంది. దీనిని దివ్యచక్షవు అంటారట. ఈ దివ్యచక్షువుపై ఇతరుల దృష్టి పడి దోషం కలుగకుండా వుండేందుకు వధువరుల నుదుట బాసికం కడతారట.

పెళ్ళి జరిపిస్తున్న పురోహితులు గ్రీన్స్ బరో పూజారి మురళీ కృష్ణ గారు. ఏ సందర్భానికి ఎలాంటి సన్నాయి మేళం, మంగళ వాయిద్యాలు వినిపించాలో ముందుగానే చెప్పారు. మా తమ్ముడు మరో ఫ్రెండ్ అవీ, కొన్ని పెళ్ళి పాటలు సేకరించి, సందర్భానికి తగినట్లుగా వినిపించే లాగా వరుసగా నంబర్స్ వేసి డిజె పవన్ కు ఇచ్చారు. మనమిప్పుడు మ్యూజికల్ వెడ్డింగ్ చూడబోతున్నా మన్నమాట. 

ఆరుగంటల ముప్పై నిముషాలకు బావమరుదులు పూల పందిరి పట్టుకోగా

అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ"

అంటూ పాట వినిపిస్తూ ఉండగా పెళ్ళి కొడుకు తన కుటుంబ సభ్యులతో కలిసి మండపానికి తరలి వచ్చారు. పూజారిగారు పెళ్ళికొడుకును, తన అమ్మానాన్నలను కూర్చబెట్టి పూజ చేయించారు. 

ఆ తరువాత అన్నా, తముళ్ళు పూలపందిరి పట్టుకోగా

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

అంటూ పాట వినిపిస్తూ ఉండగా పెళ్ళి కూతరు మండపానికి తరలి వచ్చింది.

పెళ్ళికి రాలేకపోయిన వాళ్ళకు జూమ్ లో పెళ్ళి చూపిస్తున్నారు పిల్లలు. వాళ్ళంతా వాట్స్ ఆప్ లో కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ బాగా నచ్చిన సన్నివేశం అట ఇది. పెళ్ళి మండపం లో కంటే జూమ్ లోనే ఎక్కువ మంది ఉన్నారని బుజ్జిపండు బోలెడు ఆశ్చర్యపోయాడు. 
పూజారి గారు వధూవరులను తూర్పు పడమరలకు అభిముఖంగా కూర్చోబెట్టారు. ఆడపిల్లలు వారి మధ్యగా అడ్డుతెర పట్టుకున్నారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా పురోహితుడు మంత్రాలు పఠిస్తుండగా ముహూర్త సమయంలో జీల కర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని వధూవరులు ఒకరితలపై ఒకరు  పెట్టుకున్నారు.

ఈ రెండూ కలసిన మిశ్రమం నుండి జీలకర్రను, బెల్లాన్ని విడదీయడం అసాధ్యం. ఏ విధంగా అయితే  ఇవి రెండు విడదీయరాని బంధంతో పటిష్టంగా ఉంటాయో అలాగే వధూవరులు కూడా ఆలుమగలుగా కలసిపోయి విడదీయరాని బంధంగా మనుగడ సాగించాలని అర్థమట. 

ఆ తరువాత వధువుకు తన అత్తామామలు, వరునికి మేము బట్టలు పెట్టాము. 


తలంబ్రాల బట్టలు మార్చుకుని వచ్చాక పురోహితుడు వారివురితో పూజ చేయించి, వరునితో మంగళ ధారణ చేయిస్తూ ఈ మంత్రం చెప్పించారు. "మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా / కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్". దాని అర్థం నా జీవితానికి కారణం నువ్వు. అలాంటి  నువ్వు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. అని అట. 
ఆ తరువాత వారిరువురితో దండలు మార్పించారు. దీని అర్థం పరస్పరం ఆదరాభిమానాలు పంచుకుంటూ పూలు పరిమళించినట్లుగా మన మధ్య స్నేహం పరిమళించాలి అనిట. 

ఆ తరువాత పాణి గ్రహణం చేయించారు. పాణి గ్రహణం అంటే నవ దంపతులు తమ కష్ట సుఖములను పరస్పరము గ్రహించి అన్యోన్యంగా దాంపత్య జీవితము సాగిస్తామని దృఢంగా పెద్దల ఎదుట మాట ఇవ్వడం మని అర్థమట.


ఇక పిల్లలు, పెద్దలు అంతా ఎదురుచూస్తున్న వేడుక తలంబ్రాలు పోసుకోవడం. వధూవరులు ఒకరిపై ఒకరు పసుపు కలిపిన బియ్యాన్ని దోసిళ్ళతో పోసుకోవడం చూసే వారికి ఎంతో వేడుకగా ఉంటుంది. 

కుటుంబ శ్రేయస్సు,సమాజ శ్రేయస్సు కాంక్షించే ఉత్తమ సంతానాన్ని ఇవ్వమని మొదటగా వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు. అందుకు అంగీకరిస్తూ వధువు తలవంచి, అట్టి సంతానాన్ని పెంచే ధన, ధాన్యాలను సమృద్ధి గా ఇవ్వమని వరుని తలపై పోస్తుంది. అందుకు అంగీకరిస్తూ తల వంచుతాడు వరుడు. ధన ధాన్యాలను ఇస్తాను, వీటిని సమయోచితం గా ఉపయోగించమని సూచిస్తూ మరల వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు. నీ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నాను. ఇకనుండి మనం ఇద్దరమూ సహ జీవనం సాగిస్తూ బ్రతుకు భాద్యతను సమానంగా పంచుకుందాము అని పరస్పర అంగీకారం తెలుపుకుంటూ తల వంచుతూ మిగిలిన తలంబ్రాలను వేగం గా ఒకరిపై ఒకరు పోసుకుంటారు. అప్పటి రోజులకు తగినట్లుగా దీని అర్థం అయ్యి ఉంటుంది కానీ మూలార్థం మాత్రం ఇప్పటి రోజులకు కూడా వర్తిస్తుంది. 


ఇరువైపులా ఫ్రెండ్స్, పిల్లలు బాగా అల్లరి చేసి వాళ్ళకు పోటీ పెట్టారు. పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకూ ఇద్దరూ ఒకరికి అందకుండా మరొకరు తలంబ్రాలు పోయడానికి ప్రయత్నించారు. ఆ అల్లరి చేసిన వాళ్ళంతా వేడుక పూర్తవగానే పక్కకు వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పారు పంతులు గారు, “చూసారా, మీరిద్దరూ వాళ్ళ మాటలు విని పోటీ పడ్డారు. మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఎటో వెళ్ళిపోయారు, చివరకు మిగిలేది మీరిద్దరే. మీరు ఎప్పుడూ ఒకరికి ఒకరుగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో మరెప్పుడూ మూడో మనిషిని మీ మధ్యకు రానివ్వకండీ” అని.

చిన్నప్పటి నుండి పెళ్ళి కూతురిని భుజాల మీద వేసుకుని పెంచిన మేనమామ పెళ్ళికూతురి కాలి వేళ్ళకు మెట్టెలు తొడిగాడు. మేనమామ అత్త వధూవరులను ఆశీర్వదించారు. 
పిల్లలంతా ఎదురు చూసే మరో వేడుక బిందెలో ఉంగరాలు తియ్యడం. మూడుసార్లు ఉంగరం పెళ్ళి కొడుకుకే దొరికింది. అప్పుడు పూజారి గారు చెప్పారు. "ఉంగరం తీసి పెళ్ళికొడుకు గెలిచాడు,  అలా గెలువగలిగిన అబ్బాయిని పెళ్లిచేసుకున్న పెళ్ళి కూతురు గెలిచింది" అని.                                      
పంతులు గారు ఇద్దరికీ బ్రహ్మ ముడి వేసారు. ఈ వస్త్రాల వలె మీ జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి అని అర్ధమట. 

రాత్రి తొమ్మిదిన్నరకు పురోహితులు అరుంధతీ నక్షత్రం చూపించడానికి వధూవరులను ఆరుబయటకు తీసుకువెళ్ళారు. అక్కడ "ఈ వివాహ బంధంతో మనిద్దరం మిత్రులమైనాము. కనుక పరస్పర అనురాగ బద్ధులమై, అనుకూల దాంపత్యం తో , పరస్పర ఆలోచనా గ్రహితులమై నడచుకుందామని ప్రతిజ్ఞ చేసుకుంటారట" వధూవరులు. అందుకు సాక్షిగా ధ్రువుడు, అరుంధతి వాళ్ళిద్దరినీ అనుగ్రహిస్తారట.

పెళ్ళికి వచ్చిన పెద్దలు అందరూ వధూవరులను ఆశీర్వదించారు, పిల్లలు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆ తరువాత ఆడపడుచులు వివాహ ప్రక్రియ కు శుభం పలుకుతూ నూతన దంపతులకు హారతి ఇచ్చారు. 
అతిధులు భోజనాలు చేసాక, బయలుదేరే ముందు అందరికీ తాంబూలం ఇచ్చాము.
పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్, పెళ్ళి కొడుకు కార్ కు జస్ట్ మారీడ్ అంటూ బోర్డ్ పెట్టి, బెలూన్స్, కోక్ కాన్స్ కట్టి అలంకరించారు. వధూవరులిద్దరూ ఆ కారులో మగపెళ్ళివారింటికి వెళ్ళారు.
అదండీ సంగతి. ఏ విధమైన ఆటంకాలూ లేకుండా అలా జరిగింది పెళ్ళి.
 
****************************

అంతకు ముందు రెండు రోజుల క్రితం కోవిద్ మూలంగా కర్ఫ్యూ పెట్టబోతున్నాం, సాయంత్రం పది గంటల తరువాత నుండీ ఉదయం ఆరుగంటల లోగా ఎవరూ రోడ్ మీద తిరగకూడదు, ఇంట్లో పది మంది కంటే ఎక్కువ మంది మనుషులు ఉండకూడదు అనే వార్త వచ్చింది. అయితే అది పెళ్ళి తరువాత రోజు నుండి అమలు. పెళ్ళి రోజు నుండీ అయి ఉంటే బాగా ఇబ్బంది పడే వాళ్ళం. మేము భోజనాలు చేసి వస్తువులన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళేసరికి దాదాపుగా ఒంటిగంట అయింది. 

తరువాత రోజు ఉదయం కొత్త దంపతులు ఇద్దరూ పెళ్ళి బట్టలతోనే తమ ఇంట్లో సత్యన్నారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతం కూడా మురళీ కృష్ణ గారే చేయించారు. వ్రతానికి ఇంట్లో పెద్దవాళ్ళం మాత్రం వెళ్ళేట్లు, మేం వచ్చేసాక పిల్లలంతా పెళ్ళి దండం పెట్టుకుని భోజనాలు చేసేట్లుగా అనుకున్నాం. అట్లా అయితే ఇంట్లో తక్కువ మందిమి ఉంటాం కదా! కూతురు మీద బెంగ పెట్టుకున్న నాన్న మేము వచ్చేవరకూ కూడా ఆగక ఉదయం ఎనిమిది గంటలల్లా కూతురూ అల్లుడి ఇంటికి వెళ్ళిపోయారు. వెనుకే మేము ఒక గంట తరువాత బయలుదేరాము.

వ్రతం అయిన తరువాత రోజు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలంతా వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపేసారు. వెనుకటి రోజుల్లో అయితే గుమ్మం దగ్గర పేర్లు చెప్పించేవారు. ఇప్పుడు ముందే చక్కగా పేర్లతో పిలుచుకుంటున్నారుగా అందుకని ఈ అమ్మాయిలు బోలెడన్ని ప్రశ్నలతో సిధ్ధమయ్యారు కానీ పెళ్ళికూతురు, పెళ్ళికొడుకూ అన్నీ ప్రశ్నలకూ టకాటకా సమాధానాలు చెప్పేసారు. బావమరిది అక్కా బావలకు కాళ్ళు కడిగి స్వాగతం చెప్పాడు.
ఆట పాటలతో ఆ రోజు సరదాగా గడిచింది. పెళ్ళి సందడి ముగిసింది. ఇంకా పెళ్ళి తరువాత చెప్పుకునే ముచ్చట్లు ఉంటాయిగా ఆ కబుర్లు ఇక్కడ చదవొచ్చు. 

****************************

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవిఅలంకరణఅరిసెలూ అవాంతరాలుస్వప్నలోకంనిశ్చయ తాంబూలాలుమెహెందీ సంగీత్ , పెళ్ళికూతురు అంటూ పది రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. అన్నింటికీ లింక్స్ ఉన్నాయి. దేనిమీద నొక్కితే అది చదవొచ్చు.