Sunday, January 29, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యాశాల - 8

కొట్టకల్ - ఆర్యవైద్యాశాల - 7

కొట్టకల్ లో ఉన్న మూడు వారాలలో ఒక్క సినిమా చూడలేదు, పగలంతా ఎవరినీ కలిసిందీ లేదు. ఉదయాన్నే పార్కులో నడక, కాంటీన్ లో టిఫిన్, పుస్తకాలు చదవడం, సాయంత్రం గుడి దగ్గర అక్కడకు వచ్చిన వాళ్ళతో కబుర్లు, రాత్రి భోజనం, ఇలా ఉండేది దినచర్య. ఎప్పుడూ చుట్టూ మనషులు, ఉద్యోగాలు, వారాంతంలో పాఠశాల, పార్టీలు ఇలా హడావిడిగా ఉండే మా ఇద్దరికీ చాలాకాలం తరువాత తీరుబడి చిక్కింది. జీవితపు ఈ మజిలీలో కలకాలం గుర్తుంచుకోవలసిన పరిచయాలు, గుర్తుండిపోయే క్షణాలు కొన్ని. 

వివేక్ విజయన్, పి.కె.వారియర్ గారి మనుమడు, అక్కడే కైలాసమందిరంలో ఉంటున్నారు. వివేక్ బహుముఖ ప్రజ్ఞాశాలి, వేదం చదువుకున్నారు, ఆస్ట్రాలజీ తెలుసు, రచయిత. జీవితం విసిరిన సవాల్ ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కుంటున్న అతనిని చూసి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.  

డాక్టర్ సరోజ్ బజాజ్, అక్కడకు పేషెంట్ గా వచ్చారు. హిందీ సాహిత్యంలో పి.హెచ్.డి పట్టా పుచ్చుకుని, ప్రొఫెసర్ గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. హైదరాబాద్ లో మహిళల కోసం సుమన్ జూనియర్ కాలేజ్, మహిళా దక్షత సమితి కాలేజ్ ఫర్ విమెన్, సుమన్ వొకేషనల్ కాలేజ్ ఫర్ గాళ్స్, నర్సింగ్ కాలేజ్ లు నడుపుతున్నారు. పేద విద్యార్థినిలకు అక్కడ పూర్తిగా ఉచితం. నేషనల్ సిటిజన్స్ అవార్డ్, మహిళా శిరోమణి, మహిళా రత్న పురస్కార్, బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ లాంటి ఎన్నో అవార్డ్స్, బంగారు పతకాలు రాష్టపతి గ్యాని జైల్ సింగ్ యాదవ్, మదర్ థెరిస్సా, శంకర్ దయాళ్ శర్మ గారి సతీమణి విమలా శర్మ లాంటి నుండి అందుకున్నారు.   

బహదూర్, అజయ్ నేపాల్ నుండి వచ్చి అక్కడ కాంటీన్ లో పనిచేస్తున్నారు. ఏడాదికి ఒక్కసారే వారి దేశానికి వెళ్ళి కుటుంబాన్ని కలిసేది. లేచిన దగ్గర నుండి పడుకునే  ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ  సంతోషాన్ని స్వంతం చేసుకునే విద్యేదో వాళ్ళకు తెలిసినట్లుంది మొహం మీద నవ్వులేకుండా ఎప్పుడూ కనిపించలేదు.   

గుడి మెట్ల మీద కబుర్లు, మసాలా టీ, చైనీస్ ప్లాటర్ కలిసి పంచుకున్న కొట్టకల్ స్నేహాలు, బుల్లి డాక్టర్ల ముచ్చట్లు బావున్నాయి అన్నీ. రెండు నెలలు పాటు పథ్యం ఉంటూ మందులు వాడమన్నారు. ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రయాణం బావుంది. 

మీరెవరైనా ఆయుర్వేద చికిత్స తీసుకుని ఉంటే మీ అనుభవాలు కామెంట్ లో వ్రాయండి, మరి కొంతమందికి ఉపయోగపడొచ్చు. ఇంతవరకూ ఈ  కబుర్లున్నీ ఓపిగ్గా విన్న మీకందరకూ ధన్యవాదాలతో  

స్వస్తి