Monday, May 28, 2012

ఆకుపచ్చని జ్ఞాపకం

        అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అందరం నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం. బస్సు మెయిన్ రోడ్డు వదిలి మట్టి రోడ్డు పట్టిందనడానికి గుర్తుగా ఎర్రటి దుమ్ము పైకి లేచింది. నేనూ, తమ్ముడు బస్సులో వెనుక సీట్లోకి వెళ్లి కూర్చున్నాం. అక్కడైతే రోడ్డుమీద గతుకులు వచ్చినప్పుడల్లా బస్సు ఎత్తెత్తి పడేస్తుంది అది మాకెంత ఇష్టమో. సన్నని ఎర్రటి దారి పక్కనంతా నాగజెముడు, బ్రహ్మజెముడు, కలబంద చెట్లు ఆర్ట్ పీసుల్లా నిలబడి ఉన్నాయ్. అక్కడక్కడా పచ్చగా జీడిమామిడి తోటలు. రెండు మూడు ఊర్లు దాటాక మావూరొచ్చింది.

      బస్సు అలా దిగేమో లేదో "ఏం రామకృష్ణా కోడల్ని, పిలకాయల్ని తీసుకొచ్చినట్టు౦డావే" అడిగారు ఆ విధిలో కొట్టు దగ్గరున్న నాన్న వాళ్ళ బాబాయి. "ఎండాకాలం సెలవలిచ్చారుగా చిన్నాయనా, మిమ్మల్న౦దరినీ చూడాలని వచ్చాం" చెప్పారు నాన్న. "ఏం జయమ్మా బావు౦డావా?" అని అమ్మ నడిగి "మీ నాయన పొద్దుట్నుంచీ మీ కోసం ఎదురుచూస్తా ఉండాడు." అంటూ నాన్నతో చెప్పి విశాలంగా నవ్వాడు ఆ తాతయ్య.

      "ఆక్కడే వున్న ఒక బాబాయి "రేయ్ ఒదిన చేతిలో బాగ్ తీసుకోరా" అని ఓ పదిహేనేళ్ళ అబ్బాయికి పురమాయించాడు.అదేంటో ఆ ఊరంతా చుట్టాలే, ఒకరినొకరు అక్కా, ఒదినా, పిన్నీ, మావా, చిన్నాయనా..అంటూ పిలుచుకుంటారు. అమ్మ వద్దన్నా వినకుండా ఆ అబ్బాయి అమ్మ చేతిలో బాగ్ తీసుకున్నాడు. దారిలో ఎవరెవరో పలుకరిస్తున్నారు కాని, నేను తమ్ముడూ రయ్యిన పరిగెడుతూ నాన్నమ్మ వాళ్ళ వీధి దగ్గరకు వచ్చేశాం. అమ్మ, నాన్న కనిపించిన వాళ్ళతో మాట్లాడుతూ మెల్లగా నడుస్తూ వెనకెక్కడో వున్నారు.

      రోడ్డు మీదనుండి ఇల్లు చాలా దూరం ఉంటుంది కదా, రోడ్డు చివరగా తాతయ్య వాళ్ళ ఇల్లు, దారికి అటూ ఇటూ బొంత రాళ్ళతో కట్టిన చిన్న గోడ, గోడకు అటూ ఇటూ రోడ్డు పొడవునా ఇళ్ళున్నాయి. ఎప్పట్లానే తాతయ్య భోషాణం పెట్టె పక్కనున్న చెక్కచేతుల కుర్చీలో కూర్చుని 'మేం ఎప్పుడు వస్తామా' అని వీధి వైపు చూస్తూ కనిపించారు. తాతయ్య తెల్ల చొక్కా, పంచె కనిపిస్తున్నాయి, ఇంకొచెం జాగ్రత్తగా చూస్తే తాతయ్య కళ్ళకున్న అద్దాలు కనిపి౦చాయి. మేం ఇంటిదగ్గరకు రాగానే లోపల్నుండి నాయనమ్మ చూసిందేమో హడావిడిగా బయటకు వచ్చింది. కుచ్చిళ్ళు అంచుపట్టి పైకి దోపిన పచ్చచీర, నుదిటిమీద యెర్రని కుంకుమ బొట్టు, 
పాపిట తీసి వెనక్కి దువ్వి జడవాసి చుట్టుకున్నముచ్చటైన ముడి, ముక్కుకి ఐదు రాళ్ళ ముక్కు పుడక, చేతిమీద పచ్చబొట్టుతో వేసిన ముగ్గు, చేతినిండా మట్టిగాజులు, వేసి చుట్టిన ముడి, మొహంలో వెలుగుతూ కనిపించే సంతోషం, ఇదీ నాన్నమ్మ రూపం. 

     "ఏమ్మా కావలి బస్సుకొచ్చారా
ఉదయాన్నే ఒంగోలు బస్సుకొస్తారని చూస్తా ఉండాం" అని నాతో చెప్పి "సుగుణా అమ్మాయోళ్లు వచ్చారు" అని పిన్నికి వినిపించేలా పెద్ద కేక పెట్టింది. ఈ లోగా అమ్మా వాళ్ళు కూడా వచ్చారు.

      నాయనమ్మ కేకకు మా ఇంటికి అటు పక్కనున్న ఇంటిలో ఉన్న పిన్నివాళ్ళు, ఇటు పక్క ఇంటిలో ఉన్న తాతయ్య వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. ఇలాగా అమ్మావాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంతలో పిన్ని ఇంట్లోంచి వచ్చింది.

     "రా అక్కా, మంచి ఎండలో బయలుదేర్నారే, కాళ్ళు కడుక్కుందురు గాని 
రండి" అని దొడ్లోకి దారి తీసింది. పిన్నితో మాట్లాడుతూ కాళ్ళు కడుక్కోవడానికి దొడ్లోకి వెళ్లాను. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న తొట్టి నిండా నీళ్ళు నింపి వున్నాయి. మధ్యాహ్నం ఎండ నీళ్ళపై పడి ఎదురుగా ఉన్న గోడమీద కదిలే వృత్తాలు చుడుతూ ఉంది. ఇత్తడి చెంబుతో తొట్లోనుంచి నీళ్ళు తీసుకుని రాళ్ళమీద పరిచిన నల్ల బండపై నిల్చుని కాళ్ళు, చేతులూ, మొహం శుభ్రంగా కడుక్కున్నాను. ఆ నీళ్ళన్నీ బండ కింద గుంటలోకి వెళ్లడం చూస్తుంటే భలే సరదాగా అనిపించేది.

     ఇంతలో బాబాయి వచ్చి "నీ చెట్టుని పలకరించావా జ్యోతీ" అని అడిగాడు. బాదం చెట్టు వైపు చూసి
నేనూ నవ్వాను. నేను పుట్టానని తెలిసిన రోజున తాతయ్య ఆ చెట్టును తీసుకొచ్చినాటారట. అందుకని దాన్ని జ్యోతి చెట్టనో, నా ఫ్రెండ్ అనో పిలుస్తారు. ఆ చెట్టు పచ్చని ఆకులతో ఎంత అందంగా ఉంటుందో...ఆకుల వెనుక అక్కడక్కడా బాదం కాయలు కనిపిస్తున్నాయ్. "జ్యోతీ, ఆ కొమ్మమీద పక్షి గూడు౦ది చూశావా?" అంటూ బాబాయి ఒక కొమ్మను చూపించాడు. 

      ఈలోగా "బయట ఎండగా ఉంది, లోపలకు రండమ్మా" అంటూ నాన్నమ్మ పిలిచింది. లోపలకు వెళ్లి వంటగది గుమ్మానికి రెండు వైపులా వున్న సిమెంట్ తో కట్టిన అరుగుల మీద కూర్చున్నాము. ఆ అరుగుల చివర కొంచెం ఎత్తుగా దిండు పెట్టినట్లు కట్టి ఉంటుంది. ఆ సిమెంట్ సోఫా గమ్మత్తుగా అనిపించేది.

      ఎండలో నుండి లోపలకు రాగానే చీకటిగా అనిపించింది
 కానీ, కాసేపటికి కళ్ళకి అలవాటయి ఇంట్లోవన్నీ స్పష్టంగా కనిపించాయి. నేలంతా చక్కగా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి, గోడ మీద అడ్డంగా వేసిన ముగ్గుగీత చాలా అందంగా ఉంది. ఇంటికి మధ్యలో వున్న రెండు స్థంభాలలో ఒక దానిమీద సీసాలో గనిసి గడ్డలోంచి వచ్చిన తీగ  చెక్కమీద పాకి గమ్మత్తుగా ఉంది. గదిలో మూలగా పే....ద్ద కుండ ఉంది. సుమారుగా ఏడు అడుగుల ఎత్తున్న ఆ కుండలో వడ్లు పోసి వుంటాయట, నేనెప్పుడూ అవి చూడలేదు.

      
ఒక అరుగుమీద పిన్ని, ఎర్రచీర కట్టుకుని పైట భుజమ్మీదుగా ముదుకు వేసుకుని, జారుముడితో ఉన్న పక్కింటి బోసినోటి అమ్మమ్మ, రెండో అరుగు మీద నేనూ, తమ్ముడూ, నాయనమ్మ కూర్చున్నాము. ఆకుపచ్చ, తెలుపు గళ్ళ దుప్పటి వాల్చిన నవారు మంచం మీద అమ్మ, నల్ల గీత ఉన్న బులుగు దుప్పటి వాల్చిన మంచం మీద నాన్న, బాబాయి కూర్చున్నారు. రుగుల పైన గోడమీద వరుసగా మా నాన్న స్కూల్ ఫోటో, పెద్దత్త పెళ్ళి ఫోటో, చిన్నగౌను వేసికుని, ఉంగరాల జుట్టుతో అమాయకంగా చూస్తున్న నా ఫోటో, గుఱ్ఱం బొమ్మమీద కూర్చున్న తమ్ముడి ఫోటో, ఇంకా కొన్ని ఫోటోలు...వరుసగా వేలాడదీసి వుంటాయి. నాయనమ్మ ఎప్పట్లానే ఆ వేళ కూడా ఆ ఫొటోలన్నీ నాకూ, తమ్ముడికీ చూపించి అప్పటి సంగతులు చెప్పింది. 

       "బాబాయ్ తాటి చెట్ల దగ్గరకు ఎప్పుడు వెళ్దాం?" ఉత్సాహంగా అడిగాను. "నువ్వెప్పుడంటే అప్పుడేనమ్మా" తెల్లని పళ్ళు కనిపించేలా నవ్వుతూ చెప్పాడు. అసలు బాబాయి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, బాబాయిని కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఆ మాట కొస్తే ఆ ఇంట్లో ఎవరినీ కోపంగా చూడలేదు. బాబాయి మాటతో క్వీన్ విక్టోరియా లాగా ఫీల్ అయి "అయితే ఇప్పుడే వెళ్దాం" చెంగున అరుగు మీంచి దూకి చెప్పాను. "ఇప్పుడొద్దులేమ్మా అన్నం తిని కాసేపుబ్బడుకోండి, చల్లబడ్డాక పోదురుగాని" చెప్పారు తాతయ్య. 
అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. నేనూ, తమ్ముడూ 'ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు తోటకెళ్దామా ' అని ఎదురుచూస్తూ కూర్చున్నాము. తాటికాయల కబుర్లు కాస్త చల్లబడ్డాక చెప్పుకుందాం. 

Friday, May 18, 2012

కడుపు చించుకుంటే...

"సరోజా, నాకేం చెయ్యాలో తోచట్లేదే"
"బాధపడకే కష్టాలు మనుషులకు కాకపోతే మానులకొస్తాయా"
"నీకేం నువ్వు ఎన్నైనా చెప్తావ్, నీదాకా వస్తే కదా తెలిసేది"
"మా అక్క కూడా ఇలాగే బాధ పడేది, ఏం చేస్తాం 'మన ప్రాప్తం ఇంతే' అని సరిపెట్టేసుకోవాలి"
"ఏం సరిపెట్టుకోవడమో నా పరిస్థితికి నా మీద నాకే జాలిగా ఉంది"
"అయ్యో అలా బాధ పడకే...కాలేజీలో 'వీరనారి' అనిపించుకున్న నువ్వేనా ఇలా కృ౦గిపోతుంది?"
"ఈ సంసారంలో పడ్డాక ధైర్యం గీర్యం కొండెక్కి కూర్చున్నయ్"
"అసలా విషయం ఎప్పుడు తెలిసిందే నీకు?"
"ఓ నెల్లాళైంది, అప్పట్నుంచీ నాలో నేనే కుమిలి పోతున్నానంటే నమ్ము"
"ఓ విషయం అడుగుతాను ఏం అనుకోవుగా..."
"అనుకోవడానికేం ఉంది, అయినా నీ దగ్గర నాకు దాపరికమేమిటే. అడుగూ" 
"అది తెల్లగా అందంగా ఉంటుందటగా"
"ఆ కళా కాంతి లేకుండా తెల్లగా ఉంటుంది...మా అయన దాన్ని చూసి మెరుపుతీగ అని మురిసిపోతుంటే ఒళ్ళు మండిపోతుందనుకో" 
"ఏంటీ....నీ ముందే అలా అన్నారా!"
"ఆ...నా ముందే అన్నారు."
"దాన్ని ఎలాగోలా ఒదిలించుకోలేకపోయావా?"
"ఆ ప్రయత్నమూ అయింది. నానా గడ్డీ పెట్టాక మొహం నల్లబరచుకుని ఓ రెండువారాలు౦టుంది, తరువాత మళ్ళీ మామూలే. జీవితాంతం నేను దీన్ని భరించాల్సిందేనే.. ఇలాంటి కష్టం పగవాళ్ళక్కూడా రాకూడదు బాబూ."
"ఊరుకోవే ఇంక చేసేదేముంది సర్దుకుపోవడమే.."
"ఎలానే సర్దుకునేది, ఎక్కడికెళ్ళినా నాతోనే, దాన్ని చూసి నన్ను వరసలు మార్చి పిలుస్తుంటే ఎలా తట్టుకోమంటావ్.."
"ప్చ్..కష్టమే పాప౦"
"కష్టమని చిన్నగా అంటావా..రాత్రి పగలూ అదే ఆలోచనైపోయింది, ఆ పెద్దమ్మ నా నెత్తికెక్కాక మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదైతే నా ఎదటికి రాకూడదనుకున్నానో, దేన్నైతో ఎదుర్కోవడానికి ఇంత కాలం భయపడ్డానో అది దాపురించాక 'నలుగురితోపాటు నారాయణా' అని అనుకోలేకపోతున్నాను."
"పోనీ ఎవరినైనా సలహా అడుగుదామా..."
"అదీ అయింది....ఎవరికి తోచినవి వాళ్ళు చెప్పారు, అన్నీ ప్రయోగించా మహా మొండిది కదూ అంత త్వరగా వదుల్తుందా.."
"మరెలా..పోనీ మీ అత్తగారితో ఓ మాట అనక పోయావా.."
"చెప్పకుండానే ఉంటానా...దానికావిడ "మాకూ వచ్చిందమ్మా ఈ కష్టం, ఏదో గుట్టుగా నోరు మూసుకుని ఊరుకున్నాం కానీ నీలా ఇల్లెక్కి గోల పెట్టలేదు" అన్నారు.
"ఇక ఊరుకునేది లేదు" 
"ఇ౦కా వినూ....తరవత్తవాత దాని బంధుగణాన్నంతా తీసుకొస్తుందని కూడా అన్నారావిడ" 
"మనమేం చేతులు ముడుచుక్కూర్చున్నామా, అందాకా వస్తే...."
"ఆ వస్తే ఏం చెయ్యనే..."
"ఒక్క తెల్ల వెంట్రుకని ఊరుకున్నాం కానీ తలంతా వస్తే....ఎంచక్కా పార్లర్ కి వెళ్లి రంగేయించుకో, లేకపోతే హెన్నా అయినా పెట్టించుకో"
"అంతేనంటావా"
"ఆ..అంతే మరి"
        

Wednesday, May 9, 2012

ఇరుగూ...పొరుగూ

     ఇప్పుడంటే నెలకొకసారి పున్నమి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది కానీ, అప్పుడంతా చిట్టితల్లి నవ్వులతో పగలూ, రాత్రీ వెన్నెలే కదూ! ఉంగరాల జుట్టు, గుండ్రటి మొహం, చారడేసి కళ్ళు, లేతనీలం రంగు గౌను వేసుకుని, బుజ్జి కాళ్ళకు మువ్వల పట్టీలు పెట్టుకుని ఘల్లుఘల్లుమంటూ ఇంట్లో నడుస్తూ ఉంటే ఆ సిరిమహాలక్ష్మి నట్టింట్లో తా౦డవమాడినట్లే ఉండేది.

      పెళ్ళయి, కాగానే శ్రీవారు ఒక మూడంతస్తుల అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ లో ఇల్లు చూశారు. అక్కడున్నప్పుడే చిట్టితల్లి పుట్టింది. ఆ ఏడాదే ఎదురింటి స్వాతి బడికి వెళ్లడం మొదలుపెట్టింది. వాళ్ళింట్లో ఆఖరిదవడంతో తనకన్నా చిన్నదైన చిట్టితల్లిని క్షణం ఒదిలేది కాదు స్వాతి. ఇంటిదగ్గర ఉన్న సమయమంతా చిట్టితల్లితోనే ఆటలు. స్వాతి వాళ్ళ అమ్మగారు టీచరుగా పనిచేసేవారు. ఆవిడ కూడా సాయంకాలాలు చిట్టితల్లిని ఇంటికి తీసుకెళ్ళి ఆడించుకునేవారు. చిట్టితల్లి రెండేళ్ళకే స్పష్టంగా మాట్లాడి౦దంటే అది స్వాతి చలువే మరి. తనకొచ్చిన పద్యాలూ, పాటలూ అన్నీ చిట్టితల్లికి చెప్తూ ఉండేది.

      ఇంటికి రాగానే 
స్వాతి కాళ్ళు చేతులు కడుక్కుని, మెట్లమీద కూర్చుని పాలు తాగేది. చిట్టితల్లికేమో పాలు తాగడం అస్సలు ఇష్టం లేదు. అయితే స్వాతి మెట్ల దగ్గరకు వచ్చే సమయానికే అమ్మ కూడా బోర్నవిటాతో ఉన్న పెద్ద గ్లాసు, తాగడానికి వీలుగా మరో చిన్నగ్లాసు తీసుకుని మెట్ల దగ్గరకు వచ్చేది. పెద్దగ్లాసులోంచి చిన్నగ్లాసులోకి కొంచెం వంపి చిట్టితల్లి చేతికి ఇచ్చేది. చిట్టితల్లి ఒక్క చుక్క నోట్లోకి రాకుండా తాగినట్లు నటించేది. స్వాతి తాగడం అవగానే 'నువ్వు పాలు తాగితేనే నేను నీతో ఆడుకుంటా' అనేది. అంతే పాలన్నీ తాగేసి ఖాళీ గ్లాసు అమ్మ చేతిలో పెట్టేసేది చిట్టితల్లి. కొన్ని రోజులయ్యాక చిట్టితల్లి, స్వాతి అలా చెప్పకపోతే అడిగి చెప్పించుకుని మరీ పాలు తాగేది.

     అలా ఆడుతూ, పాడుతూ, 
ముద్దులు మూట కడుతూ నలుగురి మధ్య రెండేళ్ళు పూర్తి చేసింది చిట్టితల్లి. ఒకరోజు చిట్టితల్లి చూస్తుండగా స్వాతి కాగితంతో చేసిన విమానం పైనుంచి కిందకు వేసింది. అది గాలిలో ఎగురుతూ, తిరుగుతూ, వయ్యారంగా వెళ్లడం విపరీతంగా నచ్చేసింది చిట్టితల్లికి. అప్పటినుండి చేతిలో ఏదుంటే అది పైనుంచి 'జుయ్' అని కింద వెయ్యడం మొదలు పెట్టింది. కిందకు చూస్తే మధ్యలో ఏదో అడ్డం ఉంది కాని ఒకవైపు కింద ఇంటి వాళ్ళు గిన్నెలు తోముకునే స్థలం, మరో వైపు కింద పోర్షన్ వారి వీధి వాకిలి కనిపిస్తాయి. చిట్టితల్లి చేతిలో ఏదైనా గట్టి వస్తువు చూస్తే అమ్మకు పై ప్రాణాలు పైనే పోయేవి. 

     ఒక్కోసారి చిట్టితల్లి కాలికి ఒక చెప్పు వేసుకుని కనిపించేది, వెతికితే రెండో చెప్పు కింద కనిపించేది. మరోసారి అప్పడాల కర్ర పడేసింది. లేచినవేళ మంచిది కాబట్టి ఆపూట అక్కడెవ్వరూ లేరు. చిట్టితల్లికా చెప్తే అర్ధం చేసుకునే వయసు కాదు. అమ్మ చెలం పుస్తకాలూ అవీ చదివి ఉందేమో 'చిట్టితల్లిని కోప్పడదా౦' అన్న ఊహే వచ్చేది కాదు. 

       చిట్టితల్లి చేతిలో ఏదైనా బలమైన వస్తువు చూసి౦దంటే స్వాతి 'అంటీ అంటీ' అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుని పాప దగ్గరకు వచ్చేది. చిట్టితల్లి నవ్వుతూ స్వాతికి దొరక్కుండా పరిగెత్తి ఇంకా బలంగా విసరడం మొదలు పెట్టింది. కొంత పరిశోధన చేసిన తరువాత చిట్టితల్లికి విసిరే ఉద్దేశం లేకపోయినా స్వాతి మోహంలో కంగారు చూడడం కోసం విసురుతోందని అర్ధం అయిందమ్మకు. సమస్య అర్ధమైయ్యాక పరిష్కారం దానంతట అదే దొరికింది. ఆ విధంగా చిట్టితల్లికి ఆ ఆటమీద ఆసక్తి పోయింది. అమ్మ 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంది. 

                      *                       *                       *

      ఆ రోజులే వేరు కదూ..ఎవరికి ఎవరం ఏమవుతామో...తన, మన అన్న బేధం ఉండేది కాదు. పసిపాపతో ఇంటిపని, వంటపని ఒక్కర్తినీ చేసుకున్నా ఒక్కసారి కూడా శ్రమ అనిపించలేదు. ఆ బిల్డింగ్ లో అందరూ పాపను తీసికెళ్ళి ఆడుకోవడమే. రెండేళ్ళు నిండాక స్నానం చేయించి బయటకు పంపిస్తే మళ్ళీ భోజనాల వేళకు ఎవరింట్లో ఉందో వెతికి తీసుకొచ్చి అన్నం పెట్టి నిద్రపుచ్చేదాన్ని. భయం వుండేది కాదు, అందరి తలుపులూ తెరిచే ఉండేవి. అపార్ట్మెంట్ గేటు పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని చాకలి వాళ్ళ కుటుంబం ఉండేది. ఈ రోజుల్లో ఏ అపార్ట్మెంట్ చూసినా మూసిన తలుపులూ తాళాలూనూ..



Thursday, May 3, 2012

కౌముదిలో నా కవిత 'వెఱ్ఱి ఆశ '

నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'మే' సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

           వెఱ్ఱి ఆశ 

అయినా అంత తొందరేంటి నీకు?
కలిసెళ్దాం అనుకున్నాం కదా!
నువ్వొక్కదానివే అలా వెళ్లిపోవడమేనా?

ఎవరేమైతే నీకేం? ఎవరెలాపోతేనేం?
అరె....వెళ్లేముందు కనీసం ఓ మాట...

అయినా ఏ రోజు నువ్వు నా మాట విన్నావు కనుక!
నా కోసం వేచి వుండకన్నానా ...
రాత్రవనీ, అపరాత్రవనీ,
నేనొచ్చేదాకా కళ్ళు వాకిటనే!
తిండీ లేదూ ...నిద్రా లేదూ....

అసలు నువ్వెంత గడుసుదానివంటే...
నా ఇష్టాలేంటో తెలుసుకున్నావు కాని,
కనీసం ఒక్కసారైనా, నీకు నచ్చేవే౦టో చెప్పావా?
నన్ను పసివాడిగా మార్చి ఏమి తెలియకుండా చేశావ్!

నీ కెంత స్వార్ధం లేకపోతే...
సంతోషాన్నంతా మూట కట్టుకుని,
విషాదాన్ని విరజిమ్మివెళ్తావ్ ?

నాకేనా పౌరుషం లేనిది?
నీ తలపులన్నీ ఈ పూటే తుడిచేస్తా....

అదేంటో.... చెరిపేస్తున్నకొద్దీ కనిపిస్తూనే వున్నయ్
ఊట బావిలో నీరులా....
అవి కూడా నీ అంతే మొండివి మరి!

నీ ఉనికితో నా మనసంతా వెల్లవేసినట్టున్నావ్
ఏ వైపు చూసినా నీ రూపమే!

నువ్వు మొన్న కట్టిన పచ్చ చీర
జ్ఞాపకాల అలల్ని రేపుతోంది!

నువ్వు నాటిన మల్లెమొక్క
నిను గానక... బిక్క మొహం వేసింది!

నా సంతోషానికి అవసరమైన మందేదో
చెప్పడం మరిచిపోయావ్,
ఎదుటనున్న కాలం అంతా....
నీ తలపులు మోస్తూ బ్రతకమన్నావా!

తిట్టానని కోపగించుకుని రాకుండా వుండకేం!
మరుజన్మలోనైనా... నన్ను కలుస్తావని వెఱ్ఱి ఆశ!!