Tuesday, July 17, 2012

సరిగ్గా ఎనిమిది గంటలకు....

"అందరూ గుర్తు పెట్టుకోండి.... మిగిలిన విషయాలు అక్కడే మాట్లాడుకుందాం."

        *               *                  * 

       అనుకున్న సమయం అయింది. దాదాపుగా అ౦దరూ వచ్చారు. కొందరు కారు డిక్కీలోని వస్తువులు జాగ్రత్తగా తీసి కింద పెడుతున్నారు. చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా వుంది. గాలి కూడా స్థంబించి౦దేమో ఎక్కడా ఒక్క ఆకు కూడా కదలడంలేదు. పేరు తెలియని పక్షి ఒకటి కీచుగా అరుస్తూ ఎగిరిపోయింది.


"మన వాళ్ళ౦దరూ వచ్చినట్లేనా?" అడిగాడు సూర్యం.
"ఆ అంతా వచ్చేశారు..ఏం చెయ్యాలో చెప్పు" తొందర పెట్టాడు రవి.
"సరే...ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం మొత్తం ఇరవై రెండుమందిమి, పదకొండు మందిమి ఇటువైపు, ఇంకో పదకొండు మందిమి అటువైపు వెళ్తే హోల్ ఏరియా కవర్ చెయ్యొచ్చు. ఏమంటారు?" సమాధానం కోసం ఆగాడు వెంకటేష్. 


"ఏం రిస్క్ లేదుగా?" అడిగింది ఝాన్సీ.
"రిస్కా...రిస్క్ లేకుండా యే పనీ ఉండదు. రిస్క్ గురించి అలోచిస్తే అసలేమీ చెయ్యలేం.... ఇదుగో రాఘవ రెడ్డీ నువ్విది పట్టుకుని ముందు నడువ్, ఎవరూ రాకుండా చూస్తుండు, కాస్త జాగ్రత్తగా వుండాలి, కొంచెం కూడా తేడా రాకూడదు." చెప్పాడు శేషాచలం.
"భాస్కర్, చూసేవాళ్ళ కనుమానం రాకుండా, దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ముందు నడువు. జాగ్రత్త, హఠాత్తుగా ఎవరైనా ఎదుట్నుండి రావచ్చు. తేడా వస్తే ఎముక మిగలదు. "గ్లవ్స్ తెచ్చాను, తాలా రెండు తీస్కోండి." అంటూ అందరికీ ఇచ్చాడు సత్యన్నారాయణ.


"ఇప్పుడీ గ్లవ్స్ అవసరమా?" అడిగాడు శంకర్.
"ఇటుబోయి ఎటొస్తుందో మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది." అంటూ వెంకటేష్ డిక్కీలో వున్న సంచిలోవి తీసి, "ఇవి కూడా తలా ఒకటి తీస్కోండి. వీటిని వాడడం తెలుసుగా?" అందర్నీ ఉద్దేశించి అడిగాడు.
సంచిలోంచి ఒకటి తీసి అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూస్తూ "అబ్బో చాలా పొడవుగా వున్నాయే, వీటిని వాడే పని పడ్తుంద౦టావా?" అడిగాడు మల్లేష్.
" అవసరమవుతుందా? అంటే ఇప్పుడే ఎలా తెలుస్తుంది మల్లేష్, అవసరమైతే మాత్రం తప్పకుండా వాడాల్సిందే." చెప్పాడు సూర్యం.
"ఈ సంచులు తీస్కుని దొరికినివాటిని దొరికినట్లుగా వీటిలో వేసి మూటకట్టండి. పనయ్యాక అందరం ఇక్కడే కలుస్తాంగా వీటిని ఎలా పంచుకోవాలో అప్పుడు చూద్దాం. ఆ..సరిగ్గా పన్నెండు గంటలకల్లా అందరం ఇక్కడే కలుద్దాం."

"బ్రదర్, ఒక్కసారి ఆ సీసా ఇవ్వు వెళ్ళడానికి కాస్త ..." అంటూ నవ్వాడు మహేష్.
"ఆ....ఇప్పుడే ఖాళీ జేస్తే వెళ్ళడానికి కష్టం, తిరిగొచ్చేదాకా ఆగాల్సిందే" సీసాలున్న డబ్బా మూత వేస్తూ చెప్పాడు వెంకట్.

              *               *                  *

    వాళ్ళ౦దరూ అలా రెండు గ్రూపులుగా విడిపోయారు. అందరూ ఒకే దగ్గర నడిస్తే ప్రమాదమని ఒకళ్ళకొకళ్ళు కూతవేటు దూరంలో వెళ్ళేలా సంజ్ఞలు చేసుకుని 
ఇద్దరు ముగ్గురూ కలసి ఒక గుంపుగా నడవడం మొదలుపెట్టారు.  

"మనం శ్రమ పడ్డమే కాని ఇక్కడేవీ దొరికేలా లేవే?" వెంకట్.
"అదిగో అక్కడ చూడు ఏదో మెరుస్తూ...." బాగా కిందకు వంగి చెట్టు మొదలు వైపు చూస్తూ చెప్పాడు మాధవ్.
"మనక్కావల్సిందదే." వేణు మొహం వెలిగిపోయింది.
"ఆ పక్కన ఇంకో రెండు కూడా వున్నాయి" కొమ్మలు తప్పి౦చాడు వెంకట్.
"ఇంకొంచెం ముందుకు...జాగ్రత్త, అమ్మయ్య దొరికిందా...ఇదిగో ఈ మూటలో వెయ్యి" సంచి తెరచి పట్టుకున్నాడు వేణు.

  
         *               *                  *
"ఇక్కడెవరో వున్నట్లున్నారు" కాల్చిపారేసిన సిగెరెట్ పీకను అనుమానంగా చూస్తూ చెప్పాడు సూర్యం."
"అటువైపు వెళ్ళకండి, ఏదో కారు వస్తున్నట్లుంది. లైట్లు కనిపిస్తున్నాయి." చిన్న గొంతుతో హెచ్చరించాడు ముందు నడుస్తున్న భాస్కర్.
"ఎందుకైనా మంచిది నేను ఇటు నడుస్తాను. మీరు ఆ చెట్లచాటుగా రండి." అన్నాడు రాఘవ రెడ్డి
"ఇక్కడేం దొరకవనుకున్నాం గాని, చాలానే ఉన్నాయే, అప్పుడే సగం సంచి నిండిది." సంచిలోవి జారిపోకుండా మూతి బిగించి పట్టుకుని నడుస్తున్నాడు మోహన్.
"ఒక్కోటి కనిపిస్తూ వుంటే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేక పోతున్నాను." మోహన్ తో చెప్పింది ధరణి.
"ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నట్లుగానా?" ఉడికించాడు మోహన్.
"ఎప్పుడూ తిండేనా ..." అంటూ నవ్వింది.

         *               *                  *

"మన వెనుకున్న కుర్రాళ్ళు కనిపించడంలా" కీచుగా అరిచింది వాణి.
అందరూ ఒక్కసారిగా ఆగిపోయ్యారు. వెనుక చెట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. మూట నిండగానే ఎవరికీ చెప్పకుండా ఎటైనా వెళ్ళిపోయుంటారా? లేక వారికేమైనా ప్రమాదం జరిగిందా? ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. "ఆ చెట్టుదాటే వరకు మా వెనుకే ఉన్నారు?" నిశ్శబ్దాన్ని భగ్నం చేశాడు రవి. "నేనెళ్ళి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి." అంటూ వచ్చిన దారిలో వెనక్కి వెళ్లాడు వేణు. ఓ ఐదు నిముషాల తరువాత ముగ్గురూ దూరంగా వస్తూ కనిపించారు. ఈలోగా రెండొవ గ్రూప్ లో వున్న ఓ ఇద్దరు పెద్దమూటతో ఎదురొచ్చారు.

"ఇంతన్యాయం పనికి రాదు, ఎవరి ఏరియా వాళ్ళదే మీరిటు రాకూడదు" అవేశపడింది ధరణి.
"మనలో మనం గొడవలు పెట్టుకోకూడదు, ఇలాంటివి కొంచెం చూసీ చూడనట్టు పోవాలి" సర్ది చెప్పాడు నరసింహం."
"అదేం కుదరదు" అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు మోహన్.
"పోనీ సంచిలోవి ఇచ్చైమా?" అడిగాడు రవి.
"మనమిలా మాట్లాడుకుంటుంటే టైమైపోతోంది. త్వరగా వెనక్కి పోదాం పదండి" అంటూ హడావిడి పెట్టాడు మల్లేశ్. 

         *               *                  *
"వెళ్ళేప్పుడు ఆ పక్కదారిలో వెళదాం, ఇంకాసిన్ని దొరకొచ్చు" ఆశగా చెప్పాడు సూర్యం. అ౦దరూ వేరేదారి పట్టారు. ఆ దారంతా గడ్డి మొలిచి వుంది. మధ్యలో అక్కడక్కడా చెట్లు. ముందురోజు కురిసిన వర్షం వల్లనేమో నేల కొంచెం తడిగా వుంది.

"ఇక్కడంతా బురద, అడుగుల గుర్తులు పడకుండా నడవండి." హెచ్చరించాడు నరహరి.
"ఆ గ్యాస్ స్టేషన్ లోనుంచి వస్తున్న కార్లో అతను మనల్ని చూసినట్లున్నాడు. ఫోన్లో ఏదో చెప్తున్నాడు చూడండి." కంగారుగా చెప్పింది ఝాన్సీ.
"ఇందాక ఆ పక్కగా వెళ్ళినతను మనల్ని ఫోటోలు తీశాడేమోనని నాకు అనుమానంగా ఉంది." అనుమానంగా చెప్పాడు మోహన్.

    మెల్లగా అందరూ పన్నెండు గంటలకు చెట్టుకిందకు చేరారు. కారు డిక్కీ తెరిచి తలా ఒక సీసా తీసి తాగుతూ, జీడిపప్పులు నములుతున్నారు. ఐదు సంచులకు పైగా సరుకు తెచ్చారు. అందరి మొహాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి.
"ఇక్కడేమీ దొరకవనుకున్నాము, బాగానే దొరికాయి." తృప్తిగా నిట్టూర్చాడు మోహన్.
"మళ్ళీ ఎప్పుడు కలవడం?"
"మూడు నెలల తర్వాత కలుద్దాం."
"ఆ ట్రాష్ బాగ్ లన్నీ ట్రంక్ లో పెట్టేయండి, హారిస్ టీటర్ వెనుక ట్రాష్ లో పడేస్తాము" చెప్పాడు వెంకటేష్.

        *               *                  * 

      అదండీ విషయం. మా ఊరు శుభ్రంగా ఉండడం కోసం మా బాధ్యతగా ఏమైనా చెయ్యాలని మా తెలుగు అసోసియేషన్ ఓ రెండు మైళ్ళ రోడ్డును దత్తత తీసుకు౦ది. సంఘ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు కలసి, రెండేళ్ళ పాటు, మూడునెల్లకోసారి ఈ రోడ్డును శుభ్రం చేస్తామన్నమాట. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, నీలాకాశాన్ని, వెండి మబ్బుల్ని చూస్తూ, చెత్త కనపడితే నిధి కనపడినంతగా సంతోషిస్తూ, ఉత్సాహంగా ఉల్లాసంగా కనపడినవన్నీగ్లవ్స్, ట్రాష్ గ్రాబర్ నుపయోగించి  ఏరి మూట కట్టేసి, చెత్తకుండీలో వేశాం. వేసవి కాలం ఎండ ఇబ్బంది పెట్టిన మాట నిజమే కాని, నలుగురం కలసి పనిచేశాం కదా ఏదో కొంచెం తృప్తిగా అనిపించింది.


Thursday, July 12, 2012

ఆటా జ్ఞాపికలో నా వ్యాసం 'తెలుగు బ్లాగులు'

      అదో అందమైన పల్లెటూరు... భావపరిమళాలు వెదజల్లే అక్షరసుమాలు, కవితా పూరితమైన చల్లని తెమ్మెరలు, పద్యసాహిత్యపు హరితవనాలు, తీర్చిదిద్దిన రంగవల్లుల వంటి రచనలు, పదచాతుర్యంతో కూడిన సంభాషణల తోరణాలు, ఎల్లవేళలా స్వాగతం పలికే వీధి గుమ్మాలతో అక్కడ నిత్య౦ పండుగ శోభ కళకళ్ళాడుతూ సాక్షాత్కరిస్తుంది. అంతర్జాలంలో కనిపించే అద్భుత౦ ఈ తెలుగు బ్లాగు ప్రపంచం.

    సాహిత్యపు విలువలు వలువలు వీడని సామ్రాజ్యం అది. ‘తెలుగుభాష అంతరించి పోతోంద’ని వాపోతున్నవారందరూ ఒక్కసారి అంతర్జాలంలోకి వచ్చి, నిశ్శబ్దంగా అక్కడ తెలుగువారు చేస్తున్న సాహిత్య సేవ చూడండి. కథలు, కవితలు, పద్యాలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, రాజకీయాలు, సమీక్షలు, సమాచారాలు, కబుర్లు, చెణుకులు, ఛలోక్తులు, చిత్రాలు, వంటలు, చిట్కాలు ఇలా ఎన్నో విశేషాల సమాకలనమే ఈ బ్లాగులు. తెలుగు భాష మీద ఆసక్తి వున్న వారు ఉత్సాహంగా పాల్గొని హర్షాతిరేకంతో వ్రాసుకుంటున్న రచనలు, తెలుగు భాషావైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి.

       మనిషికీ మనిషికీ మధ్య పెరిగిన దూరంలో, వంటరితనపు ఎడారి దారులలో వేసవి వడగాల్పుల ధాటికి వేసారిన వారందరికీ ఈ బ్లాగులు చలివేంద్రాలే. మనసులో మాట పదుగురి ముందు నిర్భయంగా చెప్పుకోగలిగిన స్థైర్యాన్ని, కావలసిన ఊరటనీ అందిస్తాయి. సంతోషాన్ని, బాధనీ పంచుకోవడానికి ఓ వేదికలా నిలిచి, పరిష్కారం చూపిస్తాయి. ఒకరి ఆత్మసంఘర్షణ పదుగురికి ఉపయోగపడే జీవిత పాఠమౌతుంది. ఏ ప్రపంచీకరణ వలన మానవ సంబంధాలకు అంతరాయం వాటిల్లిందో, దానినే ఆయుధంగా చేసుకుని, వేరు వేరు పట్టణాలలో, దేశాలలో, ఖండాలలో వు౦టున్న వ్యక్తులతో స్నేహ సంబంధాలు కొనసాగించుకోవడానికి, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న మిత్రులతో విశేషాలు పంచుకోవడానికి ఈ బ్లాగులు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి.

బ్లాగులు

        ప్రాంతీయ సభలు, సమావేశాల వివరాలు, పుస్తక ప్రదర్శనలు, యాత్రా విశేషాలు, ప్రపంచంలోని వింతలు, విడ్డూరాలు, చూడచక్కని ప్రదేశాలు అన్ని౦టి వివరాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ విశేషాల గురించి అంతర్జాలంలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ, అభిరుచులు కలగలసిన వారు అందించిన వివరాలకు సాటి రావు కదా అవి. పైగా మన సందేహాలకు సమాధానాలు, సూచనలూ దొరికే సౌలభ్యం అక్కడ ఉంటుంది.

      ఈ బ్లాగు ప్రపంచంలో కలుషితమైన కుల రాజకీయాలు, మతోన్మాదాలు లేవనే చెప్పొచ్చు. ఉత్తమ రచన ఎవరు చేసినా సహృదయంతో ప్రోత్సహించేవారే ఎక్కువ శాతం ఉంటారు. ఒక్కోసారి ఈ బ్లాగులోని చర్చలు వ్యక్తిగత దూషణల వరకూ వెళుతుంటాయి కానీ అవి చాలా తక్కువ శాతమని చెప్పొచ్చు. బ్లాగులు మొదలైన కొత్తలో ‘కామెంట్ మోడరేషన్’ లేని కారణంగా, ఈ వ్యాఖ్యల మీద అదుపు వుండేది కాదు. అందువలన ఆ రోజుల్లో ఈ వ్యక్తిగత దూషణలు కొంచెం ఎక్కువ మోదాతులోనే వుండేవని వినికిడి.

     సాధారణంగా బ్లాగు నిర్వహించడానికి blogger.com, wordpress.com లను ఉపయోగిస్తారు. వీటిని వాడడానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు, చాలా సులభంగా కావలసిన రీతిలో బ్లాగును నిర్మించుకోవచ్చు. బ్లాగు పేరు పెట్టడానికి, వ్రాసిన రచన ఏ విభాగానికి సంబంధించిదో తెలుపడానికి, ఏ రోజు, నెల, సంవత్సరం వ్రాశామో నమోదు చేసుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు ఉంటాయి. రచనలకు అనుబంధ చిత్రాలను ప్రచురించే సౌలభ్యం కూడా వుంటుంది. ఎక్కువ మంది ఆదరించిన రచనలు, కొత్తగా పెట్టిన వ్యాఖ్యలు, వారికున్న ఇతర బ్లాగుల వివరాలు అన్నీ ఒకే దగ్గర చూసే వీలు ఉంటుంది. ఎవరి బ్లాగు వాళ్ళే కాకుండా నచ్చిన ఇతర బ్లాగుల వివరాలు కూడా అదే పేజీలో పొందుపరిచే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇతర బ్లాగర్లు కొత్త రచనలు చేసినప్పుడు ఆ సమాచారం సొంత బ్లాగులో చూసే వీలు వుంటుంది. తమ రచనలను గూగుల్ ప్లస్, ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్ డెన్, ఈమెయిలు ద్వారా ఇతరులతో పంచుకునే సౌలభ్యం కూడా ఉంది.

      వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు వారు, వారి పరిసరాలలోని ప్రజా జీవన విధానం గురించి వ్రాసిన రచనల వలన సమకాలీన సాహిత్యం అవగతమౌతుంది. బ్లాగులో మాండలిక౦లో వ్రాసిన అనుభవాలు, కథలూ గడచి పోయిన బాల్యాన్ని, ఆనాటి అనుబంధాలను తిరిగి కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. కవితలు రాయడమే కాక వాటికి తగిన అందమైన బొమ్మలు వేసి అందించే బ్లాగులు కూడా ఉన్నాయి. ఒక సాధారణ విషయాన్ని అసాధారణ శైలిలోవ్రాయగలిగిన బ్లాగరులు కొందరు తమ రచనలను ఏ పత్రికకూ పంపించక బ్లాగులో పెడుతూ ఉంటారు. ఆ రచనలపై, పాఠకుల తక్షణ స్పందనలే వారి రచనలకు స్ఫూర్తి.

     పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాలు తెలిపే బ్లాగులో వ్రాసిన పుస్తక సమీక్షలను చదివి, చదువవలసిన పుస్తకముల జాబితా తయారు చేసుకోవచ్చు. దీనివలన ఎన్నో మంచి పుస్తకాలు చదివే అవాకాశం ఉంటుంది. ఈ బ్లాగులు రచయతల గురించి, రచనల గురించి విస్తృతమైన సమాచారం అందిస్తున్నాయి. ఒక్క రచయితల గురించే కాకుండా చిత్రకారులు, ప్రాచీన కవులు, శిల్పులు, ఆయా రంగాలలో నిష్ణాతులైన వారి పరిచయాలు కూడా లభ్యమౌతాయి.

     చలనచిత్రాలపై వ్రాసిన సమీక్షలు చదవడం వలన గతంలో చూడలేకపోయిన మంచి సినిమాలు చూసే అవకాశం కలుగుతుంది. నేడు విడుదవుతున్న కొన్ని అసభ్య చిత్రాలపై సమీక్షలను ఎటువంటి పక్షపాతం లేకుండా వ్రాసి బ్లాగులో పెట్టడం గమనార్హం. నేటి చిత్రాలలో అశ్లీలతను ప్రతిఘటి౦చే విషయంలో బ్లాగులలో జరిగే చర్చలు చదివిననాడు, అటువంటి చిత్రాలు నిర్మించడానికి, కనీసం ఊహించడానికి కూడా ఎవరూ సాహసించరేమో అనిపిస్తుంది. నాటి ఆణిముత్యాల నుంచి నేటి ఉర్రూతలూగించే పాటల వరకూ అన్నింటి సాహిత్యం ఈ బ్లాగులో చదవొచ్చు. వేటూరి, జంధ్యాల, ఘంటసాల, సావిత్రి మొదలైన సినీప్రముఖుల అభిమానులు కొందరు వారికోసం బ్లాగులు నిర్వహిస్తున్నారు. ఈ బ్లాగులలో వారి నటజీవితానికే కాక నిజ జీవితానికి సంబంధించిన వివరాలూ, వారి జీవితాలలో వారనుభవించిన అటుపోట్లూ చదివి ‘ఎందరో మహానుభావులు’ అనుకోకుండా ఉండలేము.

     నిశ్చలచిత్రాలకు సంబంధిన బ్లాగుల్లో అందమైన ప్రకృతి దృశ్యాలను, అద్భుతమైన విశేషాలను చూడొచ్చు. విరిసిన పువ్వులు, శోభాయమానమైన సాయంస౦ధ్యలు, నదీనదాలు, గడ్డిపరకపై జారుతున్న చినుకు ముత్యాలు పరవశింపచేస్తే, ఎన్నడో చిన్నతనంలో చూసిన పువ్వు, లేచిగురు మావిడి చెట్టు, చేదభావి హఠాత్తుగా మన ఎదురుగా నిలబడి మనల్ని గతస్మృతుల నేపధ్య౦లోకి తీసుకువెళ్ళి, ఎదలో అనుభూతుల పరిమళాలు నింపుతాయి. పాపికొండల నడుమ సూరీడు, ఝుంటి తేనెలు గ్రోలుచున్న తుమ్మెద, ఆకసాన నీలిమేఘ౦, వెన్నెలతో సయ్యాటలాడే కొబ్బరాకు, గూటిలోంచి తొంగిచూసే గువ్వపిట్ట, సందెవేళ వికసించే సన్నజాజి మనసున మల్లెలు పూయిస్తాయి.

     తెలుగు నేర్చుకోవలనుకునే వారికి, పిల్లలకు తెలుగు నేర్పించేవారికి అవసరమైన సమాచారం బ్లాగులలో దొరుకుతుంది. ఈ విషయంలో ఆయా బ్లాగరుల సహాయసహకారాలు కూడా ఉంటుంది. పిల్లల కథలు, బొమ్మల కథలు, శ్రవణ కథలు, పిల్లల పాటలు ఇలా ఉన్న ప్రత్యేకమైన బ్లాగులు ఉన్నాయి. వేమన శతక౦, సుమతీ శతకం, శ్లోకాలు, నీతి కథలు అన్నీ కూడా ఈ బ్లాగుల్లో దొరుకుతాయి.

తెలుగు భాషా ఉపకరణాలు

      కంప్యూటర్ లో తెలుగు వ్రాయడానికి baraha.com, lekhini.org, telugulipi.net, google.com/transliterate లాంటి ఉపకరణాలు ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బ్లాగ్ స్పాట్ లో తెలుగులో రాసే సౌలభ్యం కూడా ఉంది. ఈ ఉపకరణాలు ద్వారా ఇంగ్లీషులో టైప్ చేసిన అక్షరాలను తెలుగులోకి మార్చుకోవచ్చు. ప్రారంభంలో అలవాటులేని కారణంగా తెలుగు టైప్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా త్వరలోనే సులభంగా టైప్ చెయ్యగలుగుతాము. అయితే ఈ సాఫ్ట్ వేర్ ల వలన ఎదురయ్యే ముఖ్య సమస్య ఏమిటంటే తెలుగు టైపింగ్ లోఅక్షరదోషాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. భవిష్యత్తులో ఈ సమస్యలులేని ఉపకరణాలు లభ్యమౌతాయని ఆశిద్దాం.

      బ్లాగు, వ్రాయడం చదవడం మూలంగా మంచి చిత్రాలు, పాటలు, సాహిత్యం పరిచయమౌతుంది. బ్లాగులో వ్యక్తిగత అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడం వలన అవి చదివిన వారికి, మనలాంటి అభిప్రాయాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారన్న అవగాహన కలుగుతుంది. తద్వారా ఒకే అభిరుచులు కలిగిన వారు స్నేహితులవడం సర్వసాధారణం. తెలుగు చదవడం కోసం ఆన్ లైన్ పత్రికల మీద ఆధారపడిన వాళ్ళకు ఈ బ్లాగులు ఒక వినూత్న కోణాన్ని చూపిస్తాయి. మొదటిసారి ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన వాళ్ళకు ఒక అత్భుత ప్రపంచాన్ని చూస్తున్న భావన రాకమానదు.

వ్యాఖ్యలు

       ఏ పని చేయడానికైనా తగిన ప్రోత్సాహం, సమర్ధవంతంగా చేయగలమన్న ఆత్మవిశ్వాసం కావాలి. మెచ్చుకుంటే పొంగిపోని వాళ్ళు ఉ౦డరేమో...ఈ మెచ్చుకోలు ఔషదంలాగా పనిచేసి వ్రాయడానికి, తద్వారా సృజనాత్మకత పెంచుకోవడానికి తగిన ప్రోత్సాహం ఇస్తుంది. బ్లాగులో వ్రాసిన టపా చదివిన పాఠకులు వ్యాఖ్యల రూపంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఈ వ్యాఖ్యలు కొన్ని మనసారా నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి, మరికొన్ని ఓదార్పునిస్తాయి, ఎక్కువ భాగం ప్రోత్సహిస్తాయి. సామాన్యంగా వ్రాయగలిగిన వారెవరైనా, భాష మీద ఆసక్తి ఉంటే బ్లాగు వ్రాయడం మొదలెట్టాక వ్రాయడంలో నిష్ణాతులవుతారు. అక్కడ లభించే ప్రోత్సాహమటువంటిది. చదివిన వారందరూ వ్యాఖ్య పెట్టాలనేం లేదు, కాని ఎంత మంది బ్లాగు చదువుతున్నారో బ్లాగు నిర్వహించేవారు చూసుకోవడానికి వీలుంటుంది. దానివల్ల తాము వ్రాసిన జాబు ఎక్కువమందికి నచ్చిందో లేదో తెలిసిపోతుంది.

     అంతర్జాలం ఎల్లలు లేని ప్రపంచం కావడం వల్ల ఒక్కొక్కసారి విపరీతమైన వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. విమర్శల ఘాటు మితిమీరుతుంది. అదుపులేని స్వేఛ్ఛ ఎవరికీ మంచిది కాదు. అందుచేత వ్యాఖ్యలని నియంత్రించుకోవడం తప్పనిసరి. వ్యాఖ్యలు రాసేటప్పుడు కూడా సంయమనం పాటించడం మంచిది.

బ్లాగు సంకలినిలు

      కొన్ని వందల సంఖ్యలో వున్న బ్లాగులను ఒకచోట చూపించి, పదుగురికీ తెలియజేసేవే సంకలినులు . ఈ సంకలినుల నిర్వాహకులు, తెలుగు భాషాభిమానంతో వీటిని స్వచ్ఛ౦దంగా నిర్వహించడం అబినందనీయం. ఈ సంకలినుల్లో ప్రధానమైనవి koodali.org, maalika.org, jalleda.com, haaram.com , sankalini.org, telugu.samoohamu.com, blogillu.com. బ్లాగు మొదలుపెట్టినప్పుడు బ్లాగు వివరాలను ఈ సంకలినిలలో నమోదు చేసుకోవాలి. బ్లాగులో ఒక టపా ప్రచురించగానే ఆ సమాచారం సంకలినిలో మొదటి పేజీలో చూపిస్తుంది, అక్కడ ఎప్పటికప్పుడు కొత్త సమాచారం లభ్యమౌతుంది. దాదాపుగా అన్ని సంకలినిలలోనూ బ్లాగులలోని తాజా వ్యాఖ్యలను చూసే సౌలభ్యం ఉంది. దీని వలన పాత టపాలు, చూడలేకపోయిన మంచి టపాల సమాచారం తెలుస్తుంది. కొన్ని సంకలినులు తమ అనుబంధ పత్రికలను కూడా నిర్వహిస్తున్నాయి. సంకలినుల్లో ఆసక్తి ఉన్న అంశాలు చదవడానికి వీలుగా బ్లాగులు, వ్యాఖ్యలు, ఫోటో బ్లాగులు, సినిమాలు, సాంకేతికం, వార్తలు, సాహిత్యం లాంటి విభాగాలు విభజించారు. కొన్ని సంకలినుల్లో ఎక్కువ మంది ఆదరించిన టపాల వివరాలు, ఆసక్తి కరమైన అంశాల వివరాలు కూడా లభ్యమౌతాయి. ఉత్తమ తెలుగు బ్లాగులను 100telugublogs.blogspot.com బ్లాగులో చూడొచ్చు.

    నేటి వేగవంతమైన జీవన సరళిలో చిన్న చిన్న ఆనందాలను, స్పందించే అంశాలను వదిలి ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నాం. బాల్యంలో ఆడిన ఆటలు, చదివిన చందమామ కథలు, అమ్మ పెట్టిన గోరుముద్దల మాధుర్యం అన్నీ అక్షరాల్లో దాగి వేచిచూస్తున్నాయి. మన మూలాలను గుర్తుచేసే ఎన్నో విషయాలు పుస్తకాల్లో భద్రపరచి ఉన్నాయి. అశ్లీలత, అసభ్యం పెచ్చుపెరిగి పోతున్నాయని వగచే ముందు మన సంస్కృతి, సాంప్రదాయాలను మరొక్కసారి మననం చేసుకుందాం. నవతరానికి మన సంస్కృతిని పరిచయం చేసి ఉత్తమ విలువలు కాపాడదాం, దానికి చదవడం ఒక్కటే మార్గం.

         చదవు ఒక యోగం, చదవగలగడం ఒక భోగం, బ్లాగు చదవడం అందరికీ మోదం.


ఆటా జ్ఞాపికను చదవడానికి ఇక్కడ నొక్కండి. 

Wednesday, July 4, 2012

కౌముదిలో నా కవిత 'ప్రతిఫలం'

నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ప్రతిఫలం 


సందె మబ్బులు
చీకటి మాటుకు తప్పుకుంటున్నై!
వేచియున్న కలువపై
వెన్నెల పరచుకుంటోంది!

మదిలో ఏ మూలో...
నిశ్శబ్దపు ఒంటరి రాత్రి
జ్ఞాపకాల దొంతర కదిలిన చప్పుడు!

అప్పుడెప్పుడో...
'నీకేం కావాలని' కదూ అడిగావ్!
ఏం అడగాలో ...
ఎలా చెప్పాలో... తెలియని రోజులు
ఒక్క నవ్వు నవ్వేసి ఊరుకున్నా!

ఆ తరువాతెప్పుడో ...
'ఏం తెచ్చానో చూడమ'న్నావ్,
మూసిన గుప్పెట్లో విరిసిన మల్లెలు!

వెన్నెల విహారాలు...
జాజిపూల పరిమళాలు!
వలపు సయ్యాటలు...
సరసాల సరాగాలు!

మోయలేని భారంతో...
మనసు కృంగిన రోజు
కొండంత ఓదార్పైనావు!

అనుభవాలు
పాఠాలయ్యాయి!
జీవితం గోదారి పాయలా
నిండుగా సాగిపోతుంది!

అప్పటి నీ ప్రశ్నకు,
ఇప్పటి నా సమాధానం
అదే చిరునవ్వు!

కాలంతో పాటు కలసిపోనీక
నువ్వు కాపాడిన
'నా నవ్వు'కు
ప్రతిఫలంగా నీకు నేనేమివ్వగలను?