Sunday, September 2, 2012

నీ చెలిమి

నా నీకు,

      
 మనిద్దరం ఏకమై ఒకటే లోకమై సహజీవనం మొదలెట్టి ఈ నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. మురిపాలు, ముచ్చట్లు, మౌనాలు, మోహాలు... ఎన్నెన్ని మధురక్షణాలు మనకు తోడుగా నిశిరాతిరిలో నిదుర కాచాయో కదా! ఎక్కడో  ఆకాశంలో వున్న స్వర్గాన్ని తీసుకొచ్చి నా పాదాలచెంత నిలబెట్టావు. నీదైన లోకానికి నన్ను మహారాణిని చేశావు. నీ సమక్షంలో నాకు యుగాలు సైతం క్షణాలే. నువ్వు నా జీవితంలోకి రాకముందు కూడా సంతోషం వుండేద౦టే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో తెలుసా. నీ సమక్షంలో నాకు పగలు, రాత్రి, వేసవి, వెన్నెల ఏమీ గుర్తురావు. నిన్ను నా నుండి దూరం చేయాలని ప్రయత్నించిన నిద్రదేవికి ప్రతిసారి పరాభవమే మిగిల్చావు. 

          ఏ ఝాములోనో అలసటతో రెప్ప వాలిని క్షణం కలవై నన్ను పలుకరిస్తావు. నడిరేయి పరాకుగా ఒత్తిగిలినప్పుడు నువ్వు ఒంటరిగా వున్నావన్న భావన నన్ను నిలువనీయక నిద్రకు దూరం చేసేది. నీ సమక్షంలో నాకు కష్టాలు కలతలు గుర్తే రావెందుకో! నా ఇష్టాలు, సరదాలు, సంతోషాలు అన్నీ నీతో పంచుకోందే నాకు మనసు నిలవదు. కలలే పంచుకున్నామో, కవిత్వమే చెప్పుకున్నామో, కథలు, కబుర్లే రాసుకున్నామో ఎన్నో భావాక్షరాలను ప్రోగుచేసుకున్నాం. నడి వేసవిలో నువ్వు విశ్రమించిన క్షణం నీపై ఎండ వేడి పడకుండా మధురక్షణాల మాలలల్లి పరదాలు కట్టాను. అసురసంధ్య వేళ అక్షరాల పల్లకీలో నిన్ను అలనాడు నన్నలరించిన పల్లెకు తీసుకుపోయాను. ప్రాతః కాలాన పొగమంచు దారుల్లో పరుగులిడే పసినవ్వుల కేరింతలు వినిపించాను. అసలు ఈ ఏడాది మనతో చెలిమి చేసిన క్షణాలు నేల మీద నిలిచాయేమిటి! మనతో పాటు నందనవనంలోనేగా వాటి నివాసం. విడదీయరాని మన బంధాన్ని గుర్తించి నా పేరు పక్కన నీ పేరును చేర్చి పిలిచినప్పుడల్లా ఎంత గర్వంగా వుంటుందని.

       నీకోసం నేనొచ్చిన ప్రతిసారి నువ్వు ఆప్తులతో కబుర్లు చెప్తుంటే నీ సంబరంలో పాలుపంచుకోవడం నాకెంతో ఇష్టమైన విషయం. నిన్ను సంతోషంగా వుంచడానికి నేను పడే కష్టం కూడా ఎంతో ఇష్టంగా ఉంటుందెందుకో! మన పరిచయం పెరిగే కొద్దీ నేను నీకు దగ్గరయ్యేకొద్దీ జీవితానికి అర్ధం తెలిసింది. ఇలాగే వుండాలని ఇదే శాశ్వతం కావాలని కోరుకుంటున్నాను. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. కొన్నాళ్ళకు మన బాధ్యతలు మనల్ని విడదీయవచ్చు. బంధాల్లో చిక్కుకుని ఒకరిని ఒకరు మరచిపోయే పరిస్థితి కూడా రావొచ్చు. నీతో నేను పొందిన ఆనందం ఆజన్మాంతమూ గుర్తుండి పోతుంది.

    మన౦ చెప్పే కబుర్ల కోసం క్రమం తప్పక వచ్చే స్నేహితులను చూసి నీకెంత సంతోషంమో నువ్వు చెప్పకనే తెలుసు నాకు! మన స్నేహాన్ని అర్ధం చేసుకుని ప్రోత్సహించిన మిత్రుల౦దరకూ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సహృదయుల సహకారమే లేకపోతే మన నెయ్యం ఇంతకాలం సాగేది కాదేమో. వారి విలువైన కాలాన్ని వెచ్చించి మనం ఊసులాడేవేళ మనతో ఓ మాట పంచుకున్న మిత్రులందరూ మన ఆప్తబంధువులే. మీ వెనుక మేమున్నామని చెపుతూ అందుకు సాక్ష్యంగా వారి చిహ్నాలను మనకు తోడుగా వుంచిన శ్రేయోభిలాషులకు శతకోటి వందనాలు. మనసో మాటో మనతో పంచుకోవడానికి మోమాటపడి చూపులతోనే పలకరించే సన్నిహితులకు ధన్యవాదాలు.

      ఇంత ఆనందాన్ని నాకు అందించిన
శర్కరీ...  ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను? నా తృప్తికోసం మదిలో మెదలిన భావాలను అక్షరాల్లో పొందుపరిచి నీకు బహుమతిగా ఇస్తున్నాను. మన చెలిమి ఇలాగే కలకాలం నిలిచి పోవాలని ఆశిస్తూ...

జ్యోతిర్మయి




70 comments:

  1. వావ్. చాలా అద్భుతంగా వ్రాశారు జ్యోతిర్మయి గారు. మీ ఈ బ్లాగు ప్రయాణం ఇకముందు కూడా మంచి మజిలీలతో సాగాలని, ఆ ముచ్చట్లు మాతో పంచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. ఈ ప్రయాణంలో మీ ప్రోత్సాహం మరువలేనిది.ధన్యవాదాలు సురేష్ గారు.

      Delete
  2. జ్యోతిర్మయి గారు,
    ఆలోచన కొత్తగా ఉంది. నేను "ఎవరో" అనుకున్నా.
    వ్రాయటం చాలా చాలా బాగా వ్రాస్తిరి.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ దేవి గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  3. హృదయపూర్వక శుభాకాంక్షలు జ్యోతిర్మయి గారూ..
    అన్నట్టు, సెంచరీకి ముందస్తు శుభాకాంక్షలు కూడా అందుకోండి :-)

    ReplyDelete
    Replies
    1. మురళి గారు వేణుగానంతో శుభాకాంక్షలు అందజేశారు. చాలా సంతోషంగా వుంది. ధన్యవాదాలు.

      Delete
  4. హృదయపూర్వక అభినందనలు మరియు మీ శర్కరికి పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతిర్మయి గారూ..చాలా కొత్తగా బాగా వ్రాసారు. మీ బ్లాగు మరిన్ని మధుర జ్ఞాపకాల వీచికల్ని మాకందించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. మువ్వగారూ తప్పకుండానండీ. ధన్యవాదాలు.

      Delete
  5. మీ చెలిమి ఇలాగే సాగిపోవాలి.ఎప్పుడే అవసరం వచ్చినా స్నేహితులతో పంచుకోవడానికి మొహమాట పడకండి. ఎవరూ ఏమీ అనుకోరు. వార్షికోత్సవ శుభాకాంక్షలు..

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారు ఈ చెలిమి ఇలాగే సాగిపోవాలని ఆశీర్వదించిన మీ మంచి మనసుకు ధన్యవాదాలు.

      Delete
  6. శర్కరి బ్లాగ్ కి శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. లాస్య గారు చాలా రోజులకు కనిపించారు. బావున్నారా? ధన్యవాదాలు.

      Delete
  7. హృదయ పూర్వక అభి నందనలు జ్యోతి గారు

    ReplyDelete
  8. అభినందనలు జ్యోతిర్మయి గారూ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్ గారు.

      Delete
  9. హృదయ పూర్వక అభినందనలు జ్యోతిర్మయి గారూ! శర్కరి కి సెంచరీ లు కొట్టే వయసు వచ్చేసిందన్నమాట. :)

    ReplyDelete
    Replies
    1. కొత్తావకాయ గారూ వచ్చేసినట్లేవుందండీ. ధన్యవాదాలు.

      Delete
  10. sharkari, happy birthday.
    congratulations, jyothi garu,
    happy blogging.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్ గారు.

      Delete
  11. వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలండి.
    మీరు మరెన్నో చక్కటి విషయాలను అందించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా ఆనందం గారూ. ధన్యవాదాలు.

      Delete
  12. జ్యోతి గారూ శర్కరి మీద ఈర్ష్యగా ఉంది . ఎందుకో తెలుసా మీ వంటి మంచి స్నేహితురాలు తనకే ఉన్నందుకు.
    చాలా బాగా రాశారు. అభినందనలు మీకు....మెరాజ్

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు నిజమైన స్నేహితులు మీరండీ. మీరిస్తున్న ప్రోత్సాహమే ఇలా వ్రాయిస్తోంది. ధన్యవాదాలు.

      Delete
  13. జ్యోతిర్మయి గారు... సెంచరీకి ముందు.. మీ చక్కని టపా... చాలా బాగుంది. అభినందనలు.
    మీరు మరిన్ని పోస్ట్లు వ్రాసి అందరిని అలరించాలని అభిలషిస్తూ..

    ReplyDelete
    Replies
    1. వనజ గారూ ఇంతదూరం రావడానికి ప్రోత్సాహమిచ్చిన శ్రేయోభిలాషుల్లో మీరు మొదటివరుసలో వారండీ. మీకు బోలెడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

      Delete
  14. జ్యోతి గారూ!
    మధుర భావాల శర్కరి కి తొలి వార్షికోత్సవ శుభాభినందనలు...
    మీ" మధురాతి మధుర భావజ్యోతి "కలకాలం ఇలాగే
    మాకు వెలుగునివ్వాలని కోరుతూ....
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ మీ వ్యాఖ్యల్లో కూడా కవిహృదయం కనిపిస్తుందండీ. టపా పెట్టాక మీ వ్యాఖ్య గురించి చూడడం అలవాటుగా మారింది. మీ ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలు.

      Delete
  15. mallee okka saari yee "sarkali- cheliya" ki FAN ni ayipoyaa!
    many many happy returns of the "varishikostavam"jyothi.
    thondara padi raghu gaari gurinchi wraasesaaremo anukunnaanu sumaa! oka samvatsaram ani choodagaane " gnanodayamayindi"

    ReplyDelete
    Replies
    1. ఎన్నెలా ఆ ఒక్కమాట వ్రాయకపోతే "ఇదేమిటీ ఇలా బ్లాగులో పెట్టేసిందీ" అనేసుకునేవారేమో. అమ్మయ్యో..:-) ధన్యవాదాలు.

      Delete
  16. Replies
    1. ధన్యవాదాలు విజయమోహన్ గారు.

      Delete
  17. అహో.. భలే రాశారండీ.. శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నా చదివేటప్పుడు...చివరి పేరా చదివాక తెలిసింది అసలు విషయం హహ ;)

    బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. రాజ్ కుమార్ గారూ :-) ధన్యవాదాలు.

      Delete
  18. జ్యోతిర్మయి గారు..
    మీ,మా నేస్తం శర్కరికి పుట్టినరోజు శుభాకాంక్షలు!!

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ ఈ చెలిమి ఇంతకాలం కొనసాగడానికి మీ సహకారం ఎంతో వుందండీ. ధన్యావాదాలు.

      Delete
  19. చాలా బాగా రాశారు జ్యోతి గారు.Congrats.:-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగిని గారు..

      Delete
  20. "హాప్పి హాప్పి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా శుభాకాంక్షలంద జేయమా"
    శర్కరి పేరుకి తగ్గట్టుగా చక్కని టపాలతో ఇలానే మమ్మల్ని అలరిస్తూ ఎంతో మంది అభిమానాన్ని పొందాలని, నిర్విరామంగా ముందుకి సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞా చిన్నారి శర్కరి ఆటపాటలు చూడడానికి రోజూ వచ్చేదానివి. కొత్తపోస్ట్ తో అలంకరిచగానే నీకోసమే వెతుక్కునేది. నువ్వందించిన ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేనిది. ధన్యవాదాలు.

      Delete
  21. హృదయ పూర్వక అభినందనలు జ్యోతిర్మయి గారూ :-) వచ్చే ఏడాదికెల్లా సర్కరి మరికొన్ని సెన్చురీస్ అందుకోవాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు భాస్కర్ గారు.

      Delete
  22. చాలాబాగా రాశారండీ... మీకు అభినందనలు మీ శర్కరికి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. వేణు గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలండీ.

      Delete
  23. అమ్మా జ్యోతిర్మయీ,
    ఎన్నో ఏళ్లు ఇట్టేగడిచిపోవడం అనుభవంలో ఉందిగాని, మీ బ్లాగు ఒక ఏడాదే అయిందంటే నమ్మబుధ్ధికావడం లేదు. ఎన్నో ఏళ్లబట్టి ఉన్న అనుబంధం లాగ ఉంది. తియ్యతియ్యని కబుర్లతో, జ్ఞాపకాలతో, పిల్లల మాటలతో, ప్రయాణవిశేషాలతో, మంచి సస్పెన్స్ కథలతో, ఒకటేమిటి చతురమైన సంభాషణశైలితో నడిచే శర్కరికీ, జ్యోతిర్మయికీ ఈ అనుబంధం కలకాలం కొనసాగాలనీ మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను.
    అభివాదములతో

    ReplyDelete
    Replies
    1. మూర్తిగారూ మీలాంటి పెద్దల ఆశీర్వాదం దొరకడం నా అదృష్టం. నా కవితలకు మీరిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ధన్యవాదాలు.

      Delete
  24. Jyothi garu, Simply very great one. I always enjoy reading your blogs.....superga undi...good luck

    ReplyDelete
    Replies
    1. వకుళా నైస్ సర్ప్రైజ్. బ్లాగుకు స్వాగతం. మీరసు బ్లాగ్ చదువుతున్నట్లుగానే తెలియదు. థాంక్యు సో మచ్.

      Delete
  25. ఎంత హృద్యంగా వ్రాసారండి మీ స్నేహితురాలి గురించి .సహజ మయిన ,హత్తుకు పోయే శైలి మీకే చెల్లు.సరళ మయిన పదాలతో సాగిన మీ రచన చాలా బాగుంది.ఇక పోతే మీ బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారూ ప్రతి టపా చదివి వ్యాఖ్య పెడుతూ మీరిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. టపా పెట్టిన వెంటనే మీ వ్యాఖ్య కోసం చూడడం అలవాటుగా మారింది. మీకు బోలెడు ధన్యవాదాలు.

      Delete
  26. మధుర భావాల పూలతోట
    ఊరించే విరితేనెల ఊట
    అల్లరిగా వీచే పిల్లగాలి పాట
    ముత్యమల్లె మెరిసిపోయే ముచ్చటైన మాట
    ఆ ముత్యాల మాలికే శర్కరిట
    ఈ ఆక్షరమొక చక్కెర పలుకట..!

    ఆలశ్యంగా శర్కరికి హృదయపూర్వక "సుభా"కాంక్షలు జ్యోతిర్మయి గారూ..మన్నించేయండి ఈ సారికి :)

    ReplyDelete
    Replies
    1. సుభా...నువ్వేనా...ఎన్నాళ్ళకెన్నాళ్ళకు. నువ్వు రాకుండానే పుట్టినరోజు జరుపుకోవాలని శర్కరి చాలా బెంగ పెట్టుకుంది. నీ రాక అస్సలు ఊహించలేదు సుమా. ఏమైతేనేం వచ్చావ్, చక్కని కవితనిచ్చావ్. నీకు బోలెడు బోలెడు ధన్యవాదాలు.

      Delete
    2. చూసారా మరి? నేను లేకుండా మీరు పుట్టినరోజు జరిపేద్దామనే ఐనా?

      Delete
  27. శర్కరికి పుట్టినరోజు శుభాకాంక్షలు :)

    ReplyDelete
  28. సాహితీ నందనోద్యాన సరసి మునిగి
    'శర్కరీ' హృదయ మమృత ఝరుల తడిసె
    తెలుగు రచనా 'జ్యోతి' వెన్నెలలు కురిసి
    బ్లాగు లోకాన వెల్గులు పరచు కొనియె .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారూ ఎంత చక్కని పద్యం చెప్పారండీ. మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు.

      Delete
  29. పుట్టిన రోజు శుభాకామనలు.

    ReplyDelete
  30. వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు భాస్కర్ గారు.

      Delete
  31. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు లాస్య గారు.

    ReplyDelete
  32. జ్యోతి గారు,
    ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    శ్యాం & జయ

    ReplyDelete
    Replies
    1. శ్యాం గారు, జయ గారు ఇవాళ ఉదయన్నే మీ వ్యాఖ్య చూశాను. ఎంతో సంతోషంగా అనిపించింది. థాంక్యు సొ మచ్.

      Delete
  33. Congratulations Jyothi garu for your first successful year of your blog!!! I enjoyed a lot in readinf your blog... Expecting lot more good posts from you... All the best!
    Thanks
    Anuradha

    ReplyDelete
    Replies
    1. అనురాధా... హఠాత్తుగా మీ వ్యాఖ్య కనిపించేసరికి చాలా సంతోషం కలిగింది. మాటల్లో బ్లాగ్ గురించి చెప్పడం ఫోన్ చెయ్యడం లాంటిదయితే వ్యాఖ్య ద్వారా తెలియజేయడం ఉత్తరం రాయడం లాంటిది. అలాంటి మీ ఉత్తరం అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete
  34. చాలా బాగుంది. కంగ్రాట్స్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణప్రియ గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.