నాకు దూరప్రయాణాలంటే చాలా ఇష్టం. నేను తొలిసారిగా పదిగంటలు ప్రయాణం చేసింది ఆరెగాన్ లోని 'క్రేటర్ లేక్' కు. ఆ ప్రయాణం మరీ కొలంబియా నది ఒడ్డునే సాగిందేమో మరింత
నచ్చేసింది. ఆ తరువాత చాలా సంవత్సరాలకు 'డెల్లాస్' వెళ్తూ మిసిసిపీని దాటడం మరిచిపోలేని అనుభూతి. తరువాత 'ఫ్లోరిడా'. ఇదిగో మళ్ళీ ఇంత కాలానికి 'షికాగో' వెళ్ళే అవకాశం
దొరికింది.
చిరచిరలాడే ఎండ వేడికి చెట్టూ, చేమా విసురుకుంటూ మాగన్నుగా కునుకు తీస్తున్న సమయంలో ఓ మూడు సూట్ కేస్ లు మెల్లగా నా వెనుక సర్దుకున్నాయి. రెండు సీట్ల మధ్యలో రంగు రంగుల
బాగ్ ఒకటి గర్వంగా నిటారుగా నిలబడింది. ఏమున్నాయో ఇంత మిడిసిపడుతోందని తొంగి
చూశాను. నారింజరంగు బేబీ కారేట్స్, నిగనిగలాడే ద్రాక్ష పండ్లూ... మరి హాట్ చీటోస్
పాకెట్ ఏదీ? ప్రయాణం అనగానే చిట్టితల్లి దాన్ని
తేచ్చేసుకుంటుందే. బహుశా ఏ గేస్ స్టేషన్లోనో కొంటుంది కాబోలు! బంధు మిత్ర సమేతంగా బిలబిల్లాడుతూ వాటర్ బాటిల్స్ అన్నీ కప్ హోల్డర్స్ లో చేరిపోయాయి.
"త్వరగా ఊరు దాటాలి లేకపోతే ఆ సెవెంటీ సెవెన్ మీద
విపరీతమైన ట్రాఫిక్" అంటూ రఘు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. అనుకునట్లుగానే
ఆరుగంటలయ్యేటప్పటికల్లా ఊరికి వందమైళ్ళ దూరంలో ఉన్నాం. ఇక్కడంతా చుట్టూ నాలాంటి
వాళ్ళే మా ఊర్లో ఇలా లేరని కాదు. ఎంతైనా కొత్తవాళ్ళతో కలసి చేసే ప్రయాణమే
వేరు. జ్యోతి, రైలు ప్రయాణం
గురించి ఇలానే చెప్తూంటుంది. ఎవరెవరో కొత్తవాళ్ళు కలుస్తూంటారట...బోలెడు కబుర్లు
చెప్పుకుంటారట...గమ్యం రాగానే ఎవరిదారిన వాళ్ళు దిగిపోతారట. ఇప్పుడు కూడా అలానే
నాలాంటి వారు రోడ్డు మీద అక్కడక్కడా కనిపిస్తున్నారు. కొందరు నింపాదిగా వెళ్తుంటే, మరి కొందరు ప్రపంచం
తల్లకిందులై పోతుందన్నట్లు అడ్డం వచ్చినవారిని దాటుకుంటూ, పక్కకు తొలగని
వారిని విసుక్కుంటూ రయ్యిన ఒకటే పరుగులు. ఎక్కడన్నా కాప్ కారు కనపడగానే
ఉలిక్కిపడి ఏమీ తెలీని వాళ్ళలా అతి మెల్లగా వెళ్ళడం. కొందరు కొత్త ముస్తాబులతో
కళకళలాడుతుంటే మరికొందరు మట్టికొట్టుకుపోయి మురికిగా ఉన్నారు. నిన్న సాయంత్రమే పండు, వాళ్ళనాన్న, నన్ను షెల్
దగ్గరకు తీసుకెళ్ళారు. ఆక్కడి ప్లాస్టిక్ కుంచెలు చక్కలిగిలి పెడ్తూ శుభ్రంగా స్నానం చేయించాయి.
ఇంటికి రాగానే, అందంగా ముద్దొస్తున్నానంది చిట్టితల్లి.
ఆసక్తిగా చూస్తున్న చెట్లను పలకరిస్తూ, రోడ్డు పక్కన పచ్చరంగులో మెరిసిపోతున్న సైన్ బోర్డ్ వీడ్కోలు చెప్తూ వెళ్తున్నాం. ఓ గంట గడిచేప్పటికి బుజ్జిపండు కాఫీ కావాలన్నాడు. రెండేళ్ళ
క్రితం వరకు ఫ్రాపుచినో అడిగేవాడు. ఇంతలో ఎంత పెద్దవాడయ్యాడు! రెస్ట్ ఏరియా దగ్గర
ఆగాం. అదంత పెద్దదేం కాదు కాని చుట్టూ చెట్లతో ముచ్చటగా పర్ణశాలలా ఉంది. నా
ఎదురుగా వున్న మేపల్ చెట్టు మీద గూడులోంచి రెండు బుల్లిపిట్టలు తొంగి తొంగి
చూస్తున్నాయి. ఆకాశంలో పక్షులు బారుగా రివ్వున ఎగురుతున్నాయి. అవి కనిపించినంతవరకూ
చూడడం జ్యోతికి చాలా ఇష్టం. తన అలవాటే నాకూ వచ్చింది. మరి తొమ్మిదేళ్ళ సావాసం కదూ!
కాఫీ ఘుమఘుమలతో ఈ లోకం లోకి వచ్చాను. అందరూ సర్దుకుని కూర్చున్నాక బయలుదేరాం.
నారింజ రంగు కిరణాలు మేఘాలకు రంగులద్దడాన్ని చూస్తూ ప్రయాణించడం భలే ఉంటుంది. ఓ
గంట పండు, చిట్టితల్లి సెల్
ఫోన్ లో ఏమిటో ఆడుకున్నారు. ఎప్పట్లా గేమ్ క్యూబ్ తెచ్చుకోలేదేమిటో?
నాలుగు గంటల తరువాత "డిన్నర్ కి ఎక్కడాపను?" అని నాన్న
అడగ్గాన్నే పండు "సబ్ వే" అని అరిచాడు. అదేమిటో ప్రయాణాలప్పుడు లంచ్, డిన్నర్ అనగానే
పండు సబ్ వే తప్ప మరోటి అడగడు. హాలోపినో, చీజ్, చిపోట్లే సాస్ కలిసిన వీట్ బ్రెడ్ వాసనంటే
నాక్కూడా చాలా ఇష్టం. హెడ్ లైట్లు వెలిగిందాకా చూసుకోనేలేదు బాగా చీకటి
పడిపోయిందే! వెస్ట్ వెర్జీనియాలో ఉన్నట్లున్నాం చుట్టూ కొండలే. ఆఫీస్, స్కూలు కబుర్లతో
ప్రయాణం హుషారుగా సాగుతోంది. అందులో చిట్టితల్లి కబుర్లు మొదలెట్టిందంటే ఎవరైనా
మంత్ర ముగ్దులై వినవలసిందే. కాసేపటికి నాన్న పిల్లలిద్దరినీ మెల్లగా ఆటలోకి
దించాడు. ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్ధాలు చెప్పడం. పిల్లలిద్దరికీ తెలుగులో అన్ని
పదాలు తెలుసని నాకు అప్పటిదాకా తెలీనే తెలీదు.
చీకటి చిక్కబడింది. పిల్లలిద్దరూ మధ్య సీట్లు మడిచేసి
వాటిమీద కాళ్ళు చాపుకుని చివర సీట్లో దుప్పట్లు కప్పుకుని నిద్రపోయారు. కొండ మీద
ప్రయాణం పక్కనే ఎత్తైన చెట్ల వెనుగ్గా పెద్ద లోయ. ఆకాశంలో ఎక్కడా ఒక్క చుక్క
కనపడడంలేదు. రాత్రి పదకొండు
దాటిందేమో రోడ్డుమీద పెద్దగా సంచరంలేదు. అప్పుడు మెరిసింది ఓ మెరుపు... చెట్ల
వెనగ్గా దూరానున్న కొండమీద. ఆకాశం నుంచి భూమి వరకూ తళుక్కున మెరిసి మాయమైంది, వెనుకే పెద్ద
ఉరుము. చిన్నగా చినుకులు మొదలయ్యాయి. “ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది” అంటూ సిడి లోంచి
మధురమైన పాట వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న చల్లగాలి కొమ్మల చుట్టూ తిరుగుతూ
గిలిగింతలు పెడుతోంది. ఆకాశాన్ని అందంగా కవ్విస్తూ జలతారు మెరుపులు.
"ఇక్కడే ఆగిపోయి అలాగే చూస్తూ ఉండాలనిపిస్తోంది" అంది జ్యోతి. ఆ
మైమరుపులో తను రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేక పోతోందనిపించింది.
రాత్రి పన్నెండయ్యుంటుందేమో! అనుకున్నదంతా అయింది. చిన్న
చినుకులు కాస్తా జడివానగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. కుండలతో
కుమ్మరించినట్లుగా వర్షం పడడం మొదలయ్యింది. పక్కన వెళ్తున్న పెద్ద ట్రక్కు చక్రాల
క్రింద చిద్రమైన నీటి బిందువులు నాకళ్ళకు అడ్డం పడుతున్నాయి. రఘు పిల్లల్ని లేపి
సీట్ బెల్టు పెట్టుకోమని హెచ్చరించాడు. రెండో వైపున లోయ ఎంత దూరంలో ఉందో కనిపించడం
లేదు. "సెడార్ పాయింట్
చేరడానికి ఇంకా మూడు గంటలు పడుతుంది. మనం ముందే ఎక్కడన్నా ఆగవలసింది” అని రఘు అనగానే నాకు
వొళ్ళు జలదరించింది. భయం నాగురించి కాదు నా ఒడిలో ఆడుకుని పెరిగిన పిల్లలు, బడికి కాని, మరెక్కడికైనా కాని
నేను తీసుకు వెళితేనే తప్ప వెళ్ళని పిల్లలు ప్రమాదంలో ఉన్నారని. అంతవరకూ కారులో
వినిపించిన కబుర్లు ఆగిపోయాయి. జోరున కురుస్తున్నవర్షం చప్పుడు తప్ప అంతా
నిశ్శబ్దం.....
Nice. You maintained good suspense.
ReplyDeleteThank you Narasimha Rao garu.
Deleteఅతి ముఖ్యమైన నేస్తం ద్వారా కథ చెప్పించడం బాగుందండీ... టెన్షన్ పెడుతూ బ్రేక్ వేశారు.. అది ఎక్కువయ్యే లోపు త్వరగా రెండో పార్ట్ కూడా వ్రాసేయండి.
ReplyDeleteమా కుటుంబంలో ఒక భాగమైపోయిందది. ఎప్పటికీ గుర్తుండేవిధంగా మా నేస్తంతోనే కథ చెప్పిస్తే అన్న ఆలోచన వచ్చిన మరుక్షణం ఇది రూపుదిద్దుకుంది. థాంక్యు వేణు గారు.
DeleteIlaa aapadam tagunaa???
ReplyDeleteరెండో భాగం రాసేసాను చూడండి ఇందిరా గారు. థాంక్యు.
Deleteమా సాహస యాత్ర గుర్తు చేసారండీ...డిసెంబర్ 30 రాత్రి బెంటన్ విల్ నుంచి, డల్లాస్ కి డ్రైవ్ చేసాం. ఏమీ కనపడనివ్వని పెద్ద వర్షం.. మాతో పాటూ తెల్లారేదాకా వచ్చింది. మేమిద్దరం పైకి అప్పుడు చెప్పుకోకపోయినా ఇదే చివరి రాత్రి అనుకున్నాం. ఇప్పుడనిపిస్తోంది మా నేస్తం కూడా అదే అనుకుని వుంటుంది. త్వరగా తర్వాతి భాగం రాసెయ్యండి.
ReplyDeleteసాధారణంగా రాత్రి ప్రయాణాలు పెట్టుకోమండి. ఆ వేళ అనుకోకుండా ఆలస్యం అయింది. ఆ ఫలితమే ఇది. థాంక్యు స్ఫురిత గారు.
Deleteఇంత టెన్షన్ లో బ్రేక్ వేస్తె ఎలాగ ? తరువాత కధ తొందరగా రాయండి.
ReplyDeleteమేము కూడా మా కారు గురించి అనుకుంటూ ఉంటాము .. మా పిల్లల కంటే అదే పెద్దది అని.
మా పాత కారు అమ్మేప్పుడు అమ్మాయిని అత్తగారింటికి పంపే సీన్ గుర్తొచ్చింది. అందులోనే పండును హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన కారది. థాంక్యు రాధ.
Deletegood
ReplyDeleteThank you Subramanyam garu.
Delete