Wednesday, December 26, 2018

ముగ్గులు

ఎనిమిదిన్నర అవుతుండగా వీధిలో సందడి మొదలయ్యింది. ముగ్గు గిన్నె పట్టుకుని నేను అక్కా బయటకు వచ్చాం. అప్పటికే పక్కింటి చిట్టెక్క చుక్కలు పెడుతూ ఉంది.
"ఏం జోతా ముగ్గెయ్యడానికి వచ్చినారా?" అడిగింది పక్కింటి చిట్టెక్క.
"లేదుమే ముంజెల్దిండానికి వచ్చినాం, మొహం జూడు మోహమా. ఎన్మిదిగంట్లకు ఎందుకొస్తాంమే" పరాచికాలాడింది అక్క.
నవ్వేసింది చిట్టెక్క. "పెద్దత్తోళ్ళు గోడొచ్చినారా?"
"ఆ వచ్చుండారు." అని అక్క చెప్తుండగానే అమ్మ, పిన్ని బయటకు వచ్చారు. "కా చుక్కలు బెట్టవా? 25 చుక్కలు 5 వరసలు బేసిచుక్క 5 కి ఆపాల." అమ్మ చేతికి ముగ్గు గిన్నె ఇచ్చి చెప్పింది అక్క. అమ్మ చుక్కలు పెడితే సరిగ్గా గీత గీసినట్లు ఉంటుందని ఆ పని అమ్మకే అప్పగిస్తారు.

"ఏం, చిట్టెమ్మా బావుండాా? మీ అమ్మేదా?" అడిగింది అమ్మ.
"నాయనకన్నం పెడతా ఉందత్తా. అబ్బయ్య ఏడా? మావ గూడ వచ్చినాడా?"
"ఆ అందరం వచ్చినాం. అబ్బయ్య నిదరబోతా ఉండాడు. మీ మావ, చినమావ లీలామహల్ లో ఇంగ్లీషు సినిమాకు బొయినారు."
చిట్టెక్కతో మాట్లాడతూనే చకచకా చుక్కలు పెట్టేసింది అమ్మ. పిన్ని ముగ్గువెయ్యడం సగంలో ఉండగానే నేనూ, అక్కా ముగ్గులో రంగులు వెయ్యడం మొదలుపెట్టేశాం. చూస్తుండగానే చిలుకలు జాంపళ్ళతో సహా వాకిట్లో వాలిపోయాయి.

ముగ్గు చుట్టూదిరిగి ముచ్చటగా చూస్తున్న మాతో "మాయ్, తొమ్మిదింకాలౌతావుంది. రాండి లోపలకి." పిలిచింది అమ్మమ్మ.
"మీరు బోయి పొణుకోండిమా చుట్టుకర్ర గీసొస్తా౦." చెప్పింది పిన్ని.
"ముగ్గిన్నె అమ్మకీ నీర్జా తొందరగా గీస్తదా" అంది అమ్మ.
"చాన్నాళ్ళయిందే ముగ్గేశా" అంటూనే ఆ ముగ్గు గిన్నె తీసుకుని అమ్మమ్మ ఐదువేళ్ళు ఇలా కదిలించిందో లేదో వరుసగా నాలుగు గీతలు పడ్డాయి నేలమీద. ఐదే ఐదు నిముషాల్లో చుట్టూ దడిగట్టి ద్వారాలు పెట్టినట్టు చుట్టుకర్ర గీసేసింది.
"నీర్జా, ఆ వీధి మొగదాల ఇంట్లో సుబ్బమ్మత్త నడిగితే పశులకాడి పిల్లోడితో ఆవు పేడ పంపుండాది. రేపెకొంజావునే గొబ్బెమ్మలు జేసి, వాటిమింద మన సందులో గుమ్మడిపువ్వులు నాలుగు బెట్టండి." చెప్పింది అమ్మమ్మ.

"అట్నే మా. మీరు లోపలకు పాండి. ఐద్నిమిషాల్ అట్టా బోయి ముగ్గులు చూసోస్తాం. అంటూ భుజం చుట్టూ కొంగు కప్పుకుంది పిన్ని. ముగ్గేసేటప్పుడు తెలియలేదు కాని మంచు కురవడం మొదలై చలిగా ఉంది. ప్రతి ఇంటి ముందూ ఇద్దరూ ముగ్గురూ ఆడవాళ్ళు ముగ్గు వేస్తూనో, చూస్తూనే వీధంతా సందడిగా ఉంది. ముగ్గేసేవాళ్ళను పలకరిస్తూ వీధంతా చుట్టి వచ్చాం.

* * * * * * *

ఉదయాన్నే తమ్ముడు లేచి ముగ్గు చూస్తూ వాకిలి దగ్గర నిలబడ్డాడు.
"ఏం సుధాకరా, ముగ్గు బావుండాదా?" అడిగింది పిన్ని.
తల ఊపుతూ "ముగ్గు చుట్టూ ఎందుకు పిన్నీ గీతలు గియ్యడం" అడిగాడు తమ్ముడు.
"గీయకయకపోతే మీ చిలకలెగ్గిరి పోవా?"ఎప్పుడొచ్చిందో వెనకింటి గౌరమ్మత్త ముగ్గు వెనకాల నిలబడి నవ్వుతూ అంది.
"మరి మూడు పక్కలా ఆ దార్లేందుకు?" అడిగాను.
"ఈదిలో పిల్లి తిరగతా ఉండాదబయా. పిల్లొస్తే చిలకలు పారిపోయ్యేదానికి" చెప్పింది అత్త.


Saturday, December 22, 2018

పండగనెల

పండగనెల పెట్టి వారమౌతోంది. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. రంగుల ముగ్గులు, మెలికల ముగ్గులు, నెమళ్ళు, చిలకలు, తామరపూల ముగ్గులు.. ఒకటేమిటి ప్రకృతినంతా పటం గట్టి ముచ్చటగా ఇళ్ళ ముందు అలంకరించేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళింట్లో అమ్మమ్మతో సహా అందరిదీ అందె వేసిన చెయ్యే. అమ్మమ్మ వాళ్ళింట్లో వారిని పరిచయం చేసుకోవాలంటే ఇలా వెళ్ళండి. వాకిట్లో ముగ్గులు వంటింట్లో దోశలు 

*            *            *           *            *           *          *          *

ఉర్లగడ్డ తాళింపు, మునగాకు పెసర పప్పు కూర, వంకాయ పులుసుతో సుష్టుగా భోంచేసి మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యగదిలోకి చేరాం నేనూ, పిన్ని, అక్క.

"ఏంకా ఈ రోజేం ముగ్గేద్దామా?" ముగ్గుల పుస్తకం పేజీలు  తిప్పుతూ అడిగింది అక్క.
"మొన్న ఆదివారం పేపర్లో వేసిళ్ళా...తామర పూల ముగ్గు. అదేద్దామా?" అడిగింది పిన్ని.
"వద్దులేకా. నాల్రోల నాడు సెట్టిగారి వందన అట్టాంటి ముగ్గే ఏసిళ్ళా" అక్క గుర్తుజేసింది.
"అవునుమే. అయితే బళ్ళేదులే. ఈ చిలకల ముగ్గు జూడా" ఓ పేజీ చూపించింది పిన్ని.
"బావుందికా. రంగులన్నీ ఉండాయా?చిలకపచ్చ, ఎరుపు రంగు ముక్కుకి, లేతాకుపచ్చ జామకాయలకు."
"పాపా ఆ కొట్టుగదిలో రంగుల డబ్బాల్లో ఈ రంగులుండాయేమో జూసిరా? చెప్పింది పిన్ని.
కొట్టుగదిలోకి వెళ్లాను. పాత ఇనప డబ్బాల్లో రంగులు పోసి ఉన్నాయి. ఎరుపు, బులుగు, ఆకుపచ్చ, చిలకపచ్చ, పసుపు ఇలా చాలా రంగులు ఉన్నాయి. అందులో అక్క చెప్పిన రంగుల డబ్బాలు తీసుకొచ్చాను.
"పిన్నీ సరిపోతాయా?"
"ఆ.. సరిపోతాయి. సాయంత్రమే కళ్ళాపి జల్లేసి రాత్రి అన్నాలు దిన్నాక ముగ్గు మొదలు బెడదాం." చెప్పింది.
ఏడవగానే అన్నం తినేసి ముగ్గు డబ్బా తీసుకొచ్చాను.
"కాసేపు తాలి ఏద్దుర్లే నాయినా. రోడ్డుమీద ఇంకా సైకిళ్ళు పోతా ఉళ్ళా." చెప్పింది అమ్మమ్మ.

ఆ ముగ్గు డబ్బాలన్నీ వరండా చివరగా ఉన్న అరుగు మీదకు చేర్చాను. వరండాలో గోడ పక్కన తెల్ల పెయింట్ తో మెలికల ముగ్గు వేసివుంది. మధ్యలో మరో పెద్ద ముగ్గు. వరండా మెట్లు దిగి వీధి వైపునున్న ఇనుప గేటు దగ్గరకు వచ్చి చూశాను. అక్కడక్కడా వీధి దీపాల వెలుగుతో రోడ్డు మెరుస్తోంది. దూరంగా అక్కడో సైకిల్, ఇక్కడో రిక్షా కనిపిస్తూ ఉన్నాయి. వీ ధిలో ఇంకా ఎవరూ ముగ్గు వెయ్యడం మొదలు పెట్టలా. కాసేపట్లో ప్రతి ఇంటి బయట ముగ్గులు, రంగులతో హడావిడి మొదలవుతుంది.

Monday, April 16, 2018

వార్షికోత్సవం

        రంగులు మార్చుకున్న ఆకులు రాలి శీతాకాలం ప్రవేశించాక అంతటా నిశ్చలం. ఆకుల వియోగంతో మూగవోయిన కొమ్మలు... బూడిద రంగు ఆకాశంలో బద్దకంగా రెక్కలు విదుల్చుకుంటున్న పక్షులు. లోపల, బయటా అలుముకున్న స్తబ్ధత.

       చలి తాకిడికి కుంచించుకుపోయిన ఓ రోజుకి వార్షికోత్సవం పనులు మొదలెట్టలేదనే ఆలోచన తడుతుంది. పక్షి రెక్క విదిల్చి ముడుచుకున్నట్లు మెయిల్ ఒకటి వెళ్ళాక ఇక తప్పదన్నట్లు ఎవరో తంబూరా శ్రుతి చేస్తారు. కొత్త రాగాలు నేర్చుకుంటున్న వారు గొంతు విప్పే సమయానికి మేఘం చివరి నుండి చొచ్చుకుని వచ్చిన కిరణం భూమిని తాకుతుంది.

      విత్తనం నాటడం పూర్తయ్యాక వాలంటీర్ కోఆర్డినేటర్ అప్పుడప్పుడూ నీళ్ళు చిలకరిస్తూ ఉంటారు. నెల తిరిగేసరికి తెల్లని మంచుపైన వార్షికోత్సవం చివుర్లు తొడగడం కనిపిస్తుంది. ఈవెంట్ కోఆర్డినేటర్ కుంపట్లో మొక్కజొన్న కండెలు దోరగా కాలిస్తే, ట్రోఫీస్ కోఆర్డినేటర్ ఉప్పు, నిమ్మకాయ అద్దుతూ ఉంటారు. అందరూ కలసి చిరుచలిలో కబుర్లు చెప్పుకుంటూ ఒక్క గింజ కూడా మిగల్చకుండా మొత్తం వలిచేస్తారు. రాబోయే తీగలకు డెకరేషన్స్ టీం పందిరి సిద్దం చేస్తూ ఉంటారు.

     మూడు రాళ్ళు చేర్చి ఒక్క అగ్గిపుల్లతో నీళ్ళు వేడిచేయడం మొదలెడతారు ఫుడ్ టీం. టీ మరిగే సమయానికి చుట్టూ పళ్ళాలు, గిన్నెలు, బియ్యం, రైస్ కుక్కర్లూ అన్నీ ఎక్కడెక్కడి నుండో వచ్చి సర్దుకు కూర్చుంటాయి. బూడిద రంగు ఆకాశానికి సాయంత్రాలు జేగురు రంగు పులమడం మొదలౌతుంది. రాబోయే రంగులను అందంగా బంధించడానికి కెమెరాలకు కబుర్లు వెళతాయి.

       లోపలున్న వెచ్చదనం బయటకు పాకి కొమ్మలు పచ్చబారుతూ ఉంటాయి. చిలకలు అటూ ఇటూ ఎగురుతూ పలుకులు నేర్చుకుంటాయి. మంచు కరిగి మెల్లగా ప్రవాహం మొదలౌతుంది. నీళ్ళలో కొట్టుకొస్తున్న రంగు రాళ్ళనన్నింటినీ ఏరి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఓ పక్కగా పోగు పెడుతూ ఉంటారు. అక్కడెవరో రాళ్ళలో రాగాలు వింటూ పరవశించి పోతుంటారు.

          నలుగురు నడిచే బాటలో అటువైపుగా కూర్చున్న అతను కాగితమొకటి తీసుకుని దీక్షగా సున్నాలేని అంకెలు గీస్తుంటాడు.

         మధ్యాహ్నాలు నీలంగా మారే సమయానికి తీగలన్నీ పైకి పాకి పచ్చని పందిరి తయారవుతుంది. నీలం వంకాయలు, లేలేత చింతకాయలు నలుగురితో కూర్చుని నవ్వుకుంటూ ఉంటాయి. స్ట్రాబెర్రీస్, కీర దోస నీళ్ళపైకి చేరి నిక్కినిక్కి చూస్తుంటాయి.

        పకోడీలు, టీలు ప్రయాణానికి సన్నాహాలు మొదలెడతాయి. అందరూ ఆడిటోరియం కు చేరుకుంటారు. నెగడు చుట్టూ ఆట మొదలౌతుంది. సాంబార్లు, దద్దోజనాలు బకెట్లలొ కూర్చుని వాడవాడలా షికార్లు చేస్తాయి.

         వార్షికోత్సవం పూలన్నీ పందిరి నిండా విరగబూస్తాయి. వసంతోత్సవం జరుపుకున్న చిన్న పెద్దా  గుండెనంతా వాసన నింపుకుని ఇంటి దారి పడతారు.



Sunday, February 4, 2018

Grand Turk



దేశం చుట్టూరా ఝామ్మని తిరిగి రావాలని మీకెప్పుడైనా అనిపించిందా? నాకనిపిస్తూ ఉంటుంది. ఇండియా చుట్టూనో, అమరికా చుట్టూనో తిరిగి రావడం కుదరని పని కాని అదిగో అక్కడ కనిపిస్తోందే, గ్రాండ్ టర్క్, అదో ద్వీపము. ఆ ద్వీపాన్ని కాలినడకన చుట్టేసి రావచ్చు. ఏడు ౘదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన ఈ చిన్న ద్వీపం, టర్క్స్ అండ్ కైకోస్ ద్వీప సమూహానికి రాజధాని. ఈ చిన్న ద్వీపంలో బాంక్, ఆసుపత్రి, జైలు, ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, హైస్కూల్ వరకూ ఉచిత విద్యా సదుపాయాలు ఉన్నాయి. సున్నపు రాయి ఇక్కడ  ప్రధాన వ్యాపారము. వీరికి విమానమార్గం ప్రధాన ప్రయాణ సౌకర్యము. ద్వీపం అనగానే పెద్ద పెద్ద చెట్లు కొండలు, గుట్టలు  ఉంటాయనుకుంటాం కదూ! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటింటే ఎక్కడా పెద్ద చెట్టన్నది  కనిపించలేదు. ఈ ద్వీపంలో పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. ఈ మధ్య వచ్చిన మరియా తుఫాను వలన ఈ ద్వీపానికి చాలా నష్టం కలిగిందట. ఇక్కడ వారికి  రెండువేల పంతొమ్మిది వరకు కూడా టివి సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదట.

లేతాకుపచ్చ రంగుకు పిసరంత నీలం రంగు కలిపేసి సముద్రంలో గుమ్మరించినట్లు గమ్మత్తైన రంగులో మెరిసిపోతున్న ఈ  సముద్రంలోకి ఎంత లోపలకు వెళ్ళినా స్వచ్ఛంగా అడుగు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా మురికి అన్నది కనిపించక పోవటానికి ఇసుకలో సున్నపురాయి కలసి ఉండడమే కారణమట.
పంతొమ్మిది వందల అరవై కాలం నాటికి రెండవ ప్రపంచయుద్ధం ముగిసిపోయినా, అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం
 కొనసాగుతూనే ఉండేది. అప్పటికే రష్యన్ వ్యోమగాములు భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసేశారు. అమెరికా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. ఆ సమయంలో జాన్ గ్లెన్, అనే వ్యోమగామి అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయినప్పటికీ,  భూమండలం చుట్టూ విజయవంతంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేశాడు. అతను ప్రయాణం చేసిన రోదసీ నౌక  గ్రాండ్ టర్క్ దగ్గర నీటిలోకి దిగింది. దానికి గుర్తుగా రోదసీ నౌక నకలును గ్రాండ్ టర్క్ దగ్గర ప్రదర్శనకు పెట్టారు.

పద్దెనిమిది వందల శతాబ్దంలో కరేబియన్ ద్వీపాలలో నౌకా వ్యాపారం మెండుగా ఉండేది. అసలే జిపియస్ లేని కాలం, పైగా ద్వీపానికి దగ్గరలో తీరంలోపల కొండలు, గుట్టలు. అటు వైపుగా ప్రయాణించే ఓడలు రాత్రిపూట అటూ ఇటూ ఊగడం, మునిగిపోవడంతో విపరీతమైన ధన, వస్తు, ప్రాణనష్టం వాటిల్లేదట. ఈ కారణంగా అక్కడ పద్దెనిమిది వందల యాభై  రెండవ సంవత్సరంలో లైట్ హౌస్ కట్టడం జరిగింది. అరవై అడుగుల ఎత్తు, గట్టి ఇనుముతో కట్టిన ఈ లైట్ హౌస్ లో మొదట ఆర్గాండ్ ఆయిల్ దీపాలు రిఫ్లెక్టర్ల సాయంతో కొంతకాలం ఏదో మిణుకు మిణుకు మంటూ వెలిగినా ఆ వెలుగు సరిపోలేదట. ఆ తరువాత కిరసనాయిల్ దీపాలు ఫ్రెస్నెల్ లెన్స్ లతో పరిస్తితి చక్కబడిందట. పంతొమ్మిది వందల డెబ్భై రెండొవ సంవత్సరంలో పూర్తిగా విద్యుతీకరణ చేశారు. చాలా విశేషాలు  తెలుసుకున్నాం. కాసేపలా ఊరు చూసొద్దాం రండి.





మన దేశంలో ఓ మారుమూలనున్న చిన్న పట్టణాన్ని చూస్తున్నట్లు ఉంది కదూ! అదిగో కనిపిస్తోందే అదే పెద్ద బజారు.

                                                                                                 










       ఓ గమ్మత్తైన విషయం చెప్పనా, ఇక్కడ ఎటువంటి డ్రైవింగ్ నియమాలు లేవుట. మద్యం తాగి కూడా డ్రైవింగ్ చెయ్యొచ్చట. అన్నట్లు ఇక్కడ జలుబు, జ్వరాలకు మందులు వేసుకోరట. వేపాకులు నీళ్ళలో మరిగించి తాగేస్తే తగ్గిపోతుందని చెప్తున్నారు. వేపాకులా, ఇక్కడా? అని నేను కూడా మీలానే ఆశ్చర్యపోయాను. ఎప్పుడో ఇండియా నుండి వేపమొక్క పట్టుకెళ్ళి  అక్కడ నాటారట. జైలొకటి ఉందని చెప్పాను గుర్తుందా? ఇక్కడ చిన్న చిన్న దోపిడీలు తప్ప మర్డర్లు, మానభంగాలు లాంటి పాశవిక ఘోరలేమీ ఇప్పటి వరకూ జరగలేదట. "ఏమోయ్, బొమ్మిడాయల పులుసు పెట్టెయ్. రాత్రికి వచ్చేస్తాను" అని ఖైదీలు రాత్రుళ్ళు బయటకు వెళ్ళి రావడం ఇక్కడ మామూలేనట.

     భారీ చదువులు, ఖర్చులు, కీర్తి ప్రతిష్టలు, విలువైన వస్తువులు సరే, కనీసం అద్దం కూడా కొననక్కర్లేని సాదాసీదా జీవితాలు! ఏమిటీ, అక్కడ వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? వెళ్ళేమాటయితే మీ అడ్రస్ ఏదో ఈ కింద కామెంట్ లో పోస్ట్ చెయ్యండి. ఈసారి గ్రాండ్ టర్క్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాం.
 
https://en.wikipedia.org/wiki/Grand_Turk_Island
https://www.grandturkcc.com/island-information/fact-sheet.aspx

Thursday, January 18, 2018

క్రూజ్ టు పోర్టోరికో

        కరేబియన్ ఐలెండ్స్ చూడాలంటె శీతాకాలం మంచి సమయం, పైగా ఈస్ట్ కోస్ట్ చలి నుంచి కొంతకాలం తప్పించుకోవచ్చు. నాలుగేళ్ళ క్రితం ఇదే సమయంలో బహమాస్ కు వెళ్ళాం.

ఈయేడాది కూడా అలాంటి ప్రయాణమే. డిసెంబర్ ఇరవైమూడవ తేదీ సాయంత్రం మయామీ నుండి ఓడలో బయలు దేరి, ఇరవైఐదున గ్రాండ్ టర్క్, ఇరవైఆరున డొమెనికన్ రిపబ్లిక్(యాంబర్ కోవ్), ఇరవైయేడున పోర్టోరికో చూసి ముప్పైవ తేదీ ఉదయం ఆరు గంటలకల్లా మయామీ చేరుకోవడం...ఇదీ కార్యక్రం.

Carnival Glory
ఈ  పదకొండు అంతస్తుల ఓడ వెనుక భాగంలో దొరికింది గది. అబ్బా వెనుక వైపునా అనుకున్నాం కాని ఊగిసలాడే ఓడలో వికారాలేవీ  కలిగకకుండా ఉండాలంటే అదే మంచిదట. మొదటి అంతస్తులో ఉన్నామేమో కిటికీలో నుండి చూస్తే చేతికి అందేదూరంలో సముద్రం. గదిలోనుండే సూర్యోదయాలు చూడొచ్చని సరదాపడ్డాం.. మేఘాలకి కూడాఅలాంటి సంబరమే. తెల్లవారేటప్పటికి మమ్మల్ని చూడడానికి తయారు. నడి సముద్రంలో వాటికి మాత్రం తోచుబాటు అయ్యేదెట్లా!

"భోజనానికి త్వరగా వస్తారా ఆలస్యంగా వస్తారా?" అని మర్యాదగా అడిగినప్పుడు ముందొస్తామని కదా చెప్పాలి. మరీ ముందొస్తామంటే ఏం బావుంటుందని కాస్త మొహమాటానికి పోయి ఆలస్యంగా వస్తామన్నాం, ఇక అంతే! ఎనిమిందింటికి మొదలైన వడ్డన పదింటికి కూడా పూర్తవదే. ఇక చాలు బాబోయ్ తినలేమంటున్నా"అబ్బే ఇది కొత్త వంటకం రుచి చూడండి అంటూ" మరోటి తెచ్చి పెట్టడం. మంచి పాటలతో, డాన్సులతో ఓడంతా హుషారుగా ఉన్న సమయంలో మేము ప్లేట్లు, ఫోర్క్ లతో కాలక్షేపం. 

సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా ఈ మధ్యకాలంలో ఓ నాలుగు గంటలు గడిపింది లేదు. అలంటిది ఏకంగా వారం రోజులు. ఎలా గడుస్తాయా అని గాభరాపడ్డాం కానీ...

సముద్రం మధ్యలో చుక్కల పరదా కింద, వెచ్చగా దుప్పటి కప్పుకుని సినిమా చూడడం...టీ టైంలోకేక్స్, శాండ్విచెస్ తో పాటు కొత్త పరిచయాలు...వారితో అమెరికా రాజకీయాల నుండి మొన్నటి మరియా, ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్, యూనివర్సిటీ చదువులు ఇలా రకరకాల చర్చలు. పై అంతస్తులో మినీ గోల్ఫ్, ఆ పక్కనే వాలీ బాల్ కోర్ట్, తీరిగ్గా సముద్రం చూస్తూ డైనింగ్ హాల్ లో పెట్టిన కొత్త వంటకలేవో తెచ్చుకుని కబుర్లతో మధ్యాహ్నాలు, ఫోటోలు దిగుతూ సరదా సాయంత్రాలు... సమయమంతా ఇట్టే గడిచిపోయింది.   

"రండి రండి త్వరపడండి ఆలసించిన ఆశాభంగం మీరు వెళ్తున్న ప్రదేశాలు చూడడానికి ఓడలోనే టూర్ బుక్ చేసుకునే సదుపాయం" అని ఊదర బెట్టేస్తారు కాని అనుభవపూర్వకంగా తెలిసిందేమిటంటే అవి సాధారణంగా చాలా  ఎక్కువ ఖరీదు ఉంటాయి. పైగా వాటితో వచ్చిన ఇబ్బంది మనం ఒక టూర్ బుక్ చేసుకుంటే ఏదో ఒక వైపు చూడడానికి వీలవుతుంది. మిగిలిన భాగం చూసే అవకాశం ఉండదు. ఓడ నుండి ఇలా బయటకు వచ్చి ఓ నాలుగు ఫోటోలు తీసుకుని అలా చూడగానే టూర్ పేకేజస్ అంటూ చిన్నచిన్న బంకులు లాంటివి కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి విషయం కనుక్కుని అవసరం అనుకుంటే ఏమీ  మొహమాటపడకుండా బేరాలాడేయొచ్చు. అలా కుదరదనుకుంటే ఓ ప్రైవేట్ వెహికల్ గంటకు ఇంతని కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఆ ప్రదేశం మొత్తం చూపిస్తారు.

 Interesting foods
Toasted Avocado Poached eggs 

Buttered Popcorn Pot De creme


చూసిన ప్రదేశాల కబుర్లు త్వరలో