Monday, December 30, 2013

క్రూజ్ టు బహామాస్

 ఓ సాయంత్రం...

"క్రిస్మస్ సెలవలొస్తున్నాయ్ ఎక్కడికన్నా వెళ్దామా?"
"అబ్బా...చలిలో ఎక్కడికెళతాం?"
"చలిలేని ప్రాంతానికి వెళ్తే సరి"
"కరేబియన్ ఐలెండ్స్" 
"గుడ్ ఛాయిస్"

*                        *                   *                        *                          

బహామాస్ లో సూరీడిని చూడాలని చలువ కళ్ళద్దాలు, పూల చొక్కాలు, రంగుల చెప్పులు అల్లరి పెట్టి మరీ చిన్న పెట్టెలోకెక్కేశాయి. దాచినవి, మది దోచినవి, ముచ్చటగా తెచ్చినవి పెట్టెల్లో సర్దుకున్నాయ్. చిరు జల్లులో తడుస్తూ, పొగలు కక్కుతున్న కాఫీ మగ్గులతో, వెలుగు రాకముందే, వేన్ 'జాక్సన్ విల్' కు బయలుదేరింది. తోడుగా మరో నాలుగు వేన్స్. రాత్రంతా ధారగా పడిన వర్షం, ఊరు చివర వీడ్కోలిచ్చింది.

అల్లంత దూరంలో ఊరంత ఓడ, 'కార్నివాల్ ఫాసినేషన్'. గూడ౦త గదిలో పెట్టే బేడా పెట్టేసి పదో అంతస్తులోని కొబ్బరి తోటకు (కోకోనట్ గ్రోవ్ బార్ & గ్రిల్) చేరిపోయాం. అక్కడే భోజనం. దొరికినవన్నీ చూసేసి నచ్చినదొకటి తినేప్పటికి

'బయలు దేరుతున్నామొహో ' అని పడవ ఈల వేసింది.
దక్షిణం వైపుగా ప్రయాణం. తూర్పు పడమరలను కలుపుతున్నవంతెన, తలకు తగులుతు౦దేమో అన్నంత కిందగా ఉంది. ఓడ మాత్రం జ౦కూ బొంకూ లేక ఠీవిగా ముందుకు సాగిపోతో౦ది. చేపల కోసం వెతుకుతూ నీళ్ళ అంచునే ఎగురుతున్న సీగల్స్, ఒడ్డుకు దగ్గరగా గు౦పులుగా నిలబడి తీరిగ్గా కబుర్లాడుతున్న పడవలు,  


ప్రతి ఇంటి పెరటికి ఓ చెక్క బాట, దాని చివరగా కట్టేసిన బుల్లి నావ.....అన్నీ పదకొండో అంతస్తు నుండి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఒడ్డునే నిలబడి కదిలే ఓడను చూస్తూ ఆనందంగా చేతులూపుతున్న పిల్లల్ని చూస్తుంటే, రైలు గేటు పక్కన టాటా చెప్పిన రోజులు గుర్తొచ్చాయి.   


నీలిమేఘాలను తప్పించుకున్న కిరణాలు ఆకాశానికి అక్కడక్కడా నారింజ రంగులు పులుముతున్నాయి.  చేపల వేట పూర్తయినట్లుంది, ఎటో ఎగిరిపోతూ పక్షులు. 


చిరు చీకట్లు ముసురుతున్న వేళ, దీపాల వెలుగులో మెరిసిపోతున్న డెక్ మీద మినీ గోల్ఫ్ కోర్స్ లో పిల్లలెవరో అప్పటికే ఆట మొదలెట్టేశారు. దాని చుట్టూ వున్న కాలిబాట మీద  నడుస్తూ, జాగింగ్ చేస్తున్న ఔత్సాహికులు. ఓడ చివరలో పెద్ద వాటర్ పార్కు. సుమారు ఓ యాభై మందికి సరిపోయేలా పొందిగ్గా అమర్చిన కుర్చీలు. 


అక్కడి నుండి కిందకు వస్తే లిడో డెక్ మీద స్విమ్మింగ్ పూల్, గ్రిల్ నుండి హాట్ డాగ్స్, హామ్ బర్గర్స్ తెచ్చుకుని పూల్ చుట్టూ వేసిన కుర్చీల్లో సరదా సాయంకాలం. అంత చల్లని వేళా చిన్న గొడుగులో ఒదుగుదామనుకుంటున్న పల్చని అనాస చెక్కను చూస్తూ ఫక్కుమని నవ్వుతున్న పినాకోలాడా. హుషారైన సంగీతం చిందులు వేయిస్తోంది.

చీకటి చిక్కబడగానే అప్పటివరుకు తిరిగిన జీన్స్ లన్నీ, అందమైన ఫ్రాక్స్, స్కర్ట్స్, సూట్స్, రంగు రంగుల చొక్కాలుగా మారిపోయాయి. పదో అంతస్తులోని హాలీవుడ్ బులవాడ్ రంగు రంగుల లైట్లతో కళకళలాడి పోతోంది.

కాఫీ షాప్ ఎదురుగా నవ యవ్వనుల నవ్వుల జల్లులు, కాసినోలో గలగల చప్పుళ్ళు, రెండు ఏనుగుల మధ్య నుండి తొంగిచూస్తున్న 'పాసేజ్ టు ఇండియా', ఎడమ వైపు గదిలో చిత్రకారుల విన్యాసాలను కాన్వాసుపై చూస్తూన్న కళాభిమానుల. వాచ్ లు, టోపీలు, బాగ్ లు, బెల్ట్ లు వాటి గొప్పదనాన్ని చాటే అంకెలు అంటించుకుని షాపు అరల్లో సర్దుకున్నాయి. బారేదో ఉన్నట్లుంది చిరుచీకటిలో గాజు గ్లాసుల తళతళ. 

చివరగా ఐదంతస్తులూ చుడుతూ గుండ్రని ఆట్రియం. ఓ అంతస్తులో స్పా, సెలూన్, మసాజ్ సెంటర్, విశాలమైన సముద్రం చూస్తూ మైళ్ళు మైళ్ళు
అలవోకగా నడిచేయొచ్చనిపించే జిమ్. ఎండవేళ విశ్రా౦తి తీసుకుంటున్న ఇల్లాలిలా నిశ్సబ్దంగా అద్దాల అరల్లో పుస్తకాలు దాచుకున్న లైబ్రరీ. ఇంకో అంతస్త్తులో 'సెన్సేషన్ డైనింగ్ హాల్'. ఆ పైన అంతస్తులో సుమారుగా వెయ్యిమంది కూర్చునే వీలుగా 'పేలస్ థియేటర్', మబ్బురంగుమీద బంగారపు పూల డిజైన్తో  సీటింగ్. అలలమీద తేలుతున్నగుర్తుగా పడవ ఊగుతోంది...

హాలీ వుడ్ బులవాడ్ మరో చివర, ఓ అంతస్తు కిందకు దిగితే 'ఇమాజినేషన్ డైనింగ్ హాల్' లేత కనకాంబర౦ రంగు టేబుల్ క్లాత్స్ తో ఆహ్లాదంగా వుంది. అతిధులను ఆహ్వానించడానికి అక్కడే నిలబడి వున్నాడు మిస్టర్
జోగి, ది రెస్టరెంట్ మేనేజర్. సాలడ్, సూప్, మెయిన్ కోర్స్... కావలసినవి రాసుకుంటూ చెదరని చిరునవ్వుల వెయిటర్స్. 'డేర్ టు ఆర్డర్' కింద రాసిన కనీ వినీ ఎరుగని వింత వంటకాలు. పండుతో పాటు మరి కొందరికి ధైర్యమెక్కువని అప్పుడే తెలిసింది. "అంతా బాగనే వుంది కాని, మా ఉప్పు, పులుపూ మాటేమిటంటే?"  అడిగాం. "రేపటినుండి మీకోసం ఇండియన్ ఫుడ్ ప్రత్యేకమని" జోగి వాగ్దానం. అన్నమాట ప్రకారం అప్పడం, ఊరగాయతో సహా పప్పు, కాబేజీ, వంకాయ, బంగాళదుంప, బఠానీల కూరతోపాటు గోట్, ఫిష్, చికెన్ కూడా టేబుల్ మీద దర్శనమిచ్చాయి.  

సూర్యోదయం, సూర్యాస్తమయ౦ సముద్రంలో చూడబోతున్నామని బోలెడు సరదా పడ్డాం. ప్చ్... తుంటరి మేఘాలు, ఆ సమయాల్లోనే సూరీడ్ని దాచేశాయి. 





ప్రతిరోజు సాయంత్రం గదిలోకి వచ్చేసరికి, టవల్స్ తో చేసిన అందమైన  బొమ్మొకటి వేచిచూస్తూ ఉండేది. 




పిల్లీ ఎలుకల్లా పోట్లాడుకునే జంటల్ని కూడా క్రూజ్ చిలకా గోరింకలుగా మార్చేస్తుంది. నిజమో కాదోనని అనుమానమొస్తే, సాయంత్రం పూట హాలీవుడ్ బులవాడ్ లో ఫోటోలు తీయి౦చుకుంటున్న జంటలను చూడండి. అట్రియం చుట్టూ వరుసగా పేర్చిన ఫోటోల్లో....బీచ్ లోఅందమైన సాయంత్రాన్ని చూస్తున్న కుటుంబం, పియానో మెట్ల మీద చేతులానించిన ప్రియురాలి కళ్ళలోకి అరాధనగా చూస్తున్న ప్రియుడు. గురివింద గింజ రంగులో మెరిసిపోతున్న షా౦డిలియర్ కింద ఒకళ్ళనొకళ్ళు పొదివి పట్టుకున్న పడుచు జంట. పాలనురుగు తెర పక్కన తలగడకు అనుకుని కూర్చున మరో నడివయస్సు జంట. అందరి మొహాల్లో చిందులు వేస్తున్న చిరు దరహాసం... 

*              *              *               *                * 


గాలిపట౦ అలా అలా ఎగురుతున్నప్పుడల్లా ఆకాశంలోఎగరాలనిపిస్తుండేది. ఆ కోరిక 'కీవెస్ట్' లో తీరింది. రంగుల గాలిపటం దారం పట్టుకుని అలా పైకి వెళితే మేఘాలకు దగ్గరగా సముద్రపు అలల మీద వెలుగుల తళుకులు,                                                                               
దూరంగా కనిపిస్తున్న లంకల్లో కొబ్బరి చెట్లు, సరుగుడు తోటలు, ఒక్కసారి కిందకు రాగానే చల్లని నీళ్ళలో తడిసిన పాదాలు, నీటిలో కదిలే చేపలు . పేరాశైలి౦గ్ ఓ కొత్త గమ్మత్తైన అనుభవం. 




అనుకున్న తీరానికి చేరిపోయాం. 'నసావ్' ద్వీపంలో ప్రత్యేక ఆకర్షణ 'అట్లాంటిస్' రిసార్ట్. పిల్లలంతా ఆ రిసార్ట్ వాటర్ రైడ్స్ కి వెళ్ళిపోయారు. అక్కడి నుండి సరుగుడు చెట్ల వెంబడి కాలిబాటలో వెళ్తే ఈ చలికాలంలో కూడా వెచ్చని ఎండలో ఎగిసి పడుతున్న అలలతో నీలంగా అట్లాంటిక్ సముద్రం, 
అంచునే ఎత్తైన కొబ్బరి చెట్లు. కలలతీరంలో అలలు  సుతారంగా ఉంటాయనుకున్నాం గాని ఇవి మహా గడుసువి. కాసింత సేపుంటేనే భయపెట్టి దూరంగా పంపేశాయి.




చెమక్కులు

"అక్కడేవో అమ్ముతున్నట్లున్నారు"
"ఆ.. కొబ్బరి బొండాలు. తెమ్మ౦టావేమిటి?"
ఆ నవ్వేదో తేడాగా ఉంది. అనుమానంగా చూశాను.
"అవేమన్నా గంగా బోండాలనుకున్నావా, తాగితే తల గిర్రున తిరుగుతుంది" 
"ఆ!!!  బీచ్ లో కూడానా "
":)" 

"ఇవాళ మెనూలో గ్రిల్డ్ ఆనియన్ సూప్ ఉంది. ఆర్డర్ చేశాను"
"వెజిటేరియన్ సూపేగా?"
"మీకన్నీ అనుమానాలే. అడిగే చేశాను, పూర్తిగా వెజే"
ఇంతలో పక్కనున్న ఫ్రెండ్ కాదని చెప్పింది. మరో వెయిటర్ ని పిలిచి అడిగాం. "ఇట్ హాజ్ బీఫ్ ఇన్ ఇట్ మామ్" 
ఈలోగా మొదట నాకు చెప్పిన వెయిటర్ వచ్చాడు. 
"అదే౦టయ్యా ఇది వెజిటేరియన్ అన్నావ్, ఇందులో బీఫ్ ఉందట" అడిగాను. 
"ఇట్స్ నాట్ బీఫ్ మామ్, జస్ట్ బీఫ్ స్టాక్"  
తస్మాత్ జాగ్రత్త 

డిన్నర్ తరువాత 
"కాఫీ తాగుదామా?"
"ఏం కావాలో ఆర్డర్ చెయ్యి"
మెన్యూ తీసుకుని చదివాను. దీని పేరేదో భలే ఉందని 'ఐరిష్ కాఫీ' ఆర్డర్ ఇచ్చాను"
చిత్రమైన గ్లాసులో నురగలు కక్కుతూ కాఫీ వచ్చింది. 
"వావ్ భలే ఉంది కదూ" ఒక్క చుక్క తాగాను. ఘాటు నషాళానికి అంటింది. 
:)
ఈ చమక్కు ఇప్పటిది కాదు. మెక్సికో క్రూజ్ ఎన్సినాడా వెళ్ళినప్పటిది. ఆ అనుభవంతో షిప్ లో ఏ లిక్విడ్ కూడా కొనకూడదని అర్ధం అయింది.

నచ్చినవి 


క్రూజ్ ఫుడ్ 
తాజా మెలాన్స్.
వెయిటర్స్ డాన్స్. 
పేలస్ థియేటర్ లో చూసిన కామెడీ షో
నడి సముద్రంలో పుస్తకం చదవడం.
పిక్చర్స్
జిమ్
పద్దెనిమిది నిముషాల్లో కళ్ళముందే, ఐసు బ్లాక్ 'రెడ్ ఇండియన్' లా మారిపోవడం.
పేరాశైలి౦గ్
మంచి స్నేహితులు కలిసారేమో ఈ వెకేషన్ మరింత సరదాగా సాగింది.


ఆఖరులో తెలిసినవి ముందుగా తెలిస్తే బావుండేదనిపించినవి. 

మాలో అచ్చమైన కాఫీ ప్రియులున్నారు. ఇంటిదగ్గర నుండి బ్రూ కూడా తెచ్చుకున్నారు కాని, వేడిపాలు దొరకలేదు. ఓ రాత్రి భోజనాలయ్యాక ఖాళీగా ఉన్న వెయిటర్ని పాలు వేడి చేసి ఇమ్మని అడిగాము. అరగంట తరువాత ఓ రెండు కప్పులు పాలు తెచ్చి ఇచ్చాడు.  ఆరుగురం ఎలాగో సర్దుకుని అర్ధరాత్రి స్ట్రాంగ్ బ్రూ తాగాము. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే రూమ్ సర్వీస్ ఆర్డర్ చేస్తే వేడిపాలు ఇస్తార్ట. 

ఉదయాన్నే ఓ దగ్గర వేడి వేడిగా ఆమ్లెట్ వేస్తుంటారు. కాకపోతే అందులో ఏమేం వెయ్యాలో మనమే చెప్పాలి. మొదటి రోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్" చెప్పాను. సగమే ఉడికిందది. రెండో రోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్ వెల్ కుక్డ్" చెప్పాను. ఈసారి బాగానే ఉడికింది కాని అందులో ఉప్పూ కారం లేవు. మూడోరోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్ అండ్ హాలోపినాస్ వెల్ కుక్డ్" చెప్పాను. అంతా బాగానే ఉంది కాని ఏమిటో ఆమ్లెట్ మరీ మెత్తగా ఉంది. నాలుగోరోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్ అండ్ హాలోపినోస్ వెల్ కుక్డ్ నో ఛీజ్" చెప్పాను. అయినా ఏమిటో వెలితి. ఐదో రోజు తెలిసిన విషయమేమిటంటే రియల్ ఎగ్ అని కూడా చెప్పాలిట. అప్పటికే ఓడ దిగి కారెక్కేశా౦. 

ఫార్మల్ నైట్ చక్కగా ముస్తాబయి హాలీవుడ్ బులవాడ్ కి రాగానే పిలిచి మరీ రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసేశారు. తరువాత రోజు ఉదయం వచ్చి చూసేసరికి ఫోటోలు బ్రహ్మా౦డంగా వచ్చాయి. ఫోటోలు ఎప్పుడూ బాగానే వస్తాయి, అందులో మేమే బావుండం. ఈసారి మాత్రం మేము కూడా బానే ఉన్నాం లెండి. నచ్చినవన్నీ వరుసగా తీసేసుకున్నాం. తరువాత నుండి ప్రతి సాయంత్రం అక్కడకు వెళ్ళగానే ఫోటోలు తీసేవాళ్ళు, వాటిలో చాలా వరకు బాగా వచ్చాయి. చివర రోజు వరకు ఆగి అన్నీ ఒక్కసారే కొంటే బావుండేదనిపించింది. 

ఐదురోజులు సముద్రం మీద వున్నదానికే, ఇప్పుడు కూడా అంతా ఊగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇంత ఆనందాన్ని పంచడానికి, ఆరునెలలు నేలను చూడకుండా, చిరునవ్వుతో ఆతిధ్యం ఇచ్చిన షిప్ క్రూకి అభిమానంతో....


24 comments:

  1. చిరకాలం గుర్తుండవలసిన అనుభూతులను అందంగా దర్శింప చేసారు.మేము ఆనందడోలికల్లో ఊగాము మీతోపాటు!

    ReplyDelete
    Replies
    1. కలకాలం గుర్తుంచుకోవలసినవేనండి. అందుకే వచ్చిన వెంటనే రాసేశాను. థాంక్యు ఉమాదేవి గారు.

      Delete
  2. షార్ట్ అండ్ స్వీట్, చక్కగా ఫొటోలతో సహా చెప్తూ చూపించారు.
    ఇంతకీ ఇంటికొచ్చాక ఆ ఐదోరోజు తెలుసుకున్న ఆమ్‌లెట్ ట్రై చేశారేంటీ ;)
    ఇలాంటి ట్రిప్స్ లో అలాంటి సరదాలే కదూ తీపి జ్ఞాపకాలు!

    ReplyDelete
    Replies
    1. ఇంకా లేదండి చిన్ని ఆశ గారు. నాలుగు రోజూలూ తినేశాంగా, కొంచెం గాప్ ఇచ్చామన్నమాట.
      అవునండీ. మీరన్నది నిజం.

      Delete
  3. క్రూజ్ విశేషాలు,ఫోటోలు చాలా చాలా బావున్నాయి జ్యోతి గారూ :-)

    ReplyDelete
  4. చాలా చాలా బావుందండి I envy you :-)

    ReplyDelete
    Replies
    1. ఇలా ఒచ్చేయండి శ్రావ్యా. ఈసారి కలిసెళ్దాం.

      Delete
  5. "అంత చల్లని వేళా చిన్న గొడుగులో ఒదుగుదామనుకుంటున్న పల్చని అనాస చెక్కను చూస్తూ ఫక్కుమని నవ్వుతున్న పినాకోలాడా."

    :) భలే రాశారండీ. ఆ బుజ్జి ఏనుగు ఎంత బావుందో!

    ReplyDelete
    Replies
    1. చాలా కాలానికి కొత్తావకాయగారి ప్రశంస. ఆనందమానందమాయెనే.

      Delete
  6. భలే రాసారు.ఆమ్లెట్ విషయం బాగుంది :-) రాధిక (నాని)

    ReplyDelete
  7. Replies
    1. ఒట్టి సూపరేనా, సూపర్ డూపర్ కదా :). థాంక్స్ హర్షా.

      Delete
  8. బహామాస్ వీసా ఎలాగండీ? మన దేశంలో వారి ఎంబసీ లేదనుకుంటా.

    ReplyDelete
    Replies
    1. ఎక్కడికైనా విజిటింగ్ వీసా తీసుకోవచ్చానుకు౦టాను. ట్రావెల్ ఏజన్సీ వారిని అడిగితే తెలుస్తుందేమోనండి.

      Delete
  9. Jyothigaru,
    Chala baga rasaru.

    Rama krishna

    ReplyDelete
  10. బహమాస్ బావుంది సరే, పండు కి భోగి పళ్ళు పోసారా లేదా !
    సంక్రాంతి శుభాకాంక్షలు !

    ReplyDelete
    Replies
    1. భోగి పళ్ళు పోయాలంటే నేను నిచ్చెనలవీ ఎక్కాలండి తెరవని పుస్తకం గారు.

      మీ ముగ్గు బావుంది. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

      Delete
  11. కధ చాల చాల బావుందండి. బహమాస్ లో ఉన్నట్టు ఫీల్ అయ్యాము .
    మాప్రణీత కి చదివి వినిపిస్తే మనం ఎప్పుడు వెళ్దాము క్రూజ్ కి అని అడుగుతోంది.
    రాధ

    ReplyDelete
    Replies
    1. పిల్లలకు చదివి వినిపించాలన్న ఆలోచన నాకు చాలాచాలా నచ్చేసింది రాధా. ఓపిగ్గా విన్నందుకు ప్రణీతకు థాంక్స్ చెప్పాలి.
      మొత్తానికి తెలుగులో వ్యాఖ్య పెట్టేశారు. అభినందనలు రాధా.

      Delete
  12. Jyothi garu, chala baga undi story. After my real experience. First cruisers ki edi very good heads up story. Really liked it

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.