Tuesday, January 24, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 6

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 5 
హాస్పిటల్ కు వచ్చిన రెండవ వారం తనకు మరో ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. ఉదయం చేసే ట్రీట్‌మెంట్ పేరు పొట్లి. మూలికలు, దినుసులు వేసి వేడిచేసి మూటలా కట్టి నూనెలో ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో పొట్లితో కాపడం పెడతారు.
Picture courtesy - Google

Picture courtesy - Google
సాయంత్రం చేసే ట్రీట్‌మెంట్ శిరోవస్తి, తల మీద బ్రిడ్జి లాగా కట్టి వెచ్చని నూనెతో నింపుతారు. వెన్నెముక గట్టిపడడానికి, లేదా వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఈ ట్రీట్‌మెంట్ వలన తగ్గుతుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే బీపీ చూడడానికి ఒకరు, మందులు ఇవ్వడానికి మరో నర్స్ వచ్చే వాళ్ళు. ఆ తరువాత డాక్టర్స్ వచ్చేవారు. సాధారణంగా హాస్పిటల్స్ లో డాక్టర్స్ రౌండ్ కు వస్తున్నారంటే ఒకలాంటి హడావిడి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ అలాంటిదేమీ ఉండదు, స్టాఫ్ అంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం మరో డాక్టర్ వచ్చి పేషంట్ ఎలా ఉన్నారో కనుక్కుని వెళ్ళే వారు.

హాస్పిటల్ ఎదురుగా గుడి ఉందన్నాను కదా అది విశ్వంభర గుడి. దానిని పి.యస్.వారియర్ కట్టించారు. గుడి ముందున్న ప్రవేశ ద్వారం పైన అల్లా, క్రీస్తు, కృష్ణుడి చిహ్నాలు ఉన్నాయి. అస్పృశ్యతను పాటించే అప్పటి రోజుల్లో కూడా కులం, మతం అనే పక్షపాతం లేక ఆ గుడిలోకి అందరికీ ప్రవేశం ఉండేది.
అయ్యప్ప స్వామి దీక్ష మొదలు పెట్టే రోజు, గుడి బయట, లోపల అంతా దీపాలు పెట్టి, పువ్వులతో అందంగా అలంకరించారు. 



గుడికి ఎదురుగా ఒక స్టేజ్ కట్టి ఉంది. పి.వి.యస్ నాట్య సంఘం లోని కళాకారులు మేము అక్కడ ఉన్న మూడు వారాలలో మూడుసార్లు ప్రదర్శన ఇచ్చారు. మాకు ఆ విధంగా కథాకళి నృత్యాన్ని దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఈ నృత్యంలో కళ్ళు, కనుబొమల కదలికలతో నాట్యం చేయడం గమ్మత్తుగా ఉంది. ఈ నాట్యంలో కళాకారులకు వేసే రంగులలో కూడా చాలా అర్థం ఉంటుందట.ఈ నాట్య సంఘం జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, చైనా, కొరియా, ఇండోనేషియా ఇలా పలు దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.                                          
           

ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఆ గుడి ప్రాంగణంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కేరళలోని చాలా ప్రాంతాల నుండి కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇస్తారు. ఆ వేదిక మీద యేసుదాస్, పద్మ సుబ్రమణియం, ఎమ్. ఎస్, సుబ్బలక్ష్మి గారు అలాంటి ప్రముఖులు ప్రదర్శన ఇచ్చారు.   

 
రోజూ సాయంత్రాలు ఏడు గంటల తరువాత గుడికి వెళ్ళే వాళ్ళం. మాలాగా ట్రీట్‌మెంట్ కి వచ్చిన వారు కలిసేవారు. ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండే కాక, ఇతరదేశాల నుండి కూడా పేషెంట్స్ వచ్చారు. అక్కడకు విదేశీయులు రావడం విశేషం అనిపించింది. 

ఒక్కొక్కళ్ళది ఒక్కో సమస్య. ఆర్థరైటిస్, స్లిప్ డిస్క్, డిస్క్ బల్జ్, సాయటికా, వర్టిగో, సోరియాసీస్, ఆటో ఇమ్యూన్ డీసీజెస్ ఇలా. అందులో కొంతమంది పది సంవత్సరాల నుండీ వస్తున్నవాళ్ళు ఉన్నారు. మాకొక సందేహం వచ్చింది. ఒకసారి ట్రీట్‌మెంట్ తీసుకున్నాక వ్యాధి నయమైతే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని. దానికి వాళ్ళ సమాధానం ఏమిటంటే "సర్జరీ తప్పనిసరి అని అల్లోపతి డాక్టర్స్ చెప్పినా ఇక్కడ ట్రీట్‌మెంట్ తో సర్జరీ అవసరం లేకుండా మామూలు జీవితం గడపుతున్నాము. ఏడాదికి ఒకసారి ఇక్కడకు మెయింటెనన్స్ కు వస్తూ ఉన్నాము" అని.

సాధారణంగా ఏదైనా వ్యాధి వచ్చిన వెంటనే కాక అల్లోపతి వైద్యంలో నయమవనప్పుడు చివర ప్రయత్నంగా ఆయుర్వేదం, హోమియోపతీ వైద్యానికి వెళ్తాం. అప్పటికే జరగవలసిన అనర్ధం జరిగిపోతుంది. మొదట్లోనే వస్తే తగ్గే అవకాశం ఉంటుందట.

విజయవాడ నుండి ఒకళ్ళు ఏడు సంవత్సరాల నుండీ వస్తున్నారు. "విజయవాడలో లో కొట్టకల్ క్లినిక్ ఉంది, ఈ మసాజ్ లు, ట్రీట్మెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి కదా, మరి ఇంత దూరం వస్తున్నారే" అని అడిగాము. "ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉన్నన్ని రోజులు విశ్రాంతి చాలా ముఖ్యం, అక్కడే ఉంటే రోజు వారీ పనులతో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫలితం కనిపించడం లేదు" అని చెప్పారు.

ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఫైబ్రోమైయాల్జా. హైదరాబాద్ లో ఎందరో డాక్టర్స్ కు చూపించారట,  తొమ్మిది నెలల పాటు ఎన్నో సార్లు హాస్పటిల్ లో జాయిన్ అయిందట. అక్కడ డాక్టర్స్ ఇక తగ్గదు అని చెప్పినప్పుడు పెన్ కూడా పట్టుకోలేని స్థితిలో కొట్టకల్ కు వచ్చారట. వచ్చిన వారంలోనే ఆ అమ్మాయి మామూలుగా అయిందట. ఆ పాపను ఆరు నెలలకు ఒకసారి చొప్పున మూడుసార్లు రమ్మన్నారట. అది మూడవ సారి వాళ్ళు రావడం. 

ఆర్యవైద్యశాలకు వైద్యం కోసం వచ్చిన ప్రముఖులలో రాష్ట్రపతి వి.వి.గిరి, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, జయప్రకాష్ నారాయణ్, ఇంకా సినీ నటులు ఉన్నారు.

2 comments:

  1. దురదృష్టం ఏమిటంటే సంప్రదాయికవైద్యాలపట్ల ప్రజలకు చిన్నచూపు వచ్చేలా ఉన్నాయి చదువుల తీరులు. ఇక మీరన్నట్లు అలోపతీ వైద్యంతో నయం కాక చేతులెత్తేసిన కేసులే ఈఅల్టర్నేటివ్ వైద్యాలకు వస్తారు. కానీ వారిక్కూడా తక్షణం ఫలితం కావాలన్న ఆశ ఐతే ఉంటుంది. దశాబ్దాలు అలోపతీ వైద్యంచేయించుకున్నాక వచ్చి కూడా రెండవ డోసు పడకముందే హోమియో వైద్యం పనిచేయటం లేదని పెదవి విరిచె రోగులూ రోగుల బంధువులూ నిత్యం కనిపిస్తూ ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. ఆయుర్వేదం, హోమియోపతిల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన మందు తీసుకున్న వెంటనే తగ్గిపోవాలని ఆశిస్తారు. ఆయుర్వేదంలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిశాక సంతోషమనిపించింది. త్వరలో అభివృద్ది సాధిస్తుందనే ఆశిద్దాం. ధన్యవాదాలు

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.