ఆ పార్క్ చివర రోడ్ దాటి వెళితే నడవడానికి వీలుగా పొడవాటి బ్రిడ్జి ఉంది. దానికి ఒకవైపు సముద్రం మరొక వైపు పొందిగ్గా ఉన్న వీధులు పెద్ద పెద్ద ఇళ్ళూనూ. అవన్నీ 17 శతాబ్దం లో కట్టినవి, పాడవ కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబట్టేమో ఈ మధ్యనే కట్టినంత కొత్తగా ఉన్నాయి.
ఈ ఊరేదో కళల కాణాచిలా ఉంది. ఎక్కడ చూసినా ఆర్ట్స్ గాలరీలు ఉన్నాయి. ప్రతిదీ చూడాలని ఉంది కానీ అప్పటికే దాదాపు మూడు గంటల నుండీ నడుస్తూనే ఉన్నాం.
ఈ బుట్టలు వట్టి గడ్డితో తయారుచేసినవి కావు, వీటికి ఏడు తరాల ఘన చరిత్ర ఉందిట. ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్న ఆఫ్రికన్ అమెరికన్ లు అక్కడ ఉన్నారు.
ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది, వింటుంటే "ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అన్న శ్రీ శ్రీ మహాప్రస్థానం గుర్తుకు వచ్చింది. మనసు వికలమైయ్యే ఆ ప్రదేశాల ఫోటోలు నేను తియ్యలేక పోయాను.
ఓపీకున్నంతసేపు తిరిగి సాయంత్రానికి హోటల్ కు వెళ్ళి రాత్రికి మళ్ళీ డౌన్ టౌన్ వెళ్ళాము. ఏ ఊరి డౌన్ టౌన్ అందాలు చూడాలన్నా రాత్రిళ్ళే వెళ్ళాలి మరి. పెద్ద హడావిడి లైట్స్ కాకుండా ఒక అక్కడక్కడా బుల్లి దీపాలతో చిన్న పల్లెటూరులా ఉంది. ఒకరిద్దరుగా నడుస్తున్నవాళ్ళు, గుంపుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడూ వాహనాలు తిరుగుతున్నాయి కానీ తక్కువ. సాయంత్రం ఆరు గంటలకే అన్ని షాప్ లు మూసేసారు. ఆ నిశ్శబ్దం కూడా బావుంది. భోజనం చేసి రాత్రి హోటల్ కు వెళ్ళాం.
ఉదాయాన్నే ఏవో చూసేసి మధ్యాహ్నానికి తిరిగి ఊరికి వెళ్ళే ఆలోచన. ఏం చూడచ్చు అని గూగుల్ చేస్తే ఏదో మేగ్నోలియా ప్లాంటేషన్ అని కనిపించింది. సరే అక్కడి వరకూ వెళ్ళి ఒక గంట ఉండి వెళదాం అనుకున్న వాళ్ళం మధ్యాహ్నం రెండు గంటల వరకూ అక్కడే ఉన్నాం. కాలం అక్కడే ఆగిపోతే బావుండును అనిపించింది. అప్పుడు కూడా వర్షం పడడం వలన వెనక్కు రావాల్సి వచ్చింది.
బావున్నాయి కాదూ ఫోటోలు. నింపాదిగా వెళ్ళి రావడానికి బావుందా ఊరు. మళ్ళీ ఒకసారి వెళ్ళి, ఆర్ట్ గలరీలు, బీచ్, రైన్ బో ఇళ్ళు, మరోసారి మేగ్నోలియా ప్లాంటేషన్ చూసి రావాలి.
No comments:
Post a Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.