ఏప్రిల్ లో పాఠశాల వార్షికోత్సవం అంటూ నానా హైరానా పడి, ఇక కనీసం ఒక్క నెల రోజుల పాటు ఏ పనీ పెట్టుకోవద్దు అనుకుంటూ ఇలా కూర్చున్నామా, అప్పుడే మా మరిది “అన్నయ్యా, జూన్ లో యూరప్ వెళదామా?” అంటూ ఫోన్ చేసాడు.
యూరప్ వెళ్ళాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుని, అక్కడకు ఏ సీజన్లో వెళితే బావుంటుందో చూసుకోవాలి. ఆ తరువాత ఏ ట్రావెల్ ఏజంట్ నో పట్టుకుని, ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే కనీసం ఆరునెలలైనా పడుతుంది. అలాంటిదేమీ లేకుండా మా మరిది వెళదామా అనగానే సరే అనేసాం. వెళ్తున్నది యూరపా లేదా ఆఫ్రికానా అని కాదు ఇలా ఫామిలీతో కలసి వెళ్ళే అవకాశం వచ్చింది కదా అదీ సరదా. మా పిల్లలకు మాత్రం రావడానికి వీలు కాలేదు.
ఆ విధంగా ఇండియా నుండి మా మరిది వాళ్ళు, పిల్లలు, అమెరికా నుండి మేము బయలుదేరి ఆస్ట్రియా దేశంలోని వియన్నా పట్టణంలో కలిసేట్లు, అక్కడి నుండి చెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రాగ్ వెళ్ళేట్లుగా మొత్తం ఆరు రోజుల ప్రయాణం అనుకున్నాం.
షార్లెట్ నుండి వియన్నాకు టికెట్స్ చూస్తే ఇండియాకి వెళ్ళే టికెట్స్ కంటే ఎక్కువ ఖరీదులో ఉన్నాయి. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం, మరో నాలుగు రోజులు అక్కడే ఉండి, యూరప్ లోని మరి కొన్ని ప్రాంతాలు చూస్తేనో అనిపించింది.
వియన్నా, ప్రాగ్ రెండూ యూరప్ మధ్యలో ఉన్నాయి. మ్యాప్ మధ్యలో సున్నా చుట్టి ఉన్నాయి చూడండి. వాటికి కొంచెం దగ్గరగా ఉన్న ప్రదేశాలు నెదర్ లాండ్స్, స్విట్జర్ లాండ్, ఇటలీ, గ్రీస్. ఇవన్నీ ఆస్ట్రియాకు తలా ఒక వైపున ఉన్నాయి.
ఎక్కడకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడం కష్టమే అయింది. ఒక వారం రోజులు గూగుల్ లో వెతికి, యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇటలీ, స్విట్జర్లాండ్ అయితే బావుంటుందని అనుకున్నాం. మరో రెండు వారాల పరిశోధన తరువాత ఇటలీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ విధంగా జూన్ లో రెండు వారాల పాటు యూరప్ ప్రయాణం నిర్ణయమయ్యింది.
ఇటలీలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అందులో వెనిస్, ఫ్లోరెన్స్, రోమ్, నేపల్స్ ఈ ప్రాంతాలు ముఖ్యమైనవి. ఇటలీ వెళ్తూ మిలాన్ వెళ్ళరా అని ఆశ్చర్యంగా అడిగింది మా అమ్మాయి. మిలాన్ పక్కనున్న లేక్ కోమో చాలా బావుంటుందట. సరే అని దాన్ని కూడా కలిపాము. జూన్ రెండవ తేదీన షార్లెట్ నుండి వియన్నాకు, తిరుగు ప్రయాణం జూన్ పద్దెనిమిదిన నేపల్స్ నుండి షార్లెట్ కు టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇదంతా పూర్తయ్యసరికి పదిహేను రోజులు పట్టింది, అంటే అప్పటికి ఏప్రిల్ మధ్యకు వచ్చేసాము.
అక్కడ ఏమేమి చూడాలో చూసిపెట్టు, నేను రాగానే హోటల్స్ అవీ బుక్ చేద్దాం అంటూ పది రోజుల పాటు కాన్ఫరెన్స్ కు వెళ్ళిపోయారు అయ్యగారు. అట్లా జీవితంలో మొట్టమొదటి సారి నేనే ట్రిప్ ప్లాన్ చేయ్యాల్సి వచ్చింది. అదెంత పని ఈజీ అనుకుంటూ పని మొదలు పెట్టాను.
ఒక్కొక్క ఊరిలో ఏమేమి చూడాలి? అవి చూడడానికి ఎంత సమయం పడుతుంది? ఒక రోజులో ఎన్ని చూడగలం? ఆ ఊర్లకు పక్కనే ఉన్న చూడవలసిన ప్రదేశాలకు వెళ్ళడం ఎలా? ఇలాంటి విషయాల మీద యూట్యూబ్ లో చక్కటి వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుని పది రోజుల తరువాత తను వచ్చాక వీటన్నిటి గురించి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడానికి మరో వారం పట్టింది. అప్పటికి దాదాపుగా ఏప్రిల్ చివరకు వచ్చేసాం.
ముందుగా వియన్నా, ప్రాగ్ వెళ్తున్నాం కదా. ప్రాగ్ నుండి మిలాన్ కు ఫ్లైట్ లో వెళ్ళి, అక్కడ మూడు రోజులు ఉండి ఒక రోజు ఆ ఊరిలో చూడవలసినవి చూసి, తరువాత రెండు రోజులూ లేక్ కోమో, వెనిస్ డే ట్రిప్స్ లా వెళ్ళి రావడం.
ఆ తరువాత ఫ్లోరెన్స్ వెళ్ళి, అక్కడ మూడు రోజులు ఉండడం. అక్కడి నుండి చింకు టెర్రా, పీసా టవర్, లూకా, సియన్నా లాంటి ఊర్లకు డే ట్రిప్స్ లా వెళ్ళి రావడం. ఆ తరువాత రోమ్, అక్కడ మూడు రోజులు ఉండి వీలయితే పాంపే, ఆమాల్ఫీ కోస్ట్, కాప్రి ఐలెండ్స్ లాంటివి చూద్దాం అనుకున్నాం.
అంటే మిలాన్, ఫ్లోరెన్స్, రోమ్ ఈ మూడు ఊర్లలో ప్రతి ఊరిలోనూ మూడు రోజులు ఉండి ఆ ఊర్లు, వాటి చుట్టుపక్కల ప్రాంతాలు చూసేలాగా అన్నమాట. ట్రిప్ భలేగా ప్లాన్ చేసాం అనుకుంటున్నారు కదూ! మేమూ అలాగే అనుకున్నాం, రిక్ స్టీవ్స్ వీడియోస్ (Rick Steves' Europe - YouTube) చూసే వరకూ. ఇంతకూ రిక్ స్టీవ్స్ ఎవరో చెప్పనేలేదు కదూ! అమెరికన్ ట్రావెల్ రైటర్. తను యూరప్ మీద ట్రావెల్ సిరీస్ తీసారు.
ఇటలీ ఏ సీజన్ లో అయినా బావుంటుంది కానీ, మే, జూన్ లలో ఎక్కువ చలి, వేడి లేకుండా వెళ్ళడానికి ఇంకా బావుంటుంది. అయితే అమెరికా, యూరప్ లలో కాలేజీలు, స్కూళ్ళకు వేసవి సెలవులు అప్పుడే మొదలవుతాయి. ఆ నెలల్లో టూరిస్ట్ లు ఎక్కువగా వస్తుంటారు. ప్యాకేజ్ టూర్ బస్ లు, క్రూజ్ షిప్స్ ఆ ప్రాంతాలకు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు లోపల వెళ్ళిపోతాయి. రష్ లేకుండా ఉండాలంటే ఉదయం ఎనిమిది లోపల మ్యూజియమ్స్ కు వెళ్ళి సాయంత్రాలు ఐదు గంటల తరువాత ఊర్లు చూడాలిట. ఇదంతా తెలియని మేము ప్యాకేజ్ టూర్ తీసుకున్నట్లు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. రిక్ స్టీవ్స్ వీడియో చూసాక ప్లాన్ మార్చాం.
ప్రాగ్ నుండి ఉదయాన్నే ఫ్లైట్ లో మిలాన్ కు వెళ్ళి అక్కడ ఒక్క రోజే ఉండి తరువాత రోజులు వెనిస్, ఫ్లోరెన్స్, రోమ్, నేపల్స్ లో ఉండేలా ప్లాన్ చేసాం. చింక్యు టెర్రా లో ఒక్క రాత్రి అయినా ఉంటే చాలా బావుంటుంది కానీ మా తొమ్మిది రోజుల ఇటలీ ప్రయాణంలో అది కుదిరేలా లేదు. అలగే లేక్ కోమో కూడా.
కొన్ని దగ్గర హోటల్స్, కొన్ని దగ్గర అపార్టెంట్స్ బుక్ చేసాం. ప్రాగ్ నుండి మిలాన్ కు ఫ్లైట్ మిగిలిన అన్ని ఊర్లకు ట్రైన్స్ టికెట్స్ తీసుకున్నాం. కొన్ని మ్యూజియమ్స్ కు ఎంట్రన్స్ టికెట్స్, టూర్స్ కూడా బుక్ చేసికున్నాం.
తరువాత భాగం ఇక్కడ చదవండి.
No comments:
Post a Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.