ఈ పోస్ట్ కు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
మేము ఉంటున్న అపార్ట్మెంట్ కు ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కితే ఐదు నిముషాలలోనే స్పానిష్ స్టెప్స్ వచ్చాయి. పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టిన మెట్లవి, మొత్తం నూట ముప్పై ఎనిమిది. అప్పట్లో అది కవులు, రచయితలు, ఫోటో గ్రాఫర్స్, మోడల్స్ కు సమావేశ స్థలం. ప్రస్తుతం కూడా టూరిస్ట్ లతో సందడిగా ఉంది. ఆ మెట్ల పైకి వెళ్ళి చూస్తే ఊరంతా కనిపిస్తోంది. ఆ మెట్లు ఎక్కడానికి టికెట్ ఏమీ లేదు కానీ ఆ మెట్ల మీద కూర్చుంటే మాత్రమే రెండు వందల యాభై యూరోలు జరిమానా వేస్తారట.
పియజ్జా డి స్పాన్యా లో ఆ స్టెప్స్ ముందు ఒక పడవ లాంటి ఫౌంటెన్ ఉంది, దాని పేరు ఫౌంటానా డెల్లా బార్చా(Fontana della Barcaccia). పదహారవ శతాబ్దంలో ఆ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఒక పడవ కొట్టుకుని వచ్చి అక్కడ ఆగిపోయిందిట. దానికి గుర్తుగా ఆ ఫౌంటెన్ కట్టారు.
అక్కడ మరో విశేషం కూడా ఉంది, ప్రముఖ కవి జాన్ కీట్స్ ఆ మెట్లకు మధ్యలో ఒక పక్కగా ఉన్న ఇంట్లో ఉండేవారు. అతనికి టిబి వచ్చినప్పుడు డాక్టర్ సలహా మీద రోమ్ కు వచ్చి అక్కడ ఉన్నాడట. ఆ ఫౌంటెన్ శబ్దం వింటూ అతను ఆఖరి రోజులు గడిపాడు. పాపం పాతికేళ్ళకే అతని జీవితం ముగిసిపోయింది. అతనున్న ఇంటిని ఇప్పుడు మ్యూజియమ్ చేసారు.
https://www.italy-travels.it/
అంతకు ముందే వర్షం పడడం వలన వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. ఒక దగ్గర చెస్ నట్స్ వేపుతున్నారు. అవి తీసుకుని తింటూ ట్రెవి ఫౌంటైన్(Trevi Fountain) వైపు నడవడం మొదలు పెట్టాము.
క్రీస్తుపూర్వం పంతొమ్మిదవ సంవత్సరంలో రోమ్ కు నీటి సరఫరా కోసం ట్రెవి ఫౌంటెన్ కట్టారు. ట్రెవి అంటే మూడు, మూడు రోడ్ల కూడలిలో కట్టిన ఫౌంటెన్ అది. పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పుడున్న ఫౌంటెన్ స్థానం లోనే ఎనభై ఆరు అడుగుల ఎత్తు, నూట అరవై అడుగుల వెడల్పుతో బొరాక్ స్టైల్ లో ఒక కొత్త ఫౌంటెన్ ను కట్టారు.
ఆ ఫౌంటెన్ మీద చాలా విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న పెద్ద విగ్రహం భూమిని చుట్టిన నీటికి సంబంధించిన దేవుడు, ఓసియనస్ (Oceanus). అతని రథం ఒక పెద్ద గవ్వలాగా ఉంది. ఆ రథానికి ఉన్న రెండు నీటి గుర్రాలలో ఒకటి శాంతంగా మరొకటి రౌద్రంగా ఉన్నాయి. అంటే అవి నది, సముద్రాలను ప్రతీకలన్నమాట. ఆ గుర్రాలను లాగుతూ ఇద్దరు రథసారధులు. ఓసియనస్ కు ఎడమ వైపునున్న విగ్రహం సౌభాగ్య దేవత, అబన్డాన్షా(Abundance). ఆ విగ్రహానికి పై నున్న విగ్రహం రోమ్ నగరానికి నీళ్ళు తేవడానికి కంకణం కట్టుకున్న, అగ్రిఫ(Agrippa). కుడి వైపునున్న విగ్రహం ఆరోగ్య దేవత, సలుబ్రిటస్(Salubritas). రోమ్ నగరానికి నీటి ఎద్దడి వచ్చినప్పుడు వర్జిన్ మైడన్ నగరానికి పద్నాలుగు మైళ్ళ దూరంలో నీటిని చూపించిందట. సలుబ్రిటస్ విగ్రహం పైన, వర్జిన్ మైడన్, సైనికుల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటి పైన ఉన్న నాలుగు శిల్పాలలోని ఒకరు పండ్లు , ఒకరు పువ్వులు, ఒకరు గోధుమలు, మరొకరు ద్రాక్ష వైన్ పట్టుకుని వున్నారు. అవన్నీ భూమి, నీరు ద్వారా వచ్చే వనరులు. అన్నింటి కంటే పైన ఈ ఫౌంటెన్ పాప్ క్లెమెన్స్ IIX(Pope Clemens XII) ఆధ్వర్యంలో కట్టిందనడానికి గుర్తుగా సింహాసనం ఉంటుంది. ఈ ఫౌంటెన్ ను ఇంత అర్థవంతంగా డిజైన్ చేసిన వారు నికోలా సాల్వి(Nicola Salvi). ఆ ఫౌంటెన్ ను కట్టడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది.
ఇటాలియన్స్ కు ఒక ఆసక్తి కరమైన నమ్మకం ఉంది. ఆ ఫౌంటెన్ లోని నీళ్ళలో కనుక ఒక నాణాన్ని వేస్తే తిరిగి రోమ్ కు వస్తారని, రెండు నాణాలు వేస్తే ఇటాలియన్ తో ప్రేమలో పడతారని, మూడు నాణాలు వేస్తే ఆ ప్రేమించిన వారితో పెళ్ళి అవుతుందని నమ్ముతారు. ఆ నమ్మకంలో నిజమెంతో కానీ, ఆ ఫౌంటెన్ లోని కాయిన్స్ లెక్క పెడితే రోజుకి దాదాపు మూడు వేల యూరోలు ఉంటుందట. స్పానిష్ స్టెప్స్ దగ్గర కంటే ఎక్కువ మంది టూరిస్ట్ లు ఉన్నారు ట్రెవి ఫౌంటెన్ దగ్గర.
మేము హిస్టారిక్ సెంటర్ లో ఉన్నందువలనేమో ఎటు చూసినా చక్కని ఆర్కిటెక్చర్ తో బిల్డింగ్స్, పియజ్జాలు. హిస్టరిక్ సెంటర్ కాకుండా రోమ్ మిగలిన దగ్గర ఎలా ఉంటుందో చూడాలని దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కు వెళ్ళి బస్ ఎక్కాము. ఎక్కడికి అని ఏమీ లేదు అది ఎక్కడకు తీసుకుని వెళితే అక్కడికి. హిస్టారిక్ సిటీ దాటిన తరువాత కూడా బిల్డింగ్స్ చక్కని ఆర్కిటెక్చర్ తో చాలా అందంగా ఉన్నాయి. ఒక అరగంట అలా ప్రయాణం చేసి బస్ దిగి మెట్రో ఎక్కి తిరిగి రూమ్ కు వచ్చాము. అలా ఇక్కడకు వెళ్ళాలి ఇది చెయ్యాలి అని ప్రణాళికలేమీ లేకుండా గమ్యం లేని ప్రయాణం బావుంది.
రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ అయి సాయంత్రం డిన్నర్ కు గాంధీ టూ రెస్టారెంట్ కు వెళ్ళాం. గాంధీ అనే పేరు చూసి వెజిటేరియన్ రెస్టరెంటేమో అనుకున్నాం కానీ కాదు. గార్లిక్ చికెన్, టమోటో చాట్ తీసుకున్నాం. మా పక్క టేబుల్ లో ఫిలడెల్ఫియా నుండి వచ్చిన ఒక యువ జంట కనిపించింది. వాళ్ళు మాలాగే స్వ౦తంగా ఇటలీ చూడడానికి వచ్చారట. వాళ్ళ సలహా ప్రకారం టీ ఆర్డర్ చేసాం, మేము యూరప్ వచ్చాక అదే మొదటి సారి టీ తాగడం. అక్కడి నుండి వస్తుంటే ఒక పియజ్జా దగ్గర సందడిగా ఉంది. మేము కూడా మెకరూన్స్ తీసుకుని అక్కడే చాలా సేపు గడిపాము. మేము ఆ రోజే అక్కడకు వచ్చామని, ఆ ప్రాంతం అంతా మాకు కొత్తని అనిపించనే లేదు.
తరువాత రోజు ఉదయాన్నే ఆరు గంటలకల్లా బయలుదేరాం. అప్పటికి రోమ్ ఇంకా నిద్ర లేవలేదు. ఖాళీగా ఉన్న వీధులలో తిరుగుతూ, స్పానిష్ స్టెప్స్, ట్రెవి ఫౌంటెన్ కు మళ్ళీ ఒకసారి వెళ్ళి కావలసినన్ని ఫోటోలు తీసుకుని, ఎనిమిది గంటల వరకూ అక్కడే గడిపాము. రోమ్ లో ఇక్కడా అక్కడా అని ఏం లేదు ఎటు చూసినా అందమే.
అక్కడి నుండి దగ్గరలోనే ఉన్న విల్లా బొర్గీస్ గార్డెన్ కు వెళ్ళాం. చాలా పెద్ద గార్డెన్ అది, ఆ సమయంలో వాకింగ్ చేస్తున్న వాళ్ళు తప్ప ఎవరూ లేరు. అక్కడ, మ్యూజియమ్, సఫారీ, లేక్, ఫౌంటెన్స్, స్టాచ్యూస్ ఉన్నాయి. అక్కడ ఉన్న పంతొమ్మిదవ శతాబ్దం నాటి వాటర్ క్లాక్ ఇప్పటికీ నడుస్తోంది. ఆ గార్డెన్స్ ఎత్తులో ఉండడం వలన అక్కడి నుండి రోమ్ అందంగా కనిపిస్తోంది.
ఆ గార్డెన్ లోని కేఫ్ లో క్రొషంట్, కాఫీ తీసుకుని రోమన్ ఫోరం వైపు వెళ్ళే ట్రామ్ ఎక్కాము. మిగిలిన కబుర్లు తరువాత చెప్పుకుందాం.
No comments:
Post a Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.