కోర్టెజ్(Cortez) నుండి మాన్యుమెంట్ వ్యాలీ(Monument Valley)కి రెండు గంటల ప్రయాణం. అంతా ఎడారి, అక్కడక్కడా ఎత్తైన కొండలు దారి పక్కన ఏవో చిన్న చిన్న ఎడారి మొక్కలు తప్ప ఎక్కడా పెద్దగా చెట్లు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతం ఎంతో విశాలంగా కనిపించింది.
ఒక ముప్పావు గంట ప్రయాణం తరువాత ఫోర్ కార్నర్స్ మాన్యుమెంట్(Four Corners Monument) వచ్చింది. అది ఆరిజోనా (Arizona), యూటా(Utah), కొలరాడో(Colorado), న్యూ మెక్సికో(New Mexico) ఈ నాలుగు రాష్ట్రాలు కలసే అరుదైన ప్రదేశం. మేము ముందుగా అనుకున్న సమయానికి బయలుదేరగలిగితే అక్కడ ఆగే వాళ్ళం కానీ, బయలుదేరడమే ఆలస్యం అవడంతో అక్కడకు వెళ్ళలేకపోయాము.
పిక్చర్ కార్టెసీ: A Guide for Visiting Four Corners Monument - Ace Adventurer
మరి కొంతదూరం వెళ్ళేసరికి రోడ్ చివర ఎత్తైన కొండలు కనిపించాయి. ఆ రోడ్ మీదే ఫారెస్ట్ గంప్(Forest Gump) సినిమా తీసింది.
Picture Courtesy: Monument Valley - Wikipedia
మాన్యుమెంట్ వ్యాలీలో లో కొండలు కొన్ని చదరంగా పందిరి మంచల్లా (Mesas), ఇంకొన్ని గోపుర శిఖరల్లా (spires), మరి కొన్ని ఒంటి స్తంభం మేడల్లా(Buttes) ఉన్నాయి. ఆ కొండలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.
కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో సముద్రపు నీళ్ళు భూమి మీదకు వస్తూ ఉండేవి. ఆటుపోటుల కారణంగా ఆ నీళ్ళు రావడం, వెళ్ళడం జరిగేది. వచ్చిన ప్రతిసారీ కాస్త మట్టి, ఇసుక, గవ్వలు, ఖనిజాలు వదిలి వెళ్ళేవి. ఇలా రావడం పోవడం కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు జరిగినది. ఆ తరువాత ఆ ప్రాంతానికి వరదలు రావడం, తద్వారా కాలువలు ఏర్పడడం ఆ తరువాత అవి నదులుగా మారడం వీటన్నిటి వలన మరికొంత మట్టి, బురద చేరడం జరిగింది. ఆ ఇసుక మట్టి, ఖనిజాలు కలిసి రాళ్ళుగా మారడం మొదలైంది.
ఆ తరువాత భూమిలో ఏమి మార్పు వచ్చిందో ఏమో ఆ ప్రాంతం అంతా అమాంతంగా పైకి లేచింది. వర్షం, మంచు, గాలి, ఎండ వీటితో ఆ రాళ్ళు వివిధ రకాల ఆకారాలుగా రూపాంతరం చెందాయి. అక్కడి నదులు ఆ రాళ్ళ మధ్య వొరుసుకుని ప్రవహించడంతో కొండల మధ్య లోయలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతమే కొలరాడో పీఠభూమి. ఆ పీఠభూమిలోనే మేము ప్రయాణం చేస్తున్నది. ఎడారి లాంటి నేలపై ఒకప్పుడు సముద్రాలు, నదులు పారేవని తెలిసినప్పుడు “ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయనే” సామెత గుర్తొచ్చింది.
ఇంతకూ ఆ కొండలకు ఎరుపు రంగు ఎలా వచ్చిందో తెలుసా? సముద్రపు నీళ్ళు వదిలి వెళ్ళిన బురదలో ఉన్న ఐరన్, ఆక్సిడైజ్ అవడంతో అక్కడ ఇసుక, మట్టి కూడా ఆ రంగులోకి మారాయి. మేము మరీ పొద్దెక్కాక వెళ్ళాము కానీ, సూర్యోదయంలో కానీ సూర్యాస్తమయంలో కానీ వెళ్ళి ఉంటే ఆ ప్రాంతం అంతా ఇంకా అందంగా కనిపించేది.
మరో విషయం తెలుసా! మాన్యుమెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అమెరికాకు సంబంధించినది కాదు, నవాహో దేశానికి(Navajo Nation) చెందినది.
పద్నాలుగవ శతాబ్దంలో నవాహొ ఆదివాసీలు ఆ ప్రాంతానికి వలస వచ్చి, అక్కడే స్థిరపడ్డారు. వారు మట్టి, చెక్కతో ఇళ్ళు కట్టుకుని ప్రకృతిలో మమేకమై జీవనం సాగించేవారు. గుడారాల్లా ఉండే వారి ఇళ్ళను హోగాన్స్(Hogans) అంటారు. గొర్రెల పెంపకం వారి ప్రధాన ఆదాయం. ఆడవారు ఊలుతో బట్టలు, దుప్పట్లు లాంటివి అల్లేవారు, మగవారు వ్యవసాయం చేసేవారు. వారు నగలు తయారు చేయడంలో సిద్దహస్తులు. వీరు మాతృవంశ పద్ధతిని(matrilineal) అనుసరిస్తారు, అంటే వాళ్ళ వంశం తల్లి వైపు నుండి నిర్ణయించబడుతుంది. తల్లి నుండి కూతురికి ఆస్తి వస్తుంది. పెళ్ళైన తరువాత భర్త, భార్య ఇంటికి వెళ్తాడు.
తరువాత శతాబ్దాలలో వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు, మూడువందల మైళ్ళు నడిపించినటువంటి దారుణాలు కూడా జరిగాయి గానీ, చివరకు వారి ప్రాంతాన్ని వారు నిలబెట్టుకున్నారు. ఆ విధంగా నవాహొ దేశం వారికి స్వంతం అయింది.
ప్రస్తుతం అది అమెరికాలో ఉన్న మరో దేశం. ఇప్పటి నవాహో దేశం అభివృద్ది చెంది స్వంత గవర్నమెంట్ ఏర్పర్చుకుంది. నవాహో ప్రజలకు నవాహో, అమెరికా రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. ఆరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాలలోని కొంత భాగం నవాహొ దేశం కిందకు వస్తుంది.
ఈ ప్రయాణం తరువాత భాగం చదవలనుకుంటే ఇక్కడకు వెళ్ళండి.
No comments:
Post a Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.