తెలుగు తరగతి పిల్లలకి కథ చెప్తుండగా 'ఉమ్మడి కుటుంబం' గురించి కథలో ఓ ప్రస్తావన వచ్చింది. వాళ్ళకి వివరించి చెప్పాను, కానీ ప్రశ్నార్ధకాలు? "ఎలా వీళ్ళకు అర్ధం అవుతుందా?" అని ఆలోచించాను. ఏదైనా చూపించాలి, లేదా వాళ్ళకు హృదయానికి హత్తుకునేలా సరదాగా ఉండేలా చెప్పాలి. ఆ ప్రహసనంలో పుట్టిందే ఈ 'ఉగాది వేడుకలు'.
నాటిక వ్రాయడం మొదలెట్టగానే చిన్నప్పటి రోజులూ, బాబాయిలు, పిన్నులు, అత్తలు, నాన్నమ్మలు, తాతయ్యలు అందరూ ఎదురుగా వచ్చేశారు. మా వీధిలో తిరిగే పూలమ్మాయి పూల బుట్టతో సహా నా ముందుకు వచ్చి కూర్చుంది. 'ఆక్కూరలో' అని బయట లయబద్దంగా అరుపు వినిపించింది. అంతేనా 'అమ్మా పాలు' అని పాలబ్బాయి కేక, ఇలా అందరూ ఒక్కొక్కరుగా వచ్చేశారు. వీళ్ళతో పాటే సరదా సరదా సినిమా పిచ్చి గౌరి కూడా. వీళ్ళందరినీ పిల్లలకు పరిచయం చెయ్యాలని, చిన్నప్పటి పండుగలు, సరదాలు, మురిపాలు, ముచ్చట్లు అందరితో పంచుకోవాలని ఈ నాటికకు శ్రీకారం చుట్టాను.
తొలి విడతగా నాటకం వ్రాయడం పూర్తయ్యింది. ఈ స్క్రిప్ట్ స్నేహితులకు చూపించాను "బావుంది కాని ఈ తెలుగు రాని పిల్లలతో ఇంత పెద్ద నాటకమా?" అని సందేహం వ్యక్తం చేశారు. "అవును కదూ చేతిలో పెన్ ఉందని రాసుకుంటూ పోయాను. ఇప్పుడెలా?"
పిల్లలందరినీ పిలిచాము ఒక్కోరికి ఒక్కో కారెక్టర్ ఇచ్చాము. బావుంది... అదేం చేసుకోవాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళకెలా చెప్పాలో మాకూ తెలియలేదు. అసలే పదిహేను మంది పిల్లలు వాళ్ళ కారెక్టర్లకు ఎంచక్కా నవ్యమైన రీతిలో నామకరణం చేసేశాను. ఏ పేరు ఎవరిదో నాకే అర్ధం కాలేదు. "అలాక్కాదు కానీ జ్యోతీ, ముందు నువ్వీ పేర్లన్నీ మార్చేసి శుభ్ర౦గా వాళ్ళ పేర్లు పెట్టి తిరగవ్రాసెయ్" అని ఫ్రెండ్స్ చక్కాపోయారు.
వాళ్ళటు వెళ్ళగానే ఏడుపు మొహం వేసుకుని కూర్చున్నాను. ఈ కమామీషంతా చూస్తున్న శ్రీవారు అప్పుడు రంగంలోకి దిగారు. "అలాక్కాదమ్మడూ ఏదో చూద్దాంలే దిగులు పడకు" అంటూ..ఈ లోగా మరో ఫ్రెండ్ "ముందు వాళ్ళ వాయిస్ లు రికార్డు చేస్తే ఈజీగా ఉంటుందని" సలహా ఇచ్చారు. "వావ్ మా గొప్పగా ఉంది" అనుకుంటూ రికార్డింగ్ రూమూ, మైకూ, ఇంకా ఏమిటేమిటో అన్నీ సిద్దం చేసుకుని....పిల్లల్ని రికార్డింగ్ కి పిలిచాము. "ఒకళ్ళ తరువాత మరొకళ్ళు డయలాగ్స్ చెప్పేస్తారు చాలా ఈజీ" అనుకుంటూ.
ముందస్తుగా అతి చిన్న డయలాగ్స్ ఉన్న పాలబ్బాయిని పిలిచాము. "ఎండలకు గేదె నీళ్ళెక్కువగా తాగేసినట్టు౦దమ్మా, డబ్బులీయమ్మా బేగెల్లాలి ఇదీ డైలాగ్." చెప్పు నాన్నా అన్నాను.
"ఎండల్ కి గేద్" అని ఆపేసాడు. పది సార్లు "ఎండల్ గేద్" అయ్యాక మా వారికో 'బ్రహ్మాండమైన' ఇడియా తట్టింది. ఈ 'బ్రంహాండం' గురించి ముందు ముందు మావారికి బాగా అర్ధం అయిందిలెండి.
నాయనా సురేషూ నువ్వు ఇలా అనమ్మా అని,
ఎండ....లకి....గేదె.... నీళ్ళు.....ఎక్కువ.....గా .......తాగేసి....నట్టు.. ఉంది.......అమ్మా అని పదాలు విడివిడిగా రికార్డు చేయించారు. ఆ తరువాత అవన్నీ కలపి "ఎండలకి గేదె నీళ్ళు ఎక్కువగా తాగేసినట్టు ఉంది అమ్మా" అని వినిపించారు. ఈ విధంగా ఆ నాటకంలోని వాక్యాలు రూపు దిద్దుకున్నాయన్నమాట. ఇలా౦టి వాక్యనిర్మాణంలోని పెద్ద ఇబ్బంది పదానికి పదానికి మధ్య గ్యాప్ సరిగ్గా ఇవ్వాలి. ఇవ్విదంగా 'బ్రహ్మాండం' వారికి బాగా అనుభవమయ్యింది.
పదిహేను మంది పిల్లలకు రీటేకులతో ఓ ఇరవై ఫైళ్ళు తయారయ్యాయి. ఓ అందమైన వెన్నెల రాత్రి చేతిలో స్క్రిప్ట్ తో నేనూ, ఒళ్ళో లాప్టాప్ తో మావారూ కూర్చుని డైలాగ్స్ అన్నీ వరుసక్రమంలో పెట్టి ఆ చిన్నారి గొంతులు పలికిన తీరుకు మురిసిపోతూ, ముచ్చట పడిపోతూ ఎట్టకేలకు రికార్డింగ్ ని ఓ కొలిక్కి తీసుకొచ్చాం. అంతలో ఎలా అయిపోతుందీ శబ్దాలు అదేనండీ సౌండ్ అఫెక్ట్స్ చీపురుతో ఊడుస్తున్నట్టు, పాలు చెంబులో పోస్తున్నట్టు, నీళ్ళతో కాళ్ళు కడుగుతున్నట్లు, సైకిలు బెల్లులు, మువ్వల శబ్దం ఇలా. అన్నీ బావున్నాయి మజ్జిగ చిలుకుతున్న శబ్దం ఎక్కడా కనిపించలా. ఎంచక్కా పెరుగు గిన్నెలో కవ్వమేసి చిలికేసి, ఆ శబ్దం రికార్డు చేసేసి, అటుపిమ్మట ఆ మజ్జిగలో నిమ్మకాయ పిండేసి, ఆహా ఓహో అనుకుంటూ తాగుతూ ఆ ఆడియో రికార్డింగ్ ని ఎంజాయ్ చేశామన్నమాట.
ఇక ప్రాక్టీసులు. మళ్ళీ పిల్లలందరినీ పిలిచి రికార్డు చేసింది వినిపించి ఇక కానివ్వండన్నాం. తెలుగులో వాళ్ళ గొంతులు వినేసుకుని నవ్వేసుకున్నారు తప్పితే పని జరగాలా. మళ్ళీ "కట్ కట్" అని తీవ్రంగా ఆలోచించాక కథను సీన్లుగా విడగొట్టాలని అర్ధం అయ్యింది. ఒక్కో సీను చేసి చూపించాను. చిన్న సీన్లు అంటే తక్కువ మంది స్టేజి మీద ఉండే సీన్లు బాగానే ఉన్నాయ్. మరి ఎక్కువమంది ఉన్నప్పుడో మళ్ళీ తికమక మొదలయ్యింది ఆ తికమకలో సీనుకి "స్క్రీన్ ప్లే" ఉండాలని అర్ధం అయ్యింది. స్టేజి మీద పిల్లలు ఎక్కడి నుండి రావాలో ఎక్కడ నిలబడాలో అన్నీ గీసి చూపించాను. అప్పటికి నా బుర్రలో ఏముందో వినే వాళ్లకి అర్ధం అయ్యింది.
మరి మాటలు సరే, పాటలవీ ఉంటే బావుంటుంది కదా. అసలే మన తెలుగు అసోసియేషన్ ప్రోగ్రామ్స్ లో "ఆ అంటే అమలా పురం" పాటలకి చిన్న పిల్లల హావభావాలూ, నృత్యాలూ చూసి తలలు ది౦చేసుకు౦టున్నాం. కొంచెం తల ఎత్తుకునే లాగ "చెమ్మ చెక్క, ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ, ఉగాది పండగ ఒచ్చింది" లాంటి పాటలతో పిల్లలకు అభినయం నేర్పించాము. కొంచెం సరదాగా మా గౌరి 'సోగ్గాడే సోగ్గాడు' పాటకు డాన్స్ కూడా చేసింది. ఇది మీరు చూసి తీరాల్సిందేన౦డోయ్.
నాటకానికి కావాల్సిన వస్తువులు లడ్లు, కవ్వం, విస్తర్లు, మజ్జిగ్గిన్నె, పాల కేను, పూల బుట్ట, కూరగాయలు, తాతయ్యకు చేతి కర్ర, గౌరికి చీపురు, అమ్మకు ముగ్గు ఇలా చదువుకుంటూ పోతే చాలా చాలా..... లడ్లు న్యూస్ పేపర్ ఉండ చేసి ప్లేడో తో పాకం పట్టేసా. నిజం పాకం కాదు లెండి రౌండ్ గా చుట్టేసా. విస్తర్లు వాల్ మార్ట్ లో గ్రీన్ ప్లేస్ మేట్లు దొరికాయి. కవ్వం, పాల కాను ఇల్లిల్లూ గాలించి పట్టాం. ఇలా కూర, నారా, బుట్టా తట్టా, పూలూ పళ్ళూ, గిన్నెలు, గరిటెలు, గ్లాసులతో ఆడిటోరియంకు వెళ్ళడానికి రెడీ అయిపోయాం.
అసలు రిహార్సల్స్ అప్పుడు మొదలయ్యాయి. కొన్ని డైలాగ్స్ పిల్లలకంటే ముందుగా వచ్చేస్తున్నాయ్. కొన్ని నింపాదిగా వస్తున్నాయ్. మళ్ళీ ఎడిటింగు. ఇవ్విదంగా చివరాఖరకు నాటకం రికార్డింగు పూర్తయ్యింది. ఇక ప్రోగ్రాం రెండు వారాల్లోకి వచ్చేసింది, పిల్లలందరూ బాగా చేస్తున్నారు. అనుకోని అవాంతరం.. నాటకంలో పెదనాన్నకి చెస్ టోర్నమెంట్ నాటకం రోజేనని తెలిసింది. హతవిధీ! ఇంకేముంది మరో పెదనాన్నని వెతికి, కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒప్పించాం. ఈ లోగా తాతగారు మరో విషయం చెప్పారు సైన్స్ ఒలంపియాడ్లో రీజెనల్స్ లో విన్ అయితే స్టేట్స్ వెళ్ళాలట అది కూడా ప్రోగ్రాం రోజేనట. సీక్రెట్ గా పోలేరమ్మకి పొంగళ్లవీ పెట్టి, విన్ అవకుండా చేసామనుకోండి.
డ్రెస్ రిహార్సల్స్..ఓ ఇద్దరు తప్ప మిగతా పిల్లలందరూ కూడా పది ఏళ్ళ లోపు వారూ, పొట్టి పొట్టి జీన్సుల వారూను. వారికి ఇదు మీటర్ల చీరలు చుట్టబెట్టే మహత్తర బాధ్యతని వారి తల్లులు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. డ్రెస్ రిహార్సల్స్ రోజు అమ్మమ్మ ముచ్చటైన చిలక పచ్చ రంగు లంగా ఓణీలో బాపు బొమ్మలా ప్రత్యక్షమైంది. అది చూసి ఢామ్మని పడబోయి ప్రోగ్రాం గుర్తొచ్చి ఆగిపోయాను.
"అమ్మడూ ఏంటి నాన్నా డ్రస్సూ?"
"అమ్మమ్మ పంపించి౦దాంటీ. ఇట్స్ నైస్" అంది.
"డ్రెస్ బావుంది కాని నువ్వు అమ్మమ్మవి కదా చీర కట్టుకోవాలి." అన్నా కొంచెం జంకుతూ.
"హా.... ఇ డోంట్ లైక్ దట్." అంది.
"పోనీ అదే ఉంచేయండి మొడెర్న్ అమ్మమ్మలా ఉంటుంది." ఆ తల్లి కోరిక.
మరో నాటకం వ్రాస్తానని దానిలో ఆ అమ్మాయికి ఆ లంగా ఒణీనే వేయిస్తానని ప్రమాణాలు చేసి మెల్లగా తల్లీ కూతురిని ఒప్పించి ఆ పూటకి గండం గట్టెక్కి౦చాను. తెల్లజుట్టుకు మాత్రం తిలోదకాలే.
ఈ నాటికలో ఓ బంతి భోజనాల కార్యక్రమం పెట్టాం. ఆడపిల్లలందరూ విప్లవం లేవదీసారు. "ఆంటీ ఎప్పుడూ మేమే ఒడ్డించాలా? అలా కుదరదు ఈ సారి మేం కూర్చుటాం బోయ్స్ ని ఒడ్డించమనండి" అని. వాళ్లకి నాటకం అయిపోగానే మగపిల్లలతో వడ్డన కార్యక్రమం పెట్టిస్తామని నచ్చచెప్పి ఆ సీను చేయిస్తున్నాం. ఒళ్ళు మండిన ఆ పూర్ణమ్మలు నిలబడి ప్లేట్లలోకి పదార్ధాలను ఫ్రిజ్బీల్లా విసరడం మొదలెట్టారు. ఇది రేపు నాటకమనగా ఈ వేళ రాత్రి సన్నివేశమన్నమాట. ఇలా చేస్తే మన నాటిక పరువు పోతుందిరా అమ్మళ్ళూ... నా మాట వినండి అమ్మల్లారా... అని భోరున విలపించాను. వారు కరుణి౦చారో లేదో నాకు స్టేజి మీద కాని తెలియదు.
ప్రోగ్రాం టైం అయింది పిల్లలందరూ చిన్నవాళ్ళు "ఎలా చేస్తారో? ఏమిటో" అని ఒకటే టెన్షన్. నాటిక మొదలయ్యింది. ఏ సీను దగ్గర ఏ పిల్లల్ని స్టేజి మీదకు పంపించాలో చూసుకునే హడావిడిలో నాటిక సరిగా చూడనే లేదు. నాటిక అవగానే ఆగకుండా రెండు నిముషాలు పాటు మోగిన చప్పట్లు కళ్ళు చేమర్చేలా చేశాయి. అప్పటి భావాలకు ప్రతిరూపాలే '
సంకల్పం', '
పూలు గుసగుసలాడేనని 'నూ. ఆ తరవాత '
దసరా సంబరాలు', '
వెళ్ళాలని వుంది కానీ....' అనే నాటికలకు స్పూర్తి కూడా ఆ చప్పట్లే.
మా ప్రయత్నాలన్నిటికీ కూడా సంపూర్ణ సహకారల౦దిస్తున్న నా ప్రియ మిత్రులకు, మా ఊరి తెలుగు ప్రజలకు బ్లాగ్ముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నాటకం కొరకు బాపు బొమ్మల నేపధ్యంలో ఏకంగా వాకిలినే స్టేజ్ మీద నిలిపిన నా నేస్తానికి ప్రత్యేక ధన్యవాదాలు.
అంతా బాగానే ఉంది ఈ రామాయణం ఏమిటనుకుంటున్నారా? బంగారు జింకను అడిగిన సీతకు ఆ రాముడు తెచ్చివ్వలేక పోయాడు. నా రాముడు నే మనసుపడిన ప్రతి పని వెనుక తోడై వుండి వీటన్నింటినీ విజయపథం వైపు నడిపిస్తున్నాడు.
కొస మెరుపు
తెలుగు మాట్లాడని పిల్లలు కూడా నాటకం పూర్తయ్యేటప్పటికి అందరి డైలాగ్స్ చెప్పడమే కాక
"ఎన్నాళ్ళయిందక్కా మిమ్మల్నందరినీ చూసి",
"డబ్బులీయమ్మా బెగెల్లాలి"
"ఇలా ఇంటి భోజనం చేసి ఎన్నాళ్లయ్యిందో"
లాంటి వాక్యాలు ఇంట్లో ప్రయోగించడం మొదలు పెట్టారు...
నాటకంలో అమ్మ నిజం అమ్మకి ఉగాది పచ్చడి చేయడం నేర్పించింది.
"మా అమ్మాయి అడిగిన డబ్బులివ్వకుండా బేరాలు, పైగా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు" అని కూరలమ్మే వాళ్ళమ్మ, అడపా దడపా నా కవితలు చదివే నా బెస్ట్ ఫ్రెండ్ కూడానూ, బ్లాగును చూడమన్నా చూడక తన నిరసన వ్యక్తం చేశారు.
ఈ నాటకం చూసిన మా నాన్నా "అరేయ్ జ్యోతీ, కూరగాయలు ఇండియాలో కన్నా అమెరికాలోనే చీప్ గా ఉన్నాయే" అని వ్యాఖ్యానించారు. గౌరీ వాళ్ళ తాతగారు ఇంటికి ఎవరొచ్చినా ఓ సారి ఈ వీడియొని చూపించకుండా పంపించట్లేదట.
ఇందులో పాల్గొన్న పిల్లలందరూ మా తెలుగు తరగతి విద్యార్ధులు.