Friday, January 13, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 3

కొట్టకల్ ఆర్యవైద్యశాల - 2 

మూడవ రోజు ఉదయం ఆరు గంటలకు పార్క్ కు వెళ్ళాం. కొంతమంది పార్క్ లో నడుస్తున్నారు, ఒకరిద్దరు యోగా చేస్తున్నారు, ఇద్దరు ఫారినర్స్ గడ్డిలో చెప్పులు లేకుండా వట్టి కళ్ళతో నడుస్తున్నారు. అన్నట్టు అక్కడ వారానికి మూడు రోజులు యోగా ఇన్స్ట్రక్టర్ వచ్చి యోగా నేర్పిస్తారు. ఎక్కువగా పేషంట్స్ ఉంటారు కాబట్టి చిన్న చిన్న స్ట్రెచస్ మాత్రమే చేయిస్తున్నారు. 

అక్కడ ఒక గంటసేపు ఉండి ఈసారి సెంటినెల్ లో ఉన్న కాంటీన్ కు వెళ్ళాం. అది అనెక్స్ లోని కాంటీన్ కంటే పెద్దది, కొంచెం రష్ గా ఉంది. ఖాళీ టేబుల్ చూసి కూర్చున్నాం. అక్కడ బ్రేక్ ఫాస్ట్ మెనూలో వడ కూడా ఉంది. రాగి పుట్టు, తట్టు దోశ తీసుకున్నాం. రాగి పుట్టుతో శనగల కూర ఇచ్చారు, బావుంది. పుట్టు అదే మొదటిసారి తినడం. ఆవిరితో ఉడికిన పుట్టు ఆరోగ్యానికి మంచిదట. తట్టు దోశలు, పలుచని కొబ్బరి పచ్చడితో ఇచ్చారు, మెత్తగా బావున్నాయి.  
సాయంత్రం హాస్పిటల్ దాటి బయటకు వెళ్ళాం. హాస్పిటల్ కు కుడి వైపున చాలా షాప్స్, బేకరీస్ ఉన్నాయి. దగ్గరలోనే ఒక షాప్ లో అన్నిరకాల పండ్లు, కూరగాయలు దొరుకుతున్నాయి. అక్కడ పర్సిమన్స్ చూసి ఆశ్చర్యపోయాము, ఎందుకంటే అవి ఇండియాలో దొరుకుతాయని తెలియదు. సీతాఫలాలు, థాయ్ లాండ్ జామకాయలు, పర్సిమన్స్ తీసుకున్నాము. వంట చేసుకోవడానికి కావలసిన సరుకులు కూడా దొరుకుతున్నాయి. హాస్పిటల్ కు ఎడమ వైపున కొంచెం దూరంలోనే బట్టల షాప్, స్పైసెస్ షాప్, కొరియర్ సర్వీస్, కొబ్బరి బోండాలు అమ్మే షాప్ కనిపించాయి. 



అన్నట్లు మరిచే పోయాను, హాస్పిటల్ లో ప్లాస్టిక్ బాగ్ లు నిషిద్దం. మేము ఇంటి నుండి వచ్చేటప్పుడే హైకింగ్ కు వెళ్తే పనికొస్తాయని రెండు డ్రా స్ట్రింగ్ బాగ్స్ తెచ్చుకున్నాం. హైకింగ్ కాదు కదా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ సేపు వాకింగ్ కూడా చేయకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. మా బాగ్స్ అలా పండ్లు తీసుకుని రావడానికి ఉపయోగ పడ్డాయి. అక్కడ ఉన్నన్ని రోజులూ పండ్లు, కొబ్బరి బోండాలే మా చిరుతిండి.

అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు, నవలలు, జీవిత చరిత్రలు, పత్రికలు ఇలా అనేక పుస్తకాలు ఉన్నాయి. అక్కడ విపుల, చతుర, ఆంధ్రభూమి, గోదావరి కథలు, పాలగుమ్మి పద్మరాజు రచనలు, విజయానికి ఐదు మెట్లు లాంటి తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. లైబ్రరీలో కూర్చుని చదువుకోవచ్చు లేదా పుస్తకాలు రూమ్ కి తెచ్చుకోవచ్చు.

అక్కడ లైబ్రేరియన్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారు. అతను ఇరవై ఏళ్ళ నుండి అక్కడ పనిచేస్తున్నారట, ఆర్యవైద్యశాల గురించి చాలా వివరాలు చెప్పారు. వైద్యశాలలో రెండు వందల ముప్పై గదులు ఉన్నాయి, దాదాపుగా నాలుగు వందల మంది ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రూమ్ రెంట్ లో తేడా ఉన్నా ట్రీట్మెంట్ చార్జెస్ అందరికీ ఒకటే. అందరూ డాక్టర్స్ అన్ని వార్డ్స్ కు వెళతారు.  
కొట్టకల్ ఆర్యవైద్యశాలలు కొట్టకల్ లోనే కాక కొచ్చిలో రెండు, డిల్హీ లో ఒకటి ఉన్నాయి. ఇండియాలో మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలలో క్లినిక్స్ కూడా ఉన్నాయి. కొట్టకల్ లో వంద గదులున్న మరో బిల్డింగ్ మార్చి నుండి ప్రారంభం అవుతుంది.  
అక్కడ ఉద్యోగులకు రోజుకు నాలుగు రూపాయలకే భోజనం, టిఫిన్, టీ ఇస్తున్నారు. అక్కడ పనిచేసే వారి కుటుంబాలకు మెడికల్ ఖర్చులన్నీ ఉచితం. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే తప్ప అక్కడ పనిచేసే వారు ఎవ్వరూ ఉద్యోగం వదిలి వెళ్ళరు. మసాజ్ చేసే వాళ్ళకు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేషన్ పూర్తి చేసాక మిగిలిన బ్రాంచ్ లకు పంపిస్తున్నారు.

ఈ హాస్పిటల్ ను ప్రారంభించిన పి.యస్.వారియర్ గురించి చెప్పారు. ఆర్యవైద్యశాల ఒక హాస్పిటల్ మాత్రమే కాదు ఒక సంస్థ అనీ, ఆ సంస్థలో హాస్పిటల్స్, క్లినిక్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్, మ్యూజియమ్, హెర్బల్ గార్డెన్, ఫామ్స్, కాలేజ్, రీసెర్చ్ సెంటర్ కూడా ఉన్నాయని చెప్పారు. అంతే కాక ఒక చారిటబుల్ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు, అక్కడ ఆయుర్వేదం, అల్లోపతి డాక్టర్స్ కూడా ఉన్నారట. ఆ హాస్పిటల్ లో వైద్యం పూర్తిగా ఉచితం. చాలా ఆసక్తిగా అనిపించింది. 

పి.యస్.వారియర్ గరించి, ఆర్యవైద్యశాల గురించి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. రెండు పుస్తకాలు తీసి ఇచ్చారు.

2 comments:

  1. చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్యామల రావు గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.