Wednesday, January 11, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 2

కొట్టకల్ ఆర్యవైద్యశాల - 1 

మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కాంటీన్ కు వెళ్ళాము. నిన్న రాత్రి చీకట్లో తెలియలేదు కానీ ఆ డైనింగ్ హాల్ అద్దాల మేడలా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు, కొండలు, బిల్డింగ్స్ తో ఊరంతా అందంగా కనిపిస్తోంది. అప్పటికే అక్కడ ఒకరు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అతను జర్మనీ నుండి వచ్చారట, తనకు రిస్ట్ దగ్గర కట్టు కట్టి ఉంది. ఆ హాస్పిటల్ కు ఫారినర్స్ కూడా వస్తారని అర్థమైంది. 

ఒక టేబుల్ దగ్గర కూర్చోగానే మా దగ్గరకు ఈసారి ఓ పాతికేళ్ళ అబ్బాయి వచ్చి, మెనూ ఇచ్చాడు.  అతనూ నేపాలీనే, పేరు అజయ్. మెనూ లో ఇడ్లీ, దోశ, రాగి దోశ, రాగి పుట్టు, ఆపం, ఊతప్పం, టీ, కాఫీ ఉన్నాయి. దోశ, ఇడ్లీ, కాఫీ చెప్పాము. ఇంట్లో చేసుకునే లాంటి మెత్తని దోసెలు, కొబ్బరి పచ్చడి, తమిళనాడులో చేసే ఉప్పుడు బియ్యం ఇడ్లీ. అక్కడ ఫిల్టర్ కాఫీ దొరకదు, ఇన్స్టెoట్ కాఫీ మాత్రమే ఉంది. 
                                       


టిఫిన్ పూర్తి చేసి ఎనిమిది గంటల కల్లా రూమ్ కి వెళ్ళిపోయాం. ఎనిమిదిన్నరకు డాక్టర్ అనిత తన టీమ్ తో వచ్చి ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు ట్రీట్‌మెంట్ ఉంటుందని చెప్పారు. ట్రీట్‌మెంట్ సమయంలో ఎటువంటి అసౌకర్యం ఉన్నా తనకు చెప్పడం మరచి పోవద్దని చెప్పారు. కాసేపటి తరువాత జూనియర్ డాక్టర్ వచ్చి పేషంట్ కు సంబంధించిన వివరాలు అన్నీ రాసుకున్నారు. ఒక నర్స్ వచ్చి మందులు ఇచ్చి ఏవి ఎప్పుడు వాడాలో చెప్పారు. ఆయుర్వేద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నప్పుడు మామూలుగా వాడే అల్లోపతి మందులు ఏవీ ఆపక్కర్లేదని చెప్పడం రిలీఫ్ గా అనిపించింది. అక్కడ డాక్టర్స్ కు తప్ప ఎవరికీ సరిగ్గా ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ రాదు. అందరూ మళయాళం మాత్రమే మాట్లాడతారు.

ఆ రోజు నుండే తనకు ట్రీట్‌మెంట్ మొదలయ్యింది. తనను మసాజ్ రూమ్ కు తీసుకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళాను, అక్కడక్కడా బ్లూ డ్రెస్ వేసుకున్న హాస్పిటల్ స్టాఫ్ తప్ప వేరే ఎవ్వరూ కనిపించలేదు. కారిడార్ లో వెళుతుంటే మసాజ్ గదుల ముందు హెర్బల్స్ వాసన వస్తోంది. 

బాగా ఉక్కపోతగా  ఉంది. బహుశా చలి ప్రాంతం నుండి వచ్చిన నాకు ఇలా అనిపిస్తుందేమో, ఇండియాలో తీర ప్రాంతాలలో ఉండే వారికి ఈ వాతావరణం ఇంత అసౌకర్యంగా ఉండకపోవచ్చు. పావుగంటలో వెనక్కు వచ్చాను. బహదూర్ వచ్చాడు లంచ్ ఆర్డర్ చేస్తారా అని. లంచ్ కు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, పేషంట్ తాలి, చెపాతీ, కూరలు ఉంటాయట. ఒక సౌత్ ఇండియన్ తాలి, ఒక నార్త్ ఇండియన్ తాలి చెప్పాను.

ఒక గంటన్నర తరువాత తను ఒళ్ళంతా నూనె పట్టించుకుని వచ్చారు. తనను తీసుకుని వచ్చిన అతను బెడ్ మీద ప్లాస్టిక్ షీట్ పరిచి ఒక గంట పాటు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. స్నానం కూడా ఒక గంట, గంటన్నర ఆగి చేయమన్నారు. అలా అయితే ఆ నూనెలు శరీరానికి బాగా పడతాయట. ట్రీట్‌మెంట్ ఎలా ఉందని అడిగాను. ఆ రోజు ఇచ్చిన ట్రీట్మెంట్ పేరు ఫిజిచిల్(pizhichil) అని, ఒక లీటర్ రెండు వందల గ్రాముల వేడి నూనెతో నలుగురు మనుషులు గంటసేపు మర్దనా చేశారని చెప్పారు. తనకు పడుకోగానే బాగా నిద్ర పట్టేసింది. 

మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా రెండు పెద్ద కారేజ్ లతో భోజనం తెచ్చి పెట్టాడు బహదూర్. వాటి సైజ్ చూస్తే ఆ భోజనం మాకేనా లేక ఆ ఫ్లోర్ లో వాళ్ళందరికీ తెచ్చాడా అనిపించింది. కేరెజ్ తెరిస్తే సాంబారు, రసం, మట్ట రైస్, మూడు కూరలు ఉన్నాయి, అన్నీ సరిపడా ఉన్నాయి, ఏవీ ఎక్కువగా లేవు. విడిగా పెరుగు, పచ్చడి ఇచ్చారు. నార్త్ ఇండియన్ తాలి లో సాంబారుకు బదులు పలుచగా ఉన్న పప్పు, మజ్జిగ చారు, బాసుమతి బియ్యంతో అన్నం, రెండు చిన్న చపాతీలు, సలాడ్ ఉన్నాయి. అక్కడి పెరుగు తినలేనంత పుల్లగా ఉన్నది. ప్రతి కూరలోనూ కొబ్బరి తురుము వేసారు. సాంబారులో చక్రాల్లా తరిగిన తొక్కు తీయని అరటికాయ ముక్కలు కొత్తగా అనిపించాయి కానీ బాగానే ఉన్నాయి. మాకు కేరళ మట్ట రైస్ తినడం అలవాటే. అందువలన భోజనం బాగానే అనిపించింది. తెల్ల బియ్యం, ఉప్పు, కారాలు దండిగా వేసుకుని తినే అలవాటు ఉన్న వాళ్ళకు భోజనం నచ్చక పోవచ్చేమో.


మధ్యాహ్నం మూడు గంటలకు మరొక ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈసారి తలమీద బ్రిడ్జ్ లా కట్టి అందులో వెచ్చని నూనె పోసారట. నూనె వేడి తగ్గుతుంటే ఆ నూనె తీసి వెచ్చచేసి పోస్తూ ఉన్నారట. ఈ ట్రీట్‌మెంట్ పేరు శిరోవస్తి అనీ, వెన్నెముక గట్టిపడడానికి ఆ ట్రీట్‌మెంట్ ఇస్తారని చెప్పారు. ఒక వారం పాటు అదే ట్రీట్‌మెంట్ ఇస్తారట. ఈసారి కూడా ఒళ్ళంతా నూనె పట్టించి, ఒక గంట సేపు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. 

ఆ సాయంత్రం కారిడార్ లో ఒక పెద్దావిడ కనిపించారు. ఆవిడ పది సంవత్సరాల క్రితం ట్రీట్‌మెంట్ కి వీల్ చెయిర్ వచ్చి, వెళ్ళేటప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారట. అప్పటి నుండి ఆవిడ ప్రతి సంవత్సరం రెండు వారాల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారట. ఆవిడ తనతో ఒక పాటు ఒక ముప్పై ఏళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చారు. ఆవిడకు వేళకు మందులు ఇవ్వడం, వంట చేయడం, ఆవిడ బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం లాంటివి అన్నీ చేస్తున్నాడు. ఈ హాస్పిటల్ లో పేషెంట్ తో పాటు అటెండెంట్ తప్పనిసరి.

2 comments:

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.