Tuesday, January 17, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 4

కొట్టకల ఆర్యవైద్యశాల - 3 

లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కేరళ లోని ఒక మామూలు గ్రామమైన కొట్టకల్, ఆయుర్వేదానికి పుట్టినిల్లుగా నిలిచిందంటే దానికి కారణం డాక్టర్ పి.ఎస్.వారియర్. అతని కలే ఈ ఆర్యవైద్యశాల. ఆ కలకు ఆయన ప్రాణం పోస్తే దానిని ఈ మధ్య కాలం వరకూ నడిపినవారు ఆయన మేనల్లుడు డాక్టర్ పి.కె.వారియర్.
బ్రిటిష్ పాలనలో ఆయుర్వేదం మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్న రోజులు. 1902 వ సంవత్సరంలో ముప్పై రెండేళ్ళ పొన్నియంబల్లి సంకుణ్ణి వారియర్, కొట్టకల్ లో ఆర్యవైద్యశాల ప్రారంభించారు. ఈయన అతి చిన్న వయస్సులో ఆయుర్వేదం నేర్చుకోవడమే కాక ఒక డాక్టర్ దగ్గర మూడేళ్ళ పాటు అల్లోపతి కూడా అభ్యసించి, చిన్న చిన్న సర్జరీలు చేయడం కూడా నేర్చుకున్నారు. 
అప్పటికి ఆయుర్వేదం గురించి సరైన పుస్తకాలు లేవు. వైద్యులు అనుసరించే విధానాలు వేరువేరుగా ఉండేవి, ఒక్కొక్క వైద్యుడు ఒక్కో విధంగా చికిత్స చేసేవారు. పి.యస్.వారియర్ 1907 వ సంవత్సరంలో ‘చికిత్స సంగ్రహం’ అనే పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకంలో ఏ వ్యాధులకు ఏ మందులు, ఎంత మోతాదులో వాడాలి, పంచకర్మ ఎలా చేయాలి, ఇంకా  ప్రత్యేక చికిత్సా విధానాలు, ఫిజిచల్ కోర్సులు ఇవన్నీ కూడా అందరికీ అర్థమైయ్యేలా తేలిక భాషలో వ్రాసారు. ఆ పుస్తకం ఎన్నో ఇతర భాషలలోకి అనువదించబడింది. 
1925 వ సంవత్సరంలో అనాటమీ, ఫిజియాలజీ కి సంబంధించిన ‘అష్టాంగశరీరం’ అని పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకాన్ని కాలేజ్ సిలబస్ లో చేర్చడం జరిగింది. ఆయుర్వేదంలో మొదటి పత్రిక ‘ధన్వంతరి’ కూడా ఈయనే ప్రారంభించారు. సాధారణ ప్రజానీకానికి కూడా ఆయుర్వేదం గురించి తెలుసుకోవడానికి దోహద పడిన ఈ పత్రిక ఇరవై మూడు సంవత్సరాల పాటు నడిచింది .  

అల్లోపతి లో టాబ్లెట్స్ రూపంలో మందులు దొరుకుతున్న కాలంలో ఆయుర్వేదంలో మందుల తయారీ లేదు. వైద్యులు, రోగులకు ఏ మందులు వాడాలో వాటిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తే, రోగులు లేదా వారికి సంబంధించిన వారు మూలికలు, ఆకులు సేకరించి మందులు తయారు చేసుకునే వారు. దీని వలన మందు సరైన మోతాదులో లేకపోవడమో, ఒకటో అరో మూలికలు వేయకపోవడమో జరిగేది. దాని వలన జబ్బు నయం అయ్యేది కాదు. ఆయుర్వేదంలో ఈ విధానమే కనుక కొనసాగితే ప్రజలకు ఆ వైద్య విధానం పట్ల నమ్మకం పోతుందని పి.యస్.వారియర్ భావించారు. 

ఆయుర్వేద వైద్యులు మందులు తయారుచేసి అందరూ అవే వాడినట్లయితే ఆ సమస్య తీరుతుందని భావించి పి.ఎస్.వారియర్ ఆర్యవైద్యసమాజాన్ని ప్రారంభించారు.  

అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో 1924 సంవత్సరంలో చారిటబుల్ హాస్పిటల్ ప్రారంభించారు. ఇక్కడ వైద్యం, భోజనం, వసతి అన్నీ ఉచితం. ఈ హాస్పిటల్ లో ఆయుర్వేదంతో పాటు అల్లోపతి వైద్యం కూడా ఇస్తారు. 

ఆయుర్వేదం అభివృద్ది చెందడానికి పుస్తకాలు, మందులే కాదు, ముఖ్యంగా కావలసింది వైద్యులు. అందుకోసంగా పి.యస్.వారియర్ 1917 సంవత్సరంలో కాలికట్ లో ఆయుర్వేద పాఠశాల ప్రారంభించారు. ఆ తరువాత ఈ పాఠశాలను కొట్టకల్ కు మార్చారు. ఆ పాఠశాల తరువాత కళాశాలయై, ప్రస్తుతం విద్యార్థులకు ఆయుర్వేదంలో డిగ్రీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. 

ఆ విధంగా ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు, మందులు తయారు చేయడానికి కావలసిన ఫార్ములా, వైద్యం చేయడం నేర్పించే పాఠశాల ఏర్పడ్డాయి. ఇక కావలసింది మందులు తయారు చేసే మాన్యుఫాక్చరింగ్ యూనిట్. అది కూడా కొట్టకల్ లోనే ప్రారంభమైంది. మందుల తయారీకి అవసరమైన మొక్కలను ఫామ్స్ లో పెంచుతున్నారు. 



ప్రస్తుతం ఈ యూనిట్ లో ఐదు వందల రకాల మందులు తయారవుతున్నాయి. ఏడాదికి ఎనభై ఐదు కోట్ల రూపాయల మందులు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. దాదాపుగా 1000 మంది ఏజంట్స్ ఉన్నారు. ఇన్ని ఉన్నా ఆయుర్వేద మెడిసిన్స్ అని గూగుల్ లో వెతికితే డాబర్, హిమాలయ లాంటి బ్రాండ్స్ కనిపిస్తాయి కానీ కొట్టకల్ కనిపించదు, దానికి కారణం వారు మార్కెటింగ్ గురించి ఖర్చు పెట్టకపోవడమే.
పి.యస్.వారియర్ ఆయుర్వేద వైద్యం పెంపొందించడానికి చేసిన కృషిని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు వైద్యరత్న బిరుదు ఇచ్చి సత్కరించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో సభ్యునిగా చేర్చుకోవడమే కాక ఆయుర్వేద వైద్య విధానాల పట్ల వారి వైఖరిని మార్చుకున్నారు. పి.ఎస్.వారియర్ జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం 2002 వ సంవత్సరంలో కొట్టకల్, పి.యస్.వారియర్ స్టాంప్ విడుదల చేసింది.
పి.యస్.వారియర్ కు వైద్యమే కాదు కళల పట్ల కూడా ఆసక్తి మెండు. ఆయన 1909 లో ‘పరమ శివ విలాసం’ అనే నాటక కంపెనీ ప్రారంభించారు. తాను స్వయంగా కొన్ని నాటకాలు కూడా వ్రాసి వేయించే వారు. తరువాత కాలంలో అది పి.యస్.వి నాట్య సంఘంగా మారింది. కేరళలోని ప్రఖ్యాతి గాంచిన నాట్య సంఘాలలో ఇది కూడా ఒకటి.

ఏ సంస్థ అయినా ప్రారంభించిన వారు కనుమరుగవగానే రూపురేఖలు మార్చుకుంటుంది, చాలా సందర్భాలలో శిథిలమైపోతుంది కూడా. అయితే ఆర్యవైద్యశాల మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ సంస్థ ఇంత సమర్ధవంతంగా నడవడానికి కారణం పి.ఎస్.వారియర్ ముందు చూపు ఆయన వ్యవహార దక్షత. 

పి.యస్.వారియర్ ఆర్యవైద్యశాల ట్రస్ట్ ఏర్పాటు చేసారు. ఈ ట్రస్టులోని ఏడుగురు సభ్యలలో  ఐదుగురు వారి కుటుంబ సభ్యలు, ఇద్దరు హాస్పిటల్ లో పనిచేసే వైద్యులు ఉంటారు. కేరళలో కొన్ని కుటుంబాలలో మాతృస్వామ్య విధానం ఆచరిస్తూ ఉంటారు. అంటే వారసులు అన్నతమ్ముల పిల్లలు కాక మేనల్లుళ్ళు అవుతారు. వారియర్ కుటుంబం అదే విధానం అనుసరిస్తోంది. 

ఆర్యవైద్యశాల సంస్థకు మేనేజింగ్ ట్రస్టీ అవ్వాలంటే పి.యస్.వారియర్ మేనల్లుడు అవడమే కాక ఆయుర్వేద డాక్టర్ అయి ఉండాలి. ఫౌండర్ కుటుంబ సభ్యలకు కూడా ఆ సంస్థలో పనిచేస్తేనే జీతం. ఒక్క హాస్పిటలే కాక, మందులు తయారుచేసే కర్మాగారం, ఉచిత హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, హెర్బల్ గార్డెన్స్ ఇవన్నీ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయంలో నలభై ఐదు శాతం ఛారిటబుల్ హాస్పిటల్ కు, నలభై ఐదు శాతం ఆయుర్వేద అభివృద్దికి, పది శాతం కాలేజ్ అభివృద్దికి వాడాలని పి.యస్.వారియర్ విల్లులో వ్రాసారు.
పి.ఎస్.వారియర్ కు ప్రతిరోజూ డైరీ వ్రాసే అలవాటు ఉంది. ఆయన డైరీ చదివితే ఆనాటి కాలమాన పరిస్థితులు కూడా తెలుస్తాయి. 1944 వ సంవత్సరం జనవరి 30వ తేదీ ఉదయాన తెరిచిన డైరీ, వ్రాయడానికి సిధ్ధం చేసుకున్న పెన్, వెలిగించిన దీపం అలానే ఉన్నాయి కానీ వైద్యరత్నం పి.యస్.వారియర్ మాత్రం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

4 comments:

  1. మన ఉజ్వల భవిష్యత్ కోసం తపించిన మనకు తెలియనివారు ఎందరో ఉన్నారు. మీరీ కధనాన్ని వ్రాస్తున్నందుకు థాంక్స్

    ReplyDelete
    Replies
    1. అవునండి. ధన్యవాదాలు లక్కరాజు గారు

      Delete
  2. Very trustworthy and educational blog. Please continue publishing quality articles like this one.
    Latest News Updates

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.