పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడచు పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు
మనసున్న వాడు మా పెళ్ళి కొడుకు మమతెరిగిన వాడు మా పెళ్ళి కొడుకు
తెలుగు పెళ్ళి అన్నారు మరి ఈ సంగీత్ ఏమిటీ? ఒకవేళ సంగీత్ ఉన్నా, ఇంత పాత పాటేమిటి? ఇవేగా మీ ప్రశ్నలు. అన్నీ వివరంగా చెప్తాను.
అసలు మొదట సంగీత్ వద్దనే అనుకున్నాం. సంగీత్ మన సంప్రదాయం కాదు, పైగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి వీలు కూడా కాదు అని. అంతగా కావాలనుకుంటే మీరు పెళ్ళి అయిన తరువాత కొద్ది మంది ఫ్రెండ్స్ ని పిలుచుకుని పార్టీ ఇవ్వమని మా పిల్లలకు చెప్పాము. ముందు సరే అన్నారు కానీ నాలుగు రోజుల తరువాత ఇంట్లో వాళ్ళంతా లేకుండా మాకేం పార్టీ, మీరంతా కూడా ఉండాల్సిందే చాలా తక్కువ మందితో సెలెబ్రేట్ చేసుకుందాం అన్నారు. పెద్దవాళ్ళు మీరెందుకు మాకడ్డం అనకుండా మీరు లేకపోతే మాకు పార్టీయే కాదు అనగానే మరేం ఆలోచించకుండా సరే అన్నాం.
మా పెళ్ళి కొడుకు ఈ బానర్ ఎట్సీ లో ఆర్డర్ చేసాడట. భలే ఉంది కదూ!
పెద్ద వాళ్ళు కొత్త పాటలకూ, చిన్నవాళ్లు పాతపాటలకూ డాన్స్ చెయ్యాలట. ఆ చమత్కారం చూడండి. ఇదంతా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, వాళ్ళ అన్నా వదినల ప్లాన్. పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు అంటే పెద్ద పిల్లలు చిన్న పిల్లలు కాబోలు అనుకున్నాం, కాదట పెద్దవాళ్ళం మేమేనట. మేము డాన్స్ వేయడం ఏమిటి అంటే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మాకోసం ఆంటూ ముందరి కాళ్ళకు బంధం వేసేసారు.
మీరు పాట సెలెక్ట్ చేసుకుంటారా లేక మమ్మల్నే ఇవ్వమంటారా అంటూ రోజుకో పిచ్చి పాట పంపించేది మా అమ్మాయి. ఇవేం పాటలూ, వీటికి మేం డాన్స్ చేయడమేమిటి? అంటే భలే ఉన్నాయమ్మా ఇవి, ఏదో ఒకటి త్వరగా సెలెక్ట్ చేసుకోండి, అవతల కొరియోగ్రాఫర్ కి త్వరగా పాటలు చెప్పాలి అని తొందర పెట్టేసేది. తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడినా తనకు లిరిక్స్ పూర్తిగా అర్థం అవవని అప్పుడు తెలిసింది.
అప్పటి వరకూ కరోనా భయం ఉండేది. ఈ పాటల భయంతో అదెటో పారిపోయింది.ఎక్కడ అలాంటి పాటలకు మా చేత బలవంతంగా డాన్స్ చేయిస్తుందో అని మేమే ఒకపాట ఎంచుకున్నాం. అలాగే వాళ్ళ మేనమామ, అత్త లను కూడా ఒప్పించేసింది. వాళ్ళ పిన్ని సహాయంతో ఇండియాలో ఒక కొరియోగ్రాఫర్ ను డాన్స్ నేర్పించడానికి మాట్లాడేసింది. అదీ నేపథ్యం.
డిసెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఆర్కిడ్ బ్యాంకెట్ హాల్ కి వెళ్ళేసరికి ఆ డెకరేషన్ చూసి వావ్. ఇంకో మాట లేదు . మీరే చూడండి.
సాయంత్రం ఏడు గంటలకల్లా కార్యక్రమం మొదలైంది.
"మామ కూతురా నీతో మాటున్నది
పడుచుగుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే జొన్న చేలు చాటున్నది”
చిన్నవాళ్ళు పాత పాటలన్నారు కదా అని మా అల్లుడు ఈ పాటతో డాన్స్ మొదలు పెట్టాడనుకుంటున్నారా ఏమిటి? అబ్బే, ఆ టైప్ కాదండీ మా అల్లుడు. మామయ్యా మీ అమ్మాయితో నా జీవితం పంచుకోవాలని ఉంది అందుకు మీ అనుమతి కావాలనే అర్థం వచ్చే ఈ పాట ఎంచుకున్నాడు. మొదటిసారి వినడం ఆ పాట, బావుంది, మీరు కూడా వినండి.
and put on my best suit
Got in my car and raced like a jet
All the way to you
Knocked on your door with heart in my hand
To ask you a question
Can I have your daughter for the rest of my life?
Say yes, say yes
అంటూ అల్లుడు ఎంత బ్రతిమలాడినా, ముందు నో నో అన్న మామగారిని తన డాన్స్ తో మెప్పించి పాట పూర్తయ్యేటప్పటికి ఒప్పించాడు.
బావా, నువ్వేదో మా పెదనాన్నను మాయ చేశావు సరే, మా అక్కను పెళ్ళి చేసుకోవాలంటే మా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి అంటూ మరదళ్ళు “ఓ బావా మా అక్కను సక్కగ సూస్తావా?” అని అక్కడే అడిగేసి
బావ దగ్గర మాట తీసుకుని అప్పుడు పర్మిషన్ ఇచ్చారు.
అంతటితో ఆపలేదు వాళ్ళ అల్లరి, మళ్ళీ ఇంకో తిరకాసు పెట్టారు. నువ్వు మా అక్కను పెళ్ళి చేసుకోమని మేమంతా లేనప్పుడు అడగడం కాదు ఇప్పుడే ప్రపోజ్ చెయ్యాలన్నారు. మీ సరదా నేనెందుకు కాదనాలంటూ పెళ్ళి కొడుకు ప్రపోజ్ చేసాడు. ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.
రెండు కుటుంబాల వాళ్ళం మా హర్షం వ్యక్తం చేసాం.
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ…
హెయ్… లైట్ సెట్టింగిక్కడ్నే మైక్ సెట్టింగిక్కడ్నే
ఈ హాలు నే చేసేద్దాం డిస్కో టెక్కల్లే...
హెయ్… నైటు నైనవ్వక్కర్లే బైటికే ఎళ్ళక్కర్లే...ఇలా మనం క్లబ్బైతే… డబులవదా ఫన్నే
హ్యాపీగా గడిపేలా… ఏ ఫారిన్ కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటీ, సిమ్లా… ఈ హాలే దాటక్కర్లా
మన్నాపేదెవడు, అడిగేదెవడు… చలో చలో మరి చేసేద్దాం గోల
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
"బయటకు వెళ్ళడాలూ అవీ ఎలాగూ లేవు చక్కగా పెళ్ళి చేస్తే ఒకే గూట్లో చిలుకా గోరింకల్లా ఉంటారని ఇరువైపుల పెద్దవాళ్ళం నిర్ణయించుకున్నాం". అని చెప్పాను గుర్తుందా ఇదిగోండి మా గువ్వల జంట పాట
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలీ గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై
పెళ్ళి కూతురూ, పెళ్ళికొడుకు ఇద్దరూ మూడు లేయర్స్ కేక్ తెచ్చుకున్నారు. క్రింది లేయర్ పెద్దవాళ్ళట అంటే అమ్మా, నాన్నా, అత్తా, మామా అన్నమాట. మధ్య లేయర్ వాళ్ళట, పైన అన్నా తమ్ముడి కుటుంబం అట. మూడు లేయర్స్ మూడు ఫ్లేవర్స్ తో తీసుకున్నారు. అందరూ కలసి ఉండే మాధుర్యమే జీవితంట. ఆ కేక కట్ చేసి మాధుర్యాన్ని అందరికీ పంచి పెట్టారు.
నిన్నగాక మొన్న పెళ్ళయిన అన్నా వదినలు
ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
అంటూ డాన్స్ చేసి వన్స్ మోర్ అనిపించుకున్నారు
రెండు నెలల క్రితం పెళ్ళి అయిన మరో జంట
అడగక అడిగినదేవిఁటో
లిపి చిలిపిగ ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో
పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు
అంటూ డాన్స్ చేసారు.
పెళ్ళికూతురిని ఆట పట్టిస్తూ
వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే
క్రీమ్ బిస్కట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిల్సోనియ్యడే
అంటూ పార్టీ మార్చేసింది పెళ్ళి కూతురి ఫ్రెండ్.
మా మేనల్లుడు సిసింద్రీ, ఆ రోజు డాన్స్ ఫ్లోర్ వాడిదే.
ఈ అక్కా చెల్లెళ్లు కూడా డాన్స్ చేయమనగానే చక్కగా ముందుకు వచ్చి డాన్స్ చేసారు.
కొంటె గాణ్ణి కట్టుకో
కొంగుకేసి చుట్టుకో
కోటివన్నెలున్న దానా
ఈ హడావిడి ముగిసేసరికి ఎనిమిదయింది. అందరినీ భోజనాలు చేయమని పిలిచాం.
కోవిడ్ కదా ఒక టేబుల్ కి మరో టేబుల్ కీ ఎక్కువ దూరం ఉండేలా అరేంజ్ చెయ్యమన్నాము. టేబుల్ కు సాధారణంగా పది కుర్చీలు పెట్టొచ్చు, కానీ ఆరే ఉండేలా చూడమన్నాము. ఒక్కొక్క ఫామిలీకి ఒక్కో టేబుల్ అన్నమాట. ఒక్క డాన్స్ ఫ్లోర్ మీద తప్ప మిగతా టైమ్ అంతా అందరం మాస్క్ పెట్టుకునే ఉన్నాం.
భోజనాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తునారు. మధ్య మధ్యలో వచ్చి నాలుగు ఎపిటైజర్స్ పట్టుకుని పోతున్నారు. ఇప్పుడే తినాలి, ఇంతే తినాలి లాంటి పట్టింపులేమీ లేవు.
ఈ రోజు స్పెషల్ స్వీట్ బకలవా. అయితే ఆ స్వీట్ ని ఎవరూ పెద్దగా ముట్టుకోలేదు. అంతకంటే స్వీట్ మెమొరీస్ పోగేసుకునే పనిలో ఉన్నారు.ఈ క్రింద పొటోలు చూడండి, మీకే అర్ధం అవుతుంది.
ఈ శుభ సందర్భంలో వియ్యంకుల హడావిడి చూడాలి. మీరే వినండి ఈ పాట
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
మనకోసం వెలిగేనట ఉల్లాసం మనదేనట....
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే వియ్యంకులమంట మేమే....
పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురి మేనమామ లిద్దరూ
నువు పెద్దపులి. నువ్వు పెద్దపులి...
నువు పెద్దపులి లెక్క గోదితివీరో...
బమ్మాండం బద్దలు గొట్టేయ్రో ...
నువు పెద్దపులి లెక్క గోదితివీరో...
బమ్మాండం బద్దలు గొట్టేయ్రో ...
అంటూ పాట రాగానే ఇద్దరూ పెద్దపులి డాన్స్ చేసారు.
ఆ రోజు పెళ్ళి కొడుకూ, పెళ్ళి కూతురి ఫ్రెండ్స్ అందరూ అర్థరాత్రి వరకూ డాన్స్ ఫ్లోర్ మీదే ఉన్నారు. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా.
అలా ఆ రోజు వేడుకలు జరుపుకున్నాం. డెకరేషన్స్ చేసింది టామ్, అతను ఆర్కిడ్ బ్యాంకెట్ హాల్ మానేజర్. లైటింగ్, అరేంజ్ మెంట్స్ సూపర్. డిజె పవన్ తెలుగతను కాకపోయినా చక్కని తెలుగు పాటలు కలక్ట్ చేసారు. అతని స్పీకర్ సిస్టమ్ కూడా బావుంది. ఫుడ్ దక్షిణ్ రెస్టారెంట్ నుండి తెప్పించాము. ఈ రెస్టారెంట్ వాళ్ళు మాకు బాగా తెలిసిన వారు, ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయించారు. ఐటమ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సర్వ్ చేసింది కూడా వాళ్ళే. బకలావా డెట్రాయిట్ లోని ఫరాత్ బేకరీ లో ఆర్డర్ చేసాము. పెళ్ళి కూతురికి మేకప్ చేసింది జెన్నీ లేముయ, హెయిర్ సెట్ చేసింది ఆనాఫమ్. ఇద్దరూ మా ఊరి వాళ్ళే.
సంగీత్ మన సాంప్రదాయం కాదు కదా అన్న ప్రశ్నకు పైన చెప్పిన దాంట్లోనే మీకు సమాధానం దొరికి ఉంటుంది అనుకుంటున్నాను. అప్పుడప్పుడు పెరుగుకైనా తోడు మారుస్తుండాలి కొంచెం పంజాబీ వాళ్ళ తోడు తెచ్చుకుందాం. పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలంటే కొత్త వర్షన్ వచ్చినప్పుడు ఫోన్ అప్డేట్ చేస్తాం కదా అలాగన్నమాట.
మా ఇంటి పెళ్ళి వేడుకలకు అత్తరు పరిమళాలు అద్దింది ఆ సాయంత్రం.
ఇక నలుగు, మంగళ స్నానాల కబుర్లు
ఇక్కడ చదవొచ్చు.