Tuesday, March 30, 2021

సంగీత్

పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడచు పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు
మనసున్న వాడు మా పెళ్ళి కొడుకు మమతెరిగిన వాడు మా పెళ్ళి కొడుకు

తెలుగు పెళ్ళి అన్నారు మరి ఈ సంగీత్ ఏమిటీ? ఒకవేళ సంగీత్ ఉన్నా, ఇంత పాత పాటేమిటి? ఇవేగా మీ ప్రశ్నలు. అన్నీ వివరంగా చెప్తాను.

అసలు మొదట సంగీత్ వద్దనే అనుకున్నాం. సంగీత్ మన సంప్రదాయం కాదు, పైగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి వీలు కూడా కాదు అని. అంతగా కావాలనుకుంటే మీరు పెళ్ళి అయిన తరువాత కొద్ది మంది ఫ్రెండ్స్ ని పిలుచుకుని పార్టీ ఇవ్వమని మా పిల్లలకు చెప్పాము. ముందు సరే అన్నారు కానీ నాలుగు రోజుల తరువాత ఇంట్లో వాళ్ళంతా లేకుండా మాకేం పార్టీ, మీరంతా  కూడా ఉండాల్సిందే చాలా తక్కువ మందితో సెలెబ్రేట్ చేసుకుందాం అన్నారు. పెద్దవాళ్ళు మీరెందుకు మాకడ్డం అనకుండా మీరు లేకపోతే మాకు పార్టీయే కాదు అనగానే మరేం ఆలోచించకుండా సరే అన్నాం.  

మా పెళ్ళి కొడుకు ఈ బానర్ ఎట్సీ లో ఆర్డర్ చేసాడట. భలే ఉంది కదూ!
పెద్ద వాళ్ళు కొత్త పాటలకూ, చిన్నవాళ్లు పాతపాటలకూ డాన్స్ చెయ్యాలట. ఆ చమత్కారం చూడండి. ఇదంతా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, వాళ్ళ అన్నా వదినల ప్లాన్. పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు అంటే పెద్ద పిల్లలు చిన్న పిల్లలు కాబోలు అనుకున్నాం, కాదట పెద్దవాళ్ళం మేమేనట. మేము డాన్స్ వేయడం ఏమిటి అంటే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మాకోసం ఆంటూ ముందరి కాళ్ళకు బంధం వేసేసారు.

మీరు పాట సెలెక్ట్ చేసుకుంటారా లేక మమ్మల్నే ఇవ్వమంటారా అంటూ రోజుకో పిచ్చి పాట పంపించేది మా అమ్మాయి. ఇవేం పాటలూ, వీటికి మేం డాన్స్ చేయడమేమిటి? అంటే భలే ఉన్నాయమ్మా ఇవి, ఏదో ఒకటి త్వరగా సెలెక్ట్ చేసుకోండి, అవతల కొరియోగ్రాఫర్ కి త్వరగా పాటలు చెప్పాలి అని తొందర పెట్టేసేది. తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడినా తనకు లిరిక్స్ పూర్తిగా అర్థం అవవని అప్పుడు తెలిసింది. 

అప్పటి వరకూ కరోనా భయం ఉండేది. ఈ పాటల భయంతో అదెటో పారిపోయింది.ఎక్కడ అలాంటి పాటలకు మా చేత బలవంతంగా డాన్స్ చేయిస్తుందో అని మేమే ఒకపాట ఎంచుకున్నాం. అలాగే వాళ్ళ మేనమామ, అత్త లను కూడా ఒప్పించేసింది. వాళ్ళ పిన్ని సహాయంతో ఇండియాలో ఒక కొరియోగ్రాఫర్ ను డాన్స్ నేర్పించడానికి మాట్లాడేసింది. అదీ నేపథ్యం.

డిసెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఆర్కిడ్ బ్యాంకెట్ హాల్ కి వెళ్ళేసరికి ఆ డెకరేషన్ చూసి వావ్. ఇంకో మాట లేదు . మీరే చూడండి.









సాయంత్రం ఏడు గంటలకల్లా కార్యక్రమం మొదలైంది.

"మామ కూతురా నీతో మాటున్నది
పడుచుగుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే జొన్న చేలు చాటున్నది”

చిన్నవాళ్ళు పాత పాటలన్నారు కదా అని మా అల్లుడు ఈ పాటతో డాన్స్ మొదలు పెట్టాడనుకుంటున్నారా ఏమిటి? అబ్బే, ఆ టైప్ కాదండీ మా అల్లుడు. మామయ్యా మీ అమ్మాయితో నా జీవితం పంచుకోవాలని ఉంది అందుకు మీ అనుమతి కావాలనే అర్థం వచ్చే ఈ పాట ఎంచుకున్నాడు. మొదటిసారి వినడం ఆ పాట, బావుంది, మీరు కూడా వినండి.  

and put on my best suit
Got in my car and raced like a jet 
All the way to you
Knocked on your door with heart in my hand 
To ask you a question
Can I have your daughter for the rest of my life? 
Say yes, say yes

అంటూ అల్లుడు ఎంత బ్రతిమలాడినా, ముందు నో నో అన్న మామగారిని తన డాన్స్ తో మెప్పించి పాట పూర్తయ్యేటప్పటికి ఒప్పించాడు.

బావా, నువ్వేదో మా పెదనాన్నను మాయ చేశావు సరే, మా అక్కను పెళ్ళి చేసుకోవాలంటే మా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి అంటూ మరదళ్ళు “ఓ బావా మా అక్కను సక్కగ సూస్తావా?” అని అక్కడే అడిగేసి


బావ దగ్గర మాట తీసుకుని అప్పుడు పర్మిషన్ ఇచ్చారు.


అంతటితో ఆపలేదు వాళ్ళ అల్లరి, మళ్ళీ ఇంకో తిరకాసు పెట్టారు. నువ్వు మా అక్కను పెళ్ళి చేసుకోమని మేమంతా లేనప్పుడు అడగడం కాదు ఇప్పుడే ప్రపోజ్ చెయ్యాలన్నారు. మీ సరదా నేనెందుకు కాదనాలంటూ పెళ్ళి కొడుకు ప్రపోజ్ చేసాడు. ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

రెండు కుటుంబాల వాళ్ళం మా హర్షం వ్యక్తం చేసాం. 

ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ…
హెయ్… లైట్ సెట్టింగిక్కడ్నే మైక్ సెట్టింగిక్కడ్నే
ఈ హాలు నే చేసేద్దాం డిస్కో టెక్కల్లే...
హెయ్… నైటు నైనవ్వక్కర్లే బైటికే ఎళ్ళక్కర్లే...
ఇలా మనం క్లబ్బైతే… డబులవదా ఫన్నే 

హ్యాపీగా గడిపేలా… ఏ  ఫారిన్ కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటీ, సిమ్లా… ఈ హాలే దాటక్కర్లా
మన్నాపేదెవడు, అడిగేదెవడు… 
చలో చలో మరి చేసేద్దాం గోల
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ 
"బయటకు వెళ్ళడాలూ అవీ ఎలాగూ లేవు చక్కగా పెళ్ళి చేస్తే ఒకే గూట్లో చిలుకా గోరింకల్లా ఉంటారని ఇరువైపుల పెద్దవాళ్ళం నిర్ణయించుకున్నాం". అని చెప్పాను గుర్తుందా ఇదిగోండి మా గువ్వల జంట పాట

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలీ గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై

పెళ్ళి కూతురూ, పెళ్ళికొడుకు ఇద్దరూ మూడు లేయర్స్ కేక్ తెచ్చుకున్నారు. క్రింది లేయర్ పెద్దవాళ్ళట అంటే అమ్మా, నాన్నా, అత్తా, మామా అన్నమాట. మధ్య లేయర్ వాళ్ళట, పైన అన్నా తమ్ముడి కుటుంబం అట. మూడు లేయర్స్ మూడు ఫ్లేవర్స్ తో తీసుకున్నారు. అందరూ కలసి ఉండే మాధుర్యమే జీవితంట. ఆ కేక కట్ చేసి మాధుర్యాన్ని అందరికీ పంచి పెట్టారు.
 నిన్నగాక మొన్న పెళ్ళయిన అన్నా వదినలు 

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో

అంటూ డాన్స్ చేసి వన్స్ మోర్ అనిపించుకున్నారు
రెండు నెలల క్రితం పెళ్ళి అయిన మరో జంట

అడగక అడిగినదేవిఁటో
లిపి చిలిపిగ ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో
పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు

అంటూ  డాన్స్ చేసారు.
పెళ్ళికూతురిని ఆట పట్టిస్తూ

వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే
క్రీమ్ బిస్కట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిల్సోనియ్యడే

అంటూ పార్టీ మార్చేసింది పెళ్ళి కూతురి ఫ్రెండ్. 
మా మేనల్లుడు సిసింద్రీ, ఆ రోజు డాన్స్ ఫ్లోర్ వాడిదే. 
ఈ అక్కా చెల్లెళ్లు కూడా డాన్స్ చేయమనగానే చక్కగా ముందుకు వచ్చి డాన్స్ చేసారు.

కొంటె గాణ్ణి కట్టుకో 
కొంగుకేసి చుట్టుకో 
కోటివన్నెలున్న దానా 


ఈ హడావిడి ముగిసేసరికి ఎనిమిదయింది. అందరినీ భోజనాలు చేయమని పిలిచాం. 





కోవిడ్ కదా ఒక టేబుల్ కి మరో టేబుల్ కీ ఎక్కువ దూరం ఉండేలా అరేంజ్ చెయ్యమన్నాము. టేబుల్ కు సాధారణంగా పది కుర్చీలు పెట్టొచ్చు, కానీ  ఆరే ఉండేలా చూడమన్నాము. ఒక్కొక్క ఫామిలీకి ఒక్కో టేబుల్ అన్నమాట.  ఒక్క డాన్స్ ఫ్లోర్ మీద తప్ప మిగతా టైమ్ అంతా అందరం మాస్క్ పెట్టుకునే ఉన్నాం. 

భోజనాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తునారు. మధ్య మధ్యలో వచ్చి నాలుగు ఎపిటైజర్స్ పట్టుకుని పోతున్నారు. ఇప్పుడే తినాలి, ఇంతే తినాలి లాంటి పట్టింపులేమీ లేవు. 

ఈ రోజు స్పెషల్ స్వీట్ బకలవా. అయితే ఆ స్వీట్ ని ఎవరూ పెద్దగా ముట్టుకోలేదు. అంతకంటే స్వీట్ మెమొరీస్ పోగేసుకునే పనిలో ఉన్నారు.ఈ క్రింద పొటోలు చూడండి, మీకే అర్ధం అవుతుంది.


ఈ శుభ సందర్భంలో వియ్యంకుల హడావిడి చూడాలి. మీరే వినండి ఈ పాట

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
మనకోసం వెలిగేనట ఉల్లాసం మనదేనట....
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే వియ్యంకులమంట మేమే....

పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురి మేనమామ లిద్దరూ  

నువు పెద్దపులి. నువ్వు పెద్దపులి...
నువు పెద్దపులి లెక్క గోదితివీరో...
బమ్మాండం బద్దలు గొట్టేయ్రో ...
నువు పెద్దపులి లెక్క గోదితివీరో...
బమ్మాండం బద్దలు గొట్టేయ్రో ...

అంటూ పాట రాగానే ఇద్దరూ పెద్దపులి డాన్స్ చేసారు.  

ఆ రోజు పెళ్ళి కొడుకూ, పెళ్ళి కూతురి ఫ్రెండ్స్ అందరూ అర్థరాత్రి వరకూ డాన్స్ ఫ్లోర్ మీదే ఉన్నారు. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా.




అలా ఆ రోజు వేడుకలు జరుపుకున్నాం. డెకరేషన్స్ చేసింది టామ్, అతను ఆర్కిడ్ బ్యాంకెట్ హాల్ మానేజర్. లైటింగ్, అరేంజ్ మెంట్స్ సూపర్. డిజె పవన్ తెలుగతను కాకపోయినా చక్కని తెలుగు పాటలు కలక్ట్ చేసారు. అతని స్పీకర్ సిస్టమ్ కూడా బావుంది. ఫుడ్ దక్షిణ్ రెస్టారెంట్ నుండి తెప్పించాము. ఈ రెస్టారెంట్ వాళ్ళు మాకు బాగా తెలిసిన వారు, ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయించారు. ఐటమ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సర్వ్ చేసింది కూడా వాళ్ళే. బకలావా డెట్రాయిట్ లోని  ఫరాత్ బేకరీ లో ఆర్డర్ చేసాము. పెళ్ళి కూతురికి మేకప్ చేసింది జెన్నీ లేముయ, హెయిర్ సెట్ చేసింది ఆనాఫమ్. ఇద్దరూ మా ఊరి వాళ్ళే. 

సంగీత్ మన సాంప్రదాయం కాదు కదా అన్న ప్రశ్నకు పైన చెప్పిన దాంట్లోనే మీకు సమాధానం దొరికి ఉంటుంది అనుకుంటున్నాను. అప్పుడప్పుడు పెరుగుకైనా తోడు మారుస్తుండాలి కొంచెం పంజాబీ వాళ్ళ తోడు తెచ్చుకుందాం. పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలంటే కొత్త వర్షన్ వచ్చినప్పుడు ఫోన్ అప్డేట్ చేస్తాం కదా అలాగన్నమాట.

మా ఇంటి పెళ్ళి వేడుకలకు అత్తరు పరిమళాలు అద్దింది ఆ సాయంత్రం. 

ఇక నలుగు, మంగళ స్నానాల కబుర్లు ఇక్కడ చదవొచ్చు.  

*********************

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవిఅలంకరణఅరిసెలూ అవాంతరాలుస్వప్నలోకంనిశ్చయ తాంబూలాలుమెహెందీ  అంటూ ఎనిమిది రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.

Sunday, March 28, 2021

మెహెందీ

మా చిన్నప్పుడు ఏ సాయంత్రమో పొలం నుండి వస్తూ గోరింటాకు తెచ్చేవాడు మామయ్య. పిల్లలందరమూ కూర్చుని ఆకులు దూసి పుల్లలు వేరు చేసేవాళ్ళం. అత్త పెరట్లోని రోట్లో వేసి కాటుకలా రుబ్బి కొబ్బరి చిప్పలో తీసిపెట్టేది. ఈలోగా అమ్మమ్మ సాయంకాలం వంట పూర్తి చేసేది. ఏడు గంటలకల్లా అన్నాలు తినేసి పిల్లలందరం గోరింటాకు పెట్టించుకునేవాళ్ళం. చుక్కలూ, చెంద్రుడు మా అరచేతుల్లో ఉంటే ఆ రోజు అమావాస్య అయినా మేడ మీద వెన్నెల పరుచుకున్నట్లనిపించేది. ఆ గోరింటాకు ఆరిందాకా కథలు, కబుర్లు చెప్పుకునే వాళ్ళం. తెల్లవారి చూసుకుంటే అరచేతుల్లో ఎర్రగా సూర్యుడు ఉదయించేవాడు.

అవునూ అసలు 'పండడం' అని ఎందుకంటున్నాం, ఎర్రగా అయింది అనొచ్చుగా. బంగారు మురుగు కథలో శ్రీరమణ గారు కూడా “ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడి నోరు పండాలి. అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి" అన్నారు. కాయలు పండుతాయి, పంట పండుతుంది ఆ కోవలోకి వస్తుంది కాబోలు ఈ గోరింటాకు పండడం. నూతన వధువు చేతికి గోరింటాకు పెట్టుకుంటే అదృష్టం పండుతుందట.

ఈ గోరింటాకు పెట్టుకునే సరదా మన దేశంలో దాదాపుగా నాలుగు, ఐదవ శతాబ్దాలలో మొదలైందట. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ మెహందీ మొఘలులు భారతదేశానికి తీసుకుని వచ్చిన కళ అనుకున్నారట కానీ అప్పటికే భారతదేశంలో ఉన్నదనడానికి సాక్ష్యంగా అజంతా గుహల్లోని శిల్పాలకు కూడా అరచేతిలో గోరింట ఉన్నదట.

ఇక మన కథలోకి వద్దాం.

డిసెంబర్ ఏడవ తేదీ సంగీత్ డెకరేషన్ చూడడానికి హాల్ కి వెళ్ళాం కదా! తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం మూడవుతోంది. అప్పటికి మెహందీ డెకరేషన్ మొదలే పెట్టలేదు. ఇంకా చిన్న చిన్న పనులు చాలానే ఉన్నాయి. అప్పటి వరకు ఎవరు వచ్చి సహాయం చేస్తామన్నా ఫరవాలేదు మేము చేసుకోగలం అంటున్న వాళ్ళం ఆ రోజు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాం.

సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పటికి ఇల్లంతా వస్తువులతో నిండి పోయి ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మిమ్మల్ని అలా వదిలివేసి ఏ సహాయమూ చేయలేకపోయామని చాలా నొచ్చుకున్నారు. ఏం చేస్తాం అందరం గృహ నిర్భంధం లో ఉండవలసిన రోజులు కదా! అప్పటికప్పుడు ఇల్లు సర్దడం మొదలుపెట్టి ఓ గంటలో ఒక కొలిక్కి తెచ్చారు.

ఆ సాయంత్రం అందరం తలా ఒక పనిలో తల మునకలై ఉన్నాం. మధ్య గదిలో మెహందీ ఫంక్షన్ కి డెకరేషన్ చేస్తున్నారు ఓ ముగ్గురు. పెరట్లో ఓ ఐదుగురు మంగళస్నానాలకు డెకరేషన్ చేసే పనిలో ఉన్నారు. గరాజ్ లో పూల పందిరి, బ్యాక్ డ్రాప్ పెడుతున్నారు మరో నలుగురు. ఆ రోజు అనుకున్నాం ఈ కోవిడ్ లేకపోయి ఉంటే పెళ్ళికి పదిహేను రోజుల ముందు నుండే ఇల్లు ఇలా సందడిగా ఉండేది అని. పోనీలే ఈ ఒక్క రోజు అయినా ఈ ముచ్చట తీరింది అనుకున్నాం. ఆ పూటంతా ఇంట్లో వాళ్ళం, ఫ్రెండ్స్ అందరమూ మాస్క్ లు పెట్టుకునే ఉన్నాం. 

సాయంత్రం కరిగి రాత్రయింది. "అక్కా, ఈ కర్టెన్ పొడవు సరిపోతుందా"? "పెద్దమ్మా మొత్తం ఎన్ని గిఫ్ట్స్ పాక్ చెయ్యాలి"? "అక్కా, లిల్లీస్ ఇంకా ఉన్నాయా, ఇవేనా"? ఇలా అందరూ అడుగుతూ ఉంటే ఆ రోజు కాళ్ళకు చక్రాలు కట్టుకుని పరుగెడుతున్నాను. పాపం వచ్చిన వాళ్ళకు టీ కూడా ఇవ్వలేదని గుర్తు వచ్చింది. మా మరదలు, తోడికోడలు కోసం చూస్తే వాళ్ళిద్దరూ పూల పందిరి దగ్గర బిజీగా ఉన్నారు. వంటగదిలోకి వెళ్ళాను. జ్యోతిగారూ ఒకసారి వచ్చి ఈ ఫ్రేమ్ వచ్చిందో చూడండి. గరాజ్ లోనుండి పిలుస్తున్నారు. అప్పుడే అటువైపు వచ్చిన మా మరిది వదినా నేను టీ పెడతాను నువ్వా పని చూడు అన్నాడు. నువ్వా అన్నాను ఆశ్చర్యంగా ఇండియాలో ఉన్నప్పుడు రోజుకు పదమూడు గంటలు మెళ్ళో స్టెత్ వేసుకుని ఉండడమే చూసాను కానీ ఇలా వంట గదిలో ఎప్పుడూ చూడలేదు తనను. దాదాపుగా ఇరవై మందిమి ఉన్నాం ఇంట్లో. ఎన్ని పాలు, ఎంత పొడి వెయ్యాలో చెప్పబోతున్నాను తనకు. "జ్యోతీ త్వరగా రండి" అంటూ మళ్ళీ పిలుపొచ్చింది గరాజ్ లో నుండి. నేను చూసుకుంటాగా నువ్వెళ్ళు అన్నాడు. ఓ అరగంటలో పొగలు గక్కే టీ చిక్కని కాఫీ తయారు. 

స్నేహమో, బంధుత్వమో మన చుట్టూ అల్లుకుని ఉంటాయి. ఆ స్పర్శ తెలిసేది ఇటువంటి సందర్భాలలోనే.

ఈ ఫేవర్ మార్ట్ లో తెప్పించిన కర్టెన్స్ మా కజీన పంపిన గొడుగులు, దిండు కవర్స్ తో మా ఫ్రెండ్ ఇంకా పెళ్ళి కూతురి ఫ్రెండ్ కలసి ఎంత చక్కగా డెకరేట్ చూశారో చూడండి.

ఉదయం తొమ్మిది గంటల కంతా మెహందీ పెట్టేవాళ్ళు వచ్చేసారు. పెళ్ళికూతురికి ఒకరు మిగిలిన వారికి పెట్టడానికి ఒకరు. స్నానాలు చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి మెహందీ పెట్టించుకోవడం మొదలు పెట్టారు.

ఈ మెహందీ డిజైన్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇండియన్ డిజైన్స్ మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా సన్న గీతలతో మామిడి పిందెలు, పువ్వులు, నెమళ్ళతో డిజైన్ చేతుల నిండుగా ఉంటుంది. పెళ్ళి కూతురికి పెట్టే డిజైన్స్ లో పల్లకి, కలశము, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, పూల మాలలు లాంటి చిత్రాలు చిత్రీకరిస్తారు.

మా పెళ్ళి కూతురి చేతిలో అవన్నీ మీకు కనిపిస్తున్నాయా?



పాకిస్థానీ డిజైన్స్ కూడా సన్నని గీతలతో ముస్లిం సంస్కృతి ప్రతిబింబించే విధంగా లో డోమ్స్, లతలు, మాస్క్ లాంటివి చిత్రీకరిస్తారు. ఈ డిజైన్స్ కూడా చెయి మొత్తం నిండుగా ఉంటుంది. అరబిక్ డిజైన్ మరీ సన్నని గీతలతో కాక కొంచెం వెడల్పుగా పువ్వులు లతలతో చాలా అందమైన పెయింటింగ్ లా ఉంటుంది. ఇండో అరబిక్ డిజైన్స్ హంసలు, మామిడి పిందెలు, లతలతో ఎంతో అందంగా ఉంటాయి.


ఆఫ్రికన్ మెహంది డిజైన్స్ జామెట్రిక్ డిజైన్స్ లో అంటే చతురస్రము, త్రికోణాకారము లాంటి ఆకరాలలో చుట్టూ చిన్నచిన్న ఆకులతో చూడడానికి ఒక క్రమ పద్దతిలో అందంగా ఉంటుంది.


ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి సాయంత్రం నాలుగయింది. మెహందీ పెట్టడానికి ఇద్దరినే కాకుండా మరో ఇద్దరిని పిలిస్తే త్వరగా అయ్యుండేది. అప్పటికీ వాళ్ళ దగ్గర కోన్స్ తీసుకుని ఇంట్లో వాళ్ళు కూడా పెట్టినా అంత టైమ్ పట్టింది.


పెళ్ళికొడుకు పేరును మెహంది డిజైన్ లో ఎక్కడో వ్రాసారట. ఎక్కడుందో చెప్పమని పరీక్ష పెట్టింది పెళ్ళి కూతురు.

ఆడవాళ్ళం మెహందీ పెట్టించుకున్నప్పుడు మగవాళ్ళంతా సంగీత్ కోసం షాపింగ్ చేసే హడావిడిలో ఉన్నారు. ఐదు గంటల కల్లా మెహందీ డెకరేషన్ తీసేసి తరువాత రోజు ఉదయాన్నే జరగబోయే పెళ్ళి కూతురు ఫంక్షన్ కి బ్యాక్ డ్రాప్ పెట్టేశారు.

పెళ్ళి కూతురికి మెహెందీ పెట్టినవారు రాజీ. ఇక్కడే మా ఊర్లోనే ఉంటారు, చాలా ఓపిగ్గా చక్కగా పెట్టారు.

మధ్యాహ్నమే మేకప్ ఆర్టిస్ట్ వచ్చి పెళ్ళికూతురికి హెయిర్ సెట్ చేసి మేకప్ వేసింది. మిగిలిన వాళ్ళం కూడా మెహందీ చేతులు కడిగేసుకుని సాయంత్రం ఆరుగంటల కల్లా సంగీత్ కి తయారయి పోయాం. ఆ కబుర్లు ఇక్కడ చదవొచ్చు


*********************

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవిఅలంకరణఅరిసెలూ అవాంతరాలుస్వప్నలోకంనిశ్చయ తాంబూలాలు,  అంటూ ఏడు రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.


Friday, March 26, 2021

నిశ్చయ తాంబూలాలు

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవిఅలంకరణఅరిసెలూ అవాంతరాలుస్వప్నలోకం అంటూ ఆరు రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.

సాధారణంగా నిశ్చితార్థం చేసుకున్నాక పసుపు కొడతారు. మా కాబోయే వియ్యంకులు ఇండియాలో ఉన్నారు. “వదినా, పెళ్ళి పనులు మొదలు పెట్టాలంటే ముందు పసుపు కొట్టాలి, మీరూ, పిల్లలూ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మా అబ్బాయి కోడలితో తాంబూలాలు మార్చుకోండి” అన్నారు మా వియ్యపురాలు . “అలా కాదు లెండి మీరు వచ్చాకే మార్చుకుందాము. మీకు అభ్యంతరం లేకపోతే ముందు పూజారి గారితో ముహూర్తం పెట్టించుకుందాం” అన్నాను, వాళ్ళు సరేనన్నారు. పూజారి గారు ముహూర్తం పెట్టాక పసుపు కొట్టి పెళ్ళి పనులు మొదలు పెట్టేసాము. మా కాబోయే వియ్యంకులు, పెళ్ళి కొడుకు మేనమామ నెల రోజుల ముందే ఇక్కడకు వచ్చారు. పెళ్ళికొడుకు తరఫున ఇంకా వస్తామన్న వాళ్ళు ఉన్నారట కానీ వాళ్ళెవరికీ వీసా లేదుట. అప్పటికి ఎంబసీ ఓపెన్ అయినా అపాయింట్ మెంట్ తీసుకోవాలి. అది త్వరగా ఇవ్వరు ఈ కారణాలతో వాళ్ళు రాలేకపోయారు. 

మా తమ్ముడు వాళ్ళు, మరిది వాళ్ళు పెళ్ళికి రెండు వారాల ముందే వస్తున్నారు. నిశ్చితార్థానికి ఇంట్లో వాళ్ళందరూ ఉండాలని డిసెంబర్ తరువాత ఏ రోజు మంచిదని పూజారి గారిని అడిగితే డిసెంబర్ ఆరవ తేదీ ఉదయం పది గంటల తరువాత బావుందని చెప్పారు.

ఆ వేళ ఉదయాన్నే వాకిలి ముందు ముగ్గు వేసి, గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాము. మధ్య గదిలో అంతకు ముందు రోజు రాత్రే ఏర్పాటు చేసిన బ్యాక్ డ్రాప్ ముందు తెల్లని దుప్పటి పరచి నాలుగు పీటలు వేసాం. వెండి పళ్ళెంలో పసుపు కుంకుమలు, మరో పళ్ళెంలో తమలపాకులూ, వక్కలూ, అరటిపళ్ళూ, కొబ్బరి బొండాలు అన్ని సిధ్ధం చేసుకున్నాము. పసుపు గణపతిని చేసి తమలపాకులో పెట్టి  పళ్ళెం నిండుగా బియ్యం పోసి అందులో ఉంచాము.





మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళు న్యూజెర్సీ లో ఉంటారు. మాకు బంగారం కొనడానికి సహాయం చేసారే వాళ్ళ అమ్మాయి తాను. వాళ్ళు వివేక్ ఫ్లవర్స్ నుండి పూల మాలలు తీసుకుని అంతకు ముందు రోజు రాత్రే పెళ్ళికి వచ్చారు. పూలమాలలోని పువ్వులన్నీ అప్పుడే కోసినంత తాజాగా ఉన్నాయి.
 ఉదయం తొమ్మిది గంటలయింది. ముదురాకుపచ్చ రంగు బెనారస్ లంగా, నారింజ రంగు ఓణీ వేసుకుని, వాళ్ళ పిన్ని వేసిన ఫ్రెంచ్ ప్లాట్ ని అద్దంలో చూసుకుంటోంది మా అమ్మాయి. రోజూ పదకొండయినా మంచం దిగని మిగిలిన పిల్లలు కూడా ఆ వేళ అప్పటికే లేచి అందంగా తయారయిపోయారు. మరో అరగంటలో మగ పెళ్ళి వాళ్ళు వచ్చారు. వారి రాకతో పెళ్ళికళ వచ్చేసింది.

పూజారి గారు మా ఇద్దరితో విఘ్నేశ్వర పూజ చేయించి సంకల్పం చెప్పించారు. పెళ్ళి సవ్యంగా జరగాలని ఆ గణపతి దేవుడిని వేడుకున్నాము.    





ఆ తరువాత పూజారి గారు లగ్న పత్రిక వ్రాసి మధ్యలో పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టమని ఇచ్చారు. మా మరిది కూతురి అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి. ఆ పాప పంతులు గారు రాసిన పత్రికను తీసుకుని అప్పటికే ప్రింట్ చేసి పెట్టుకున్న టెంప్లేట్స్ రెండింటిలో ముహూర్తం టైమ్, ప్రదేశం ఇంకా మిగిలిన వివరాలన్నీ రాసింది.


ఆ తరువాత మమ్మల్ని, మాకు కాబోయే వియ్యంకులను ఎదురు ఎదురుగా కూర్చోబెట్టారు. మాతో వారికి, వారితో మాకు గంధం రాయించి, బొట్టు పెట్టించి, పన్నీరు చల్లించి లగ్నపత్రికను పండు తాంబూలాన్ని ఇప్పించారు. దాని అర్థం వాళ్ళ అబ్బాయికి, మా అమ్మాయికి పెళ్ళి చేస్తామని బంధువుల ముందు దైవ సాక్షిగా చేసుకున్న ఒప్పందమట.  

ఏ ఒప్పందం చేసుకున్నా ఇలా తాంబూలం ఇవ్వడం అన్నది పూర్వం నుండీ వస్తున్న ఆచారం. నేను విన్న విశేషాలు ఇప్పుడు మీకు చెప్తాను. పూర్వం యుధ్ధం చేయడానికి ఒప్పుకున్న సైన్యాధికారికి రాజుగారు తాంబూలం ఇచ్చేవారట. అలాగే కావ్యం రాసి తనకు అంకితం ఇవ్వమని అడగడానికి కవిగారికీ ఇచ్చేవాళ్ళట. ఆ తాంబూలం పుచ్చుకున్న పక్షంలో ఆ రాజుగారి  ప్రతిపాదనకు వాళ్ళు ఒప్పుకున్నట్లు అర్థమట.



ఈ తాంబూలం వెనుక నున్న మరో విశేషం చూడండి. ఆకుపచ్చని తమలపాకు, తెల్లని సున్నం, నల్లని వక్క కలిపి తాంబూలం వేసుకున్నప్పుడు నోరు ఎర్రగా పండుతుంది కదా. అలాగే భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వారు ఒక కుటుంబంగా కలసి ఉన్నప్పుడు ప్రేమానురాగలు పండుతాయని దాని అర్థమట.

పండూ తాంబూలంతో పాటు గౌరవ మర్యాదలూ, ఆప్యాయతా అనురాగాలు కూడా ఒకరికి ఒకరం ఇచ్చి పుచ్చుకున్నాము. మా రెండు కుటుంబాలు అలా ఒక్కటయ్యాయి.

కొత్తగా బంధుత్వం కలుస్తున్న శుభ సందర్భానికి గుర్తుగా బట్టలు పెట్టుకున్నాం.
కాబోయే కోడలికి అత్తమామలు కొత్తచీర, నగ పెట్టి పూలుపళ్లు ఇచ్చి ‘శీఘ్రమేవ వివాహసిద్ధి రస్తు,’ అని దీవించారు. 

కాబోయే అల్లుడికి కొత్త బట్టలు పెట్టి, అక్షింతలు వేసి దీవించాము.

ప్రతి సంవత్సరం మా ఇంట్లో రాఖీ రోజున చిట్టితల్లి బుజ్జిపండుకు రాఖీ కట్టడం, పండు అక్కకు బహుమతి ఇవ్వడం ఆనవాయితీ.  నీకు అక్కతో ఉండే అనుబంధం ఇక నుండి బావతో కూడా ఉండాలని చెప్తూ బుజ్జిపండుతో కాబోయే బావకు బహుమతిని ఇప్పించాము.
"మా అబ్బాయి మీకు చూడగానే నచ్చాడా అన్నయ్యా" అని మా వియ్యపురాలు అడిగారు. నచ్చాడని చెప్పారు కానీ అప్పుడు కారణం చెప్పలేదు ఈయన. ఆరడుగులవాడు, అరవిందనేత్రుడు అని కాదు ఆ అబ్బాయి చేతి మీదున్న పచ్చబొట్టు చూసి నచ్చాడట తనకు. బంధాలను ఇంత గౌరవించే వాడు వివాహ బంధాన్ని కూడా గౌరవిస్తాడన్న నమ్మకం.

చందనం రంగు కంచి పట్టుచీరలో పెళ్ళికూతురు, ముదురు నీలం రంగు సూట్ లో పెళ్ళికొడుకు అందంగా తయారయి వచ్చారు. 

ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు పూలల్లో కలగలిపిన మాలలు ఇరువురూ మార్చుకున్నారు. రెండు జీవితాలు ఒక్కటిగా చేసుకుంటామని ఒకరికొకరు వాగ్దానాలు చేసుకున్నారు.

ఇక్కడ ఒక విషయం గమనించారా? ముందుగా రెండు కుటుంబాలు కలిసిన తరువాతనే ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వబోతున్నారు. ఇటువంటి పధ్ధతి హిందూ సాంప్రదాయం లోనే ఉందో ఇతర మతాలలో కూడా ఉందో మరి, తెలిసిన వారు చెప్పాలి.
పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుకి అక్షింతలు వేసి ఆశీర్వదించాము.



ఆడపచులు వారికి పసుపు, సున్నం కలిపిన ఎర్ర నీళ్ళలో  తమలపాకు వేసి దాని మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసారు.

ఈ శుభసందర్భంలో ఇంట్లో అందరికీ బట్టలు పెట్టాము. చిన్న వాళ్ళంతా పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు.  




పూర్వం పెళ్ళి నిశ్చయం చేసుకునే రోజున పెద్దలు, బంధువుల సమక్షంలో నియమ నిబంధులు, ఇచ్చి పుచ్చుకోవడాలు లాంటివి మాట్లాడుకునే వారట. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు నిశ్చితార్థం రోజున అక్కడ ఉండేవారు కాదట. ముఖ్యంగా పెళ్ళికొడుకు. 

మా వియ్యంకులు ఇండియాలో ఉండగానే వాళ్ళకు ఫోన్ చేసి మనం పెళ్ళి మాటలు మాట్లాడుకుందాం మీ ఆచారాలు అవీ చెప్పండి” అని అడిగాం. మా ఆచారాలు ఏవీ లేవు, మీకేమయినా ఉంటే చెప్పండి మేము చేస్తాము అని మా అన్నయ్య అన్నారు. అప్పుడు మా వదిన ఏమన్నారంటే “మాకేమీ లేవు. ఎప్పుడు మేం వాళ్లింటికి వెళ్ళినా మా కోడలు "అబ్బా వీళ్ళు వచ్చారా" అనుకోకుండా "అబ్బ, అత్తమ్మ వాళ్ళు వచ్చారు" అనుకోవాలి. అట్లా అనుకునే విధంగా మేమే చేసుకుంటాము అని చెప్పారు. ఎంత గొప్ప ఆలోచనో కదా! కోడళ్ళు అలా ఉండాలని అందరికీ ఉంటుంది. కోడలు అలా ఉండాలంటే అత్త మామలుగా తమ ప్రవర్తన ఎలా ఉండాలో తెలిసేది ఎందరికి? అలాంటి సమాధానం ఊహించని మేము చాలా ఆశ్చర్యపోయాము. 

ఈ పాండమిక్ వలన కేవలం ఇంట్లో వాళ్ళతోనే నిశ్చితార్థం చేసుకుంటున్నాం. పిల్లల ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది దగ్గర బంధువులు సంగీత్ కి వస్తున్నారు. అప్పుడు ఉంగరాలు మార్చుకుంటే బావుంటుందనుకున్నారు పెళ్ళి కూతురూ, పెళ్ళి కొడుకూనూ.

 
అయితే ఒక సరదా ఘట్టం చెపుతాను వినండి. బంగారు ఉంగరాలు తరువాత మార్చుకోవచ్చని, అప్పటికి రింగ్ పాప్స్ తెచ్చుకున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళు అవే మార్చుకుని మా అందరికీ కూడా తొడిగేశారు. పిల్లలంతా బోలెడు సరదా పడ్డారు. అసలు పెళ్ళి హడావిడి అంతా వాళ్ళదే. ఇంట్లో మొదటి పెళ్ళి మరి.

డిసెంబర్ నెల అయినా ఆ రోజు వాతావరణం అంత చల్లగా లేదు. అందరం పెరట్లోకి వెళ్ళి ఫోటోలు తీయించుకున్నాం. బొబ్బట్లు, కొబ్బరన్నం, దొండకాయ పకోడీ వేపుడు, మామిడికాయ పప్పు, వంకాయ-మామిడికాయ కూర, బీరకాయ పచ్చడితో ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు చేశాం.

ఈ కరోనా వలన దగ్గర స్నేహితులను కూడా పిలవలేకపోయాం, రెండు వైపులా కుటుంబ సభ్యులం మాత్రమే ఈ వేడుక జరుపుకున్నాం. పెళ్ళికి రాలేకపోయిన మా నాన్నకు మిగిలిన బంధువులకు, స్నేహితులకు జూమ్ లో ఈ వేడుకలు చూపించే బాధ్యత బుజ్జిపండు తీసుకున్నాడు. చూస్తున్న మా ఫ్రెండ్స్ కి ఇలా కేవలం కుటుంబ సభ్యులతో ఇంట్లోనే నిశ్చితార్థం చేసుకోవడం చాలా నచ్చిందట.

సాయంత్రం నేనూ, మా వారు ముందుగా వియ్యంకులకు, ఆ తరువాత నలుగురు స్నేహితులకు శుభలేఖలు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించి వచ్చాము.
సంగీత్ హాల్ డెకరేషన్ పూర్తయిందట. ఆ తరువాత రోజు మధ్యాహ్నం కొద్దిసేపు అక్కడకు వెళ్ళి డెకరేషన్ ఎలా చేసారో చూసి డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని పిల్లలు మిమ్మల్ని కూడా బయలుదేరదీసారు. ఓ గంట అక్కడ ఉన్నాం కానీ మనసంతా ఇంటి దగ్గర పనిమీదే ఉన్నది.  ఆ సాయంత్రం ఓ నలుగురైదుగురు ఫ్రెండ్స్ వచ్చారు. పెళ్ళిలో, ప్రదానంలో, వ్రతంలో ఇద్దామనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ పాక్ చేసుకున్నాం. 


ఆ రాత్రి అనుకున్న పనులన్నీ పూర్తయ్యేసరికి ఏ ఒంటిగంటో అయింది. తెల్లవారుతూనే మెహందీ పెట్టేవాళ్ళు వచ్చేస్తారు. ఆ కబుర్లు ఇక్కడ చదవొచ్చు.