Friday, March 26, 2021

నిశ్చయ తాంబూలాలు

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవిఅలంకరణఅరిసెలూ అవాంతరాలుస్వప్నలోకం అంటూ ఆరు రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.

సాధారణంగా నిశ్చితార్థం చేసుకున్నాక పసుపు కొడతారు. మా కాబోయే వియ్యంకులు ఇండియాలో ఉన్నారు. “వదినా, పెళ్ళి పనులు మొదలు పెట్టాలంటే ముందు పసుపు కొట్టాలి, మీరూ, పిల్లలూ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మా అబ్బాయి కోడలితో తాంబూలాలు మార్చుకోండి” అన్నారు మా వియ్యపురాలు . “అలా కాదు లెండి మీరు వచ్చాకే మార్చుకుందాము. మీకు అభ్యంతరం లేకపోతే ముందు పూజారి గారితో ముహూర్తం పెట్టించుకుందాం” అన్నాను, వాళ్ళు సరేనన్నారు. పూజారి గారు ముహూర్తం పెట్టాక పసుపు కొట్టి పెళ్ళి పనులు మొదలు పెట్టేసాము. మా కాబోయే వియ్యంకులు, పెళ్ళి కొడుకు మేనమామ నెల రోజుల ముందే ఇక్కడకు వచ్చారు. పెళ్ళికొడుకు తరఫున ఇంకా వస్తామన్న వాళ్ళు ఉన్నారట కానీ వాళ్ళెవరికీ వీసా లేదుట. అప్పటికి ఎంబసీ ఓపెన్ అయినా అపాయింట్ మెంట్ తీసుకోవాలి. అది త్వరగా ఇవ్వరు ఈ కారణాలతో వాళ్ళు రాలేకపోయారు. 

మా తమ్ముడు వాళ్ళు, మరిది వాళ్ళు పెళ్ళికి రెండు వారాల ముందే వస్తున్నారు. నిశ్చితార్థానికి ఇంట్లో వాళ్ళందరూ ఉండాలని డిసెంబర్ తరువాత ఏ రోజు మంచిదని పూజారి గారిని అడిగితే డిసెంబర్ ఆరవ తేదీ ఉదయం పది గంటల తరువాత బావుందని చెప్పారు.

ఆ వేళ ఉదయాన్నే వాకిలి ముందు ముగ్గు వేసి, గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాము. మధ్య గదిలో అంతకు ముందు రోజు రాత్రే ఏర్పాటు చేసిన బ్యాక్ డ్రాప్ ముందు తెల్లని దుప్పటి పరచి నాలుగు పీటలు వేసాం. వెండి పళ్ళెంలో పసుపు కుంకుమలు, మరో పళ్ళెంలో తమలపాకులూ, వక్కలూ, అరటిపళ్ళూ, కొబ్బరి బొండాలు అన్ని సిధ్ధం చేసుకున్నాము. పసుపు గణపతిని చేసి తమలపాకులో పెట్టి  పళ్ళెం నిండుగా బియ్యం పోసి అందులో ఉంచాము.





మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళు న్యూజెర్సీ లో ఉంటారు. మాకు బంగారం కొనడానికి సహాయం చేసారే వాళ్ళ అమ్మాయి తాను. వాళ్ళు వివేక్ ఫ్లవర్స్ నుండి పూల మాలలు తీసుకుని అంతకు ముందు రోజు రాత్రే పెళ్ళికి వచ్చారు. పూలమాలలోని పువ్వులన్నీ అప్పుడే కోసినంత తాజాగా ఉన్నాయి.
 ఉదయం తొమ్మిది గంటలయింది. ముదురాకుపచ్చ రంగు బెనారస్ లంగా, నారింజ రంగు ఓణీ వేసుకుని, వాళ్ళ పిన్ని వేసిన ఫ్రెంచ్ ప్లాట్ ని అద్దంలో చూసుకుంటోంది మా అమ్మాయి. రోజూ పదకొండయినా మంచం దిగని మిగిలిన పిల్లలు కూడా ఆ వేళ అప్పటికే లేచి అందంగా తయారయిపోయారు. మరో అరగంటలో మగ పెళ్ళి వాళ్ళు వచ్చారు. వారి రాకతో పెళ్ళికళ వచ్చేసింది.

పూజారి గారు మా ఇద్దరితో విఘ్నేశ్వర పూజ చేయించి సంకల్పం చెప్పించారు. పెళ్ళి సవ్యంగా జరగాలని ఆ గణపతి దేవుడిని వేడుకున్నాము.    





ఆ తరువాత పూజారి గారు లగ్న పత్రిక వ్రాసి మధ్యలో పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టమని ఇచ్చారు. మా మరిది కూతురి అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి. ఆ పాప పంతులు గారు రాసిన పత్రికను తీసుకుని అప్పటికే ప్రింట్ చేసి పెట్టుకున్న టెంప్లేట్స్ రెండింటిలో ముహూర్తం టైమ్, ప్రదేశం ఇంకా మిగిలిన వివరాలన్నీ రాసింది.


ఆ తరువాత మమ్మల్ని, మాకు కాబోయే వియ్యంకులను ఎదురు ఎదురుగా కూర్చోబెట్టారు. మాతో వారికి, వారితో మాకు గంధం రాయించి, బొట్టు పెట్టించి, పన్నీరు చల్లించి లగ్నపత్రికను పండు తాంబూలాన్ని ఇప్పించారు. దాని అర్థం వాళ్ళ అబ్బాయికి, మా అమ్మాయికి పెళ్ళి చేస్తామని బంధువుల ముందు దైవ సాక్షిగా చేసుకున్న ఒప్పందమట.  

ఏ ఒప్పందం చేసుకున్నా ఇలా తాంబూలం ఇవ్వడం అన్నది పూర్వం నుండీ వస్తున్న ఆచారం. నేను విన్న విశేషాలు ఇప్పుడు మీకు చెప్తాను. పూర్వం యుధ్ధం చేయడానికి ఒప్పుకున్న సైన్యాధికారికి రాజుగారు తాంబూలం ఇచ్చేవారట. అలాగే కావ్యం రాసి తనకు అంకితం ఇవ్వమని అడగడానికి కవిగారికీ ఇచ్చేవాళ్ళట. ఆ తాంబూలం పుచ్చుకున్న పక్షంలో ఆ రాజుగారి  ప్రతిపాదనకు వాళ్ళు ఒప్పుకున్నట్లు అర్థమట.



ఈ తాంబూలం వెనుక నున్న మరో విశేషం చూడండి. ఆకుపచ్చని తమలపాకు, తెల్లని సున్నం, నల్లని వక్క కలిపి తాంబూలం వేసుకున్నప్పుడు నోరు ఎర్రగా పండుతుంది కదా. అలాగే భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వారు ఒక కుటుంబంగా కలసి ఉన్నప్పుడు ప్రేమానురాగలు పండుతాయని దాని అర్థమట.

పండూ తాంబూలంతో పాటు గౌరవ మర్యాదలూ, ఆప్యాయతా అనురాగాలు కూడా ఒకరికి ఒకరం ఇచ్చి పుచ్చుకున్నాము. మా రెండు కుటుంబాలు అలా ఒక్కటయ్యాయి.

కొత్తగా బంధుత్వం కలుస్తున్న శుభ సందర్భానికి గుర్తుగా బట్టలు పెట్టుకున్నాం.
కాబోయే కోడలికి అత్తమామలు కొత్తచీర, నగ పెట్టి పూలుపళ్లు ఇచ్చి ‘శీఘ్రమేవ వివాహసిద్ధి రస్తు,’ అని దీవించారు. 

కాబోయే అల్లుడికి కొత్త బట్టలు పెట్టి, అక్షింతలు వేసి దీవించాము.

ప్రతి సంవత్సరం మా ఇంట్లో రాఖీ రోజున చిట్టితల్లి బుజ్జిపండుకు రాఖీ కట్టడం, పండు అక్కకు బహుమతి ఇవ్వడం ఆనవాయితీ.  నీకు అక్కతో ఉండే అనుబంధం ఇక నుండి బావతో కూడా ఉండాలని చెప్తూ బుజ్జిపండుతో కాబోయే బావకు బహుమతిని ఇప్పించాము.
"మా అబ్బాయి మీకు చూడగానే నచ్చాడా అన్నయ్యా" అని మా వియ్యపురాలు అడిగారు. నచ్చాడని చెప్పారు కానీ అప్పుడు కారణం చెప్పలేదు ఈయన. ఆరడుగులవాడు, అరవిందనేత్రుడు అని కాదు ఆ అబ్బాయి చేతి మీదున్న పచ్చబొట్టు చూసి నచ్చాడట తనకు. బంధాలను ఇంత గౌరవించే వాడు వివాహ బంధాన్ని కూడా గౌరవిస్తాడన్న నమ్మకం.

చందనం రంగు కంచి పట్టుచీరలో పెళ్ళికూతురు, ముదురు నీలం రంగు సూట్ లో పెళ్ళికొడుకు అందంగా తయారయి వచ్చారు. 

ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు పూలల్లో కలగలిపిన మాలలు ఇరువురూ మార్చుకున్నారు. రెండు జీవితాలు ఒక్కటిగా చేసుకుంటామని ఒకరికొకరు వాగ్దానాలు చేసుకున్నారు.

ఇక్కడ ఒక విషయం గమనించారా? ముందుగా రెండు కుటుంబాలు కలిసిన తరువాతనే ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వబోతున్నారు. ఇటువంటి పధ్ధతి హిందూ సాంప్రదాయం లోనే ఉందో ఇతర మతాలలో కూడా ఉందో మరి, తెలిసిన వారు చెప్పాలి.
పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుకి అక్షింతలు వేసి ఆశీర్వదించాము.



ఆడపచులు వారికి పసుపు, సున్నం కలిపిన ఎర్ర నీళ్ళలో  తమలపాకు వేసి దాని మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసారు.

ఈ శుభసందర్భంలో ఇంట్లో అందరికీ బట్టలు పెట్టాము. చిన్న వాళ్ళంతా పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు.  




పూర్వం పెళ్ళి నిశ్చయం చేసుకునే రోజున పెద్దలు, బంధువుల సమక్షంలో నియమ నిబంధులు, ఇచ్చి పుచ్చుకోవడాలు లాంటివి మాట్లాడుకునే వారట. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు నిశ్చితార్థం రోజున అక్కడ ఉండేవారు కాదట. ముఖ్యంగా పెళ్ళికొడుకు. 

మా వియ్యంకులు ఇండియాలో ఉండగానే వాళ్ళకు ఫోన్ చేసి మనం పెళ్ళి మాటలు మాట్లాడుకుందాం మీ ఆచారాలు అవీ చెప్పండి” అని అడిగాం. మా ఆచారాలు ఏవీ లేవు, మీకేమయినా ఉంటే చెప్పండి మేము చేస్తాము అని మా అన్నయ్య అన్నారు. అప్పుడు మా వదిన ఏమన్నారంటే “మాకేమీ లేవు. ఎప్పుడు మేం వాళ్లింటికి వెళ్ళినా మా కోడలు "అబ్బా వీళ్ళు వచ్చారా" అనుకోకుండా "అబ్బ, అత్తమ్మ వాళ్ళు వచ్చారు" అనుకోవాలి. అట్లా అనుకునే విధంగా మేమే చేసుకుంటాము అని చెప్పారు. ఎంత గొప్ప ఆలోచనో కదా! కోడళ్ళు అలా ఉండాలని అందరికీ ఉంటుంది. కోడలు అలా ఉండాలంటే అత్త మామలుగా తమ ప్రవర్తన ఎలా ఉండాలో తెలిసేది ఎందరికి? అలాంటి సమాధానం ఊహించని మేము చాలా ఆశ్చర్యపోయాము. 

ఈ పాండమిక్ వలన కేవలం ఇంట్లో వాళ్ళతోనే నిశ్చితార్థం చేసుకుంటున్నాం. పిల్లల ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది దగ్గర బంధువులు సంగీత్ కి వస్తున్నారు. అప్పుడు ఉంగరాలు మార్చుకుంటే బావుంటుందనుకున్నారు పెళ్ళి కూతురూ, పెళ్ళి కొడుకూనూ.

 
అయితే ఒక సరదా ఘట్టం చెపుతాను వినండి. బంగారు ఉంగరాలు తరువాత మార్చుకోవచ్చని, అప్పటికి రింగ్ పాప్స్ తెచ్చుకున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళు అవే మార్చుకుని మా అందరికీ కూడా తొడిగేశారు. పిల్లలంతా బోలెడు సరదా పడ్డారు. అసలు పెళ్ళి హడావిడి అంతా వాళ్ళదే. ఇంట్లో మొదటి పెళ్ళి మరి.

డిసెంబర్ నెల అయినా ఆ రోజు వాతావరణం అంత చల్లగా లేదు. అందరం పెరట్లోకి వెళ్ళి ఫోటోలు తీయించుకున్నాం. బొబ్బట్లు, కొబ్బరన్నం, దొండకాయ పకోడీ వేపుడు, మామిడికాయ పప్పు, వంకాయ-మామిడికాయ కూర, బీరకాయ పచ్చడితో ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు చేశాం.

ఈ కరోనా వలన దగ్గర స్నేహితులను కూడా పిలవలేకపోయాం, రెండు వైపులా కుటుంబ సభ్యులం మాత్రమే ఈ వేడుక జరుపుకున్నాం. పెళ్ళికి రాలేకపోయిన మా నాన్నకు మిగిలిన బంధువులకు, స్నేహితులకు జూమ్ లో ఈ వేడుకలు చూపించే బాధ్యత బుజ్జిపండు తీసుకున్నాడు. చూస్తున్న మా ఫ్రెండ్స్ కి ఇలా కేవలం కుటుంబ సభ్యులతో ఇంట్లోనే నిశ్చితార్థం చేసుకోవడం చాలా నచ్చిందట.

సాయంత్రం నేనూ, మా వారు ముందుగా వియ్యంకులకు, ఆ తరువాత నలుగురు స్నేహితులకు శుభలేఖలు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించి వచ్చాము.
సంగీత్ హాల్ డెకరేషన్ పూర్తయిందట. ఆ తరువాత రోజు మధ్యాహ్నం కొద్దిసేపు అక్కడకు వెళ్ళి డెకరేషన్ ఎలా చేసారో చూసి డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని పిల్లలు మిమ్మల్ని కూడా బయలుదేరదీసారు. ఓ గంట అక్కడ ఉన్నాం కానీ మనసంతా ఇంటి దగ్గర పనిమీదే ఉన్నది.  ఆ సాయంత్రం ఓ నలుగురైదుగురు ఫ్రెండ్స్ వచ్చారు. పెళ్ళిలో, ప్రదానంలో, వ్రతంలో ఇద్దామనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ పాక్ చేసుకున్నాం. 


ఆ రాత్రి అనుకున్న పనులన్నీ పూర్తయ్యేసరికి ఏ ఒంటిగంటో అయింది. తెల్లవారుతూనే మెహందీ పెట్టేవాళ్ళు వచ్చేస్తారు. ఆ కబుర్లు ఇక్కడ చదవొచ్చు. 


No comments:

Leave your Comment

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.