Monday, March 22, 2021

అలంకరణ

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవి అంటూ మూడు రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.

డెకరేషన్స్ కి మేము అనుకున్న డిజైన్స్ బెంగుళూరులో ఉన్న కజిన్ కి వాట్స్ ఆప్ లో పిక్స్ పంపించాను. వాటికి కావలసినవి వస్తువులు, ఇంకా పెళ్ళికి కావలసిన ఉంగరాల బిందె, మంగళ స్నానాలకు జల్లెడ, కొబ్బరిబోండాం డెకరేషన్ కి కుందన్స్, కళ్యాణం బొట్టు, తలంబ్రాలకు ముత్యాలు, పువ్వుల ఆభరణాలు, గాజులు, పెట్టడానికి చీరలు, బ్లౌజ్ పీసెస్ ఇలా ఒకటేమిటి సమస్తం ఈ కోవిద్ టైమ్ లో కూడా ఒకటికి నాలుగు సార్లు షాపింగ్ కి వెళ్ళి దొరికినవన్నీ పంపించింది.



బ్యాక్ డ్రాప్ కి చిలుకలు కావాలని అడిగాము. అవి దొరకలేదని తన స్వంత ఆలోచనలతో బ్లౌజ్ పీస్ ని చిలుకల్లా కుట్టి౦చింది. అలాగే మెహంది డెకరేషన్ కి కావలసిన దిండు కవర్లు కూడా. మేము చెప్పినవే కాక ఇలా తన ఆలోచనతో అవసరం అనుకున్నవన్నీ పంపించింది.

వధూవరులను పూల పందిరి కింది నడిపిస్తూ మండపానికి తీసుకొని రావాలని ముచ్చట పడ్డాం. మల్లెపూలు, లిల్లీ స్ తో కట్టిన పందిరి అయితే భలే ఉంటుంది కదూ! చల్లగా ఉండే ఈ డిసెంబర్ లో ఇక్కడ చామంతులే దొరకవు, అలాంటిది మరి మల్లెపువ్వులంటే కష్టమే. మా కజిన్ షాపింగ్ చేస్తున్నప్పుడే ఆర్టిఫిషియల్ లిల్లీస్ దొరుకుతాయేమో చూడమన్నాను. తాను షాప్ లో చూసిన పిక్స్ పెట్టింది. లిల్లీస్ బాగానే ఉన్నాయి కానీ తక్కువ మాలలు దొరికాయి అదీ బంతి పూల కాంబినేషన్ తో. విడిగా లిల్లీస్ తీసుకుని పంపి౦చింది. దాంతో పాటే అల్లడానికి పెద్ద దారపు ఉండ, పూసలు కూడానూ. ఎంత చక్కగా ఆలోచించిందో కదా!

అడ్డుతెర మాత్రం స్పెషల్ గా డిజైన్ చేయించాలనుకుంది. అయితే అది తాను అనుకున్నట్లుగా కాక ఫ్లెక్సీలా వచ్చింది. పెళ్ళిపూలజడ వాళ్ళను అడిగాము కానీ మాకు కావలసిన డిజైన్ వాళ్ళ దగ్గర రెడీగా లేదు. అప్పటికే వస్తువులు షిప్ చేయాల్సిన టైమ్ దాటిపోతోందని అన్నీ షిప్ చేసేసింది.

అడ్డుతెర కోసం నెల్లూరులో ఉన్న ఫ్రెండ్ కి ఫోన్ చేశాను, తను నాకు ఒకసారి ఒక ఆర్టిస్ట్ ని పరిచయం చేసారు. ఆవిడ కాన్వాస్ మీద వేసిన పెయింటింగ్స్ చాలా బావున్నాయి తను బట్టల మీద కూడా పెయింట్ చేస్తారు. అప్పటికప్పుడు ఆ ఫ్రెండ్ ఆ ఆర్టిస్ట్ తో మాట్లాడి అడ్డుతెర పెయింట్ చేయించారు. ఇంకా కొనవలసిన చీరలు ఉంటే అవి కూడా తీసుకుని పంపించారు.

ఏవో చిన్న చిన్న సరదాలు ఉంటాయిగా తలంబ్రాల పళ్ళాలు, పసుపు కుంకుమలు పాకెట్స్, తాంబూలం ఇవ్వడానికి పొట్లీ బాగ్స్ అవన్నీ మా తోడికోడలు తీసుకుని వచ్చింది. భలే ఉన్నాయి కదూ! 

అలా పెళ్ళి బట్టలు, నగలు కొనడం దగ్గర నుండి పెళ్ళికి కావలసిన వస్తువుల షాపింగ్ దాకా మా బరువు బాధ్యతల్ని తమ బాధ్యతలుగా తీసుకుని వీళ్ళంతా చేసిన సహాయం ఎప్పటికీ మరచిపోలేం.

ఒక వైపు ఇండియాలో షాపింగ్స్ అవుతున్నాయి, ఆఫ్ షోర్ తో పనిచేస్తున్నట్లే రాత్రంతా వీడియో కాల్స్ ఉండేవి. మరో వైపు అమెరికాలో డెకరేషన్ ఏర్పాట్లు మొదలు పెట్టాం. ముందుగా లోవ్స్ నుండి చెక్క తెచ్చి డెకరేషన్స్ కి కావలసిన వుడ్ ఫ్రేమ్స్ మా వారు, మరో ఫ్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫ్రెండ్ గురించి మీకు కొంచెం చెప్పాలి. పెళ్ళికి పిలవకపోయినా ఫరవాలేదు పని మాత్రం చెప్పండి అంటూ ఈ రోజు మొదలు పెళ్ళి రోజు రాత్రి సామానులు ఇంటికి వచ్చిందాకా అన్ని పనులు తనవే. ఫ్రేమ్స్ పూర్తయ్యాక చక్కగా వాటికి వైట్ పెయింట్ కూడా వేసారు. 


మేము ఎన్నుకున్న డిజైన్ లో ముగ్గు వేస్తానని ఓ ఫ్రెండ్ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ముగ్గు పిండితో ముగ్గు కర్ర గీసినంత తేలిగ్గా పనవ్వలేదు. వాల్ మార్ట్, జోయాన్ ఫాబ్రిక్స్, హాబీ వార్ల్డ్ లాంటి షాపులన్నీ ఇవన్నీ తిరిగి రకరకాల క్లాత్ లు, పెయింట్ లు, బ్రష్ లు మార్చి చివరకు సాధించారు.
ఈలోగా గరుడవేగాలో మా కజిన్ పంపిన షిప్పింగ్ వచ్చింది. ముప్పై గంటలు ప్రయాణం చేసి రావడంతో పాపం పువ్వులు అలసి సొలసి ముడుచుకు పోయాయి. మా వారూ, మరిదీ వాటిని హోమ్ థియేటర్ కి తీసుకువెళ్ళి కబుర్లే చెప్పారో, సినిమాలే చూపించారో కానీ కళకళలాడుతూ బయటకు వచ్చాయి. మా తమ్ముడు, మరో ఫ్రెండ్, బుజ్జి పండు ఇంకా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకూ కూడా కూర్చుని ఆ పూల మాలలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రేమ్ కి కట్టారు. కట్టినప్పుడు అబ్బా భలే ఉన్నాయి అనుకున్నామా, ఫ్రేమ్స్ నిలబెట్టగానే పూలు వేళ్ళాడి పోతున్నాయి.

బోలెడు కష్టపడినా ఫలితం దక్కలేదని మా మరిది, తోడికోడలు, తమ్ముడు, మరదలు ఒక్కొక్క పువ్వు తీసి మాల గుచ్చి మళ్ళీ కట్టారు. ఈసారి ఎంత బాగా వచ్చిందో చూడండి. పనిలో పర్ఫెక్షన్ అంటే అది. వీళ్ళు నలుగురూ తలచుకుంటే సాధించలేనిది లేదు.

చిలుకలు కుట్టించిందిగా మా కజిన్, ఆ చిలుకలు ఫిల్ చేయడానికి ముందు థెర్మోకోల్ బాల్స్ అమెజాన్ లో ఆర్డర్ చేసాము. సన్న హోలో బాల్స్ వేయాడానికి చాలా టైమ్ పడుతోంది. ఇంతలో ఒక ఫ్రెండ్ తాను ఆ పని చేస్తానని తీసుకున్నారు. థెర్మో కోల్ బాల్స్ వేయడానికి కష్టంగా ఉందని బియ్యం వేసారట. చిలుక తయారయ్యింది కానీ బరువు పెరిగి పోయింది. ఇలా కాదని ధనియాలు వేసి చిలుకను ఫిల్ చెసారు. ఇవిగోండి మా ధనియాల చిలుకలు.


లిల్లీస్ వచ్చాయిగా తీరిక దొరికిన వాళ్ళం సరదాగా మాలలు గుచ్చడం మొదలు పెట్టాం. పెద్దావిడ మా అత్తయ్య కూడా ఈ మాలలు గుచ్చారు. నాలుగు రోజులకు అందరికీ మోజు తీరి పోయింది. ఆ తరువాత ఇద్దరు ఫ్రెండ్స్ ఆ పూలను తీసుకెళ్ళి రెండు రోజుల్లో మొత్తం మాలలు గుచ్చి తీసుకుని వచ్చారు. అప్పటికే తయారుచేసిన ఫ్రేమ్ కి ఆ పూలన్నింటినీ వేలాడ దీసాము. 

ఒక రోజు యూ ట్యూబ్ లో వీడియో చూస్తూ “మనం కూడా పెళ్ళి కూతురికీ, పెళ్ళి కొడుకుకూ కలిపి మంగళ స్నానం చేయిస్తే ఎలా ఉంటుంది?” అనుకున్నాం. అనుకున్నదే తడవుగా పెళ్ళి కొడుకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకున్నారు. మా పెరట్లో పెర్గోలా వేసి డెకరేషన్స్ కి కావలసిన కర్టెన్స్ ఇండియా నుండి తెప్పించారు. జిల్లు మనే చలిని కూడా లెక్కచేయక ఒక సాయంకాలం పూట నాలుగు గంటల పాటు ఆ పందిరిని ముస్తాబు చేశారు.

 ఒక ఫ్రెండ్ వాళ్ళ పాప కుందన్స్ తీసుకుని వెళ్ళి చక్కగా కొబ్బరి బోండాం ను అలంకరించి  తీసుకుని వచ్చింది. అలా డెకరేషన్ కి కావలసినవి ముందుగా తయారు చేసుకున్నాం.
ఇవన్నీ ముందుగా చేసికున్నాం. పెళ్ళి రోజు మాత్రం మా ఫ్రెండ్ ఒకతను, వాళ్ళ పిల్లలు, మరో  ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కలసి ఇలా చక్కగా పూల కార్లు సిద్ధం చెసారు.  ఇందులో మా జోక్యం ఏమీ లేదు. కార్లు రాగానే నోర్లు తెరచి చూడడం తప్ప. డిజైనింగ్, మెటీరీయల్ తెచ్చుకోవడం, డెకరేషన్ అంతా వాళ్ళదే. 

ఈ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళి దగ్గరుండి చేయాలని సరదా పడిన వాళ్ళు. ఈ కరోనా వలన  ఇంటికి రాలేకపోవడంతో చేయాల్సిన పనేదైనా ఉంటే వాళ్ళ ఇంటికే తీసికెళ్ళి చేసి పంపించేవాళ్లు. మనసుంటే మార్గమదే కనిపిస్తుంది. ఏమంటారు? 

పెళ్ళి కూతురికి పట్టు చీర కట్టి, నిండుగా నగలు పెట్టినా బారుగా అల్లి పూలజడ వేయకపోతే కళే ఉండదు. పూలజడ, మాలలు వివేక్ ఫ్లవర్స్ లో దొరుకుతాయని తెలుసు కానీ ఈ డిసెంబర్ చలికి ఎలా ఉంటాయో తెలీదు. ఎందుకైనా మంచిదని జడబిళ్ళలు తెప్పించి, ఆ బిళ్ళలకు చుట్టూ తాజా పూలు ఎలా పెట్టాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాం. 

వివేక్ ఫ్లవర్స్ లో మల్లెపూలు, జాజిపూలు, గులాబీలు, లిల్లీలు ఇలా చాలా రకాల పువ్వులు ఉన్నాయి. పూలజడ, పూల మాలలు, వేణీలు, తలలో పెట్టుకోవడానికి మాలలు ఆర్డర్ చేసాము. ఈ బాధ్యత అంతా మా మరదలు తీసుకుంది. మా ఊళ్ళో వివేక్ ఫ్లవర్స్ బ్రాంచ్ లేదు, దగ్గరలో అట్లాంటా, న్యూజెర్సీలలో ఉన్నాయి. అక్కడి నుండి వాళ్ళు షిప్పింగ్ చేస్తే వచ్చేసరికి ఎంత ఫ్రెష్ గా ఉంటాయో తెలీదు. వివేక్ ఫ్లవర్స్ వాళ్ళకు ఫోన్ చేసి మేమే వచ్చి తీసుకుంటామని పది పన్నెండు గంటలు బయటే ఉండాలి కాబట్టి ఐస్ బాక్స్ లో పెట్టి ఇవ్వమన్నాం. సరేనన్నారు.

ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక వేడుకలు మొదలవడమే తరవాయి అనుకుంటున్నారా? భలేవాళ్ళే, పెళ్ళికి స్వీట్స్ లేకుండానా. ఆ కబుర్లు ఇక్కడ చదవొచ్చు

12 comments:

  1. Replies
    1. ప్రతి పోస్ట్ చదివి చక్కగా కామెంట్ వ్రాస్తున్నారు. ధాన్యాదాలు సుబ్రమణ్యం గారు.

      Delete
  2. కళ్ళకి కట్టినట్టు ఉన్నాయి కబుర్లు

    ReplyDelete
  3. మా చిన్నప్పుడు చూసిన పెళ్లిళ్లు గుర్స్టోస్తున్నాయి , అప్పట్లో , ఇలా పనివాళ్ళు , ఈవెంట్ మానేజ్మెంట్ లాంటివి ఏమి లేకుండా , బంధువులు తలా ఒక చేయి వేసి చేసేవాళ్ళు . నెలరోజులు ముందు మొదలయి , పెళ్లి తరువాత నెలరోజులు వరకు ఆ వాసన ఉండేది ఇంట్లో . మీరు ఈ పనులు అన్ని మీ వాళ్ళు సహాయం తో చేసుకోవడం చూస్తుంటే , సంతోషంగా ఉంది . ఇలా ప్రతీ పని అందరు కలిసి చేసుకోవడం చాల ఆనందంగా ఉంటుంది .

    ReplyDelete
    Replies
    1. అవునండీ, నలుగురూ కలసి పని చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. ధన్యవాదాలు.

      Delete
  4. 👌👌👌👌👌
    👏👏👏👏👏
    మాటల్లేవ్...భలే చేసారండి, ముగ్గు ఎలా వేశారు vector paint లాగా వచ్చింది. సూపర్. రెండవ ఫోటో లో గొడుగులాగా ఉన్నవి ఏమిటవి ?

    ReplyDelete
    Replies
    1. ముగ్గు భలే వేసారు కదూ! అవి రాజస్థానీ గొడుగులు, మెహంది డెకరేషన్ కోసం మా కజిన్ పంపించింది. ధన్యవాదాలండీ.

      Delete
  5. చిలుకల డెకరేషన్ ఎక్కడ వాడారు ?

    ReplyDelete
    Replies
    1. పైన ఉన్న బ్యాక్ డ్రాప్ లో బంతిపువ్వుల మధ్యలో రెండు చిలుకలు ఉన్నాయి చూడండి. ముందు గంటల బదులు చిలుకలు పెడదామనుకున్నాము. పెట్టి చూస్తే గంటలే బావున్నాయని అవే పెట్టాము.

      Delete
  6. గొడుగులు ఎలా వాడారు ఫోటో చూపించండి.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా. తరువాత పోస్ట్ లలో వస్తుందండి.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.