Thursday, March 18, 2021

అమెరికాలో తెలుగు పెళ్ళి

ఒకప్పుడు మనసును మీటి మధురోహలు పలికించిన రెండక్షరాల పెళ్ళి అనే పదం, నేడు పాతికేళ్ళు దాటిన పిల్లల తల్లిదండ్రుల మనసులలో రేపుతోంది కలవరం.

మాతృదేశానికి దూరంగా అమెరికాలో ఉంటున్నాం. పిల్లలకు పెళ్ళి సంబంధాలు ఎలా చూడాలి? ఒకవేళ ఏ మ్యాచ్ మేకింగ్ సైట్ ద్వారానో చూసినట్లయితే ఆ వ్యక్తి గురించి, కుటుంబం గురించి తెలిసేదెలా? మనం చూసిన సంబంధాలు పిల్లలకు నచ్చుతాయా? అసలు పెద్దవాళ్ళం ఈ సంబంధాలు చూడడం అనేది సరైనా పనేనా? ఒకవేళ పిల్లలు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు, మన ప్రాంతం, దేశం కాకపోతే మన కుటుంబంలో ఇమడగలరా? ఇలా ఎన్నో సందేహాలు.

ఇలాంటి పరిస్థితులలో “నేను ఫలానా వ్యక్తిని కలిశాను, మీరు కూడా చూసి మీ అభిప్రాయం చెప్పండి” అని మీ అమ్మాయి ఒక అబ్బాయిని పరిచయం చేసిందనుకోండి. ఆ పరిచయం అయిన అబ్బాయి మీకు కూడా అన్ని విధాలుగా నచ్చి, పైగా మరో కొత్త భాషేదో నేర్చుకోనవసరం లేకుండా ఆ అబ్బాయి అచ్చ తెలుగులో మాట్లాడుతుంటే... ఊహించుకుంటేనే భలే సంతోషంగా ఉంది కదూ! పోయిన ఆగస్ట్ లో మా అమ్మాయి మాకా సంతోషాన్ని ఇచ్చింది.

ఆ అబ్బాయి మమ్మల్ని కలిసి మాట్లాడిన మొదటి రోజే ఒక పొజిటివ్ ఫీలింగ్ కలిగింది. మా అభిప్రాయాలేవీ మా పాపతో చెప్పకుండా తన నిర్ణయం కొరకు వేచి చూసాము. మనం చూసే కోణం వేరు పిల్లల ఆలోచనా ధోరణి వేరు. జీవితాంతం కలసి నడవవలసిన వాళ్ళు, వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఓ రెండు నెలల తరువాత పిల్లలిద్దరూ కూడా ఒకరికొకరు నచ్చామని పెళ్ళికి సిద్దమేనని చెప్పారు. ఈలోగా పెద్దవాళ్ళం మేము కూడా పరిచయాలు చేసుకున్నాం. మా అదృష్టం ఏమిటంటే ఆ అబ్బాయి అన్నా వదినలు మా ఊరి లోనే ఉండడం.

అది సరే "మా గొప్పగా పోస్ట్ మొదలు పెట్టావు. ఇప్పటివరకూ మేము ఎవరం పెళ్ళిళ్ళవీ చేయలేదనుకున్నావా" అని యుధ్ధానికి రాకండేం. సాంప్రదాయబధ్ధంగా అచ్చతెలుగు పెళ్ళిళ్ళు అమెరికాలో చాలా మంది చేసి ఉండొచ్చు గానీ ఇలా కరోనా కాలంలో పెళ్ళి చేయడం మాత్రం ఓ గమ్మత్తైన అనుభవం. “మొన్నటికి మొన్న కరోనా సమయంలో ప్రయాణం అన్నావు, ఇప్పుడేమో పెళ్ళంటున్నావు. వేరే టైమ్ ఏదీ కుదరలేదా మీకు, హై” అనకండి. ఇందులో మా తప్పేం లేదు “ పెళ్ళి చేస్తే డిసెంబర్ పది లోగా చేయండి, లేదా ఏప్రిల్ వరకూ ఆగాలి, ఈలోగా ముహూర్తాలే లేవని” పంతులు గారు చెప్పారు. అదీ కాక పిల్లలు అలా రెస్టారెంట్ దాకా వెళ్ళొస్తామన్నా ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని మాకు కంగారుగా ఉంటోంది. బయటకు వెళ్ళడాలూ అవీ ఎలాగూ లేవు చక్కగా పెళ్ళి చేస్తే ఒకే గూట్లో చిలుకా గోరింకల్లా ఉంటారని ఇరువైపుల పెద్దవాళ్ళం నిర్ణయించుకున్నాం. అలాగ మా చిట్టితల్లి పెళ్ళి నిశ్చయం అయింది.


ఇంతకూ “ఇవన్నీ మాకెందుకు చెప్తున్నట్లో” అనుకుంటున్నారా? మాలాగా ఇతర దేశాలలో ఉండి పెళ్ళి వేడుకలు జరిపించడం ఎలా? అని ఆందోళన పడుతున్న వాళ్ళకు ఉపయోగపడుతుందని, అమెరికాలో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారా అని ఆసక్తి ఉన్న మీ లాంటి వాళ్ళ కోసమూనూ.

పెళ్ళికి ఎక్కువ వ్యవధి లేదు, ప్రస్తుత పరిస్థితులలో ఇండియా వెళ్ళి పెళ్ళి చేసే వీలూ లేదు. ఆ ముచ్చటేదో అమెరికాలోనే జరిపించాలని నిర్ణయించుకున్నాం. కేవలం కుటుంబ సభ్యులం మాత్రమే ఉండి ఇంట్లోనే మండపం అదీ కట్టి పెళ్ళి జరిపించేటట్లు, ఈ కరోనా తగ్గి రోజులు మామూలైనప్పుడు మెహందీ, సంగీత్ లాంటి వేడుకలన్నీ చేసుకునేటట్లుగా మా పిల్లలకో ప్రతిపాదన పెట్టాం. వాళ్ళన్నారు “ఈ కరోనా వాక్సిన్ రావడానికీ, అంతా మామూలవడానికి ఒక్క ఏడాదే పడుతుందో ఇంకా ఎక్కువే అవుతుందో, అప్పుడు మాకేం సరదా ఉంటుంది? తక్కువ మందితో అయినా అన్ని వేడుకలూ ఇప్పుడే చేసుకుందాం” అని. సమంజసమే కదా!

“పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు” అనే పాట గుర్తుంది కానీ, ఆ పందిళ్ళు ఎలా వేయాలో, తప్పెట్లు, తాళాల మాటేమిటో, తలంబ్రాలు ఎలా కలపాలో ఏమీ తెలియదు. అమెరికా వచ్చిన పాతికేళ్ళలో ఇక్కడ రెండంటే రెండే పెళ్ళిళ్ళు చూసాను. ఒకటి మా వారి బాస్ పెళ్ళి. అమెరికన్ పెళ్ళికొడుకు కొరియన్ పెళ్ళి కూతురు. చర్చ్ లో పెళ్ళి, ఓ యాభై మంది అతిధులు, ఆ పక్కనే ఉన్న హాల్ లో భోజనాలు. మనం సినిమాలో చూసినట్లుగానే ఉంగరాల మార్పిడి పెళ్ళి. మరో పెళ్ళి తెలుగు వాళ్ళదే కానీ అతిథులుగానే వెళ్ళాం, అన్నీ వివరంగా చూసే సందర్భం రాలేదు.

మా తమ్ముడిది, మరిదిది పెళ్ళిళ్ళు జరిగి ఇరవై ఏళ్ళ పైమాటే. ఇండియా నుండి బంధువులు ఎవరైనా పెళ్ళి, నిశ్చితార్థం అని ఫోన్ చేస్తే, ఫోన్ లోనే విషెస్ చెప్పడం తప్ప ఎప్పుడూ హాజరవలేక పోయాము. పోయిన ఏడాది ఓ ఐదు నెలలు ఇండియాలో ఉండడంతో దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళడానికి వీలయింది కానీ, అంతా పుస్తక పరిజ్ఞానం. ఎంత దగ్గరుండి చూసినా, చేయడానికి వచ్చేసరికి అన్నీ కొత్తగా ఉంటాయి. పైగా ఆ పెళ్ళికి వెళ్ళింది నేనొక్కదాన్నే.

తరచుగా పెళ్ళిళ్ళకు హాజరయ్యే ఇండియాలో ఉన్న వారికేమో కానీ అమెరికాలో ఉన్న మాలాంటి వాళ్ళకు మాత్రం పెళ్ళంటే అపురూపం. పందిళ్ళూ వాటి మాటెలా ఉన్నా సందళ్ళు చేయడానికి మాత్రం మా మరిది వాళ్ళు, తమ్ముడు వాళ్ళు రెండు వారాల ముందే సకుటుంబ సమేతంగా వచ్చేలా నిర్ణయించుకున్నారు. పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా, నాన్న, మేనమామ ఓ నెల రోజులు ముందే వస్తామన్నారు.

పెళ్ళి చేద్దాం అని నిర్ణయం తీసుకుంది సెప్టంబర్ మధ్యలో. ఈ కరోనా వలన అప్పటికి నార్త్ కెరోలినా లో పెళ్ళికి ఓ యాభై మంది మాత్రమే హాజరయే అనుమతి ఉంది, అదీ బయట ఏ తోటలోనే చేస్తే. ఫంక్షన్ హాల్ లో అయితే పాతిక మందికి మాత్రమే అనుమతి. పాతిక మందంటే ఇరువైపులా ఇంట్లో వాళ్ళమే సరిపోతాం. సరే రానున్న రోజుల్లో మార్పులు రాకపోతాయా అనుకుంటూ సన్నాహాలు మొదలుపెట్టాం. సెప్టెంబర్ ఆఖరకు పెళ్ళిలాంటి వేడుకలకు వందమంది హాజరవ్వచ్చనే ఉత్తర్వు జారీ అయింది, అది నవంబరు పదమూడవ తారీఖు వరకు వర్తిస్తుందట. ఆ తరువాత పరిస్థితిని బట్టి ఈ నియమంలో మార్పు ఉండొచ్చట. అప్పుడు మాకో గొప్ప సందేహం వచ్చింది.

పెళ్ళికి ఎంత మందిని పిలవాలి? అటువైపు, ఇటువైపు కలిపి ఓ వంద మందిని పిలిచామనుకోండి, పిలిచాక మళ్ళీ ఇరవై ఐదు మంది మాత్రమే హాజరవ్వాలని ఉత్తర్వులు జారీ అయితేనో? ఒకవేళ పిలిస్తే ఎవరెవరిని పిలవాలి? పాతికేళ్ళ అమెరికా వాసం, పన్నెండేళ్ళ షార్లెట్ వాసంలో మిత్రుల సంఖ్య బాగానే పెరిగింది. పెళ్ళంటే సుమారుగా ఐదారువందల మంది వరకు అతిధులు ఉండొచ్చు. బాగా దగ్గర స్నేహితులే ఓ యాభై కుటుంబాల వరకూ ఉంటారు. అలాగే పెళ్ళికొడుకు వాళ్ళది కూడా మంచి కలివిడి కుటుంబం. వాళ్ళ వైపు నుండీ ఎక్కువ మంది అతిధులే ఉండొచ్చు. సరే ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి "మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది" అని స్నేహితులతో చెప్పాము. కావలసిన వాళ్ళతో శుభవార్త పంచుకుంటే సంతోషంరెట్టింపు ఆవుతుంది కదూ!

ఇక్కడ పెళ్ళిళ్ళు ఫామ్ హౌస్ లోనో, లేదా ఏ లేక్ దగ్గరో చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. పెళ్ళి డిసెంబర్ లో కాబట్టి చలి వల్ల అది వీలు పడదు. ఏదైనా హోటల్ ఫంక్షన్ హాల్ అయితే బావుంటుందని మాస్క్ వేసుకుని కారులో శానిటయిజర్ పెట్టుకుని, ఊరిలో వున్న ఒక్కొక్క హోటల్ బాల్ రూమ్ చూడడం మొదలు పెట్టాము.

పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళతో పాటు పట్టుచీరల రెపరెపలు, జిలుగు నగల తళతళలు కూడా ఉండాలిగా. పెళ్ళి కుదిరాక పెళ్ళికి కావలసిన వస్తువులు, బట్టలు, నగలు ఇండియా వెళ్ళి కొనుక్కోవచ్చని అనుకునే వాళ్ళం. ఈ కరోనా టైమ్ లో అది సాధ్యం కాదు. ఇక్కడ దొరికేవేవో కొనుక్కుని చేసేద్దాం అంటే మనసు రాలేదు. ఒక్కసారే కదా పెళ్ళి చేసుకుంటారు, అదీ మనసుకు నచ్చినట్లుగా చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. కానీ కావలసినవి అన్నీ ఎలా వస్తాయి? ఏం చెయ్యాలో తోచని స్థితి. ఇలా ఓ పదిహేను రోజులు గడిచిపోయాయి, ఏ పనీ ఓ కొలిక్కి రావడం లేదు.

ఆ తరువాత కబుర్లు ఇక్కడ చదవండి. 

11 comments:

  1. అంతా బాగుంది కానీ తెలుగువారింటి పెళ్ళిలో ఈ మెహందీలూ సంగీతులూ ఏమిటీ చిత్రం!!

    ReplyDelete
    Replies
    1. ఈ పెళ్ళి చేయకముందు మాకు ఇలాగే అనిపించేదండీ. పెళ్ళి తరువాత మా అభిప్రాయం మార్చుకున్నాము. ధన్యవాదాలు.

      Delete
  2. ఇంటరెస్టింగ్ . కరోనా ని ఎదిరించి పెళ్లి చేసేశారన్నమాట .
    హార్దిక శుభాకాంక్షలు . waiting for next posts.

    ReplyDelete
    Replies
    1. ఎదిరించామో కాసేపలా పక్కన పెట్టామో :) పెళ్ళి మాత్రం జరిపించము. థాంక్ యు.

      Delete
  3. శుభమస్తు--శీఘ్రమస్తు--అవిఘ్నమస్తు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు బాబాయ్. ఎలా ఉన్నారు?

      Delete
  4. Replies
    1. అలాగే. మీరిలా ఊ కొడుతూ ఉంటే చెప్పే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. థాంక్ యు.

      Delete
  5. అభినందనలు అండీ. చాలా సంతోషం. మీకు పెళ్లి వయసు అమ్మాయి ఉందా? తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాం..త్వరగా చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వరూధిని గారు. మీకు ఒక్కడుగు వెనుక ఉన్నాం అంతే. :). సాయంత్రం పోస్ట్ చేస్తాను.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.