Showing posts with label yoorap. Show all posts
Showing posts with label yoorap. Show all posts

Wednesday, December 13, 2023

మురానో, బూరానో

వెనిస్ కు దగ్గరలో మురానో, బూరానో అని రెండు ఐలెండ్స్ ఉన్నాయి. మొదటసారి ఆ పేర్లు విన్నప్పుడు కవలల్లా భలే ఉన్నాయే అనిపించింది. మురానో ఐలెండ్ వెనిస్ కు కొంచెం దగ్గరలో ఉంటుంది, బూరానోకు వెళ్ళాలంటే ఇంకొంత దూరం వెళ్ళాలి. ఆ ఐలెండ్స్ లోని రంగురంగుల ఇళ్ళలో పూర్వం చేపలు పట్టేవారు ఉండేవారట.
మొదట మాకు ఆ ఐలెండ్స్ కు వెళ్ళే ఆలోచన లేదు. వెనిస్ కు వెళ్ళిన రోజు మధ్యాహ్నం మ్యాప్ చూస్తే మురానో అక్కడకు దగ్గరలోనే ఉన్నట్లు తెలిసింది. ఊరికే కాసేపలా వెళ్ళొద్దామని బయలుదేరాము. నీళ్ళ మీద వేపరెట్టో వెళుతూ ఉంటే ఏడ్రియాటిక్ సముద్రపు గాలి చల్లగా హాయిగా ఉంది. అక్కడక్కడా చిన్న చిన్న ఐలెండ్స్ కనిపిస్తూ ఉన్నాయి.
  
ఇరవై నిముషాలలో మురానో ఐలెండ్ కు చేరుకున్నాం. వేపరెట్టో దిగి ఐలెండ్ లోపలకు వెళ్ళగానే మధ్యలో కెనాల్ దానికి అటూ ఇటూ ఇళ్ళు, గాజు వస్తువులున్న షాప్స్, రెస్టరెంట్స్ ఉన్నాయి. మురానోలో గాజు తయారీ ఫాక్టరీ ఉంది. అక్కడకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ ఫాక్టరీకి వెళతారు కానీ మేము ఇదివరలో న్యూయార్క్ దగ్గర గ్లాస్ ఫాక్టరీ చూసి ఉన్నాము కాబట్టి మళ్ళీ మురానోలో వెళ్ళలేదు.  అక్కడ తయారు చేసిన గాజు వస్తువులు, షా౦డ్లియర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్క షాండ్లియర్ ఖరీదు తొమ్మిది నుండి పదిహేను వేల యూరోల వరకూ ఉంది. 
 
  
అంతా బావుంది కానీ మేము చూడాలనుకున్న రంగురంగుల ఇళ్ళు మాత్రం కనిపించలేదు. అక్కడ టూరిస్ట్ లను అడిగితే, “అవి ఇక్కడ కాదు బురానోలో ఉంటాయి, ఆ ఐలెండ్ కు తప్పనిసరిగా వెళ్ళండి” అని చెప్పారు.

అప్పుడు టైమ్ మూడున్నర అవుతోంది. అక్కడి నుండి బూరానోకు అరగంట ప్రయాణం. అంటే అక్కడికి వెళ్ళేసరికి నాలుగవుతుంది. బూరానో నుండి తిరిగి వెనిస్ కు వెళ్ళడానికి ఆఖరి వేపరెట్టో ఐదు గంటలకు ఉంది. అంటే మేము బురానో లో కేవలం ఒక నలభై ఐదు నిముషాలు మాత్రమే ఉండగలం. అయినా సరే వెళ్ళాలనే నిర్ణయించుకున్నాం.

ఆ రోజు ఉదయం మిలాన్ లో ట్రైన్ ఎలా ఎక్కడమా అని కంగారు పడ్డవాళ్ళం, ఇక్కడ ఐలెండ్ లో చిక్కుకు పోతేనో అని కంగారు పడలేదు. ధైర్యం పెరిగి పోయింది.  
డాక్ దగ్గర దిగి ఐలెండ్ లోపలకు అడుగు పెట్టగానే చక్కని పరిమళం పలకరించింది, ఎక్కడా అని చూస్తే ఆ ఇళ్ళ ముందు అల్లుకున్న పచ్చని స్టార్ జాస్మిన్ తీగలు, తీగల నిండా విరపూసిన తెల్లని మల్లెలు కనిపించాయి. ఐలెండ్ లో ఉన్నంత సేపూ ఆ పువ్వుల పరిమళం మమ్మల్ని చుట్టుముట్టే ఉంది. బూరానోలో రంగు రంగుల ఇళ్ళు ఏదో ఒకటి రెండు వీధులలో ఉంటాయి అనుకున్నాము కానీ, ఐలెండ్ లోని ఇళ్ళన్నీ అలాగే చక్కని రంగులతో కళకళలాడి పోతున్నాయి. అది చూడగానే పండగ నెలలో రంగురంగుల ముగ్గులతో కళకళలాడే మా అమ్మమ్మ వాళ్ళ వీధి గుర్తొచ్చింది. 

ఆ పువ్వుల పరిమళం, వేసవి మధ్యాహ్నపు నిశ్శబ్దం మేము ఇటలీలో ఉన్నామని, అదొక ద్వీపమని ఏదీ గుర్తుకు రాలేదు. అక్కడే ఉండి ఆ ప్రశాంతతలో ఒక భాగమై పోవాలని అనిపించింది. ఆ టూరిస్ట్ లు తప్పకుండా బూరానోకు వెళ్ళండి అని ఎందుకు చెప్పారో అప్పుడర్థ౦ అయింది.
 
ఇంతకూ ప్రతి ఇంటికీ వాళ్ళు ఎందుకు అలా రంగులు వేశారో తెలుసా? ఒకటేమో చేపలు పట్టి తిరిగి వచ్చేవారికి పొగ మంచులో ఈ ఐలెండ్ గుర్తుపట్టడానికి. మరొకటేమో అన్ని ఇళ్ళు ఒక్కలాగే ఉండడం వలన ఎవరిల్లు వారు గుర్తు పట్టడానికి అట. ఎవరిల్లు వారికి తెలియకపోవడమేమిటీ అనుకుంటున్నారు కదూ. మామూలుగా అయితే తెలుస్తుంది కానీ చీకటి రాత్రిలో కాస్త మందు పుచ్చకుకున్నాక కష్టమే కదా! వాళ్ళిల్లు అనుకుని పక్కింటికి వెళితే మరీ ప్రమాదం.

ఇవన్నీ కథలేనేమో నాకు తెలియదు, తెలిసింది చెప్పానంతే. వాళ్ళు, ఇళ్ళకు రంగులు ఎందుకు వేసుకుంటేనేం లెండి, చూడడానికి మాత్రం ముచ్చటగా ఉన్నాయి.
 
  
బూరానోలోని మగువలకు భర్తల మీద ప్రేమ ఎక్కువే. చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళు చాలా కాలం తిరిగి రారు కదా! వారి కోసం కుకీస్ తాయారుచేసి ఇస్తారట. ఆ కుకీస్ ను బుస్సోలా అంటారు, అవి మూడు నెలలయినా పాడవకుండా ఉంటాయట. అయినా పడవ మీద వెళ్ళేవారు ఏదో చేసుకోలేరని కాదు వీళ్ళు ఇవి పంపించేది. ఆ కుకీస్ తిన్నప్పుడల్లా తియ్యని జ్ఞాపకం మనసులో మెదలాలని.  
మొగవాళ్ళేమో చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు, అప్పుడు అక్కడి ఆడవాళ్ళు ఏం చేసారో తెలుసా లేసు తయారీ మొదలు పెట్టారు. ఏదో కాలక్షేపంగా కాదు దీక్షగా. ఏ శతాబ్దంలో మొదలెట్టారో తెలియదు కానీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. పైగా ఈ లేస్ తయారీ నేర్పడానికి అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. బూరానో లేస్ గౌన్ లు యూరప్ లోని రాజవంశీకులు తెప్పించుకునే వారట. లేసులతో బట్టలే కాక రకరకాల వస్తువులు కూడా తయారు చేస్తారు.
 
 
యూరప్ వెళ్ళే ముందు కేవలం రంగు రంగుల ఇళ్ళు చూడ్డడం కోసం వేరే ఐలెండ్ కు వెళ్ళాలా, వద్దులే అనుకున్నాం కానీ వెళ్ళక పోతే మాత్రం చాలా మిస్ అయ్యేవాళ్ళం. బురనోలో ఇంకొంచెం సేపు ఉండాలని ఎంతగానో అనిపించినా ఐదు గంటల తరువాత వేపరెట్టో లేదుగా తప్పనిసరిగా అక్కడి నుండి బయలుదేరవలసి వచ్చింది. బై బై బూరానో.

మిగిలిన కబుర్లు రేపు చెప్పుకుందాం. వెనిస్ కబుర్లు ఇక్కడ, ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.