Monday, February 4, 2013

అక్షర నీరాజనం

       ఓ కల...ఎదలో మెదిలి నేటికి నాలుగేళ్ళు. నిమిదిమంది పిల్లలతో మొదలైన మా పాఠశాలలో ఇప్పుడు మొత్తం నలభై ఆరు మంది విద్యార్ధులు, ఎనిమిది మంది ఉపాద్యాయులు వున్నారు.

    అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది 'అంతా వృధా ప్రయాసేనా...ఏనాటికైనా పిల్లలు తెలుగులో మాట్లాడం సాధ్యమయ్యే పనేనా...పుట్టిన దగ్గరనుండి అమెరికాలో ఉంటూ, ఒక్క తెలుగు మాట రాని పిల్లలతో తెలుగు మాట్లాడించగలమా' అని. అప్పటకీ తల్లిదండ్రులు "మా పిల్లల భాషలో చాలా మార్పు వస్తోంది, ఇప్పుడు పదాలు స్పష్టంగా పలక గలుగుతున్నారు, వాళ్ళ అమ్మమ్మావాళ్ళతో కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడుతున్నారు" అని చెప్పినా అనుమానంగానే వుండేది.

     ఈ శనివారం తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పిల్లలు వేసిన నాటికలు చూసాక, వారు పాడిన పద్యాలు, పాటలు విన్నాక తెలుగు స్పష్టంగా మాట్లాడగలరనే నమ్మకం కలిగింది.


           ఈ కార్యక్రమాలలో పిల్లలు సమయస్ఫూర్తితో సమస్య ఎలా గట్టెక్కాలి అని సందేశాత్మకమైన "చేపల తెలివి", అర్ధం చేసుకోకుండా బట్టీ పెట్టడం వలన కలిగే అనర్ధాలను తెలిపే "ఎస్ నో ఆల్రైట్", చెడు సావాసాలతో ఎలా కష్టాల పాలౌతమో తెలిపే 'చెడు స్నేహం',  ఐకమత్యం గురించి ప్రభోదించే 'శరీర ఆవయవాలు ఏమంటున్నాయో విందామా!', ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనషి ప్రవర్తన ద్వారా ఎలా బయటపడుతుందో తెలిపే "అప్పు", మాతృదేశానికి ఎంత దూరంలో ఉన్నా మన మూలాలు మర్చిపోకూడనే అంశంతో రూపొందించిన 'రూట్స్' అనే తెలుగు నాటికలు వేశారు. పిల్లలకు ఇంత చక్కని తర్ఫీదు నిచ్చిన ఉపద్యాయులకు ప్రత్యేక అభినందనలు.
మూడు చేపల కథ
శరీర ఆవయవాలు ఏమంటున్నాయో విందామా
     పిల్లలు పెద్ద పెద్ద వాక్యాలు అవలీలగా చెప్తుంటే, "ఇదంతా ఎలా సాధ్యమైంది?" అని ఆశ్చర్యం వేసింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. దీని వెనుక ఉపాద్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల శ్రమ ఎంతుందో అర్ధమైంది. పిల్లలు పాటలు, పద్యాలు కూడా చాలా చక్కగా చెప్పారు.
'లింగాష్టకం' పాడుతున్న నాలుగవ తరగతి పిల్లలు
          ఈ పిల్లలను "మీకు తెలుగు చదవడం వచ్చింది కదా..ఇక ఇంటి దగ్గర  చదువుకోండి" అని చెప్తే, "లేదు మేము పాఠశాలకే వస్తామంటూ" ఈ ఏడాది కూడా వచ్చి స్పష్టంగా చదవడం నేర్చుకుంటున్నారు. వీళ్ళకోసం నాలుగవ తరగతి మొదలు పెట్టాము. ఒక్కరోజు వాళ్ళ ఉపాద్యాయుడు రాకపోతే ఈ పిల్లలు మొహాలు చిన్నబోవడం చూస్తుంటే వారి అనుబంధానికి చాలా ముచ్చటేస్తుంది. వీరు పడిన లింగాష్టకం ఇక్కడ చూడొచ్చు.
ఒకటవ తరగతి ఉపాద్యాయని మంజుల 
ఒకటవ తరగతి ఉపాద్యాయులు సుమతి, స్నేహ
రెండవ తరగతి ఉపద్యాయని లావణ్య
రెండవ తరగతి ఉపాద్యాయులు రాధ, లక్ష్మి 
మూడవ తరగతి ఉపాద్యాయని రాధ 
నాలుగవ తరగతి ఉపాద్యాయులు రఘునాథ్ 
పాఠశాల ఉపాధ్యాయుల బృందం 
   ఈ ఉపాద్యాయులందరూ స్వలాభాపేక్షలేకుండా ఏడాది పొడవునా అంకితభావంతో పాఠాలు చెప్తున్నారు. 
      
     పిల్లలే ముందుకు వచ్చి తెలుగు ఎందుకు నేర్చుకోవాలో, వాళ్ళకు తెలుగు నేర్చుకోవడం ఎంత ఇష్టంగా వుందో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. బోధనలో భాగంగా ప్రతి వారం తరగతిలో చెప్పే 'మంచి విషయం', పిల్లల ప్రవర్తనలో ఎలా మార్పు తీసుకొని వస్తుందో చెప్తూ నేటి విద్యా విధానంలో లోపించిన ఎన్నో అంశాలు వారు ఈ తరగతులలో నేర్చుకుంటున్నారని...ఆ తల్లిదండ్రుల మాటల్లో వింటుంటే మా బాధ్యత మరింత స్పష్టంగా అర్ధం అయింది. 

     తల్లిదండ్రులు, ఉపద్యాయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన 'తెలుగు భాష గొప్పదనం' పాట, ఆ తరువాత తెలుగులో వారు కవిత వ్రాసి ఇచ్చిన మేమెంటో మాకు ఎంతో విలువైనవి.  
   
      'ఒక్క నిముషం తెలుగు', 'మన తెలుగు తెలుసుకుందాం', 'మీకు తెలుసా...' వంటి కార్యక్రమాల పాల్గొన్న పెద్దవాళ్ళ ఉత్సాహం చూసాక మన భాష పట్ల వున్న మమకారం అర్ధం అయింది.

      ఇన్నాళ్ళూ పిల్లలు ఏమి నేర్చుకున్నా, అందరి ముందు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. పిల్లలు చేసిన అక్షర నీరాజనానికి పెద్దల కళ్ళలో  ఆనందభాష్పాలు నిలిచాయి. పెద్దలందరూ వారిని మెచ్చుకున్నందుకు పిల్లలకు చాలా గర్వంగా కూడా అనిపించే ఉంటుంది. ఆ స్ఫూర్తితో వారు మరింత శ్రద్దగా తెలుగు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. 

మా పాఠశాల గుర్తింపు చిహ్నంలో వున్న మూడు అంశాలు 

భాష: మాతృభాషను నేర్పించడం
భావం: మంచి భావాలను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక రూపొందించడం.
భవిత: భవితను సన్మార్గం వైపు నడిపించడం.

తెలుగు నేర్పించాలనుకుంటున్న పెద్దల కోసం ఓ నాలుగు మాటలు
 • తెలుగు నేర్పించాలన్న మీ సంకల్పం అభినందనీయం.
 • మన భాష నేర్చుకుంటున్నామన్న ఉత్సాహ౦ పిల్లలకు కలుగజేయాలి.
 • పద్యాలు, శ్లోకాలు చెప్పించడం వలన వారికి తెలుగు మాట్లాడం తేలిక అవుతుంది.
 • సామెతలు, జాతీయాల వంటివి వాడడం ద్వారా వారిలో, ఆసక్తిని కలిగించి వారికి భాషనే కాక లోకజ్ఞానాన్ని కలిగించిన వాళ్ళమౌతాము.
 • చక్కని భావం వున్న పాటలను వినిపించడం, స్పష్టమైన ఉచ్చారణ ఉన్న టివి కార్యక్రమాలను చూపించడం వలన వారికెన్నో కొత్త పదాలు పరిచయమౌతాయి.
 • ఇంట్లో తెలుగులోనే మాట్లాడేలా ప్రోత్సహించండి.
 • తెలుగులో మాట్లాడినప్పుడు వారికి చిన్న, చిన్న బహుమతులు ఇస్తే  ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 • రాత్రి పడుకునేప్పుడు తెలుగు కథ చదవడం, లేదా తెలుగులో కథ చెప్పడం వల్ల వాళ్ళకు భాషతో అనుబంధం ఏర్పడుతుంది.
 • పండుగ రోజు ఆ పండుగ యొక్క ప్రాశస్త్యం, కథ చెప్పడం వలన వారికి మన సంస్కృతి గురించి చక్కని అవగాహన వస్తుంది.
 • మీరు తెలుగులో మాట్లాడేప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడకండి.
 • అన్నింటికంటే ముఖ్యమైనది మీరు మీ పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి.
 • ఎవరైనా వారితో ఇంగ్లీషులో మాట్లాడుతున్నా పిల్లలకు తెలుగు అర్ధమౌతుందనే విషయాన్ని గుర్తుచేయడానికి మొహమటపడకండి.
      
       భవితను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది.44 comments:

 1. చాలా బాగుందండి .మీ పాఠశాల కృషి అమోఘమండి.అభినందనలు అందరికి.చూస్తుంటే ఇండియా బళ్ళలో ఉన్నట్టుంది.

  ReplyDelete
  Replies
  1. రాధిక గారు మీ అభినందనలు అందరికీ అందజేస్తాను, ధన్యవాదాలు.

   Delete
 2. మొత్తానికి తెనుగును అక్కడ బతికిస్తున్నారు, మేమిక్కడ మరిచిపోతున్నాం, రెండు మాటలు మాటాడితే మూడు ఇంగ్లీషుమాటలుంటున్న రోజులమ్మాయ్!

  ReplyDelete
  Replies
  1. మన దేశంలో పుస్తక పఠనంమీద ఆసక్తి కలిగిస్తే చాలా సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా భాషకు సంబందించినవి. పిల్లల తెలుగు ఆసక్తిగా నేర్చుకోవాలంటే పెద్దలు కూడా తెలుగు పుస్తకాలు తీసి చదవమని ప్రోత్సహిస్తూ ఉంటాము. ధన్యవాదాలు.

   Delete
 3. తెలుగు భాష కృషి కొరకు మీరు చేస్తున్న సేవ ఎంతో ప్రశంసించదగినది . ఈ టపా చదువుతుంటే నాకు అర్థం అయిన విషయం ఏమిటంటే మీ విద్యాలయం అమెరికా లో ఉందన్న సంగతి. అక్కడ తెలుగు పిల్లల కోసం మీరు తెలుగు భాష కై ఒక విద్యాలయాన్ని స్థాపించడం నిజంగా ఆనందంగా ఉంది. మరో చిత్రమైన విషయం ఏమిటంటే ఈ టపా చదువుతున్న నాటికి నేను ఎం.ఏ (తెలుగు) ఆఖరి సంవత్సరం పరీక్ష రాస్తున్నాను. తెలుగు కోసం కొందరు చేస్తున్న సేవ గుర్తుకొచ్చి ఒక క్షణం ఆలోచన లో పడ్డాను. నాకు కూడా తెలుగు భాష అభివృద్ధి కై కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలు ఉన్నాయి. మీ టపా ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ధన్యవాదాలు !

  ReplyDelete
  Replies
  1. నవజీవన్ గారు మీరు తెలుగు ఎం. ఏ చదువుతున్నారని తెలిసి చాలా ఆనందం కలిగింది. అమెరికాలో చాలా దగ్గర్ల ఇలా తెలుగు నేర్పించే బళ్ళు ఉన్నాయండి. ప్రతి సంవత్సరం నేర్చుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. మీ వ్యాఖ్య మాకు నూతనోత్సాహానిచ్చింది. ధన్యవాదాలు.

   Delete
 4. ఇండియాలో మరచిన దాన్ని అక్కడ పోషిస్తున్న మీ తెలుగుభాషా కృషి ప్రశంసనీయం.

  ReplyDelete
  Replies
  1. పద్మార్పిత గారు అక్కడ రోజూ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అది మామూలుగా ఉంటుంది. పిల్లల నోట్లోంచి ఒక్క తెలుగు మాట వచ్చినా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు.

   Delete
 5. మీ పాఠశాల ద్వారా తెలుగు భాషకి విశిష్ఠమైన సేవలు అందజేస్తున్న మీకు, మీ అద్యాపక బృందానికి అభినందనలు జ్యోతిర్మయిగారు.

  ReplyDelete
  Replies
  1. కిశోర్ వర్మ గారు స్వాగాతమండీ. మీ అభిననందనలు వారికి అందజేస్తానండి. ధన్యవాదాలు.

   Delete
 6. మాతృ బాష పట్ల మమకారంతో.. పొరుగు చోట మన ఉనికిని నిలబెడుతూ.. మంచి పౌరులని తీర్చి దిద్దే భాధ్యతని మోస్తున్న మిత్రులందరికీ పాఠశాల నిర్వహిస్తున్న మీకు మనసారా అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. వనజవనమాలి గారు మీలో నాకు నచ్చే గుణం చెడును ఖండించడమే కాక ఎక్కడ మంచి కనిపించినా అక్కడ మీ వ్యాఖ్య వుంటుంది. సమస్యను అన్ని వైపులనుండి దాడిచేసే గుణమిది. మీ వ్యాఖ్యలు నేను ముందుకు నడవడానికి ఎంతో తోడ్పడుతున్నాయి. ధన్యవాదాలు.

   Delete
 7. మీ కృషి బాగుంది. అందరికీ అభినందనలు. :)

  ReplyDelete
  Replies
  1. క్రాంతి కుమార్ గారు స్వాగతమండి. ధన్యవాదాలు.

   Delete
 8. మీకు, మీ బృందానికి అభినందనలు జ్యోతిర్మయి గారు :-)
  లింగాష్టకం బాగా పాడారు, పిల్లలకు కుడా అభినందనలు :))

  ReplyDelete
  Replies
  1. హర్షా నాటికలలో సంభాషణలు చాలా బాగా పలికారు. మిగిలినవి ఇంకా యు ట్యూబ్ పెట్టలేదు.
   పిల్లలకు నీ మాటకా చెప్తాను. ధన్యవాదాలు.

   Delete
 9. మంచి పని చేస్తున్నారు. అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. తృష్ణ గారు ధన్యవాదాలు.

   Delete
 10. మీ కృషిని మనసారా అభినందిస్తూ, మీకూ, మీ పాఠశాల ఉపాధ్యాయబృందానికీ, తెలుగు భాషని ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్న ఆ చిట్టిపిల్లలకూ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలివ్వాలని ఆయనను మనసారా ప్రార్ధిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. శ్రీలలిత గారు మీలాంటి పెద్దల ఆశీర్వాదం వలన అనుకున్నది సాధించగలుగుతున్నాము. మీ అభినందనలు వారందరికీ అందజేస్తాను. ధన్యవాదాలు.

   Delete
 11. జ్యోతిర్మయి గారూ..
  పాఠశాల కబుర్లు చాలా బాగున్నాయండీ..
  మీ పాఠశాల గుర్తింపు చిహ్నంలో వున్న మూడు అంశాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సినవి..
  మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం.. మీకు,పిల్లలకు అభినందనలు..

  ReplyDelete
  Replies
  1. రాజి గారు మా గుర్తింపు చిహ్నంలోని అంశాలు గుర్తించారు చాలా సంతోషం. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ధన్యవాదాలు.

   Delete
 12. ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే
  పరమేశ్వరున కిడు పాద పూజ

  ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే
  పాలిచ్చు తల్లికి పాద పూజ

  సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే
  భాషా మతల్లికి పాద పూజ

  తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే
  పంతులు గారికి పాద పూజ

  ఇచట బుట్టిన ‘ జ్యోతి ‘ వెల్గించు ‘ దివ్వె ‘
  ‘ తెలుగు దీప్తులు ‘ జల్లి విత్తిన ‘ మొలకలు ‘
  ‘ తెలుగు పూదోట ‘ గా తీరి , ‘ వెలుగు పూలు ‘
  పూచి , పరిమళ భరితమై మురియు గాత !

  ReplyDelete
  Replies
  1. ఎంత చక్కని పద్యం చెప్పారు రాజారావు గారు. పై పద్యం పిల్లలకు నేర్పించి క్రింది పద్యం పదిలంగా దాచుకుంటాను వెంకట రాజారావు గారు. అనేకానేక ధన్యవాదాలు.

   Delete
 13. మొదటి ఫొటొ చూసి ఆంధ్ర దేశంలో వార్షికోత్సవం అని తెలుగులో వ్రాసి అందంగా అలంకరించే బడెక్కడ ఉందీ అనుకున్నానండీ... అమెరికాలోనా! బాగు బాగు మీకూ మీ పాఠశాల బృందానికి అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు నాగార్జున గారు.

   Delete
 14. ఎంత మంచి ప్రయత్నం చేస్తున్నారు జ్యోతిర్మయి గారూ! మీ బృందానికి అనేక అబినందనలు!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు నాగలక్ష్మి గారు.

   Delete
 15. ఈ ఫోటోలలో నాకు మీరు కూడా కనిపించారోచ్చ్ ;) మీ కృషికి అభినందనలు, నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఇలాగే ప్రతీ యేడాదీ వార్షికోత్సవాలు జరుపుకుంటూ "పాఠశాల" ఎన్నో విషయాలను నేర్పిస్తూ బాగా వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. బాగానే గుర్తుపట్టావు రసజ్ఞా...మా అభిలాష కూడా అదే. మంచి మాట చెప్పావు ధన్యవాదాలు.

   Delete
 16. దేశం కాని దేశంలో మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం, మీ పాఠశాల కి తమ పిల్లల్ని పంపుతున్న తల్లిదండ్రుల అభిరుచి అభినందనీయం. గత సంవత్సర కాలంగా మా ఇంట్లో జరుగుతున్న చర్చల్లో తెలుగు బడి కూడా ఒక అంశం కానీ పరభాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్న మన వాళ్ళు ఎంత వరకు ఆదరిస్తారోనన్న చిన్న సంశయం. మీ టపా చూసాక అన్ని సంశయాలు తీరిపోయాయి. వీలయితే ఈ వసంత కాలం లేదా గ్రీష్మ ఋతువు రాగానే మేము కూడా ఒక చిన్న తెలుగు బడి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము.
  స్ఫూర్తి ప్రదాతకు అభినందనలు

  ReplyDelete
  Replies
  1. హై హై నాయక గారు మీకా అనుమానం అక్కర్లేదు మొదలుపెట్టేయండి. పాఠశాల బ్లాగులో వున్న సమాచారం మీకు ఉపయోగపడుతుందనుకుంటే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ధన్యవాదాలు.

   Delete
 17. మీ పాఠశాల కి నాకూ రావాలనుంది. పిల్లలు ఎంత ఉత్సాహంగా నేర్చుకుంటున్నారో. తల్లిదండ్రులే తెలుగు వద్దని అతిశయం చూపిస్తున్న ఈ రోజుల్లో చాలా మంచి కృషి చేస్తున్నారు. నాకైతే 'మరువం'ఉష గారు గుర్తొస్తున్నారు.మీకు నా హృదయ పూర్వక అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. జయ గారు పిల్లలకు చెప్పడం మొదలెట్టాక మేము కూడా చాలా నేర్చుకున్నామండి. ఉష గారి బ్లాగు చూసాను. తెలుగు భాష కోసం చాలా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు.

   Delete
 18. జ్యోతిర్మయి గారు
  మీ కృషికి హృదయపూర్వక అభినందనలు .
  ఇంత బిజీ జివితాలలో ఇంత శ్రద్ధగా తెలుగు భాషకై కృషి చెయడం అంత సులువైన పని కాదు. ఏంతో మక్కువ తపన క్రమశిక్షణ ఉంటే తప్ప !

  సురభి
  ( ఒక్కసారి అయినా తెలుగులో వ్యాక్య పెడుదామని ఈ ప్రయాస.
  తప్పులు ఉంటె క్షమించండి.)

  ReplyDelete
  Replies
  1. సురభి గారూ తెలుగులో వ్యాఖ్య పెట్టారు చాలా సంతోషం. మొదలుపెట్టింది నేనేనయినా తోడుగా నడుస్తున్నవారు చాలామందే ఉన్నారండి. అందరి సహకారంతోనే చేయగలుగుతున్నాము. ధన్యవాదాలు.

   Delete
 19. మీకు హృదయపూర్వక అభినందనలు జ్యోతిర్మయి గారూ! మీ శ్రమకి ఫలితం ఆ చిన్నారుల తెలుగు పలుకుల్లో వినిపిస్తూ మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు కొత్తావకాయ గారు.

   Delete
 20. ఇక్కడ తల్లిదండ్రులు ఆంగ్లం కోసం తపిస్తున్నారు .
  పాఠశాలలు ఏకంగా దండిస్తున్నాయి .
  ఇది తెలుగు నేల ప్రారబ్దం
  మేమిప్పుడు ఆంగ్ల దేశం లో ఉన్నాం
  అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాం
  అక్కడి మీ కృషికి అభినందనలు

  ReplyDelete
  Replies
  1. అక్షరానికి సేవ చేసుకునే అదృష్టం కలిగినందుకు గర్విస్తున్నాం నాన్నా. థాంక్యు.

   Delete
 21. Is it prayashena or Prayasena?

  ReplyDelete
  Replies
  1. అర్ధం కాలేదండి అజ్ఞాత గారు.

   Delete
  2. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది 'అంతా వృధా ప్రయాశేనా...ఏనాటికైనా పిల్లలు తెలుగులో మాట్లాడం సాధ్యమయ్యే పనేనా..

   ikkada, Prayasa lo.. shaa use chesaru, kaani "prayaasa" antaam kadaa?

   Delete
  3. అవునండి. తప్పు పడింది సరిచేస్తాను. థాంక్యు

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.