Thursday, March 26, 2020

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 2

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1 

మా ప్రయాణం విషయం ఉదయాన్నే మా నాన్నకు, అత్తయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను. ఓ గంటలో మా తోడికోడలు ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నెల్లూరు వస్తామనీ, మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాక వెనక్కు వెళ్తామని చెప్పింది. చెప్పినట్లుగానే తను అత్తయ్యను, పిల్లలను తీసుకుని మధ్యాహ్నం వచ్చింది. అప్పటికే సర్దడం మొదలు పెట్టేసాను. ఇల్లంతా చిందర వందరగా పెట్టెలు వస్తువులు. కాసేపు అవీ ఇవీ సర్దాక "అక్కా, నువ్వు కావలసినవి తీసుకుని వెళ్ళిపో, నేను మరో వారం తరువాత వచ్చి ఇల్లు ఖాళీ చేస్తాను. ఎవరికైనా ఇవ్వవలసినవి ఉంటే చెప్పు అవన్నీ వాళ్ళకు పంపించేస్తాను" అని చెప్పింది. గొప్ప సహాయం కదూ! ఎలా పడితే అలా వదిలేసిన ఇంటిని ఖాళీ చెయ్యడమంటే మాటలా, ఎంతమంది చేయగలరలా? ఆ రోజంతా సర్దిన వాళ్ళం సర్దినట్లే ఉన్నాం. కావలసిన వాళ్ళను కలవడం,  ఫోన్లు చేయడంతో ఆ రోజంతా హడావిడిగా గడిచింది. 

శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా పిల్లలు "పెద్దమ్మా తమిళ నాడు బార్డర్ క్లోజ్ చేశారట. ఇప్పుడెలా?" అంటూ హడావిడి పడుతూ పేపర్ చూపించారు. నాకేమీ అర్థం కాలేదు. బార్డర్ క్లోజ్ చెయ్యడం ఏమిటి? వెళ్ళనీకుండా పెద్ద కంచె కానీ కట్టేస్తారా? ఎప్పుడూ ఇలాంటిది వినలేదే. "నిత్యావసర వస్తువుల వాహనాలనీ, ప్రభుత్వ వాహనాలను, శవ శకటాలను మాత్రమే బార్డర్ దాటనిస్తారట" అంటూ పేపర్ లో వ్రాసిన వార్తను పైకి చదివారు. ఇప్పటికప్పుడు బార్డర్ దాటలంటే ఓ శవాన్ని కానీ తీసుకుని వెళ్ళాలా అని జోకులు వేస్తున్నారు పిల్లలు. మేము అమెరికన్ సిటిజన్స్ మి అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాము కాబట్టి, బార్డర్ దగ్గర మమ్మల్ని ఆపకూడదు. అలా కాకుండా బార్డర్ దాటనీయలేదనుకోండి  ఏమిటి పరిస్థితి?

అలా తర్జని బర్జన పడుతూ సరే మన ప్రయత్నాలు మనం చేద్దాం అనుకున్నాం.  గత పద్నాలుగు రోజులుగా ఎటువంటి అనారోగ్యమూ లేదని మెడికల్ ఆఫీసర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాం. అంతలో ఒక ఆలోచన వచ్చింది తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ తో వెళితే బార్డర్ దగ్గర ఆపరు కదా అని. చెన్నై లో ఉన్న ఒక ఫ్రెండ్ ను సహయం అడిగాం. తను పాపం వెంటనే మమ్మల్ని బార్డర్ దాటించడానికి ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం ఏ మూడు గంటలకో చెన్నై బయలుదేరినా ఆరుగంటలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాం. కానీ ఆ రోజు ఒంటిగంటకే నెల్లూరి నుండి బయలుదేరాం. అదే సమయానికి మా ఫ్రెండ్  చెన్నై నుండి బయలుదేరారు. మధ్యలో సూళ్ళూరు పేట దగ్గర తన కారులో ఎక్కించుకుని బార్డర్ దాటించి ఎయిర్ పోర్ట్ లో దింపాలని ఆలోచన. కొంత దూరం పొయ్యాక తన నుండి ఫోన్ వచ్చింది. బార్డర్ దగ్గర ఇబ్బంది పెట్టారనీ, ఇప్పుడు కనుక బార్డర్ దాటి  ఏపి లోకి అడుగు పెడితే తిరిగి తమిళనాడు లోనికి రానీయ మన్నారట. అయినా రిస్క్ తీసుకుని వచ్చారు. సూళ్ళూరుపేట దగ్గర డ్రైవరలిద్దరూ మా సూట్ కేస్ లను తన కారులోకి మార్చారు. ఏదో స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలా అనిపించింది. మేము బార్డర్ దాటే దాకా మా డ్రైవర్ ను అక్కడే ఉండమని డ్రైవర్ కి చెప్పాం. మేము ఎయిర్ పోర్ట్ కు వెళ్ళగలమనే నమ్మకం పోయింది. 

తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కార్ ఆపారు. ఒక పోలీస్ విండో దించమని సైగ చేసి,  "బార్డర్ క్లోజ్ చేశాం ముందుకు వెళ్ళకూడదు" అన్నారు. ఆ రాత్రికే అమెరికా వెళ్తున్నామని మాకు అమెరికన్ పాస్ పోర్ట్ ఉందని చెప్పాము. పాస్ పోర్ట్ చూపించమన్నారు. పాస్పోర్ట్ లో మా ఫోటోలు మామొహాలు మార్చి మార్చి చూసి కారు రిజిస్ట్రేషన్ చూపించమన్నారు. అన్నీ చూసాక,  ఫ్లైట్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసారు. ఎయిర్ ఇండియా కాన్సిల్ అయింది ఎమిరేట్స్ కాదు అని మా ఫ్రెండ్ చెప్పారు. ఈ సంభాషణంతా తమిళంలోనే జరుగుతోంది. ఐటనరీ చూపించాము. కాసేపు అవీ ఇవీ చూసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని సరే వెళ్ళమన్నారు.

మళ్ళీ కొంతదూరంలో మరో చెక్ పోస్ట్, అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. కారు ఆగగానే ముందు కారు మొత్తం స్ప్రే చేసి, కారులో నుండి దిగమన్నారు. ఎలిమెంటరీ స్కూల్లో బెంచి ఎక్కమని మాష్టారు చెప్తారే అలాగ. మాకందరికీ థర్మల్ చెక్ చేశారు. పొరపాటున కాస్త జ్వరం ఉంటే ఇంక బార్డర్ దాటనిచ్చేవాళ్ళు కాదేమో! మెడికల్ సర్టిఫికేట్ చూపించాము. ఇండియా ఎప్పుడు వచ్చామో, ఎందుకు వచ్చామో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామో, మా అమ్మాయి ఎక్కడ చదువుతుందో అన్నీ అడిగి, మెడికల్ సర్టిఫికేట్ చూసి వెళ్ళమని చెప్పారు. అయితే ఎక్కడా ఆగకుండా ఎయిర్ పోర్ట్ కే వెళ్ళమని కండిషన్ పెట్టారు. డెస్టినేషన్ చేరాక సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని సలహా ఇచ్చి పంపించారు.

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడ ఎంప్లాయిస్ కాకుండా ఓ పది మంది పాసింజర్స్ ఉండి ఉంటారేమో! మేము టికెట్ తీసుకున్నప్పుడు ఫ్లయిట్ అంతా  ఖాళీగా ఉంది. అది కానీ కాన్సిల్ అవదు కదా అని కంగారూ పడ్డాము. ఒకవేళ కాన్సిల్ అయితే అప్పుడు తమిళనాడు దాటి ఆంధ్రలోకి కూడా వెళ్ళలేము. ఆరున్నరకు కౌంటర్ ఓపెన్ చేశారు. అంతవరకూ ఖాళీగా ఉన్న ఆ కౌంటర్ దగ్గరకు ఎక్కడ నుండి వచ్చారో బోలెడు మంది వచ్చేసారు.  ఫ్లయిట్ లోపలకు వెళితే ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. ఇండియా నుండి బయలుదేరిన ఆఖరి ఫ్లైట్ అది. 

ఫ్లయిట్ లో అంతా మామూలుగానే ఉంది, ఒక్కటే తేడా ఏమిటంటే ఎవరైనా రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారీ ఎయిర్ హోస్టెస్ లు లోపలకు వెళ్ళి సానిటైజ్ చేస్తున్నారు. దుబాయ్ చేరాం. అటూ ఇటూ తిరిగే ప్రయాణీకులతో, షాపింగ్ చేసే కస్టమర్స్, రెస్టారెంట్స్ తో  ఎయిర్ పోర్ట్స్ సాధారణంగా సందడిగా ఉంటాయి. అప్పుడు మాత్రం ఎవ్వరిలోనూ సరదా సంతోషాలు కనిపించక పోగా అక్కడ ఒకలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉంది. అందరూ మాస్క్ లు పెట్టుకుని ఉన్నారు, కొంత మందైతే పూర్తిగా పాలిథీన్ తొడుగులు వేసుకుని ఉన్నారు.

బోర్డింగ్ దగ్గర అందరికీ థర్మల్ చెక్ చేస్తున్నారు. అప్పుడు కూడా టెంపరేచర్ ఉంటే దుబాయ్ నుండి వెళ్ళనివ్వరట. నెల్లూరు కాదు, చెన్నై కాదు ఇప్పుడు దుబాయ్ లో ఉండి పోవల్సి వస్తుందా అని చాలా కంగారూ పడ్డాము. కానీ మేము భయపడ్డట్లు కాక ఇద్దరికీ టెంపరేచర్ నార్మల్ చూపించింది. అమ్మయ్య, ఇక యుస్ వరకూ ఇబ్బంది లేకుండా వెళ్తాం అనుకున్నాం. అక్కడ మాత్రం ఇంటికి వెంటనే వెళ్ళాక తప్పక క్వారంటైన్  చేయాల్సి వస్తుందని మెంటల్ గా ప్రిపేర్ అయి ఓ ఆరుజాతల బట్టలు హ్యాండ్ లాగేజ్ లో పెట్టుకుని రెడీగా ఉన్నాం కూడా.  

వాషింగ్టన్ డీసీలో లాండ్ అయ్యాం. ఇమిగ్రేషన చెక్ లో ఇండియా కరెన్సీ, బంగారం, పచ్చళ్ళు లాంటివి ఏమైనా తెచ్చారా అని అడిగారు. అటువంటివేమీ లేవన్నాం. అయితే మీరిక వెళ్ళొచ్చు అన్నారు. ఆశ్చర్యం వేసింది, మేం అనుకున్నట్లు క్వారంటైన్ చేయమనలేదు సరికదా కనీసం థర్మల్ చెక్ కూడా చెయ్య లేదు. బహుశ మాకు తెలియని టెక్నాలజీ వాడి ఉంటారా? లేదూ అమెరికాలో అప్పటికే వ్యాపించి ఉండడంతో పరీక్షించనక్కరలేదు అనుకున్నారా? ఇండియాలో అలా కాదే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ని వెంటనే చెక్ చేస్తున్నారని విన్నాము. సరే వెళ్ళామన్నారు కదా అనుకుంటూ లాగేజ్ తీసుకుని బయటకు వచ్చాం. 

మాకు డిసి వరకే ఫ్లయిట్ దొరికింది. అక్కడి నుండి షార్లెట్ కు కారులో ఏడు గంటలు ప్రయాణం.
మా తమ్ముడు వాళ్ళు మేరీలాండ్ లో ఉంటారు. అక్కడి నుండి డిసి ఎయిర్ పోర్ట్ దగ్గర. మమ్మల్ని మా తమ్ముడు పికప్ చేసుకుని సగం దూరం తీసుకుని వెళ్తే షార్లెట్ నుండి బయలుదేరిన మా వారు, పండు మమ్మల్ని అక్కడి నుండి  పికప్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారట. మాకు కనుక వైరస్ అటాక్ అయిఉంటే వీళ్ళందరికీ  సోకే ప్రమాదం ఉంది. మా అమ్మాయి, నేను ఫ్లయిట్ దిగాక కూడా మస్క్ లు తీయలేదు. 

దాదాపుగా మూడు గంటల డ్రైవ్ తరువాత వచ్చిన రెస్ట్ ఏరియా దగ్గర ఆగాము. అప్పటికే మా వారు, పండు అక్కడికి వచ్చారు. మా మరదలు  పులిహోర, దద్దోజనం, పూరీలు, ఊర్లగడ్డ కూర, ఉప్పు మిరపకాయలు, అన్నీ రెండు పూటలకూ సరిపడా పంపించింది. మా తమ్ముడి కూతురు బ్రౌనీలు చేసి పంపింది. రెస్ట్ ఏరియా దగ్గర ఆగి అందరం భోజనాలు చేసి కారు మారాం. మేము షార్లెట్ చేరేసరికి సాయంత్రం ఐదయింది. అంటే బయలుదేరిన ముప్పైఏడు గంటల తరువాత నాలుగు కార్లు, రెండు ఫ్లైట్స్ మారి ఇల్లు చేరాం. అప్పటినుండి ఒక వారం పాటు నేనూ మా అమ్మాయి చెరో గదిలో స్వయం నిర్భంధంలో ఉన్నాం.

మేము ఇల్లు చేరడానికి సహాయం చేసిన మా తోడికోడలికి, చెన్నైలోని మా ఫ్రెండ్ కు,  మా తమ్ముడికీ, మమ్మల్ని పికప్ చేసుకున్న వారికి కూడా  వైరస్ సోకే ప్రమాదం ఉన్నా మనస్పూర్తిగా మా తమ్ముడ్ని పంపిన మా మరదలికీ, ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఈ ఐదు నెలలు మా వారిని, పండును తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్న అమెరికా స్నేహితులకూ ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అనుకున్నదానికంటే ఎంతో ముందు ఖాళీ చేస్తున్నా, ఖాళీ చేసే నెల వరకే  అద్దె ఇవ్వమన్నారు నెల్లూరులోని మా ఇంటి ఓనర్. అలా కాదని చెప్పినా వినక మీరు క్షేమంగా వెళ్ళడం ముఖ్యం ఇవన్నీ తరువాత అన్న మా ఇంటి ఓనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం అంతా డబ్బు మయం అని అంటుంటారు కాదా! అలా కాదని నిరూపించారు ఆవిడ. వైరస్ భయంతో ఎవ్వరూ ఇల్లు కదలని సమయంలో కూడా ఫ్లైట్ అటెండెంట్స్, కెప్టన్స్, ఇంకా ఎయిర్ పోర్ట్ సిబ్బంది అంతా వారి కుటుంబాలను వదిలి ప్రమాదం ఉండవచ్చని తెలిసినా పనిచేస్తున్నారు. వారందరికీ అనేకానేక ధన్యవాదాలు.

ఎవరండీ రోజులు మారిపోయాయి, అప్పటి రోజులు, అప్పటి అనుబంధాలు ఇప్పుడేవీ అనే పెద్ద మనుషులు? ఇవన్నీ అనుబంధాలు కావూ! చూసే దృష్టే ఉండాలి కానీ, రోజులన్నీ ఒక్కటే. మేము నెల్లూరి నుండీ బయలు దేరిన దగ్గరనుండి ఎన్నో వాట్స్ ఆప్ మెసేజస్, ఫోన్ కాల్స్. ఎలా ఉన్నారు? గమ్యం చేరారా? అంటూ యోగక్షేమాలు అడిగిన అందరికీ వందనాలు.

ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటే మీరు ఈ సమయంలో ఇండియా నుండి అమెరికాకు ఎలా వచ్చారు? ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది? అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయని, చాలా దేశాలు బార్డర్స్ క్లోజ్ చేశారని  విన్నామే, ఏ ఎయిర్ లైన్స్ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి? ప్రయాణంలో ఏమీ ఇబ్బంది ఎదురవలేదా?  ఇలా గత ఐదు రోజులుగా వాట్స్ అప్ లోనూ ఫోన్ కాల్స్ లోనూ కుశలం అడిగిన మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం ఈ టపా. 

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1

ఏ దేశమైన చూడాలి, అక్కడి జీవనసరళి తెలుసుకోవాలంటే కనీసం ఓ రెండు నెలలైనా ఆ దేశంలో ఉండాలని నా అభిప్రాయం. ఆ కోరిక నాకు ఇండియాలో తీరింది. అదేమిటి నువ్వు ఇండియన్ వేగా వేరుగా దేశం చూడడమేమిటి అనుకోకండి. నేను ఇండియన్ ని అయినా అమెరికాకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళు అవుతోంది. ప్రతి రెండేళ్ళకూ, లేదా ఇంకా తక్కువ వ్యవధిలోనో ఇండియా వెళ్తూ ఉన్నా నేను అక్కడ అతిథినే. చుట్టాలనూ, స్నేహితులనూ కలవడం అన్నీ అమర్చిపెడుతుంటే ఖుషీగా తిరుగుతూ అలా వెళ్ళి షాపింగ్ చేసుకుని రావడం ఇలా అన్నమాట. అది ఇండియాలో ఉండడం ఎలా అవుతుంది?

ఈసారి ఆ కోరిక తీర్చుకోవడానికీ, మెడిసిన్ పూర్తి చేయబోతున్న మా అమ్మాయి దగ్గర ఉండడానికి రెండువేల పంతొమ్మిది అక్టోబర్లో ఇండియా వెళ్ళాను. ఆరునెలలు అక్కడే ఉండి ఏప్రిల్ పదహారున తిరిగి అమెరికా వచ్చేట్లుగా అనుకున్నాము. నెల్లూరులో ఇల్లు  అద్దెకు తీసుకుని పాలు, నీళ్ళు, పేపర్ అన్నీ సమకూర్చుకుని, అక్కడి వాతావరణానికి, జీవనానికి అలవాటు పడుతూ, ఆస్వాదిస్తూ వున్నాను. ఫిబ్రవరి చివరి వరకూ అలాగే గడిచింది.  

అప్పటికే కరోనా గురించి అక్కడెక్కడో చైనాలో అలా ఉందీ, ఇటలీలో ఇలా ఉందీ అని వార్తలు వినపడుతున్నాయి. హఠాత్తుగా ఒకరోజు హైదరాబాద్ లో కరోనా అని పేపర్లో చదివి "మన దేశానికి  కూడా వచ్చిందీ ఇది" అనుకున్నాను. ఆ వైరస్ సోకినతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందనీ, వాళ్ళందరినీ క్వారంటైన్ లో ఉంచారనీ తెలిశాక కొద్దిగా కంగారు మొదలైంది. 

టికెట్ ప్రీ పోన్ చేసికుని మార్చ్ నెలాఖరకే అమెరికాకు వచ్చేస్తే మంచిదేమో అన్నాను శ్రీవారితో. దానికి మా అమ్మాయి ప్రమాదమేమీ లేదంటూ ఆ వైరస్ గురించి వివరించింది. చైనాలో  మొదలైనప్పుడు అప్పటికి ఆ వైరస్ గురించి తెలియక అది  ఎక్కువగా వ్యాపించిందనీ, అందువలన వైరస్ లోడ్ ఎక్కువై ప్రాణాంతకంగా పరిణమించిందనీ చెప్పింది. మరే ఇతర దేశాలలో అంత ప్రమాదమేమి లేదని, పైగా అది మామూలు ఫ్లూ లాంటిదే ఆరోగ్యవంతులకు ప్రాణభయమేమి లేదని చెప్పింది. వైరస్ లోడ్ అంటే ఏమిటని అడిగాను. "వైరస్ లోడ్ అంటే మన అపార్ట్ మెంటే తీసుకో దాదాపుగా వందమంది ఉన్న ఈ అపార్ట్మెంట్ లో నలుగురికి వస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదు, అదే ఎనభై మందికి వచ్చిందనుకో వైరస్ అన్నిచోట్లా వ్యాపించి అది శరీరంలోకి ఎక్కువ కణాలుగా ప్రవేశిస్తుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి సరిపోక అనారోగ్యం ఎక్కువవుతుంది. అప్పుడు వయసు, ఆరోగ్యస్థితితో సంబంధం లేకుండా ప్రాణహాని ఉంటుంది. దానికి పరిష్కారం జాగ్రత్తలు పాటించడమే. ప్రతి గంటకూ, బయటకు వెళ్ళివచ్చిన ప్రతిసారీ ఇరవై సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి" అని వివరించింది. 

మా సంభాషణ జరిగిన వారానికి అంటే మార్చ్ పదకొండున ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేస్ రిజిస్టర్ అయింది, అదీ నెల్లూరులోనే. ఆ వ్యక్తి ఇటలీ నుండి వచ్చి ఓ వారం చిన్న బజారులోనే ఉన్నాడని  తెలిశాక మొదలైంది అసలు కంగారు. నాకే కాదు నెల్లూరు వాసులందరికీనూ. ఎందుకంటే చిన్న బజార్ నెల్లూరులోని ప్రధాన వ్యాపార కేంద్రం. అక్కడ చిన్న, పెద్ద దుకాణాలు, ఇళ్ళు అన్నీ కిక్కిరిసి ఉంటాయి. అయితే అతని కుటుంబసభ్యులు ఎవరికీ ఈ వైరస్ వ్యాపించలేదనే సరికి కొద్దిగా కంగారూ తగ్గింది. 

అప్పటికే అమెరికాలో స్కూళ్ళు, యూనివర్సిటీలకు ఏప్రిల్ లో ఇవ్వవలసిన  స్ప్రింగ్ బ్రేక్ ముందుగా ఇచ్చేశారు. మేము నడుపుతున్న పాఠశాలకు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసికుని తరగతులను రద్దు చేసి తల్లిదండ్రులే పిల్లలకు పాఠాలు చెప్పేట్లుగానూ, ఈ ఏడాది వార్షికోత్సవం రద్దు చేసేట్లుగానూ నిర్ణయం తీసుకున్నాం. మరో వారం గడిచాక అమెరికన్ గవర్నమెంట్, విద్యార్ధులు ఎవరూ స్కూళ్ళ కు, యూనివర్సిటీలకూ రానక్కర్లేదనీ ఆన్ లైన్ పాఠాలు మొదలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నామనీ చెప్పారు. యూనివర్సిటీ నుండి స్ప్రింగ్ బ్రేక్ కి ఇంటికి వచ్చిన బుజ్జి పండు మరి తిరిగి వెళ్ళలేదు.  

మార్చ్ రెండవ వారానికి వచ్చేసరికి నెల్లూరులో మరో కేసు రిజిస్టర్ అయింది. ఈసారి కూడా ఇటలీ నుండి వచ్చిన వారికే వచ్చింది.  ఇండియా నుండి ఇటలీ వెళ్ళిన విద్యార్థులు అందరూ తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజలకు ఈ వైరస్ పట్ల స్పృహ కలిగించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఫోన్ లో ఖళ్ ఖళ్ మని దగ్గు, ఆ తరువాత ఓ అరనిముషం పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తున్నారు. టీవీలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. 

ప్రజలకు దీని సీరియస్ నెస్ బాగానే అర్ధం అయింది. రోడ్డు మీద వెళ్ళేవారు, కూరలమ్మే వాళ్ళూ, ఆటో వాళ్ళూ మాస్కులు వేసికుని జాగ్రత్తలు చక్కగా పాటిస్తున్నారు. ఇండియాలో అందరికీ  గొప్ప అవేర్ నెస్ వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు తుమ్మినా దగ్గినా వెంటనే మెడికల్ ఆఫీసర్లకూ, హాస్పిటల్ కూ ఫోన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. ఓ నాలుగు వారాలలో పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాం, పైగా ప్రాణ భయం ఏమీ లేదన్న ధీమా ఉండేది. అప్పటికి బయట దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ సోకింది. భారత దేశంలో పెద్దగా ఈ వ్యాధి వ్యాపించలేదు. బహుశ అక్కడి వేడి వాతావరణం కారణం కావచ్చు. లేదా ప్రజల ఇమ్యూనిటీ కావచ్చు. ఒకవేళ ఎక్కువమంది పేషంట్స్ వచ్చినా వైద్య సదుపాయం అందించడానికి వీలుగా గవర్నెమెంట్ మరియు ప్రయివేట్ హాస్పిటల్స్ అదనపు వార్డులు ఏర్పాట్లు చేస్తున్నాయని కూడా తెలిసింది. 

మార్చ్ పదిహేడువ తేదీ నుండి షిర్డీలోనూ, ఇరవైయ్యొవ తేదీ నుండి తిరుపతిలోనూ దర్శనాలు ఆపేశారు. మార్చ్ ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇండియా నుండి ఇతరదేశాలకు విమానప్రయాణాల రాకపోకలు రద్దు అనే వార్త భారతదేశం ప్రకటించింది. ఆ వార్తలు విన్నాక  నాకు మళ్ళీ కలవరం మొదలయ్యింది. ఒకవేళ ఏప్రిల్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటే ఎలాగా అని. అప్పటికే అమెరికాలో కూడా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. అక్కడ పండు, వాళ్ళ నాన్న ఇద్దరే ఉన్నారు. మామూలుగా అయితే ఫ్రెండ్స్ రావడం, పోవడం ఏమి అవసరమైనా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉండేది. రాకపోకలు నిలిచిపోవడంతో వాళ్ళ గురించి నాకు కంగారుగా ఉండేది. 

అప్పుడు మా అమ్మాయి, "అమ్మా, నాన్న గురించి నువ్వు టెన్షన్ పడుతూ ఇక్కడ ఉండడం కంటే నువ్వెళ్ళు నేను తరువాత వస్తాను" అన్నది. దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. నువ్వొక్క దానివే ఎలా ఉంటావు? ఇప్పటికిప్పుడు బయలుదేరవలసిన అవసరం లేదు నేనూ పండూ జాగ్రత్తగానే ఉన్నాం. ఒకటి రెండు వారాలు ఇలాగే ఉంటుంది తరువాత అంతా సర్దుకుంటుంది. ఏప్రిల్ పదహారు నాటికి అంతా మామూలయిపోతుంది. మీ ప్రయాణానికేమీ  ఇబ్బంది ఉండదు, అప్పుడు ఇద్దరూ కలిసే రండి అన్నారు. ఈ చర్చలన్నీ మార్చ్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జరిగాయి.  

అదే రోజు రాత్రి రెండు గంటలకు శ్రీవారి నుండి ఫోన్, ఒక లింక్ పంపించాను చదువు అంటూ. లింక్  ఓపెన్ చేస్తే, అమెరికా ట్రావల్ 4 అడ్వైజరీ అంటూ ఓ వార్త  కనిపించింది. దాని సారాంశం ఏమిటంటే అమెరికా పౌరులు ఏ దేశాలలో ఉన్నా తిరిగి అమెరికా రావలసిందనిన్నూ రాని పక్షంలో ఆయా దేశాలల్లో అనిర్నీత కాలం ఉండేట్లుగా తగిన ఏర్పాట్లు చేసుకోవలసింది అనిన్నూ. ఆ వార్త పూర్తిగా చదివే లోపలే "టికెట్ దొరికింది రేపు రాత్రికే మీ ప్రయాణం, ఐటనరీ ఇప్పుడే మెయిల్ పంపించాను" అన్నారు. మరీ మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో అన్నాను. "లేదు, ఇప్పటికే అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయి. మన అదృష్టం కొద్దీ ఎమిరేట్స్ ఒక్కటే ఉంది. ట్రావెల్ ఫోర్ అడ్వైజ్ ఇచ్చారంటే అమెరికా కూడా త్వరలో లాక్ డౌన్ ప్రకటిస్తుంది. అప్పుడిక అమెరికా నుండి ఇతర దేశాలకు  రాకపోకలు నిలిచిపోవచ్చు. ఏప్రిల్ కి కూడా ఈ పరిస్థితిలో మార్పు లేకపోవచ్చు. నీవు ఊహించినదే నిజమయ్యేలా ఉంది" అన్నారు. 

శుక్రవారం వేకువ ఝామున టికెట్ బుక్ చేశారు, ఫ్లయిట్ శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిముషాలకు. అంటే మాకు మానసికంగా సంసిద్దమవడానికి, కావలసిన వస్తువులు సర్దుకోవడానికి కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే వ్యవధి ఉంది. పాపకు హౌసీ పూర్తవడానికి ఇంకా వారం ఉంది. పైగా డిసెంబర్ లో తనకు డెంగ్యూ రావడంతో మరో వారం ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకా అత్యవరసరమైన ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ అవి ఎప్పుడు పెడతారో తెలియదు. కానీ ఇప్పుడు కనుక ఇండియాలోనే ఉండిపోతే మళ్ళీ ఆమెరికాకు ఎప్పటికి వెళ్ళగలమో తెలియని పరిస్థితి. టైలర్ల దగ్గర, లాండ్రీలో బట్టలు ఉన్నాయి. పాల వాళ్ళకు, పని మనిషికి, పేపర్ అతనికీ చెప్పాలి. ఇంటి ఓనర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్లకు ఈ విషయం చెప్పి వీడ్కోలు తీసుకోవాలి.  తెల్లవారేదాకా నిద్రలేకుండా ఇలా రకరకాల ఆలోచనలు.

మిగిలిన వివరాలు ఇక్కడ ...