Sunday, March 31, 2024

రోమన్ ఫోరమ్

రోమ్ కు వెళ్ళిన రెండవ రోజు ఉదయాన్నే విల్లా బొర్గీస్ గార్డెన్ కు వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ నుండి రోమన్ ఫోరమ్ కు ట్రామ్ లో వెళ్ళాము. ఫోరమ్ చూడడానికి ముందుగానే ఆన్ లైన్ లో 'స్కిప్ ది లైన్' టికెట్స్ తీసుకోవడంతో లైన్ లో నిలబడవలసిన అవసరం లేకుండా లోపలకు వెళ్ళాము. రోమన్ ఫోరమ్ చూసేముందు రోమ్ చరిత్ర కొంత తెలుసుకుందాం. 

రోములస్ (Romulus) పరిపాలించడం వలన రోమ్ నగరానికి ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం గుర్తుందా. అలా క్రీస్తు పూర్వం ఏడు వందల యాభైమూడవ సంవత్సరం(753 BC) లో రోమ్ మొదలైంది. అక్కడ నుండి నూటయాభై సంవత్సరాల పాటు ఏడుగురు రాజులు రోమ్ ను పరిపాలించారు. ఆ తరువాత రాజరికం అంతరించి ప్రజాస్వామ్యం మొదలైంది. 

రోమ్ లో రెండు వర్గాలు ఉండేవి, పేర్టిషియన్స్ (Patricians) భూస్వాములు, ధనవంతులు, ప్లెబియన్స్ (plebeians) సామాన్య పౌరులు, బానిసలు. రోమ్ లో పేరుకు ప్రజాస్వామ్యమే ఉన్నా ప్రభుత్వయంత్రాంగంలో అంతా పేర్టిషియన్స్ ఉండేవారు. వారిలో వారికి రాజకీయంగా వివాదాలు ఏర్పడి యుధ్ధాలు జరగడంతో అలజడి మొదలైంది. చివరకు జూలియస్ సీజర్ (Julius Ceasar) హత్యతో ప్రజాస్వామ్యానికి తెరపడింది. జూలియస్ సీజర్ మేనల్లుడు అగస్టస్ (Augustus) రోమ్ కు రాజయ్యాడు. అలా క్రీస్తు పూర్వం ఇరవైయ్యేడవ సంవత్సరంలో (27 AD) రోమ్ లో మళ్ళీ రాజరికం మొదలయ్యింది, రోమ్ నగరం విస్తరించి తిరుగులేని సామ్రాజ్యం అయింది. ఆ తరువాత మత పరమైన మార్పులు జరిగి  క్రిస్టియానిటీ (Christianity) రోమ్ లో స్థానం ఏర్పరుచుకుంది రోమన్ ఫోరం శిథిలమయ్యింది. 

picture courtesy: Roman Forum - Wikiwand
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన గరిగిపోయే.
యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రికలంతరించె!

ఒకప్పటి వైభవానికి సాక్ష్యంగా ఆ ఫోరమ్ లో నిలిచిన శిథిలాలను చూడగానే జాషువా కవి పద్యం గుర్తొచ్చింది. రోమన్ ఫోరమ్ లోని ఆ రాతి స్తంభాలు శతాబ్దాల కథలు వినిపించాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని నిర్వహించిన విధానం, కోర్ట్ లు, మార్కెట్, రాజులు, యుద్ధాలు అప్పటి నమ్మకాలు, అలజడులు, వాటి వెనుక కారణాలు ఇలా ఎన్నో. 

రోమన్ ఫోరమ్ పాలటీనా హిల్ (palatine hill), కపిటలైన్ హిల్ (Capitoline Hill) మధ్యలో ఉంది. ఆ ప్రాంతం నగరానికి మధ్యలో ఉండడంతో మొదట అక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉండేది. తరువాత కాలంలో అక్కడ  ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నంగా నిలిచిన స్థూపాలు, భవనాలు, విజయ సంకేతంగా కట్టించిన ఆర్చ్ లు, సభలు, సమావేశాలు, వేడుకలు, జైత్ర యాత్ర లతో ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. అక్కడ ఉన్న కొన్ని కట్టడాల  గురించి తెలుసుకుందాం. 
'ఆర్చ్ ఆఫ్ టైటస్ '(Arch of Titus, 70 BC), టైటస్(Titus) మహారాజు జరూసలెమ్(Jerusalem) మీద సాధించిన విజయానికి గుర్తుగా కట్టినది. ఆ ఆర్చ్ కి లోపల ఒక వైపున రథం మీద మహారాజు యుద్దానికి వెళ్తున్న చిత్రం, మరో వైపు యుద్దం గెలిచి జెరూసలేమ్ నుండి జ్యూవిష్(Jewish) లకు  సంబధించిన పవిత్రమైన  మినోర(Menorah), వెండి ట్రంపెట్(Trumpet) లాంటివి తీసుకుని వస్తున్న చిత్రాలు ఉన్నాయి.  
వయా సేక్రా (Via Sacra). రోమన్ ఫోరమ్ లోని ముఖ్యమైన కట్టడాల మధ్యగా వెళ్ళే ప్రధాన మార్గం. యుద్ధములో గెలిచిన రాజు ఊరేగింపు ఆ దారి వెంబడే వెళ్ళేది. 
'బాసిల్లికా ఆఫ్ మాక్సె౦చెస్' (Basilica of Maxentius, 312 BC). ఈ భవనం రోమన్ ఫోరమ్ లోని అతి పెద్ద కట్టడం, దీనిని పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, న్యాయస్థానంగానూ ఉపయోగించేవారు. ఈ భవనం ఆర్కిటెక్చర్ ఆధారంగానే న్యూయార్క్ పెన్ స్టేషన్ కట్టారు. 
టెంపుల్ ఆఫ్ ఆంటోనైనస్ పైయస్ అండ్ ఫాస్టిన (Temple of Antoninus Pius and Faustina, 104 AD) ను ఆంటోనైనస్ తన భార్య ఫాస్టిన జ్ఞాపకార్థంగా కట్టించారు. ఆంటోనైనస్, ఫాస్టిన ప్రజలకు ప్రీతి పాత్రమైన వారు. ఫాస్టిన, స్త్రీల కోసం, బాలికల విద్య కోసం ఎన్నో పధకాలు అమలు చేయించారు.  ఆ టెంపుల్ లోనే ఆంటోనైనస్ పార్ధివ దేహాన్ని కూడా ఉంచారు. 
టెంపుల్ ఆఫ్ కాస్టొరి అండ్ పొలుక్స్, (Temple of Castor and Pollux, 495 BC). కాస్టొరి, పొలుక్స్ ఇద్దరూ డెమి గాడ్స్. గ్రీకు రోమన్ పురాణాలలో దేవునికి లేదా దేవతకు మనిషికి పుట్టిన వారిని డెమి గాడ్స్ అంటారు. రోమన్ రిపబ్లిక్ ఏర్పడడానికి కారణమైన రిగలస్ యుద్ద౦ (Battle of Lake Regillus) యుద్దం జరిగినప్పుడు, కాస్టొరి, పొలుక్స్ ఆ యుద్దంలో రోమన్స్ కు సహాయం చేసి గెలిపించారట. 
టెంపుల్ ఆఫ్ శాటర్న్,( The Temple of Saturn, 499 BC). రోమన్ ఫోరం లో అతి పురతమైన కట్టడం. మొదట కట్టిన గుడి శిథిలమైతే క్రీస్తు పూర్వం నలభై రెండవ సంవత్సరంలో(42 BC) ఆ ప్రదేశంలోనే మళ్ళీ కట్టారు. ఆ గుడిని కోశాగారంగా ఉపయోగించేవారు.   
టెంపుల్ ఆఫ్ వెస్ట (Temple of Vesta). వెస్ట దేవత గృహానికి, కుటుంబ సౌభాగ్యానికి, ముఖ్యంగా ఆహారం తయారయ్యే అగ్ని గుండానికి సంబంధించిన దేవత. రోమన్ పురాణం ప్రకారం ఆవిడ కన్య. అందుకని వెస్ట గుడి బాధ్యతలు కన్యలే నిర్వహించాలనే నియమం ఉండేది. 
వెస్టల్ వర్జిన్స్(Vesta Virgins), రోమన్ పూజారిణులు. టెంపుల్ ఆఫ్ వెస్టా లోని అఖండ దీపాన్ని అన్ని వేళలా వెలుగుతూ ఉండేలా చూడడం వీరి బాధ్యత. ఆ దీపం రోమ్ సౌభాగ్యం అని రోమన్ల నమ్మకం. అలా ఆ దీపం వెస్ట గుడిలో వెయ్యేళ్ళ పాటు వెలిగింది.  

వీరి నివాసం వెస్ట టెంపుల్ వెనుక ఉన్న అందమైన భవనం. వీరి సేవ కోసం, మందీ మార్బలం ఉండేవారు. వీరి కోసం ప్రత్యకమైన దుస్తులు నేసేవారు. వీరు ఊరిలోకి వెళ్ళాలంటే గుర్రపు బండ్లు సిద్ధంగా ఉండేవి. ఒకవేళ కాలినడకన వెళితే సెనేటర్ అయినా సరె ఆగి వారికి దారి ఇవ్వవలసిందే. అన్ని ప్రధాన వేడుకలలోనూ మొదటి వరుస వారిదే. వీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు, పన్ను కట్టనక్కర్లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ పదవీ బాధ్యతకు  పేర్టిషియన్స్ కుటుంబంలోని కన్యలు మాత్రమే అర్హులు. వీరిని ఎంచుకునే బాధ్యత ప్రధాన పూజరిది. 

వెస్ట వర్జిన్స్ కు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. వీరు ముప్పై ఏళ్ళ పాటు ఆ గుడికే అంకితమవుతామని ప్రమాణం చేయాలి. వారు వారి కుటుంబంతో కానీ, బంధు మిత్రులతో కానీ కలువకూడదు. వారికి సంసారమూ, పిల్లలు అనే ఆలోచనే రాకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే వారికి మరణ దండన విధించే వారు. దానికి కారణం వెస్టల్ వర్జిన్స్ పవిత్రంగా ఉండాలి, వారి తప్పటడుగు రోమ్ కు అరిష్టం అని నమ్మేవారు. వారి శిక్ష అమలు విధానం ఎలా ఉండేదంటే వారికి కాస్త నూనె, దీపం, బ్రెడ్ ముక్క ఇచ్చి నేల మాళికలో ఉంచేవారు. ఆహారం లేకపోవడం వలన వారు మరణించే వారు. 

ముప్పై ఏళ్ళ పాటు వెస్టల్ వర్జిన్స్ గా ఉండి, బాధ్యత తీరిన తరువాత వారు పెళ్ళి చేసుకోవడానికి అర్హులు. అయితే అప్పటివరకూ సాధారణ జీవితం గడపక పోవడం వలన పెళ్ళి అవడమే కష్టం, ఒకవేళ పెళ్ళి చేసుకున్నా సాధారణ జీవన విధానంలో ఇమాడలేక విడిపోయే వారు. మరికొంత మంది జీవిత కాలం ఆ భవనంలోనే ఉండి పోయేవారు.  
చూరియా జూలియా (Curia Iulia 44 BC), రోమన్ ఫోరమ్ లోని ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయం. రోమ్ కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను అక్కడ భద్రపరిచే వారు. ఏడవ శతాబ్దంలో దీనిని చర్చ్ గా మార్చారు. 

రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన తరువాత  కొన్ని కట్టడాలను చర్చ్ లుగా మార్చారు. తరువాత కాలంలో భూకంపాలు, వరదలు, తుఫాన్ ల తాకిడికి ఆ ప్రాంతం అంతా బీడు పడి దుమ్ము పేరుకుపోయి భూస్థాపితం అయింది. పదహారవ శతాబ్దంలో జరిపిన తవ్వకాలలో ఆ శిథిలాలు బయట పడ్డాయి. ఆ ప్రాంతాన్ని మొత్తం బయటకు తీయడానికి దాదాపుగా వంద సంవత్సరాలు పట్టింది. 

ఆ కట్టడాలవీ చూస్తుంటే అనిపించింది. ముందు రోజు ట్రెవీ ఫౌంటెన్ లో కాయిన్ వేయలేదు కాకమ్మ కథ అనుకుంటూ, కానీ అక్కడకు వెళ్ళి కాయిన్ వేస్తే మళ్ళీ రోమ్ కు రాగలమేమో అని.

ఈ సమాచారం అంతా చరిత్ర పుస్తకాలు, వెబ్ సైట్స్ నుండి సేకరించింది. ఇవన్నీ పదిలపరిచి అందించిన వారికి ధన్యవాదాలు. ఈ పోస్ట్ కు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు, ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

Sunday, March 3, 2024

రోమ్ - 2

రోమ్ ను ఏడు కొండల మీద కట్టారని చెప్పుకున్నాం కదా! అందులో పిన్సియన్ హిల్(Pincian Hill) కింద భాగంలోఉన్న పియజ్జా డి స్పాన్యా (Piazza di Spagna) లో స్పానిష్ ఎంబసీ(Spanish Embassy) ఉంది. కొండ పైన ‘ట్రినిడా ది మాంటి’(Trinità dei Monti) అనే ఫ్రెంచ్ చర్చ్ ఉంది. కిందనున్న పియజ్జా నుండి పైన ఉన్న ఆ చర్చ్ వరకు కట్టిన మెట్లను స్పానిష్ స్టెప్స్(Spanish Steps) అంటారు. ఇటలీలో ఫ్రెంచ్ వారు కట్టించిన స్పానిష్ స్టెప్స్ అవి. 

మేము ఉంటున్న అపార్ట్మెంట్ కు ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కితే ఐదు నిముషాలలోనే స్పానిష్ స్టెప్స్ వచ్చాయి. పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టిన మెట్లవి, మొత్తం నూట ముప్పై ఎనిమిది. అప్పట్లో అది కవులు, రచయితలు, ఫోటో గ్రాఫర్స్, మోడల్స్ కు సమావేశ స్థలం. ప్రస్తుతం కూడా టూరిస్ట్ లతో సందడిగా ఉంది. ఆ మెట్ల పైకి వెళ్ళి చూస్తే ఊరంతా కనిపిస్తోంది. ఆ మెట్లు ఎక్కడానికి టికెట్ ఏమీ లేదు కానీ ఆ మెట్ల మీద కూర్చుంటే మాత్రమే రెండు వందల యాభై యూరోలు జరిమానా వేస్తారట.


పియజ్జా డి స్పాన్యా లో ఆ స్టెప్స్ ముందు ఒక పడవ లాంటి ఫౌంటెన్ ఉంది, దాని పేరు ఫౌంటానా డెల్లా బార్చా(Fontana della Barcaccia). పదహారవ శతాబ్దంలో ఆ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఒక పడవ కొట్టుకుని వచ్చి అక్కడ ఆగిపోయిందిట. దానికి గుర్తుగా ఆ ఫౌంటెన్ కట్టారు.

అక్కడ మరో విశేషం కూడా ఉంది, ప్రముఖ కవి జాన్ కీట్స్ ఆ మెట్లకు మధ్యలో ఒక పక్కగా ఉన్న ఇంట్లో ఉండేవారు. అతనికి టిబి వచ్చినప్పుడు డాక్టర్ సలహా మీద రోమ్ కు వచ్చి అక్కడ ఉన్నాడట. ఆ ఫౌంటెన్ శబ్దం వింటూ అతను ఆఖరి రోజులు గడిపాడు. పాపం పాతికేళ్ళకే అతని జీవితం ముగిసిపోయింది. అతనున్న ఇంటిని ఇప్పుడు మ్యూజియమ్ చేసారు.  
https://www.italy-travels.it/
అంతకు ముందే వర్షం పడడం వలన వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. ఒక దగ్గర చెస్ నట్స్ వేపుతున్నారు. అవి తీసుకుని తింటూ ట్రెవి ఫౌంటైన్(Trevi Fountain) వైపు నడవడం మొదలు పెట్టాము.




క్రీస్తుపూర్వం పంతొమ్మిదవ సంవత్సరంలో రోమ్ కు నీటి సరఫరా కోసం ట్రెవి ఫౌంటెన్ కట్టారు. ట్రెవి అంటే మూడు, మూడు రోడ్ల కూడలిలో కట్టిన ఫౌంటెన్ అది. పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పుడున్న ఫౌంటెన్ స్థానం లోనే ఎనభై ఆరు అడుగుల ఎత్తు, నూట అరవై అడుగుల వెడల్పుతో బొరాక్ స్టైల్ లో ఒక కొత్త ఫౌంటెన్ ను కట్టారు. 
ఆ ఫౌంటెన్ మీద చాలా విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న పెద్ద విగ్రహం భూమిని చుట్టిన నీటికి సంబంధించిన దేవుడు, ఓసియనస్ (Oceanus). అతని రథం ఒక పెద్ద గవ్వలాగా ఉంది. ఆ రథానికి ఉన్న రెండు నీటి గుర్రాలలో ఒకటి శాంతంగా మరొకటి రౌద్రంగా ఉన్నాయి. అంటే అవి నది, సముద్రాలను ప్రతీకలన్నమాట. ఆ గుర్రాలను లాగుతూ ఇద్దరు రథసారధులు. ఓసియనస్ కు ఎడమ వైపునున్న విగ్రహం సౌభాగ్య దేవత, అబన్డాన్షా(Abundance). ఆ విగ్రహానికి పై నున్న విగ్రహం రోమ్ నగరానికి నీళ్ళు తేవడానికి కంకణం కట్టుకున్న, అగ్రిఫ(Agrippa). కుడి వైపునున్న విగ్రహం ఆరోగ్య దేవత, సలుబ్రిటస్(Salubritas). రోమ్ నగరానికి నీటి ఎద్దడి వచ్చినప్పుడు వర్జిన్ మైడన్ నగరానికి పద్నాలుగు మైళ్ళ దూరంలో నీటిని చూపించిందట. సలుబ్రిటస్ విగ్రహం పైన, వర్జిన్ మైడన్, సైనికుల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటి పైన ఉన్న నాలుగు శిల్పాలలోని ఒకరు పండ్లు , ఒకరు పువ్వులు, ఒకరు గోధుమలు, మరొకరు ద్రాక్ష వైన్ పట్టుకుని వున్నారు. అవన్నీ భూమి, నీరు ద్వారా వచ్చే వనరులు. అన్నింటి కంటే పైన ఈ ఫౌంటెన్ పాప్ క్లెమెన్స్ IIX(Pope Clemens XII) ఆధ్వర్యంలో కట్టిందనడానికి గుర్తుగా సింహాసనం ఉంటుంది. ఈ ఫౌంటెన్ ను ఇంత అర్థవంతంగా డిజైన్ చేసిన వారు నికోలా సాల్వి(Nicola Salvi). ఆ ఫౌంటెన్ ను కట్టడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది. 

ఇటాలియన్స్ కు ఒక ఆసక్తి కరమైన నమ్మకం ఉంది. ఆ ఫౌంటెన్ లోని నీళ్ళలో కనుక ఒక నాణాన్ని వేస్తే తిరిగి రోమ్ కు వస్తారని, రెండు నాణాలు వేస్తే ఇటాలియన్ తో ప్రేమలో పడతారని, మూడు నాణాలు వేస్తే ఆ ప్రేమించిన వారితో పెళ్ళి అవుతుందని నమ్ముతారు. ఆ నమ్మకంలో నిజమెంతో కానీ, ఆ ఫౌంటెన్ లోని కాయిన్స్ లెక్క పెడితే రోజుకి దాదాపు మూడు వేల యూరోలు ఉంటుందట. స్పానిష్ స్టెప్స్ దగ్గర కంటే ఎక్కువ మంది టూరిస్ట్ లు ఉన్నారు ట్రెవి ఫౌంటెన్ దగ్గర. 


మేము హిస్టారిక్ సెంటర్ లో ఉన్నందువలనేమో ఎటు చూసినా చక్కని ఆర్కిటెక్చర్ తో బిల్డింగ్స్, పియజ్జాలు. హిస్టరిక్ సెంటర్ కాకుండా రోమ్ మిగలిన దగ్గర ఎలా ఉంటుందో చూడాలని దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కు వెళ్ళి బస్ ఎక్కాము. ఎక్కడికి అని ఏమీ లేదు అది ఎక్కడకు తీసుకుని వెళితే అక్కడికి. హిస్టారిక్ సిటీ దాటిన తరువాత కూడా బిల్డింగ్స్ చక్కని ఆర్కిటెక్చర్ తో చాలా అందంగా ఉన్నాయి. ఒక అరగంట అలా ప్రయాణం చేసి బస్ దిగి మెట్రో ఎక్కి తిరిగి రూమ్ కు వచ్చాము. అలా ఇక్కడకు వెళ్ళాలి ఇది చెయ్యాలి అని ప్రణాళికలేమీ లేకుండా గమ్యం లేని ప్రయాణం బావుంది.

రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ అయి సాయంత్రం డిన్నర్ కు గాంధీ టూ రెస్టారెంట్ కు వెళ్ళాం. గాంధీ అనే పేరు చూసి వెజిటేరియన్ రెస్టరెంటేమో అనుకున్నాం కానీ కాదు. గార్లిక్ చికెన్, టమోటో చాట్ తీసుకున్నాం. మా పక్క టేబుల్ లో ఫిలడెల్ఫియా నుండి వచ్చిన ఒక యువ జంట కనిపించింది. వాళ్ళు మాలాగే స్వ౦తంగా ఇటలీ చూడడానికి వచ్చారట. వాళ్ళ సలహా ప్రకారం టీ ఆర్డర్ చేసాం, మేము యూరప్ వచ్చాక అదే మొదటి సారి టీ తాగడం. అక్కడి నుండి వస్తుంటే ఒక పియజ్జా దగ్గర సందడిగా ఉంది. మేము కూడా మెకరూన్స్ తీసుకుని అక్కడే చాలా సేపు గడిపాము. మేము ఆ రోజే అక్కడకు వచ్చామని, ఆ ప్రాంతం అంతా మాకు కొత్తని అనిపించనే లేదు.



తరువాత రోజు ఉదయాన్నే ఆరు గంటలకల్లా బయలుదేరాం. అప్పటికి రోమ్ ఇంకా నిద్ర లేవలేదు. ఖాళీగా ఉన్న వీధులలో తిరుగుతూ, స్పానిష్ స్టెప్స్, ట్రెవి ఫౌంటెన్ కు మళ్ళీ ఒకసారి వెళ్ళి కావలసినన్ని ఫోటోలు తీసుకుని, ఎనిమిది గంటల వరకూ అక్కడే గడిపాము. రోమ్ లో ఇక్కడా అక్కడా అని ఏం లేదు ఎటు చూసినా అందమే.


అక్కడి నుండి దగ్గరలోనే ఉన్న విల్లా బొర్గీస్ గార్డెన్ కు వెళ్ళాం. చాలా పెద్ద గార్డెన్ అది, ఆ సమయంలో వాకింగ్ చేస్తున్న వాళ్ళు తప్ప ఎవరూ లేరు. అక్కడ, మ్యూజియమ్, సఫారీ, లేక్, ఫౌంటెన్స్, స్టాచ్యూస్ ఉన్నాయి. అక్కడ ఉన్న పంతొమ్మిదవ శతాబ్దం నాటి వాటర్ క్లాక్ ఇప్పటికీ నడుస్తోంది. ఆ గార్డెన్స్ ఎత్తులో ఉండడం వలన అక్కడి నుండి రోమ్ అందంగా కనిపిస్తోంది.




ఆ గార్డెన్ లోని కేఫ్ లో క్రొషంట్, కాఫీ తీసుకుని రోమన్ ఫోరం వైపు వెళ్ళే ట్రామ్ ఎక్కాము.  మిగిలిన కబుర్లు తరువాత చెప్పుకుందాం. 

ఈ పోస్ట్ కు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు, ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

Saturday, February 24, 2024

రోమ్

రోమ్(Rome) నగరం ఇటలీ(Italy)కి, లాట్జియో (Lazio) ప్రాంతానికి రాజధాని. రోమ్ ను ‘ది ఎటర్నల్ సిటీ' (The Eternal City) అంటే అంతం లేనటువంటి నగరం అని, ‘కేపుట్ ముండి’ (Caput Mundi), అంటే ప్రపంచానికే అధినేత అని పిలుస్తారు. దానికి కారణం రోమ్ విస్తీర్ణత, జనాభా,  ఐశ్వర్యం. రోమ్ కు ఇంకొక పేరు కూడా ఉంది, ‘ది హోలీ సిటీ' (The Holy City) అని. పోప్ ఉండే వాటికన్ సిటీ (Vatican City) అక్కడే ఉంది కదా మరి. మరో విశేషం ఏమిటో తెలుసా రోమ్ ను ఏడు కొండల మీద కట్టారు. 

  

రోమ్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో ఆల్బా లొంగా (Alba Longa) అనే దేశాన్ని న్యూమిటర్ (Numitor) అనే రాజు పరిపాలించే వాడు, ఆయన కుమార్తె పేరు రియా సిల్వియా(Rhea Silvia). కుంతికి సూర్యుని వలన కర్ణుడు పుట్టినట్లు ఆమెకు మార్స్ (Mars) వలన రోములస్(Romulus), రేమస్ (Remus) అనే ఇద్దరు కవలలు పుట్టారు. న్యూమిటర్ తమ్ముడు అమూలియస్ (Amulius) తన అన్నను ఏం చేసాడో కానీ అతని రాజ్యాన్ని తీసేసుకున్నాడు.

రాజ్యాన్ని చేజిక్కించుకున్న అమూలియస్, రియా సిల్వియా కవలల వలన దానిని పోగొట్టుకోవలసి వస్తుందని భావించి, వారిని చంపమని భటులను పంపించాడు. వారు ఆ పసిపిల్లలను చంపకుండా టైబర్(Tibar) నది ఒడ్డున వదిలి వేస్తారు. ఆ కవలలను టైబార్ నది తండ్రియైన టైబెరినస్ (Tiberius) కాపాడతాడు. ఆ అడవిలో ఉన్నటు వంటి ఒక తోడేలు వారికి పాలిచ్చి పెంచుతుంది. ఆ తరువాత ఫౌస్టులస్ (Faustulus) అనే పశువుల కాపరి వారిని దత్తత తీసుకుంటాడు.

అక్కడ ఆల్బా లొంగా దేశంలోని న్యూమిటర్, అమూలియస్ కు ఎవరి అనుచరులు వారికి ఉన్నారు. ఎప్పుడూ వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకసారి ఆ గొడవలలో చిక్కుకుని రెముస్ బంధీ అవుతాడు. రోములస్ తన తమ్ముడిని విడిపించే ప్రయత్నంలో తాము న్యూమిటర్ మనవలమని వారికి తెలుస్తుంది. ఆ ఇద్దరు సోదరులు అమూలియస్ తో యుద్దం చేసి న్యూమిటర్ ను మళ్ళీ ఆల్బాలొంగా సింహాసనం మీద కూర్చోబెడతారు.

ఆల్బాలొంగా నుండి వచ్చాక ఆ సోదరులు తమ స్వంత రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటారు. దానిని పాలెంటైన్ హిల్ (Palatine Hill) మీద కట్టాలని రోములస్, లేదు అవెంటైన్ హిల్ (Aventine hill) మీద కట్టాలని రేముస్ అనుకుంటారు. ఆ విషయం మీద అభిప్రాయ బేధాలు వచ్చి పరిష్కారం కోసం అగరి (Augury) అనే పోటీలో పాల్గొంటారు. ఆ పోటీ ఏమిటంటే దేవుడు ఎవరి పక్షాన ఉంటే వారికి పవిత్రమైన పక్షులు కనిపిస్తాయి. ఎవరికి ఎక్కువ పక్షులు కనిపిస్తే వారు గెలిచినట్లు. అందులో రోములస్ గెలుస్తాడు. రోములస్ కట్టిన న్యూ సిటీ ని ఎగతాళి చేస్తే రోములసే చంపాడో లేదా అతని అనుచరులే చంపారో కానే రోమస్ చనిపోతాడు. రోములస్ ఆ ప్రాంతాన్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలిస్తాడు. రోములస్ పరిపాలించడం వలన ఊరికి రోమ్ అనే పేరు వచ్చింది. అదీ కథ 

 https://www.ancienthistorylists.com/rome-history
 ఫ్లోరెన్స్ తరువాత మా మజిలీ అక్కడికే. ఫ్లోరెన్స్ లో ఉదయం పది గంటలకు ట్రైన్ ఎక్కితే రోమ్ వెళ్ళే సరికి మధ్యాహ్నం పన్నెండున్నర అయింది. రోమా పాస్ (Roma Pass) తీసుకుంటే ప్రతిసారీ టికెట్ కొనకుండా మెట్రో, ట్రామ్, సిటీ బస్ ఏవైనా ఎక్కొచ్చు. ట్రైన్ స్టేషన్ లోనే మూడు రోజులకి రోమా పాస్ తీసుకున్నాము , ఖరీదు పద్దెనిమిది యూరోలు (Euros). ఆ ట్రైన్ స్టేషన్ లోపలే ఉన్న మెట్రో ఎక్కితే ఐదు నిముషాలలోనే వచ్చింది మేము దిగవలసిన స్టేషన్.

మెట్రో దిగి స్టేషన్ బయటకు వచ్చి చూస్తే అప్పుడే వర్షం పడి వెలిసినట్లుంది, నగరం అంతా స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఒక ఫర్లాంగ్ దూరంలోనే ఉంది మేము తీసుకున్న ‘ఇంపీరియల్ రోమ్ గెస్ట్ హౌస్’. మాంటే(Monti) ఏరియాలో మెయిన్ రోడ్ మీద ఉన్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అది. ఆ ఫ్లాట్ లోని మూడు గదులు విడివిడిగా అద్దెకు ఇస్తున్నారు, కామన్ గా ఒక కిచెన్, లాండ్రీ రూమ్ ఉన్నాయి. రిసెప్షనిస్ట్ మా గది చూపించి తాళం ఇచ్చాడు. గ్రే అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా అందంగా ఉందా గది. బాల్కనీలోకి వెళితే విశాలమైన రోడ్, రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి.

  
సామాన్లు గదిలో పెట్టి, భోజనానికి బయటకు వెళ్ళాము. పక్కనే ఉంది ‘యల్లా యల్లా’ లెబానీస్ (Lebanese) ఫాస్ట్ ఫుడ్ రెస్టరెంట్. ఫిలాఫెల్ (Philaphel), షిష్ టౌక్ (Shish Taouk ), హమ్మస్ (Hummus), ఫ్రెంచ్ ఫ్రైస్ (French Fries) తీసుకున్నాం. ఫ్రైస్ లోకి టొమాటో కెచప్ ఇవ్వలేదు, యూరప్ లో ఫ్రైస్ తో పాటు కెచప్ ఇవ్వరని, వేరుగా ఆర్డర్ చేయాలని అప్పుడే తెలిసింది. భోంచేసాక ఊరు చూడాలని అలా వెళ్ళామో లేదో హఠాత్తుగా పెద్ద వర్షం పడడంతో వెనక్కు వచ్చేసాం.

ముందు భాగం చదవాలంటే ఇక్కడకు, తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు, ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

Saturday, February 17, 2024

ఫ్లోరెన్స్ - 2

ఫ్లోరెన్స్ ను మెడిచీస్ పరిపాలించారని చెప్పుకున్నాం కదా, వారు లుకా పిటీ అనే బ్యాంకర్ కట్టించిన ప్యాలస్ ను తీసుకుని మార్పులు చేర్పులు చేయించి దానిని తమ నివాసంగా మార్చుకున్నారు. దాని పేరు పిటీ ప్యాలస్(Pitti Palace).ఆ ప్యాలస్ వెనుక అందమైన తోట వేయించారు. ఆ తోటే బబోలీ గార్డెన్స్ (Baboli Gardens). 

ఫ్లోరెన్స్ కు వెళ్ళిన మూడవ రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఉఫిట్జి గ్యాలరీ(Uffizi Galary) టూర్ తీసుకున్నాము. బ్రేక్ ఫాస్ట్ అయ్యాక గ్యాలరీకి వెళ్ళడానికి మధ్యనున్న కాస్త సమయంలో అక్కడకు దగ్గర్లోనే ఉన్న బబోలీ గార్డెన్స్ కు వెళ్ళాము. తోటంటే ఏవో మొక్కలు పువ్వులు ఉండే బుల్లి తోట అనుకున్నాము కానీ కాదు. విశాలమైన మైదానాలు, బారులు తీరిన ఎత్తైన చెట్లు, శిల్పాలు, జలాశయాలు, విశ్రాంతి భవనాలు ఇలా చాలా ఉన్నాయక్కడ. ఆ  తోటను పూర్తిగా చూడాలంటే దాదాపుగా నాలుగు గంటలైనా పడుతుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి సరిగ్గా చూడలేకపోయాము కానీ, వీలయితే మాత్రం తప్పనిసరిగా వెళ్ళవలసిన ప్రదేశం అది.     


బబోలీ గార్డెన్స్ కు ఉఫిట్జీ గ్యాలరీకు మధ్యలో ఆర్నో(Arno) నది ఉంది. అది దాటాలంటే పాంటే వెక్యొ (Ponte Vecchio) బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలి. పాంటే అంటే బ్రిడ్జ్, వెక్యొ అంటే పురతమైనది అని అర్థం. పదమూడవ శతాబ్దం వరకూ ఆ నది దాటడానికి అదొక్కటే బ్రిడ్జ్. అప్పట్లో ఆ బ్రిడ్జ్ మీద మాంసం, చేపలు అమ్మే వారు. ఎప్పుడయితే మెడిచీస్ పిటీ ప్యాలస్ ను తమ నివాసంగా మార్చుకున్నారో అప్పుడు ఆ బ్రిడ్జ్ మీద మాంసం, చేపలు అమ్మేవాళ్లను వేరే ప్రదేశానికి పంపించి అక్కడ నగల దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కూడా అక్కడ నగల దుకాణాలు ఉన్నాయి.

ఆ షాపులవీ దాటిరాగానే ఉంది ఉఫిట్జీ గ్యాలరీ. ఉఫిట్జీ అంటే ఆఫీస్ అని అర్థం. ఒకప్పుడు అది మెడిచీస్ ఆఫీస్. గ్యాలరీ లోపలకు వెళ్ళగానే ఒక పొడవాటి హాల్లో రెండు వైపులా వరుసగా శిల్పాలు, ఒక వైపునంతా వున్న గదులలో చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. పై కప్పు కూడా అందంగా పెయింట్ చేసి ఉంది.

మైకలాంజిలో(Michelangelo), సాండ్రో బొటిచెల్లి (Sandro Botticelli), రఫయెల్ (Raphael) లాంటి కళాకారుల చిత్రాలు, శిల్పాల కోసం ప్రత్యేకంగా కొన్ని గదులను కేటాయించారు. అక్కడ బాగా నచ్చిన వాటిలో  కొన్ని చెపుతాను. 

మొదటగా సాండ్రో బొటిచెల్లి వేసిన ది బర్త్ ఆఫ్ వీనస్(The Birth of Venus),  ప్రిమవెర (Primavera) పెయింటింగ్స్. అవి పదిహేనవ శతాబ్దంలో వేసినవి. అప్పట్లో ఆ పెయింటింగ్స్ కు  ఎలాంటి రంగులు వాడారో, ఆ రంగులు ఎలా తయారు చేసారో కానీ ఆ చిత్రంలోని పువ్వులను గమనిస్తే అప్పడే నేల రాలినంత తాజాగా ఉన్నాయి. 'ది బర్త్ ఆఫ్ వీనస్' చిత్రంలో వీనస్ సముద్రంలో పుట్టి నేలమీదకు వస్తున్నట్లుగా ఉంటుంది.  ఆ చిత్రంలోని ప్రతి ఆకు, పువ్వు, ఆకాశం రంగు, వీనస్ నిలబడిన గవ్వ అన్నీ కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ప్రిమవెరా అంటే వసంతం, ఇటలీలో ఉన్న పువ్వులన్నింటినీ మనం 'ప్రిమవెరా' చిత్రంలో చూడొచ్చు.  

మైకలాంజిలో (Michelangelo) వేసిన 'డోని టాండో' (Doni Tondo) చిత్రం. పదహారవ శతాబ్దంలో ఆగ్నోలో డోని (Agnolo Doni) అనే అతను వేయించిన చిత్రం అది. టాండో అంటే వృత్తాకారం. వృత్తంలో ముగ్గురిని విభిన్న ఆకృతిలో చిత్రించడం ఈ చిత్రం ప్రత్యేకత. దీనిని 'ది హోలీ ఫామిలీ' (The Holy Family) అని కూడా అంటారు.  ఆ చిత్రానికి ఉన్న ఫ్రేమ్ కూడా మైకలాంజిలో తయారు చేసినదే.  
బచొ బాందినెల్లి (Baccio Bandinelli) చెక్కిన శిల్పం లెయ్యొకాన్ గ్రూప్ (Laocoon Group). బలమైన చెట్టు వేర్లు చుట్టుకొని పోయినట్లు ఉందా శిల్పం. ఆ శిల్పం లోని వారి మొహాలలో భయం, బాధ ప్రస్ఫుట౦గా  కనిపిస్తూ ఉన్నాయి. అది మనకు అద్భుతంగా అనిపించడమే కాదు, మైకలాంజిలో కూడా 'ది మిరకల్ ఆఫ్ ఆర్ట్' (The Miracle of Art) అని మెచ్చుకున్న శిల్పం అది.  
రఫయేల్ (Raphael) వేసిన 'మడోనా ఆఫ్ ది గోల్డ్ ఫిన్చ్' (Madonna of the Goldfinch) అనే చిత్రంలో వాడిన రంగులు, ఆ బొమ్మలోని స్వచ్ఛత ఎంతో నచ్చేసాయి. రఫయేల్ జీవితకాలం కేవలం ముప్పై ఏడేళ్ళే అయినా తను ఎన్నో అద్భుతమైన చిత్రాలు చిత్రించారు.  
అప్పట్లో ఐశ్వర్యవంతులకు కళాఖండాలను సేకరించడం ఒక వ్యాపకం, వారి హోదాకు చిహ్నం.  ఫ్రాన్సిస్కో మెడిచి (Francesco Medici) తాను సేకరించిన చిత్రాలు, శిల్పాల కోసం ప్రత్యేకంగా బెర్నార్దో బొంతలెంతి(Bernardo Buontalenti) తో ఒక గది కట్టించారు. ఆ గది ఎట్లా ఉందనుకున్నారు, నేల మీద పువ్వులు పరిచినట్లు చలువరాతితో వేసిన, ఎర్రని మంట రంగులో గోడలు, మంచి ముత్యాలును తాపడం పై భాగం, పై కప్పుకు మధ్యలో ఉన్న అద్దం నుండి వస్తున్న వెలుగులో ఆ గదిలోని చిత్రాలు, శిల్పాలు మెరిసిపోతున్నాయి. 
 
రెండు గంటల టూర్ లో గైడ్ చూపించనవి వాటితో తృప్తిగా అనిపించక మళ్ళీ వెళ్ళి ఆడియో టూర్ తీసుకుని అన్నీ స్వంతంగా చూసాము.  అలా ఒకటొకటే చూసుకుంటూ గ్యాలరీ అంతా తిరిగి బయటకు వచ్చేసరికి భోజనం వేళ దాటిపోయింది. ఆ తరువాత చూడబోతున్నది అకడేమియా గ్యాలరీ.  

అకడేమియా గ్యాలరీ (Accademia Gallery) చూడడానికి టూర్ తీసుకోలేదు కానీ అంతకు ముందే ఆన్ లైన్ లో రెండు గంటలకు స్కిప్ ద లైన్ టికెట్ తీసుకున్నాం. మాకిచ్చిన సమయం కంటే అరగంట ముందే వచ్చి టికెట్స్ కలెక్ట్ చేసుకోమన్నారు. ఆ రోజు ఇక భోజనం చేసే సమయం లేదుగా ఫ్రూట్ స్టాల్ దగ్గర స్మూతీ తీసుకుని నేరుగా అకడేమియా గ్యాలరీకి వెళ్ళాము. స్కిప్ ద లైన్ టికెట్స్ ఉన్నా కూడా నలభై నిమిషాలు రోడ్ మీదే వేచి ఉండాల్సి వచ్చింది. ఆ రోజు మరీ వేడిగా లేదు కాబట్టి ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. 

లోపలకు వెళ్ళగానే ఎదురుగా డేవిడ్(David).  పద్నాలుగు అడుగుల ఎత్తున్న డేవిడ్ ను రో ఏడడుగుల ఎత్తున్న దిమ్మె మీద పెట్టడంతో హాల్ లో ఎంతమంది ఉన్నా ఇబ్బంది లేదు, ఎటునుండి చూసినా చక్కగా కనిపిస్తోంది. ఆ శిల్పాన్ని చూస్తుంటే మైకలాంజెలో విశ్వరూపం చూస్తున్నట్లుగా అనిపించింది. రింగులు తిరిగిన  జుట్టు, తీక్షణంగా చూస్తున్న చూపులు, కాలి వేళ్లు, గోళ్ళు కెమెరాలో తీసిన ఫోటో కూడా అంతా స్పష్టంగా చూపించలేదేమో!  
  
ఆ గ్యాలరీలో ఇంకా చిన్నవి, పెద్దవి, సగం చెక్కినవి చాలా శిల్పాలు ఉన్నాయి. ఒక గదిలో కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. 
 
అకడేమియా గ్యాలరీ నుండి బయటకు వచ్చేసరికి సాయంత్రం ఐదయింది. అక్కడకు దగ్గరే మా రూమ్, దారిలో జిలాటో తీసుకుని రూమ్ కి వచ్చేసాం. అన్నట్లు జిలాటోను మొదట తయారు చేసింది ఫ్లోరెన్స్ లోనేనట. ఉదయం నుండి నడచీ నడచీ కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. రూమ్ కి అలా పడుకున్న వాళ్ళం మరో మూడు గంటలకు కానీ లేవలేక పోయాము. 

ఆ రాత్రి అక్కడకు దగ్గరలో ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్ళాం. మెన్యు  ఇటాలియన్ భాషలో ఉంది. చదవడం రాదుగా అందుకని తెలిసిన డిష్ స్పినాచ్ రావియ్యోలీ (Spinach Ravioli) ఆర్డర్ చేసాను. తను ఏదైనా ఫుడ్ విత్ నో మీట్ తెమ్మన్నారు. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, చూస్తే అందులో షెల్స్ ఉన్నాయి. 

మేము మీట్ వద్దన్నాము కదా అని వెయిటర్ ను అడిగాము. అతను ఎస్, నో మీట్ అని షెల్స్ చూపించాడు. మేము ఆశ్చర్యంగా చూస్తున్నాము, అతను అయోమయంగా చూస్తూ నో మీట్ ఓన్లీ సీ ఫుడ్ అని చెప్పాడు. మరో పాఠం నేర్చుకున్నాము. యూరప్ లో నో మీట్ కాదు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పాలని. ఇక చేసేదేం ఉంది, బుట్టలో ఇచ్చిన బ్రెడ్, స్పినాచ్ రావియ్యోలీ ఇద్దరం చెరి సగం తిన్నాము. 
 
రాత్రి భోజనం అయ్యాక ఆ మూడు రోజులు చూసిన ప్రదేశాలు గుర్తుచేసుకుంటూ ఫ్లోరెన్స్ వీధుల్లో చాలా సేపు నడిచాము. అక్కడక్కడా మాలాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు తప్ప వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి, వంటరిగా వెళ్తున్నా ఎక్కడా భయం అనిపించలేదు. 

ఫ్లోరెన్స్ బావుంది, ఇంకో రెండు మూడు రోజులు ఉండగలిగితే ఎంతో బావుండేది. ముఖ్యంగా టస్కని (Tuscany) ప్రాంతంలోని వైనరీస్(Vineries)కు వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు. చూద్దాం మరెప్పుడైనా అక్కడకు వెళ్ళే అవకాశం వస్తుందేమో! బై బై ఫ్లోరెన్స్. 

ఈ పోస్ట్ కు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు, తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు, ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.