Wednesday, May 9, 2012

ఇరుగూ...పొరుగూ

     ఇప్పుడంటే నెలకోసారి పున్నమి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది కానీ, అప్పుడంతా చిట్టితల్లి నవ్వులతో పగలూ, రాత్రీ వెన్నెలే కదూ...ఉంగరాల జుట్టు, గుండ్రటి మొహం, చారడేసి కళ్ళు, లేతనీలం రంగు గౌను వేసుకుని, బుజ్జి కాళ్ళకు మువ్వల పట్టీలు పెట్టుకుని ఘల్లుఘల్లుమంటూ ఇంట్లో నడుస్తూ ఉంటే ఆ సిరిమహాలక్ష్మి నట్టింట్లో తా౦డవమాడినట్లే ఉండేది.

      పెళ్ళయీ, కాగానే శ్రీవారు ఒక మూడంతస్తుల అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ లో ఇల్లు చూశారు. అక్కడున్నప్పుడే చిట్టితల్లి పుట్టింది. ఆ ఏడాదే ఎదురింటి స్వాతి బడికి వెళ్లడం మొదలుపెట్టింది. వాళ్ళింట్లో ఆఖరిదవడంతో తనకన్నా చిన్నదైన చిట్టితల్లిని క్షణం ఒదిలేది కాదు స్వాతి. ఇంటిదగ్గర ఉన్న సమయమంతా చిట్టితల్లితోనే ఆటలు. స్వాతివాళ్ళ అమ్మగారు టీచరుగా పనిచేసేవారు. ఆవిడ కూడా సాయంకాలాలు చిట్టితల్లిని ఇంటికి తీసుకెళ్ళి ఆడించుకునేవారు. చిట్టితల్లి రెండేళ్ళకే స్పష్టంగా మాట్లాడి౦దంటే అది స్వాతి చలువే మరి. తనకొచ్చిన పద్యాలూ, పాటలూ అన్నీ చిట్టితల్లికి చెప్తూ ఉండేది.

      ఇంటికి రాగానే 
స్వాతి కాళ్ళు చేతులు కడుక్కుని, మెట్లమీద కూర్చుని పాలు తాగేది. చిట్టితల్లికేమో పాలు తాగడం అస్సలు ఇష్టం లేదు. అయితే స్వాతి మెట్ల దగ్గరకు వచ్చే సమయానికే అమ్మ కూడా బోర్నవిటాతో ఉన్న పెద్ద గ్లాసు, తాగడానికి వీలుగా మరో చిన్నగ్లాసు తీసుకుని మెట్ల దగ్గరకు వచ్చేది. పెద్దగ్లాసులోంచి చిన్నగ్లాసులోకి కొంచెం వంపి చిట్టితల్లి చేతికి ఇచ్చేది. చిట్టితల్లి ఒక్క చుక్క నోట్లోకి రాకుండా తాగినట్లు నటించేది. స్వాతి తాగడం అవగానే 'నువ్వు పాలు తాగితేనే నేను నీతో ఆడుకుంటా' అనేది. అంతే పాలన్నీ తాగేసి ఖాళీ గ్లాసు అమ్మ చేతిలో పెట్టేసేది చిట్టితల్లి. కొన్ని రోజులయ్యాక చిట్టితల్లి, స్వాతి అలా చెప్పకపోతే అడిగి చెప్పించుకుని మరీ పాలు తాగేది.

     అలా ఆడుతూ, పాడుతూ, 
ముద్దులు మూట కడుతూ నలుగురి మధ్య రెండేళ్ళు పూర్తి చేసింది చిట్టితల్లి. ఒకరోజు చిట్టితల్లి చూస్తుండగా స్వాతి కాగితంతో చేసిన విమానం పైనుంచి కిందకు వేసింది. అది గాలిలో ఎగురుతూ, తిరుగుతూ, వయ్యారంగా వెళ్లడం విపరీతంగా నచ్చేసింది చిట్టితల్లికి. అప్పటినుండి చేతిలో ఏదుంటే అది పైనుంచి 'జుయ్' అని కింద వెయ్యడం మొదలు పెట్టింది. కిందకు చూస్తే మధ్యలో ఏదో అడ్డం ఉంది కాని ఒకవైపు కింద ఇంటి వాళ్ళు గిన్నెలు తోముకునే స్థలం, మరో వైపు కింద పోర్షన్ వారి వీధి వాకిలి కనిపిస్తాయి. చిట్టితల్లి చేతిలో ఏదైనా గట్టి వస్తువు చూస్తే అమ్మకు పై ప్రాణాలు పైనే పోయేవి. 

     ఒక్కోసారి చిట్టితల్లి కాలికి ఒక చెప్పు వేసుకుని కనిపించేది, వెతికితే రెండో చెప్పు కింద కనిపించేది. మరోసారి అప్పడాల కర్ర పడేసింది. లేచినవేళ మంచిది కాబట్టి ఆపూట అక్కడెవ్వరూ లేరు. చిట్టితల్లికా చెప్తే అర్ధం చేసుకునే వయసు కాదు. అమ్మ చెలం పుస్తకాలూ అవీ చదివి ఉందేమో 'చిట్టితల్లిని కోప్పడదా౦' అన్న ఊహే వచ్చేది కాదు. 

       చిట్టితల్లి చేతిలో ఏదైనా బలమైన వస్తువు చూసి౦దంటే స్వాతి 'అంటీ అంటీ' అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుని పాప దగ్గరకు వచ్చేది. చిట్టితల్లి నవ్వుతూ స్వాతికి దొరక్కుండా పరిగెత్తి ఇంకా బలంగా విసరడం మొదలు పెట్టింది. కొంత పరిశోధన చేసిన తరువాత చిట్టితల్లికి విసిరే ఉద్దేశం లేకపోయినా స్వాతి మోహంలో కంగారు చూడడం కోసం విసురుతోందని అర్ధం అయిందమ్మకు. సమస్య అర్ధమైయ్యాక పరిష్కారం దానంతట అదే దొరికింది. ఆ విధంగా చిట్టితల్లికి ఆ ఆటమీద ఆసక్తి పోయింది. అమ్మ 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంది. 

                      *                       *                       *

      ఆ రోజులే వేరు కదూ..ఎవరికి ఎవరం ఏమవుతామో...తన, మన అన్న బేధం ఉండేది కాదు. పసిపాపతో ఇంటిపని, వంటపని ఒక్కర్తినీ చేసుకున్నా ఒక్కసారి కూడా శ్రమ అనిపించలేదు. ఆ బిల్డింగ్ లో అందరూ పాపను తీసికెళ్ళి ఆడుకోవడమే. రెండేళ్ళు నిండాక స్నానం చేయించి బయటకు పంపిస్తే మళ్ళీ భోజనాల వేళకు ఎవరింట్లో ఉందో వెతికి తీసుకొచ్చి అన్నం పెట్టి నిద్రపుచ్చేదాన్ని. భయం వుండేది కాదు, అందరి తలుపులూ తెరిచే ఉండేవి. అపార్ట్మెంట్ గేటు పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని చాకలి వాళ్ళ కుటుంబం ఉండేది. ఈ రోజుల్లో ఏ అపార్ట్మెంట్ చూసినా మూసిన తలుపులూ తాళాలూనూ..38 comments:

 1. చిట్టి తల్లి అయినా ఆమె చిన్నారి తల్లి అయినా

  ఆ చిలిపి ఆటలే వేరు ఆ రోజులే వేరు

  ఆ నాటి చిట్టి తల్లిని గుర్తు చేసినందుకు

  ఆనందిస్తూ అభినందిస్తూ

  ReplyDelete
  Replies
  1. చిట్టితల్లి, చిన్నారితల్లుల ముచ్చట్లే తీపిగురుతులు. ఆ రోజులే వేరు....ధన్యవాదాలు.

   Delete
 2. నిజంగా చిట్టి తల్లి చిన్నప్పటి రోజులు..యెంత బాగున్నాయి!
  ఇప్పుడు అంతా ఇరుకైన మనస్తత్వాలు,ఇళ్లకే కాదు..హృదయపు గదులకు తాళాలు. పలకరించే మనసు కోసం..పరవళ్ళు త్రొక్కుతూ.. నెట్ ప్రపంచంలో పడుతున్నాం.
  ఇరుగు-పొరుగు.. లేరు..అన్నీ తాళ గదులే!
  నైస్ పోస్ట్.

  ReplyDelete
  Replies
  1. ఈ పరిస్థితి మారే రాజు వస్తుందనే ఆశిద్దాం వనజ గారూ..ధన్యవాదాలు.

   Delete
 3. జ్యోతిర్మయి గారూ..
  చిట్టి తల్లి ఆటలు,విశేషాలు బాగున్నాయండీ!

  ఇప్పుడు ఇరుగూ లేదు పొరుగూ లేదండీ..
  ఒకవేళ పరిచయాలు చేసుకుని, కొన్నాళ్ళు స్నేహం చేసినా బేధాభిప్రాయాలు,ముందొక మాట,వెనకో మాట మామూలే అందుకే అసలు ఎవరినీ కదిలించుకోకుండా వుంటే మంచిదేమో అన్న అభిప్రాయానికి వస్తున్నారేమొ మనుషులు..

  ReplyDelete
  Replies
  1. స్వాభిమానం ఎక్కువయి, సహించే గుణం తగ్గిపోతుంది రాజి గారూ...జీవితంలోని వేగం ఒక కారణమేమో..ధన్యవాదాలు.

   Delete
 4. వచ్చెయ్యండి, వచ్చెయ్యండి, మా వనారణ్యాలకి ! అంతా తెరచిన తలుపులే మరి !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
  Replies
  1. జిలేబి గారే..ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..బావున్నారా? వచ్చెయ్యమంటారు, అడ్రస్సివ్వరు..ఎలాగండీ.
   మీ ఇంటి ఆరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే రోజు వస్తుందనే ఆశిస్తున్నాను. అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉండండి, లేకపోతే బెంగగా ఉంటుంది. ధన్యవాదాలు.

   Delete
  2. జిలేబీగారూ, 'వనారణ్యం' యేమిటండోయ్. వనం, అరణ్యం పర్యాయపదాలు కదా!

   Delete
 5. మీ చిట్టితల్లి ఆట లు చదువుతుంటే మా బుజ్జిగాడి ఆటలు గుర్తొస్తున్నాయి . అపార్ట్మెంట్ వాచ్మాన్ రోజూ సాయం కాలమయ్యేసరికి , కింద నుంచి కనీసం నాలుగైదైనా సామానులు తెచ్చి ఇచ్చేవాడు :)

  ఇరుగూ పొరుగూ అంటారా , మేము ఈ ఇంటికి వచ్చి ఏడేళ్ళైంది . ఇంతవరకూ పక్కింటి వాళ్ళ తో పరిచయమే లేదు :(

  ReplyDelete
  Replies
  1. మాలా గారూ మీ బాబుకూడా అంతేనా..వాళ్ళ చిన్నతనం గుర్తొస్తే ఎంత సరదాగా ఉంటుందో కదా...
   కొన్నాళ్ళ తరువాతైనా ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.
   ధన్యవాదాలు.

   Delete
 6. ఇప్పుడు ఇళ్లు విశాలమై మనసులు ఇరుకైపోయాయి.పరిచయాలు పరిమళించాలి.మనసులు వికసించాలి.అప్పుడే స్నేహాలు పరిఢవిల్లుతాయి.చిట్టితల్లికి ఆశీస్సులు.

  ReplyDelete
  Replies
  1. ఉమా దేవి గారూ సౌకర్యాలు ఎక్కువైయ్యాక అక్కడా సర్దుకోలేని మనస్తత్వం అలవడిందేమో...మీ ఆశీస్సులు అందుకోవడం చిట్టితల్లి అదృష్టం. ధన్యవాదాలు.

   Delete
 7. nice....

  "pillalu vaari alana paalanaa vaarini ela ardham chesukovali" book raayandi chaalaa mandiki upayogapadutundi.... meeru chalaa baagaa rastaaru

  maa pakkana paina kidhaa evaru untaroo kuda naaku teliyadu anthaga buzy(palakarinchina edho tinela chustaru jaanalu ) ayipoyamu lol

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి ధన్యవాదాలు ప్రిన్స్ గారూ...
   సమస్యల గురించి అలోచించి ప్రయోజనం లేదు. పరిష్కారం వైపు అడుగులు వేద్దాం. మన పరిధిలో మనం చేయగలిగిన కృషి చేద్దాం. నులుగురి మనసులలో మంచితనం నింపేలా ప్రయత్నిద్దాం...

   Delete
 8. మనసులు మూసుకున్నాయ్ తల్లీ అందుకే తలుపు మూత పడుతున్నాయి!!!

  ReplyDelete
  Replies
  1. ఏదో ఒకరోజు నిజమైన ఆనందమేంటో తెలుస్తుంది. ఆ రోజు మళ్ళీ మనసుతో చూస్తారు. ఆ ఆశ వదిలేస్తే కష్టం బాబాయిగారూ..ధన్యవాదాలు.

   Delete
 9. రోజులన్ని ఒక్కటేనేమొనండి.. మార్పు మనలోనే వచ్చింది. అందరు ఇలా అమ్మయిల జ్ఞాపకాలు రాసేస్తున్నారు.. చదువుతుంటే, మా అమ్మాయి చిన్నతనం గుర్తుకు వస్తుంది..:))
  మీ చిట్టితల్లి కి ఇప్పుడు వయసు ఎంత?

  ReplyDelete
  Replies
  1. సరిగ్గా చెప్పారు వెన్నెల గారూ...మార్పు మనలోనే. మీ అమ్మాయి బావుందాండీ. వేసవి సెలవలు ఇస్తారుగా ఇంటి కోచ్చేస్తుంది కదా....మా పాపకు కూడా దాదాపుగా మీ పాప వయసే..ధన్యవాదాలు.

   Delete
  2. ఒకటే పడవలో ప్రాయాణిస్తున్నామన్నమాట!
   నిన్ననే తట్టా బుట్టా సర్దేసుకుని దిగేసిందండి ! ఇంక సందడే సందడి. అంటే వాగ్యుద్దాలు కూడా ఉంటాయండోయి!

   Delete
  3. అందరమూ ఆ పడవలో ప్రయాణించవలసిన వాళ్ళమే..కొంచెం ముందూ వెనుకా అంతే. :) ఈ వేసవంతా తనతో ఎంజాయ్ చెయ్యండి.

   Delete
 10. చిట్టితల్లి ఆటలు భలే ఉన్నాయండీ :) మీ ప్రజంటేషన్ ముచ్చటగా ఉంది..

  ReplyDelete
  Replies
  1. వేణు గారూ చిట్టితల్లిని చిన్నప్పుడు చూడాలి, నడవడం ఉండేది కాదు. పరుగులే.. మీ అందరి స్పూర్తితోనే రాయడం అలవాటయింది. ధన్యవాదాలు.

   Delete
 11. మీ చిట్టితల్లి ముచ్చట్లు బాగున్నాయి.
  పరిచయాలు పెంచుకోవడం లో మనం కూడా వెనకడుగు వేస్తున్నాం అంటాను నేను.

  ReplyDelete
  Replies
  1. సుబ్రహ్మణ్యం గారూ నమస్కారం. సరిగ్గా చెప్పారండీ.. ఎవరికివాళ్ళం దీని గురించి ఆలోచించి ముందంజ వేస్తే పూర్వపు పరిస్థితులే మళ్ళీ నెలకొంటాయేమో..ఎంతైనా మానవుడు సంఘజీవి కదండీ...ధన్యవాదాలు.

   Delete
 12. bhale baagunnayi, mee chitti talli mucchatlu,

  moosuku poyina talupule..ippudu..poriginti drusyaalu..

  vasantham..

  ReplyDelete
  Replies
  1. వాసంతం గారూ...తెరిచే రోజులు వస్తాయిలెండి. అందరూ మనలాంటి వాళ్ళేగా..ధన్యవాదాలు.

   Delete
 13. చిట్టి తల్లి , బుజ్జి పండు భలేగా ఉంటాయండీ మీ పోస్టులు.......
  ముఖ్యంగా మీరు మీ పిల్లల గురించి రాసే పోస్టులు.... మీరు వారితో వ్యవహరించే తీరు చాలా మందికి మంచి పాఠాలు తెలుసా....

  ReplyDelete
 14. మాధవి గారూ పిల్లలతో గడిపిన సమయానికి అక్షరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితం, ప్రాణం అన్నీ వాళ్ళేన౦డీ..వాళ్ళతో సమయం గడపడం కోసం 'ఉద్యోగం' అన్న ఆలోచనే మానుకున్నాను. ఇప్పుడు వెనుతిరిగి చూసుకున్నా సరైన నిర్ణయ౦ తీసుకున్నాననే అనుకుంటున్నాను. ధన్యవాదాలు.

  ReplyDelete
 15. Replies
  1. బాలాత్రిపురసుందరి గారూ ధన్యవాదాలు.

   Delete
 16. మాకూ ఓ చిట్టి తల్లి, ఓ బుజ్జి పండు వున్నారండి...మీ పోస్ట్ చదివాక నేనూ ఆ జ్ఞాపకాలను నెమరేసుకున్నాను. మంచి పోస్ట్...అభినందనలు జ్యోతిర్మయి గారు!

  ReplyDelete
  Replies
  1. సురేష్ గారూ మీకూ ఇద్దరు పిల్లలన్నమాట. ఇల్లంతా సందడే సందడి కదూ..
   ప్రతి టపా చదివి వ్యాఖ్యతో ప్రోత్సహిస్తున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

   Delete
 17. "సమస్య అర్ధం అయ్యాక పరిష్కారం దానంతట అదే దొరికింది. ఆ విధంగా చిట్టితల్లికి ఆ ఆట మీద ఆసక్తి పోయింది."

  ఇది బాగా నచ్చింది. భేష్ చిట్టితల్లి తల్లిగారూ! అభినందనలు!

  ReplyDelete
 18. ధన్యవాదాలు కొత్తావకాయ గారూ...

  ReplyDelete
 19. హ్మ్... సొమ్ములు పెరిగేకొద్దీ మనసులు మూసుకుంటున్నాయి. మావైపు పల్లెల్లో కాస్త ఫర్వాలేదు నేనూరొదిలి వచ్చేటప్పటికి. నేను ఇండియా వచ్చేసరికి ఎలా ఉంటుందో! చి

  ReplyDelete
  Replies
  1. అరుణ్ గారూ మా ఊరికెళితే అవే ఆప్యాయతలండీ..వారేమీ మారలేదు. పల్లెటూరులో ఉండే ఆ స్వచ్ఛత వారి మనసులలో పదిలంగా ఉంది. ధన్యవాదాలు.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.