Thursday, March 26, 2020

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 2

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1 

మా ప్రయాణం విషయం ఉదయాన్నే మా నాన్నకు, అత్తయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను. ఓ గంటలో మా తోడికోడలు ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నెల్లూరు వస్తామనీ, మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాక వెనక్కు వెళ్తామని చెప్పింది. చెప్పినట్లుగానే తను అత్తయ్యను, పిల్లలను తీసుకుని మధ్యాహ్నం వచ్చింది. అప్పటికే సర్దడం మొదలు పెట్టేసాను. ఇల్లంతా చిందర వందరగా పెట్టెలు వస్తువులు. కాసేపు అవీ ఇవీ సర్దాక "అక్కా, నువ్వు కావలసినవి తీసుకుని వెళ్ళిపో, నేను మరో వారం తరువాత వచ్చి ఇల్లు ఖాళీ చేస్తాను. ఎవరికైనా ఇవ్వవలసినవి ఉంటే చెప్పు అవన్నీ వాళ్ళకు పంపించేస్తాను" అని చెప్పింది. గొప్ప సహాయం కదూ! ఎలా పడితే అలా వదిలేసిన ఇంటిని ఖాళీ చెయ్యడమంటే మాటలా, ఎంతమంది చేయగలరలా? ఆ రోజంతా సర్దిన వాళ్ళం సర్దినట్లే ఉన్నాం. కావలసిన వాళ్ళను కలవడం,  ఫోన్లు చేయడంతో ఆ రోజంతా హడావిడిగా గడిచింది. 

శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా పిల్లలు "పెద్దమ్మా తమిళ నాడు బార్డర్ క్లోజ్ చేశారట. ఇప్పుడెలా?" అంటూ హడావిడి పడుతూ పేపర్ చూపించారు. నాకేమీ అర్థం కాలేదు. బార్డర్ క్లోజ్ చెయ్యడం ఏమిటి? వెళ్ళనీకుండా పెద్ద కంచె కానీ కట్టేస్తారా? ఎప్పుడూ ఇలాంటిది వినలేదే. "నిత్యావసర వస్తువుల వాహనాలనీ, ప్రభుత్వ వాహనాలను, శవ శకటాలను మాత్రమే బార్డర్ దాటనిస్తారట" అంటూ పేపర్ లో వ్రాసిన వార్తను పైకి చదివారు. ఇప్పటికప్పుడు బార్డర్ దాటలంటే ఓ శవాన్ని కానీ తీసుకుని వెళ్ళాలా అని జోకులు వేస్తున్నారు పిల్లలు. మేము అమెరికన్ సిటిజన్స్ మి అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాము కాబట్టి, బార్డర్ దగ్గర మమ్మల్ని ఆపకూడదు. అలా కాకుండా బార్డర్ దాటనీయలేదనుకోండి  ఏమిటి పరిస్థితి?

అలా తర్జని బర్జన పడుతూ సరే మన ప్రయత్నాలు మనం చేద్దాం అనుకున్నాం.  గత పద్నాలుగు రోజులుగా ఎటువంటి అనారోగ్యమూ లేదని మెడికల్ ఆఫీసర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాం. అంతలో ఒక ఆలోచన వచ్చింది తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ తో వెళితే బార్డర్ దగ్గర ఆపరు కదా అని. చెన్నై లో ఉన్న ఒక ఫ్రెండ్ ను సహయం అడిగాం. తను పాపం వెంటనే మమ్మల్ని బార్డర్ దాటించడానికి ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం ఏ మూడు గంటలకో చెన్నై బయలుదేరినా ఆరుగంటలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాం. కానీ ఆ రోజు ఒంటిగంటకే నెల్లూరి నుండి బయలుదేరాం. అదే సమయానికి మా ఫ్రెండ్  చెన్నై నుండి బయలుదేరారు. మధ్యలో సూళ్ళూరు పేట దగ్గర తన కారులో ఎక్కించుకుని బార్డర్ దాటించి ఎయిర్ పోర్ట్ లో దింపాలని ఆలోచన. కొంత దూరం పొయ్యాక తన నుండి ఫోన్ వచ్చింది. బార్డర్ దగ్గర ఇబ్బంది పెట్టారనీ, ఇప్పుడు కనుక బార్డర్ దాటి  ఏపి లోకి అడుగు పెడితే తిరిగి తమిళనాడు లోనికి రానీయ మన్నారట. అయినా రిస్క్ తీసుకుని వచ్చారు. సూళ్ళూరుపేట దగ్గర డ్రైవరలిద్దరూ మా సూట్ కేస్ లను తన కారులోకి మార్చారు. ఏదో స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలా అనిపించింది. మేము బార్డర్ దాటే దాకా మా డ్రైవర్ ను అక్కడే ఉండమని డ్రైవర్ కి చెప్పాం. మేము ఎయిర్ పోర్ట్ కు వెళ్ళగలమనే నమ్మకం పోయింది. 

తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కార్ ఆపారు. ఒక పోలీస్ విండో దించమని సైగ చేసి,  "బార్డర్ క్లోజ్ చేశాం ముందుకు వెళ్ళకూడదు" అన్నారు. ఆ రాత్రికే అమెరికా వెళ్తున్నామని మాకు అమెరికన్ పాస్ పోర్ట్ ఉందని చెప్పాము. పాస్ పోర్ట్ చూపించమన్నారు. పాస్పోర్ట్ లో మా ఫోటోలు మామొహాలు మార్చి మార్చి చూసి కారు రిజిస్ట్రేషన్ చూపించమన్నారు. అన్నీ చూసాక,  ఫ్లైట్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసారు. ఎయిర్ ఇండియా కాన్సిల్ అయింది ఎమిరేట్స్ కాదు అని మా ఫ్రెండ్ చెప్పారు. ఈ సంభాషణంతా తమిళంలోనే జరుగుతోంది. ఐటనరీ చూపించాము. కాసేపు అవీ ఇవీ చూసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని సరే వెళ్ళమన్నారు.

మళ్ళీ కొంతదూరంలో మరో చెక్ పోస్ట్, అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. కారు ఆగగానే ముందు కారు మొత్తం స్ప్రే చేసి, కారులో నుండి దిగమన్నారు. ఎలిమెంటరీ స్కూల్లో బెంచి ఎక్కమని మాష్టారు చెప్తారే అలాగ. మాకందరికీ థర్మల్ చెక్ చేశారు. పొరపాటున కాస్త జ్వరం ఉంటే ఇంక బార్డర్ దాటనిచ్చేవాళ్ళు కాదేమో! మెడికల్ సర్టిఫికేట్ చూపించాము. ఇండియా ఎప్పుడు వచ్చామో, ఎందుకు వచ్చామో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామో, మా అమ్మాయి ఎక్కడ చదువుతుందో అన్నీ అడిగి, మెడికల్ సర్టిఫికేట్ చూసి వెళ్ళమని చెప్పారు. అయితే ఎక్కడా ఆగకుండా ఎయిర్ పోర్ట్ కే వెళ్ళమని కండిషన్ పెట్టారు. డెస్టినేషన్ చేరాక సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని సలహా ఇచ్చి పంపించారు.

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడ ఎంప్లాయిస్ కాకుండా ఓ పది మంది పాసింజర్స్ ఉండి ఉంటారేమో! మేము టికెట్ తీసుకున్నప్పుడు ఫ్లయిట్ అంతా  ఖాళీగా ఉంది. అది కానీ కాన్సిల్ అవదు కదా అని కంగారూ పడ్డాము. ఒకవేళ కాన్సిల్ అయితే అప్పుడు తమిళనాడు దాటి ఆంధ్రలోకి కూడా వెళ్ళలేము. ఆరున్నరకు కౌంటర్ ఓపెన్ చేశారు. అంతవరకూ ఖాళీగా ఉన్న ఆ కౌంటర్ దగ్గరకు ఎక్కడ నుండి వచ్చారో బోలెడు మంది వచ్చేసారు.  ఫ్లయిట్ లోపలకు వెళితే ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. ఇండియా నుండి బయలుదేరిన ఆఖరి ఫ్లైట్ అది. 

ఫ్లయిట్ లో అంతా మామూలుగానే ఉంది, ఒక్కటే తేడా ఏమిటంటే ఎవరైనా రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారీ ఎయిర్ హోస్టెస్ లు లోపలకు వెళ్ళి సానిటైజ్ చేస్తున్నారు. దుబాయ్ చేరాం. అటూ ఇటూ తిరిగే ప్రయాణీకులతో, షాపింగ్ చేసే కస్టమర్స్, రెస్టారెంట్స్ తో  ఎయిర్ పోర్ట్స్ సాధారణంగా సందడిగా ఉంటాయి. అప్పుడు మాత్రం ఎవ్వరిలోనూ సరదా సంతోషాలు కనిపించక పోగా అక్కడ ఒకలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉంది. అందరూ మాస్క్ లు పెట్టుకుని ఉన్నారు, కొంత మందైతే పూర్తిగా పాలిథీన్ తొడుగులు వేసుకుని ఉన్నారు.

బోర్డింగ్ దగ్గర అందరికీ థర్మల్ చెక్ చేస్తున్నారు. అప్పుడు కూడా టెంపరేచర్ ఉంటే దుబాయ్ నుండి వెళ్ళనివ్వరట. నెల్లూరు కాదు, చెన్నై కాదు ఇప్పుడు దుబాయ్ లో ఉండి పోవల్సి వస్తుందా అని చాలా కంగారూ పడ్డాము. కానీ మేము భయపడ్డట్లు కాక ఇద్దరికీ టెంపరేచర్ నార్మల్ చూపించింది. అమ్మయ్య, ఇక యుస్ వరకూ ఇబ్బంది లేకుండా వెళ్తాం అనుకున్నాం. అక్కడ మాత్రం ఇంటికి వెంటనే వెళ్ళాక తప్పక క్వారంటైన్  చేయాల్సి వస్తుందని మెంటల్ గా ప్రిపేర్ అయి ఓ ఆరుజాతల బట్టలు హ్యాండ్ లాగేజ్ లో పెట్టుకుని రెడీగా ఉన్నాం కూడా.  

వాషింగ్టన్ డీసీలో లాండ్ అయ్యాం. ఇమిగ్రేషన చెక్ లో ఇండియా కరెన్సీ, బంగారం, పచ్చళ్ళు లాంటివి ఏమైనా తెచ్చారా అని అడిగారు. అటువంటివేమీ లేవన్నాం. అయితే మీరిక వెళ్ళొచ్చు అన్నారు. ఆశ్చర్యం వేసింది, మేం అనుకున్నట్లు క్వారంటైన్ చేయమనలేదు సరికదా కనీసం థర్మల్ చెక్ కూడా చెయ్య లేదు. బహుశ మాకు తెలియని టెక్నాలజీ వాడి ఉంటారా? లేదూ అమెరికాలో అప్పటికే వ్యాపించి ఉండడంతో పరీక్షించనక్కరలేదు అనుకున్నారా? ఇండియాలో అలా కాదే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ని వెంటనే చెక్ చేస్తున్నారని విన్నాము. సరే వెళ్ళామన్నారు కదా అనుకుంటూ లాగేజ్ తీసుకుని బయటకు వచ్చాం. 

మాకు డిసి వరకే ఫ్లయిట్ దొరికింది. అక్కడి నుండి షార్లెట్ కు కారులో ఏడు గంటలు ప్రయాణం.
మా తమ్ముడు వాళ్ళు మేరీలాండ్ లో ఉంటారు. అక్కడి నుండి డిసి ఎయిర్ పోర్ట్ దగ్గర. మమ్మల్ని మా తమ్ముడు పికప్ చేసుకుని సగం దూరం తీసుకుని వెళ్తే షార్లెట్ నుండి బయలుదేరిన మా వారు, పండు మమ్మల్ని అక్కడి నుండి  పికప్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారట. మాకు కనుక వైరస్ అటాక్ అయిఉంటే వీళ్ళందరికీ  సోకే ప్రమాదం ఉంది. మా అమ్మాయి, నేను ఫ్లయిట్ దిగాక కూడా మస్క్ లు తీయలేదు. 

దాదాపుగా మూడు గంటల డ్రైవ్ తరువాత వచ్చిన రెస్ట్ ఏరియా దగ్గర ఆగాము. అప్పటికే మా వారు, పండు అక్కడికి వచ్చారు. మా మరదలు  పులిహోర, దద్దోజనం, పూరీలు, ఊర్లగడ్డ కూర, ఉప్పు మిరపకాయలు, అన్నీ రెండు పూటలకూ సరిపడా పంపించింది. మా తమ్ముడి కూతురు బ్రౌనీలు చేసి పంపింది. రెస్ట్ ఏరియా దగ్గర ఆగి అందరం భోజనాలు చేసి కారు మారాం. మేము షార్లెట్ చేరేసరికి సాయంత్రం ఐదయింది. అంటే బయలుదేరిన ముప్పైఏడు గంటల తరువాత నాలుగు కార్లు, రెండు ఫ్లైట్స్ మారి ఇల్లు చేరాం. అప్పటినుండి ఒక వారం పాటు నేనూ మా అమ్మాయి చెరో గదిలో స్వయం నిర్భంధంలో ఉన్నాం.

మేము ఇల్లు చేరడానికి సహాయం చేసిన మా తోడికోడలికి, చెన్నైలోని మా ఫ్రెండ్ కు,  మా తమ్ముడికీ, మమ్మల్ని పికప్ చేసుకున్న వారికి కూడా  వైరస్ సోకే ప్రమాదం ఉన్నా మనస్పూర్తిగా మా తమ్ముడ్ని పంపిన మా మరదలికీ, ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఈ ఐదు నెలలు మా వారిని, పండును తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్న అమెరికా స్నేహితులకూ ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అనుకున్నదానికంటే ఎంతో ముందు ఖాళీ చేస్తున్నా, ఖాళీ చేసే నెల వరకే  అద్దె ఇవ్వమన్నారు నెల్లూరులోని మా ఇంటి ఓనర్. అలా కాదని చెప్పినా వినక మీరు క్షేమంగా వెళ్ళడం ముఖ్యం ఇవన్నీ తరువాత అన్న మా ఇంటి ఓనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం అంతా డబ్బు మయం అని అంటుంటారు కాదా! అలా కాదని నిరూపించారు ఆవిడ. వైరస్ భయంతో ఎవ్వరూ ఇల్లు కదలని సమయంలో కూడా ఫ్లైట్ అటెండెంట్స్, కెప్టన్స్, ఇంకా ఎయిర్ పోర్ట్ సిబ్బంది అంతా వారి కుటుంబాలను వదిలి ప్రమాదం ఉండవచ్చని తెలిసినా పనిచేస్తున్నారు. వారందరికీ అనేకానేక ధన్యవాదాలు.

ఎవరండీ రోజులు మారిపోయాయి, అప్పటి రోజులు, అప్పటి అనుబంధాలు ఇప్పుడేవీ అనే పెద్ద మనుషులు? ఇవన్నీ అనుబంధాలు కావూ! చూసే దృష్టే ఉండాలి కానీ, రోజులన్నీ ఒక్కటే. మేము నెల్లూరి నుండీ బయలు దేరిన దగ్గరనుండి ఎన్నో వాట్స్ ఆప్ మెసేజస్, ఫోన్ కాల్స్. ఎలా ఉన్నారు? గమ్యం చేరారా? అంటూ యోగక్షేమాలు అడిగిన అందరికీ వందనాలు.

ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటే మీరు ఈ సమయంలో ఇండియా నుండి అమెరికాకు ఎలా వచ్చారు? ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది? అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయని, చాలా దేశాలు బార్డర్స్ క్లోజ్ చేశారని  విన్నామే, ఏ ఎయిర్ లైన్స్ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి? ప్రయాణంలో ఏమీ ఇబ్బంది ఎదురవలేదా?  ఇలా గత ఐదు రోజులుగా వాట్స్ అప్ లోనూ ఫోన్ కాల్స్ లోనూ కుశలం అడిగిన మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం ఈ టపా. 

20 comments:

  1. వెళ్ళి మంచి పని చేసారు. పరిస్థితులు ఎప్పటికి మామూలు అవుతాయో తెలీకుండా ఉంది. ఈ సమయంలో ఎక్కడి వాళ్ళు అక్కడ అందరితో కలిసి ఉంటేనే మనఃశ్శాంతి.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడకు వచ్చే వరకూ సందేహమే మరీ అర్ధాంతరంగా వచ్చామేమో అని. కానీ ఈ మూడు రోజుల్లో ఆ అభిప్రాయం మారి మంచి పనే చేశామనిపిస్తోంది.

      Delete


  2. చాలా సంయమనంతో వ్రాసారు.

    క్షేమం.


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జిలేబి గారు.

      Delete
  3. మొత్తానికి ఇంటికొచ్చేశారు...సంతోషం!

    ReplyDelete
  4. ఎంతో వేదనా భరిత ప్రయాణం సుఖాంతంగా గమ్యం చేరినందుకు ఆనందంగా ఉంది.

    ReplyDelete
  5. వెళ్లి సాహసమే చేశారు. క్షేమంగా జేరినందుకు సంతోషం. ........ మహా

    ReplyDelete
    Replies
    1. ఈ క్లిష్ట సమయాల్లో అందరం ఒకదగ్గర లేకపోతే కష్టంగా ఉంటుంది కదండీ. ధన్యవాదాలు.

      Delete
  6. పోంలేండి, కొన్ని ఇబ్బందులు పడ్డా మొత్తానికి ఇల్లు చేరారు, ఎన్ని దేశాలు తిరిగినా మన ఇల్లు అన్న అనుభూతి వేరు, ఆ సౌఖ్యం వేరు. అందరూ శుభంగా ఉండాలి

    ReplyDelete
    Replies
    1. అవునండీ. ధన్యవాదాలు శ్రీనివాస్ రావు గారు,

      Delete
  7. క్షేమంగా చేరుకున్నారు. అదేపదివేలు

    ReplyDelete
  8. Me journey గురించి చాలా బాగా వ్రాశారు జ్యోతి గారు

    ReplyDelete
  9. మొత్తనికి ఇల్లు చేరారు సంతోషం (రాధిక నాని)

    ReplyDelete
    Replies
    1. బయలుదేరెప్పుడు తొందర పడుతున్నామెమో అనిపించింది కానీ, రెండు రోజుల్లోనే తెలిసిపోయింది సరైన నిర్ణయమే తీసుకున్నామని. థాంక్యూ.

      Delete
  10. పెద్ద అడ్వంచరే చేశారండీ.. సేఫ్ గా చేరారని తెలిసి సంతోషం. అలాగే రిలేషన్స్ గురించి మీరు చెప్పిన పాజిటివ్ విషయాలు చాలా బావున్నాయ్ అండ్ హండ్రడ్ పర్సెంట్ ట్రూ.. సెల్ఫ్ క్వారంటైన్ పీరియడ్ అయిపోయుంటుంది అనుకుంటున్నాను. ఐనా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి.

    ReplyDelete
    Replies
    1. ఇవాళ్టికి రెండు వారాలు పూర్తయ్యాయండి. ఇల్లంతా ఇక స్వేచ్ఛగా తెరిగేయవచ్చు. :) ధన్యవాదాలు వేణు గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.