Tuesday, December 12, 2023

వెనిస్

ఇంతకు ముందు భాగం కబుర్లు చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

వర్షపు నీళ్ళలో కాగితపు పడవ తేలుతుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది, అలాంటిది నీటి మీద తేలే వెనిస్ ఒక అద్భుతమే. నూటపద్దెనిమిది ద్వీపాలు, నాలుగు వందల బ్రిడ్జ్ లు ఉన్నాయి వెనిస్ లో. ప్రపంచంలో మరెక్కడా అన్ని ద్వీపాలు, బ్రిడ్జ్ లు ఉండనే ఉండవు. అలాగే వెనిస్ కు ఉన్నన్ని పేర్లు కూడా, ఏడ్రియాటిక్ సిటీ, సిటీ అఫ్ మాస్క్స్, సిటీ అఫ్ వాటర్, సిటీ అఫ్ బ్రిడ్జెస్, ది ఫ్లోటింగ్ సిటీ, సిటీ అఫ్ కెనాల్స్. బావున్నాయి కదూ!

మిలాన్ నుండి వెనిస్ కు రెండున్నర గంటల ప్రయాణం. వెనిస్ చేరేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. వెనీజియా శాంతా లుషియా, వెనిస్ ట్రైన్ స్టేషన్  ప్రయాణీకులతో చాలా సందడిగా ఉంది. ఇలాంటి దగ్గరే జేబు దొంగలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మాట గుర్తుకువచ్చి భుజానికి తగిలించుకున్న బాగ్ ను గట్టిగా చేతితో పట్టుకున్నాను.
స్టేషన్ నుండి బయటకు రాగానే ఇంతకాలం దేనిని చూడాలని అయితే ఎదురు చూసామో ఆ వెనిస్ నగరం ఎదురుగా ఉంది. గట్టిగా యాభై అడుగుల దూరంలో ఉన్న కెథడ్రల్ కు వెళ్ళాలంటే నీటి మీద నడిచే యోగ విద్య ఏదైనా వచ్చి ఉండాలి లేదా ఏ పడవలోనో వెళ్ళాలి, మధ్యలో ఉన్న గ్రాండ్ కెనాల్ ను దాటాలి కదా!
అసలు ఇంత మట్టి కూడా లేని దగ్గర కేవలం నీటి మీద ఆ నగరాన్ని కట్టిన వారి ఇంజనీరింగ్ స్కిల్స్ చూడండి. పైగా కలపగా వాడడానికి అక్కడ పెద్ద చెట్లు కూడా లేవు. క్రొయేషియా, మాంటెనెగ్రో, స్లొవేనియాలలో పెరిగే ఓక్, లార్చ్ చెట్ల కలపను తెచ్చి, వాటిని ఇరవై అడుగుల లోతుకి దింపి, అవి కుదురుకున్నాక వాటిపైన చెక్కతో గానీ, రాళ్ళతో గానీ ప్లాట్ ఫార్మ్ కట్టి, అది పాడవకుండా సున్నపు పూత వేసి దానిమీద బిల్డింగ్స్ కట్టారు. అన్ని రోజులు చెక్క నీళ్ళలో ఉంటే పాడవదా అనే సందేహం రావచ్చు. పాడవదు ఎందుకంటే చెక్కకు ఆక్సిజన్ అందదు, పైగా చెక్క నీటిలోని ఖనిజాలను, లవణాలను పీల్చు కుని గట్టిగా రాయిలా మారిపోతుంది. అదే వెనిస్ కు పునాది. దానివల్లే ఎన్నో శతాబ్దాల క్రితం కట్టినా కూడా వెనిస్ లోని నిర్మాణాలు చెక్క చెదరకుండా ఉంది.

ఇంతకూ ఇవన్నీ చేసింది ఎవరో తెలుసా వెనటీ అనే తెగ వారు, అందుకే ఆ నగరాన్ని వెనిస్ అని పిలుస్తారు. ఎప్పుడో క్రీస్తుశకం పదవ శతాబ్దంలో వచ్చి అక్కడ స్థిరపడిపోయారు. వాళ్ళకున్న బలం, బలహీనత రెండూ నీళ్ళే. పంటలు వేయడానికి నేల లేదు కానీ రవాణా చేయడానికి నీళ్ళు ఉన్నాయి అందుకే దాని మీద దృష్టి పెట్టి పట్టు, ధాన్యాలు, తివాచీలు, వర్ణ చిత్రాలు లాంటి వస్తువుల రవణాకు వసతులు కల్పించారు. సరే ఇక మన కథలోకి వద్దాం.

ట్రైన్ స్టేషన్ నుండి బయటకు రాగానే ఎదురుగా టికెట్ కౌంటర్ ఉంది. అక్కడకు వెళ్ళి రెండు రోజులకు బస్ పాస్ తీసుకున్నాం. ఆ పాస్ తీసుకుంటే రోజులో ఎన్నిసార్లయినా ఏ వేపరెట్టో అయినా ఎక్కొచ్చు, మళ్ళీ టికిట్ తీసుకొనక్కర్లేదు. పాస్ తో పాటు మ్యాప్ కూడా ఇచ్చారు, మ్యాప్ చూసి మేము ఎక్కాల్సిన వేపరెట్టో ఆగే డాక్ దగ్గరకు వెళ్ళాం. మీకు చెప్పనేలేదు కదూ అక్కడ వాటర్ బస్ ను వేపరెట్టో అంటారు. వేపరెట్టో కోసం ఒక అరగంట వేచి చూడాల్సి వచ్చింది. వాటర్ టాక్సీ తీసుకుంటే బావుండేదా పాస్ తీసుకుని తప్పు చేసామా అనిపించింది. కానీ ఆ ఒక్కసారే అంత సమయం పట్టింది. ఆ తరువాత ఎప్పుడూ పది నిముషాల కంటే ఎక్కువ సేపు ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు.
  
 
డాక్ దగ్గర దిగి అక్కడి నుండి గూగుల్ మ్యాప్ పెట్టుకుని నడవడం మొదలు పెట్టాము. సన్నని వీధులు, పక్కనంతా చిన్న చిన్న షాపులు. పాతిక అడుగులు వెయగానే ఒక మలుపు వస్తోంది. మూడు మలుపులు కూడా తిరగక ముందే ఒక బ్రిడ్జ్. ఏదో ట్రెజర్ హంట్ ఆడుతున్నంత సరదాగా ఉంది ఆ వీధుల్లో నడవడం.
 
ఒక పావుగంట నడిచేసరికి వచ్చేసింది మేము బుక్ చేసిన రుజ్జినీ ప్యాలస్. ప్యాలస్ అంటే పెద్ద రాజభవనం కాదు కానీ ఒక పెద్ద ఇల్లనుకోండి. పదిహేను వందల నలభైయ్యేడవ సంవత్సరంలో కట్టారట, అలాంటి యాంటిక్ హౌస్ లో ఉండే అవకాశం వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. రిసెప్షన్ లో మా పేరూ, ఊరూ అడిగి ఒక పెద్ద తాళం చెవి ఇచ్చి ఎలివేటర్ చూపించారు. మా గది రెండు వందల ఒకటి,  అంటే మా గది మూడవ అంతస్తులో ఉందని అర్థం.  ఇటాలియన్స్ సున్నాకు కూడా విలువ ఇస్తారు. ఇద్దరం ఒక మాదిరిగా ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఎలివేటర్ చెరొకసారి ఎక్కాల్సి వచ్చేది అంత చిన్నగా ఉందది. పైకి వెళ్ళి చూద్దుము కదా ఆ ఫ్లోర్ లో మాదొక్కటే గది, గది పక్కనే మెట్లున్నాయి. పైకి వెళ్ళి చూస్తే ఆ ఫ్లోర్ లో కూడా ఒకటే గది. హోటల్ బయట నుండి చూసినప్పుడు అడ్డంగా ఎనిమిదవ పదో గదులున్నట్లుగా ఉన్నాయి, మరి ఆ గదులన్నీ ఏమైనట్లు? లగేజ్ తెచ్చిన బాయ్ ని అడిగితే చెప్పాడు ఆ హోటల్ లో కొన్ని గదులకే ఎలివేటర్ సదుపాయం ఉందని.

తాళం తీసి లోపలకు వెళ్తుంటే ఏవో ఆలోచనలు. ఆరు శతాబ్దాల క్రితం ఆ గదిలోకి మొదటిసారిగా ఎవరు అడుగు పెట్టి ఉంటారు. తరతరాలుగా అక్కడ ఒకే కుటుంబం ఉండి ఉంటుందా? వాళ్ళ సంతోషాలు, దుఃఖాలు, వేడుకలు, కబుర్లు, ఆటలు, పాటలు ఇలా ఎన్ని రహస్యాలు దాచుకున్నదో కదా ఆ గది. అక్కడ ఉన్న కిటికీలో నుండి చూస్తే సన్నని కెనాల్ కనిపిస్తోంది. ఆ కిటికీ పక్కన కూర్చుని నీళ్ళలోకి చూస్తూ కలలు కన్న పడుచు వాళ్ళు, పసిపాపకు నీళ్ళు చూపిస్తూ కాబుర్లు చెప్పిన అమ్మలు, గడిచిన జీవితాన్ని తలపోసిన తాతలు ఎంతో మంది ఉండే ఉంటారు.
ఆ గదిలో బెడ్, డెస్క్, చైర్, టేబుల్, క్లోజెట్ ఉన్నాయి. లైటింగ్ డిమ్ గా ఉంది. బాత్రూమ్ మాత్రం మోడర్న్ గా ట్యూబ్ లైట్ కాంతిలో మెరిసిపోతూ ఉంది. రెండు సింక్స్, టాయిలెట్స్, ఒక బాత్ టబ్  ఉన్నాయి. యూరోపియన్ బాత్ టబ్ కు సగం వరకే డోర్ ఉంటుంది. అలాంటి టబ్ లో నీళ్ళు బయటకు రాకుండా స్నానం చేసే కళ మాకు రెండు రోజులకు వంట బట్టింది.

ఏ వస్తువు కావాలన్నా అందుబాటులో ఉండేట్లుగా హోటల్ కు వెళ్ళాక సూట్ కేస్ లో వస్తువులన్నీ తీసి షెల్ఫ్స్ లో సర్దుకోవడం మా అలవాటు. ఆ గదిలో క్లోజెట్ చాలా చిన్నది, అలా సర్దుకునే వీలు లేదు, గదిలో వేరే షెల్ఫ్స్ కూడా లేవు. పోనీ సూట్ కేస్ లోనే ఉంచేద్దామా అంటే సూట్ కేస్ పెట్టే స్థలమూ లేదు. సామాను పెట్టుకోవడం ఆ హోటల్ లో కొంచెం ఇబ్బందే అయింది. బహుశా అక్కడ అన్ని హోటల్స్ లోనూ అలాగే ఉండొచ్చేమో, శతాబ్దాల క్రితం కట్టిన ఇళ్ళు కదా అవన్నీ. అప్పటి వాళ్ళకు ఇన్ని వస్తువులు అవసరం ఉండి ఉండవు. 

ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి దారిలో కనిపించిన ఇటాలియన్ రెస్టారెంట్ కు వెళ్ళాం. ఇంటిని రెస్టారెంట్ గా మార్చినట్లున్నారు, ముందు చిన్న గదిలో, పెరట్లోకి వెళ్ళే దారి అంతటా టెబుల్స్, కుర్చీలు వేసి ఉన్నాయి. టొమాటో బేసిల్ పిజ్జా, వెజిటబుల్ సూప్ ఆర్డర్ చేసాం. ఇద్దరికీ అవి రెండూ ఎక్కువే అయ్యాయి. 

భోజనం చేశాక పియాజ్జా శాన్ మార్కో కు వెళ్ళాం, దాన్నే సెయింట్ మార్క్ స్క్వేర్ అని కూడా అంటారు. పియజ్జా అంటే ఊరి మధ్యలో ఉండే పెద్ద ఖాళీ స్థలం. ఇటలీలో ప్రతి ఊరిలోనూ  పియజ్జా ఉంటుంది. అక్కడే ఊరి వారు కలిసి కబుర్లు చెప్పుకునేది, పండగలవీ చేసుకునేదీను. వెనిస్ లోని పియజ్జాలో క్లాక్ టవర్, డోజ్ ప్యాలస్, సెంట్ పీటర్స్ బాసిల్లికా, బెల్ టవర్ ఉన్నాయి. బెల్ టవర్ ఎత్తు ఇరవై మూడు అడుగులు, మొదట అది అటువైపు వస్తున్న ఓడలను చూడడానికి కట్టిన వాచ్ టవర్. ఆ తరువాత అది బెల్ టవర్ అయింది.  మిగిలిన వాటి గురించి తరువాత పోస్ట్ లో వివరంగా చెప్తాను. 
  
 
మధ్యాహ్నం కొంచెంసేపు ఊరు చూసాక వేపరెట్టో ఎక్కి దగ్గరలో ఉన్న రెండు ఐలెండ్స్ కు వెళ్ళాం. ఆ కబుర్లూ తరువాత చెప్పుకుందాం. ఐలెండ్స్ నుండి వచ్చాక హోటల్ కు వెళ్తూ ఉంటే దారిలో కూరగాయలు, పండ్లు అమ్మే షాప్ కనిపించింది. అన్ని రకాలు దొరుకుతున్నాయక్కడ. కొన్ని చెర్రీస్, నెక్ట్రైన్స్ తీసుకున్నాం. దారిలో గ్రాసరీ స్టోర్ లో కనిపిస్తే నీళ్ళు తీసుకున్నాం. స్టిల్ వాటర్ అనుకుని పొరపాటున మళ్ళీ సోడా తీసుకున్నామని రూమ్ కు వెళ్ళాక తెలిసింది.  
  
సాయం సమయంలో వెనిస్ అందాలను చూడాలంటే ఆకాడమియా బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళాలి. సాధారణంగా నారింజ రంగులో ఉండే సంధ్య ఆ రోజు కాస్త మబ్బు పట్టి ఉండడంతో పేస్టల్ కలర్స్ లో ఉన్నా అందంగానే ఉంది. తనివితీరా ఆ అందాలను చూసి వెనక్కి వస్తుంటే దగ్గరలో పువ్వుల దుకాణం లోని పరిమళం సుతిమెత్తనిగా పలకరించింది .  
   
 
ఆ రాత్రి ఇటాలియన్ రెస్టారెంట్ లో ఆరుబయట కూర్చుని డిన్నర్ చేసాం. బ్రుషెట్టా, వెజిటబుల్ సూప్, న్నోచ్చి తీసుకున్నాం. ఏమిటో కొత్త కొత్త పేర్లు అనుకుంటున్నారా? ఏమీ లేదండీ బ్రెడ్ మీద అటూ ఇటూ కాస్త వెన్న రాసి కాల్చి దాని మీద టొమాటో, మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి చేసిన సల్సా వేస్తే అది బ్రుషెట్టా, పప్పూ, పులుసూ లేని సాంబార్లో కాస్త తులసి ఆకులు, మిరియాల పొడి వేసి మరగబెడితే అది వెజిటబుల్ సూప్, మైదా పిండిలో బంగాళ దుంపల ముద్ద వేసి గవ్వలు చేసి ఉడికించి వాటిని చక్కెర పాకంలో కాకుండా పైన్ నట్స్, తులసి ఆకులతో ముద్ద చేసి అందులో  వేస్తే అదే న్నోచ్చి. కాస్త భుక్తాయాసంగా ఉందంటే వెంటనే సోడా తాగమంటాం కదా, వెనీషియన్స్ కూడా అంతే. కాకపోతే నిమ్మకాయ సోడాలో కొంచెం లిక్కర్, వైట్ వైన్ కలిపి బుజ్జి గ్లాసులలో ఇచ్చారు. దాన్ని స్ప్రిట్జ్ అంటారు. 
      
 
డిన్నర్ అయ్యాక అలా నడుస్తూ వెళ్తుంటే ఒక విషయం అర్థం అయింది. వెనిస్ ఒక మేజ్, ఏ రోడ్ కు అంతం ఉండదు. ప్రతి రోడ్ మలుపు తిరిగి మరో రోడ్ లో కలుస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యనున్న సన్నదారిలో వెళ్తుంటే హఠాత్తుగా అది కుడివైపుకో, ఎడమవైపుకో తిరుగుతుంది. అక్కడ ఏదైన బుల్లి షాపో, లేదా పెద్ద చర్చో కనిపిస్తుంది. ఎటు వెళితే ఏమొస్తుందో తెలియకుండా ఆ రోడ్స్ లో నడవడం భలేగా ఉంది.

మన జీవితం కూడా అంతే కదూ! అక్కడక్కడా మలుపులు, ప్రతి మలుపు లోనూ ఏదో ఒక ఆశ్చర్యం వేచి చూస్తూ ఉంటుంది. అది బాధ కావచ్చు ఆనందమూ కావచ్చు. చివరగా మనం నడుస్తున్న దారి హఠాత్తుగా ఆగిపోతుంది.

మిగిలిన కబుర్లు రేపు చెప్పుకుందాం. ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు, తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

8 comments:

  1. "ఎటు వెళితే ఏమొస్తుందో తెలియకుండా ఆ రోడ్స్ లో నడవడం భలేగా ఉంది."
    కానీ సాయంత్రానికి ఇంటికి చేరాలి కదా! ఉన్న నాలుగు రోజులూ పిల్లలతో తిరిగాను. వాళ్లయితే వచ్చిన దోవ గుర్తు పెట్టు కుంటారు.
    వెనిస్ గురించి చక్కగా వ్రాశారు

    ReplyDelete
    Replies
    1. శివరామకృష్ణా గారూ, ధన్యవాదాలండీ. వెనిస్ లో నాలుగు రోజులు ఉన్నారా, అయితే అక్కడన్నీ చూసే వుంటారు కదూ!

      Delete
  2. ఇక్కడ ఫొటోలల్లో కనిపిస్తున్న బిల్డింగ్ లన్నీ కూడా నీళ్ళల్లోనే కట్టినవాండి?

    ReplyDelete
  3. “వాటర్ టాక్సీ” కి , గొండోలా కి (gondola) తేడా ఉందాండి?

    ReplyDelete
    Replies
    1. నరసింహా రావు గారు, వాటర్ టాక్సీ మోటార్ తో నడుస్తుందండి. గండోలాను పడవలాగా తెడ్డుతో నడుపుతారు. వెనిస్ గురించి వ్రాసిన ఆఖరి పోస్ట్ లో గండోలా గురించి వ్రాసాను.

      Delete
  4. -

    ప్రపంచంలో మరెక్కడా అన్ని ద్వీపాలు, బ్రిడ్జ్ లు ఉండనే ఉండవు.....


    మా ఇండోనేషియాకి వచ్చి చూడండీ పదివేల పై చిలుకు ద్వీపాలు కొన్నిటికి పేర్లు కూడాలేవు :) బ్రిడ్జీలున్నూ లేవు :)


    బైదివే వెనటీ వాళ్ల పూర్వీకం మా గోదావరి లంకల్లోనట అందుకే వారక్కడ వలసపోయి సెటిలయ్యేరు.

    వెనిస్ ఫోటో లు బావున్నాయి. ఓ ముప్పై వత్సరాలుగా మునిగి పోతుంది సుమా అంటూనే వున్నారు ఇంకా నిలచి వుంది కొంత కాలంలో మా మద్రాసు వెనిసయి పోయే ఆస్కారాలు మెండు :)


    చీర్స్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు, అయితే ఉండవేమో అని మారుస్తాను లెండి. :).

      ఏమిటీ గోదావరి లంకల నుండి వెనిస్ కు వలస వెళ్ళారా. వెళ్ళే ఉంటారు లెండి.

      అవునట, క్రూజ్ షిప్ లను కాస్త దూరంగా ఉంచుతున్నారట. వారణాసి నాగలక్షి గారన్నట్లు వెనిస్ స్వప్నసీమ.

      థాంక్యు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.