ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
మొఆబ్(Moab) నుండి బ్లాక్ కెన్యన్ ఆఫ్ గనిసన్ నేషనల్ పార్క్(Black Canyon of Gunnison National Park) కు శాన్ వాన్ మౌంటెన్స్(San Juan Mountains) మీదుగా వెళ్ళాము.
ఆ తరువాత అంటే దాదాపుగా మేము బయలుదేరిన రెండు గంటల తరువాత శాన్ మొగిల్ నది(San Miguel River) పక్కనే ప్రయాణం. నది అంటే పెద్ద నదేమీ కాదు చిన్న కలువలా ప్రవహిస్తూ ఉంది. ఆ కాసిన నీళ్ళకే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా చెట్లు. ఫాల్ వచ్చిందనడానికి గుర్తుగా పచ్చని ఆకులు పసుపు రంగులోకి మరిపోయాయి. ఎత్తైన కొండల మధ్య రాళ్ళను చూస్తూ మొదలైన మా ప్రయాణంలో హఠాత్తుగా అలా రంగులు కనిపించడం గమ్మత్తుగా అనిపించింది.
సాన్ వాన్ మౌంటెన్ సీనిక్ వ్యూ(San Juan Mountain Scenic view) దగ్గర ఆగాము. కొండమీద అంతా రకరకాల రంగుల్లో మొక్కలు, దూరంగా ఉన్న పర్వతం మీద అప్పుడే మంచు కురవడం మొదలైనట్లుంది అక్కడక్కడా పొడి చల్లినట్లు తెల్లగా కనిపిస్తుoది. ఆ కొండలను, చెట్లను ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవచ్చు.
మేము బ్లాక్ కెన్యన్ నేషనల్ పార్క్ కు వెళ్ళేసరికి సాయంత్రం ఐదు గంటలు అవుతోంది. పార్క్ లోకి వెళ్ళగానే మొదట కనిపించింది అంతా కలిపోయిన ప్రాంతం. జులైలో ఆ పార్క్ సౌత్ రిమ్ లో మొదలైన ఫైర్ కారణంగా అటువైపు చాలా భాగం కలిపోయి ఉంది. ఫారెస్ట్ ఫైర్ గురించి టీవి లో చూడడమే కానీ ఎదురుగా చూడడం అదే మొదటిసారి.
గవర్నెమెంట్ షట్ డౌన్ కారణంగా విజిటర్ సెంటర్ మూసివేసి ఉంది. పార్క్ లోనికి వెళ్ళడానికి ఇబ్బంది లేదు కానీ, ఎమర్జన్సీ అండ్ రెస్క్యూ సర్వీసెస్ పూర్తిగా పనిచేయడం లేదు. అందువలన మేము పార్కింగ్ నుండి ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేని వ్యూ పాయింట్స్ కు మాత్రమే వెళ్ళాము.
సౌత్ రిమ్ విజిటర్ సెంటర్ (South Rim Visitor Center)
ఎత్తైన రెండు పెద్ద కొండల మధ్య ఎక్కడో లోతులో ప్రవహిస్తోంది గనిసన్ నది(Gunnison). కొండలు రెండూ దగ్గరగా ఉండడంతో రోజు మొత్తంలో ఏ అరగంటో ఆ కెన్యన్ లో ఎండ పడుతుంది. మిగలిన సమయం అంతా ఆ లోయలో చీకటిగా ఉండి, కిందకు చూస్తుంటే కొంచెం భయంగా కూడా ఉంది. బ్లాక్ కెన్యన్ కు అందుకనే ఆ పేరు వచ్చింది.
వ్యూ పాయింట్స్ దగ్గరకు వెళ్ళేటప్పుడు కాలిపోయిన చెట్ల మధ్యగా వెళ్ళవలసి వచ్చింది. ఆ చెట్ల మొదళ్ళ నుండి మళ్ళీ చివుర్లు రావడం చూస్తే సంతోషంగా అనిపించింది. కొన్ని దగ్గర రిస్టోరేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు.
ఆ పార్క్ లో అడవి గొర్రెలు కనిపించాయి. మొదట చూసినప్పుడు అవి విగ్రహాల్లా నిలబడి కదలక మెదలక ఉంటె వాటిని జీవమున్న జంతువలనే అనుకోలేదు. అవి హఠాత్తుగా తల తిప్పడంతో జంతువులని అర్థమైంది. పెయింటెడ్ వాల్ వ్యూ పాయింట్ దగ్గర చీరలకు క్రాస్ డిజైన్ చేసినట్లు కొండమీద అడ్డ గీతలున్నాయి.
మాంట్ రోజ్ లో మేము తీసుకున్న హోటల్ “ది రాత్ బోన్ పార్లర్ అండ్ బార్” (The Rathbone Parlor and Bar). అది హిస్టారిక్ బిల్డింగ్, రాత్ బోన్ (Rathbone) అనే అతను నైట్స్ ఆఫ్ పైథియాస్ (Knights of Pythias) అనే ఫ్రాటర్నల్ ఆర్గనైజేషన్(Fraternal Organization)ను స్థాపించాడు. ఆ ఆర్గనైజేషన్ కోసం కట్టిన బిల్డింగే తరువాత రోజుల్లో హోటల్ అయింది.
ఆ ఆర్గనైజేషన్ కు నైట్స్ ఆఫ్ పైథియాస్ అని పేరు పెట్టడానికి కారణం గ్రీక్ కథ డామన్ అండ్ పైథియాస్ (Damon and Pythias). పైథియాస్ అనే అతనిని రాజద్రోహం కారణంగా బంధించి ఉరి శిక్ష వేస్తారు. అప్పుడు అతను ఆవు, సింహం కథలోలాగా నాకు ఇంటి దగ్గర కొన్ని పనులున్నాయి అవి పూర్తి చేసుకుని మా వాళ్ళకు వీడ్కోలు చెప్పి వస్తాను అంటాడు. "అలా ఎలా కుదురుతుంది ఒప్పుకోము" అంటే దానికి డామన్ "పైథియాస్ బదులు నేను కారాగారంలో ఉంటాను అతను చెప్పిన సమయానికి రాకపోతే నన్ను ఉరితీయండి" అంటాడు.
పైథియాస్ వెళ్తాడు, చెప్పిన సమయం దగ్గర పడుతూ ఉంటుంది, అతని సమాచారం తెలియదు. అతను మోసం చేశాడు ఇక తిరిగి రాడని అంతా అనుకుంటూ ఉంటారు. అతని స్నేహితుడు డామన్ ను ఉరితీయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. పైథియాస్ ఆఖరి నిముషంలో వచ్చి తాను రావడానికి దారిలో ఎన్ని అవాంతరాలు ఎదుర్కోవలసి వచ్చిందో చెప్తాడు. ఆ రాజు ఆ స్నేతులిద్దరినీ విడుదల చేస్తాడు. ఆ కథను స్ఫూర్తిగా తీసుకుని స్నేహామంటే అలా ఉండాలనే ఉద్దేశ్యంలో 'రాత్ బోన్ తను మొదలుపెట్టిన ఆర్గనైజేషన్నై కు నైట్స్ ఆఫ్ పైథియాస్ అని పేరు పెట్టాడు.
పిక్చర్ కార్టెసి: Boutique Stay in Historic Montrose | The Rathbone Hotel
తరువాత రోజు 'ఫ్రాన్సిస్ గ్జేవియర్ కాబ్రిని డే' (Frances Xavier Cabrini Day). మరియా ఫ్రాన్సెస్కా కాబ్రిని (Maria Francesca Cabrini) అనే నన్ పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికాకు వలస వచ్చిన ఇటాలియన్ బాలల కోసం ఎంతో సేవ చేశారట. ఆవిడ సేవాభావానికి గుర్తుగా ఆవిడ పుట్టిన రోజున కొలరాడో గవర్నమెంట్ సెలవు ప్రకటించింది.
ఆ రోజు ఇక చూసేవేమీ లేకపోవడంతో తీరిగ్గా లేచి ఆ డౌన్ టౌన్ కు దగ్గరలోనే ఉన్న హిస్టారిక్ హౌసెస్ చూస్తూ బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చే ఒక ఇంటికి వెళ్ళి కాఫీ తీసుకున్నాము. తరువాత బాక్ స్ట్రీట్ బేగల్ కంపనీ(Back Street Bagel Company) కి వెళ్ళాము. ఆ షాప్ లో ఒక గోడ మీద మొత్తం లోకల్స్ చేసిన క్విల్ట్స్, పెయింటింగ్స్ ఉన్నాయి. నచ్చినవి కొనుక్కోవచ్చు.
ఆ తరువాత విజిటర్ సెంటర్ కు వెళ్ళాము. స్టే హియర్ ప్లే ఎవ్రి వేర్ (stay here play everywhere) అన్న వాళ్ళ స్లోగన్ బావుంది. అంటే ఆ ఊరిలో ఉండి ఆ చుట్టుపక్కల అడ్వెంచర్స్ చేయమని అర్థం.
ఆ వేళతో మా వెకేషన్ పూర్తి అయింది అనుకుంటూ డ్యురాంగో ఎయిర్ పోర్ట్ కు బయలుదేరాము కానీ దారిలో మాకొక అనుకోని అతిథి ఎదురౌతుందని అప్పుడు తెలియదు.
మిగిలిన విశేషాలు తరువాత భాగంలో
No comments:
Leave your Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.