Monday, January 1, 2024

లుక్కా

అదేదో సినిమాలో హీరో, హీరోయిన్ జడను చూసి ప్రేమించినట్లు మేము గోడను చూసి లుక్కా(Lucca) తో ప్రేమలో పడిపోయాం. ‘టాప్ టెన్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ టస్కనీ’ అనే వీడియో చూస్తూ ఐదు తాటిచెట్లు నిడివి ఉన్న గోడ, దాని మీద రెండు కార్లు వెళ్ళగలిగినంత వెడల్పాటి రోడ్, రోడ్ కు అటూ ఇటూ వేప చెట్ల౦త పెద్ద చెట్లు చూసి ఆశ్చర్యపోయాం. ఆ గోడను దగ్గరగా చూడాలని ఆ రోడ్ మీద నడవాలని అనిపించింది కానీ అలాంటి అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు.

చిన్కు టెర్రె(Cinque Terre) నుండి లుక్కా వెళ్ళాలని అనుకున్నాం కదా, అక్కడ మౌంటరోసో(Monterosso) లో ట్రైన్ ఎక్కితే లాస్పెట్జ్యా(Le Spezia) కు పదిహేను నిముషాల్లో వెళ్ళిపోయాం. లాస్పెట్జ్యా నుండి లుక్కా కు వెళ్ళాలంటే మధ్యలో వియారెజ్జియొ(Viareggio) దగ్గర ట్రైన్ మారాలి. మొత్తం ప్రయాణం గంటన్నర. దారంతా ఊర్లు, పిల్ల కాలువలు, ప్రయాణం బావుంది. 
 
లుక్కా గురించి చెప్పుకోవలంటే అది టస్కనీ(Tuscany) కంచి. అర్థం కాలేదా మన కంచి లాగా అది పట్టు వస్త్రాలకు ప్రసిద్ది. బంగారు, వెండి జరీలతో నేసిన పట్టు వస్త్రాలకోసం ట్రేడర్స్ యూరప్ లోని చాలా ప్రాంతాల నుండి అక్కడకు వచ్చే వారట.
లుక్కాలో ట్రైన్ దిగి స్టేషన్ బయటకు రాగానే ఒక వైపు ట్రాఫిక్ హడావిడి కనిపిస్తోంది మరో వైపు దూరంగా పెద్ద గోడ కనిపిస్తోంది. అటువైపు నడవడం మొదలు పెట్టాము. మెయిన్ రోడ్ దాటి మట్టిరోడ్ మీద ఆడుగు పెట్టామో లేదో ఎక్కడి నుంచో సన్నగా పువ్వుల పరిమళం. చుట్టూ చూస్తే పచ్చగా గడ్డి తప్ప మొక్కలేవీ లేవు, గమనిస్తే అర్థమైంది ఆ వాసన మరెక్కడిదో కాదు, మా ఎదురుగా ఉన్న జమ్మి చెట్ట౦త పెద్ద చెట్టుకున్న పసుపు పచ్చని పువ్వుల నుండి అని. ఆ చెట్టు పేరు తెలుసుకోవాలని ఫోటో తీసి ఫోన్ ఆప్ లో చూస్తే తెలిసింది దాని పేరు కస్తూరా అని. మనం కస్తూరి చెట్టనే పిలుచుకుందాం.
లుక్కాలోని గోడను పదిహేను వందల నాలుగవ సంవత్సరంలో మొదలుపెట్టి పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరం వరకూ అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల పాటు కట్టారట. అంత పెద్ద గోడను ఊరి చుట్టూ ఎందుకు కట్టారో తెలుసా ఆ ఊరి లోకి శత్రువులు రాకుండా అడ్డుకోవడానికి. ఆ గోడకు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. అప్పట్లో అవసరమైనప్పుడు మాత్రమే అవి తెరిచేవారట. 
 
ఆ గోడ పైకి వెళ్ళగానే మధ్యలో రోడ్, రోడ్ కు అటూ ఇటూ ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఆ రోడ్ పక్కన ఉన్న బెంచీ మీద అక్కడక్కడా కొంతమంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు, కొంతమంది మీద సైక్లింగ్ చేస్తున్నారు. అప్పటి యుద్దాలు, ఆ హడావిడీ అన్నీ ఆగిపోయి ఇప్పుడా గోడ మీద ఊరు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంది. 
 
ఊరు చూడాలని గోడ దిగి కిందకు వెళ్ళాము. అక్కడ వాహనాలు నడపడానికి పరిమితి ఉన్నట్లుంది, ఊరి లోపల ఒక్క కారూ లేదు, సెంటర్ కు దూరంగా  ఎక్కడో పార్క్ చేసి ఉన్నాయి.  ఆ ఊరిలో సైకిల్స్ మాత్రమే వాడతారేమో! అక్కడక్కడా సైకిల్ స్టాండ్స్ ఉన్నాయి.
 
కొంచెం లోపలకు వెళితే పదిహేనవ శతాబ్దంలో కట్టిన కెథడ్రల్, బెల్ టవర్ ఉన్నాయి. అన్నట్లు మీకు చెప్పలేదు కదూ లుక్కా ను ది టౌన్ ఆఫ్ ఎ హండ్రెడ్ చెర్ఛెస్ అంటారు.  
 
అవి చూసి ఇంకొ౦చెం ముందుకు వెళితే పాత పుస్తకాలు అమ్మే స్టాల్స్ ఉన్నాయి. అక్కడ ఇంగ్లీష్, ఇటాలియన్ పుస్తకాలు దొరుకుతున్నాయి. ఆ ఊరి వారు ఇంగ్లీష్ కొంచెం కష్టంగా  మాట్లాడుతున్నారు కానీ చాలా మర్యాదగా సమాధానం ఇస్తున్నారు. 
నాలుగు వీధులూ తిరిగేసి జిలాటో తీసుకుని గోడ మీద రోడ్ పక్కన బెంచ్ మీద కూర్చున్నాము. అక్కడంతా నిశ్సబ్దమే, గాలికి ఊగుతున్న ఆకుల చప్పుడు తప్ప మరేం వినిపించడం లేదు. ఆ గోడ పక్కన ఇళ్ళకు స్టార్ జాస్మిన్ తీగలు అల్లించినట్లున్నారు. సన్నని పరిమళం, తీరుగా ప్రశాంతంగా ఉన్న ఆ ఊరి అందం, టివి, సెల్ ఫోన్ లేని రోజుల్లో చల్లని సున్నపు మిద్దెల్లో పుస్తక ప్రపంచంలో విహరిస్తూ కోయిల పాటల కోసం వేచి చూసిన వేసవి మధ్యాహ్నాల్ని గుర్తుకు తెచ్చాయి. 
అక్కడ కూర్చున్న౦తసేపూ నిన్నేమైందో, రేపేం జరగబోతోందో అన్న ఆలోచనే లేదు. రిటైర్ అయ్యాక ఆ ఊరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనుకుంటూ ఫ్లోరెన్స్ వెళ్ళడానికి ట్రైన్ స్టేషన్ వైపు బయలుదేరాం.

ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

4 comments:

  1. -
    రిటైర్ అయ్యాక ఆ ఊరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనుకుంటూ.....

    రెండే రోజుల్లో పారిపోయి మళ్లీ‌ అమరిక యైన స్వంత వూరికి వెళ్లేదానికి పెట్టేబేడా సర్దేసుకుంటారు :)


    ReplyDelete
    Replies
    1. అంతే నంటారా, అమెరికాలో పనులతో రోజు ఇరుకై పోతోంది. అక్కడయితే విశాలమౌతుందేమో నని :)

      Delete
    2. మంచి ఐడియా - ఓ హాట్ హాట్ పెసరట్టు / జిలేబి స్టాల్ అక్కడ ఓపెన్ చేసి పెట్టేసుకుని‌ వచ్చీ పోయే కస్టమర్లతో మాట్లాడుతూ టైమ్ పాస్ చేసేయొచ్చు :)

      Delete
    3. ఈ ఐడియా బావుంది, మసాలా ఛాయ్ కూడా పెట్టేద్దా౦. :)

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.