ఇంతకుముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
ఫ్లోరెన్స్ కు వెళ్ళిన మూడవ రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఉఫిట్జి గ్యాలరీ(Uffizi Galary) టూర్ తీసుకున్నాము. బ్రేక్ ఫాస్ట్ అయ్యాక గ్యాలరీకి వెళ్ళడానికి మధ్యనున్న కాస్త సమయంలో అక్కడకు దగ్గర్లోనే ఉన్న బబోలీ గార్డెన్స్ కు వెళ్ళాము. తోటంటే ఏవో మొక్కలు పువ్వులు ఉండే బుల్లి తోట అనుకున్నాము కానీ కాదు. విశాలమైన మైదానాలు, బారులు తీరిన ఎత్తైన చెట్లు, శిల్పాలు, జలాశయాలు, విశ్రాంతి భవనాలు ఇలా చాలా ఉన్నాయక్కడ. ఆ తోటను పూర్తిగా చూడాలంటే దాదాపుగా నాలుగు గంటలైనా పడుతుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి సరిగ్గా చూడలేకపోయాము కానీ, వీలయితే మాత్రం తప్పనిసరిగా వెళ్ళవలసిన ప్రదేశం అది.
ఆ షాపులవీ దాటిరాగానే ఉంది ఉఫిట్జీ గ్యాలరీ. ఉఫిట్జీ అంటే ఆఫీస్ అని అర్థం. ఒకప్పుడు అది మెడిచీస్ ఆఫీస్. గ్యాలరీ లోపలకు వెళ్ళగానే ఒక పొడవాటి హాల్లో రెండు వైపులా వరుసగా శిల్పాలు, ఒక వైపునంతా వున్న గదులలో చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. పై కప్పు కూడా అందంగా పెయింట్ చేసి ఉంది.
మైకలాంజిలో(Michelangelo), సాండ్రో బొటిచెల్లి (Sandro Botticelli), రఫయెల్ (Raphael) లాంటి కళాకారుల చిత్రాలు, శిల్పాల కోసం ప్రత్యేకంగా కొన్ని గదులను కేటాయించారు. అక్కడ బాగా నచ్చిన వాటిలో కొన్ని చెపుతాను.
మొదటగా సాండ్రో బొటిచెల్లి వేసిన ది బర్త్ ఆఫ్ వీనస్(The Birth of Venus), ప్రిమవెర (Primavera) పెయింటింగ్స్. అవి పదిహేనవ శతాబ్దంలో వేసినవి. అప్పట్లో ఆ పెయింటింగ్స్ కు ఎలాంటి రంగులు వాడారో, ఆ రంగులు ఎలా తయారు చేసారో కానీ ఆ చిత్రంలోని పువ్వులను గమనిస్తే అప్పడే నేల రాలినంత తాజాగా ఉన్నాయి. 'ది బర్త్ ఆఫ్ వీనస్' చిత్రంలో వీనస్ సముద్రంలో పుట్టి నేలమీదకు వస్తున్నట్లుగా ఉంటుంది. ఆ చిత్రంలోని ప్రతి ఆకు, పువ్వు, ఆకాశం రంగు, వీనస్ నిలబడిన గవ్వ అన్నీ కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ప్రిమవెరా అంటే వసంతం, ఇటలీలో ఉన్న పువ్వులన్నింటినీ మనం 'ప్రిమవెరా' చిత్రంలో చూడొచ్చు.
మైకలాంజిలో (Michelangelo) వేసిన 'డోని టాండో' (Doni Tondo) చిత్రం. పదహారవ శతాబ్దంలో ఆగ్నోలో డోని (Agnolo Doni) అనే అతను వేయించిన చిత్రం అది. టాండో అంటే వృత్తాకారం. వృత్తంలో ముగ్గురిని విభిన్న ఆకృతిలో చిత్రించడం ఈ చిత్రం ప్రత్యేకత. దీనిని 'ది హోలీ ఫామిలీ' (The Holy Family) అని కూడా అంటారు. ఆ చిత్రానికి ఉన్న ఫ్రేమ్ కూడా మైకలాంజిలో తయారు చేసినదే.
బచొ బాందినెల్లి (Baccio Bandinelli) చెక్కిన శిల్పం లెయ్యొకాన్ గ్రూప్ (Laocoon Group). బలమైన చెట్టు వేర్లు చుట్టుకొని పోయినట్లు ఉందా శిల్పం. ఆ శిల్పం లోని వారి మొహాలలో భయం, బాధ ప్రస్ఫుట౦గా కనిపిస్తూ ఉన్నాయి. అది మనకు అద్భుతంగా అనిపించడమే కాదు, మైకలాంజిలో కూడా 'ది మిరకల్ ఆఫ్ ఆర్ట్' (The Miracle of Art) అని మెచ్చుకున్న శిల్పం అది.
రఫయేల్ (Raphael) వేసిన 'మడోనా ఆఫ్ ది గోల్డ్ ఫిన్చ్' (Madonna of the Goldfinch) అనే చిత్రంలో వాడిన రంగులు, ఆ బొమ్మలోని స్వచ్ఛత ఎంతో నచ్చేసాయి. రఫయేల్ జీవితకాలం కేవలం ముప్పై ఏడేళ్ళే అయినా తను ఎన్నో అద్భుతమైన చిత్రాలు చిత్రించారు.
అప్పట్లో ఐశ్వర్యవంతులకు కళాఖండాలను సేకరించడం ఒక వ్యాపకం, వారి హోదాకు చిహ్నం. ఫ్రాన్సిస్కో మెడిచి (Francesco Medici) తాను సేకరించిన చిత్రాలు, శిల్పాల కోసం ప్రత్యేకంగా బెర్నార్దో బొంతలెంతి(Bernardo Buontalenti) తో ఒక గది కట్టించారు. ఆ గది ఎట్లా ఉందనుకున్నారు, నేల మీద పువ్వులు పరిచినట్లు చలువరాతితో వేసిన, ఎర్రని మంట రంగులో గోడలు, మంచి ముత్యాలును తాపడం పై భాగం, పై కప్పుకు మధ్యలో ఉన్న అద్దం నుండి వస్తున్న వెలుగులో ఆ గదిలోని చిత్రాలు, శిల్పాలు మెరిసిపోతున్నాయి.
రెండు గంటల టూర్ లో గైడ్ చూపించనవి వాటితో తృప్తిగా అనిపించక మళ్ళీ వెళ్ళి ఆడియో టూర్ తీసుకుని అన్నీ స్వంతంగా చూసాము. అలా ఒకటొకటే చూసుకుంటూ గ్యాలరీ అంతా తిరిగి బయటకు వచ్చేసరికి భోజనం వేళ దాటిపోయింది. ఆ తరువాత చూడబోతున్నది అకడేమియా గ్యాలరీ.
అకడేమియా గ్యాలరీ (Accademia Gallery) చూడడానికి టూర్ తీసుకోలేదు కానీ అంతకు ముందే ఆన్ లైన్ లో రెండు గంటలకు స్కిప్ ద లైన్ టికెట్ తీసుకున్నాం. మాకిచ్చిన సమయం కంటే అరగంట ముందే వచ్చి టికెట్స్ కలెక్ట్ చేసుకోమన్నారు. ఆ రోజు ఇక భోజనం చేసే సమయం లేదుగా ఫ్రూట్ స్టాల్ దగ్గర స్మూతీ తీసుకుని నేరుగా అకడేమియా గ్యాలరీకి వెళ్ళాము. స్కిప్ ద లైన్ టికెట్స్ ఉన్నా కూడా నలభై నిమిషాలు రోడ్ మీదే వేచి ఉండాల్సి వచ్చింది. ఆ రోజు మరీ వేడిగా లేదు కాబట్టి ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు.
లోపలకు వెళ్ళగానే ఎదురుగా డేవిడ్(David). పద్నాలుగు అడుగుల ఎత్తున్న డేవిడ్ ను రో ఏడడుగుల ఎత్తున్న దిమ్మె మీద పెట్టడంతో హాల్ లో ఎంతమంది ఉన్నా ఇబ్బంది లేదు, ఎటునుండి చూసినా చక్కగా కనిపిస్తోంది. ఆ శిల్పాన్ని చూస్తుంటే మైకలాంజెలో విశ్వరూపం చూస్తున్నట్లుగా అనిపించింది. రింగులు తిరిగిన జుట్టు, తీక్షణంగా చూస్తున్న చూపులు, కాలి వేళ్లు, గోళ్ళు కెమెరాలో తీసిన ఫోటో కూడా అంతా స్పష్టంగా చూపించలేదేమో!
ఆ రాత్రి అక్కడకు దగ్గరలో ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్ళాం. మెన్యు ఇటాలియన్ భాషలో ఉంది. చదవడం రాదుగా అందుకని తెలిసిన డిష్ స్పినాచ్ రావియ్యోలీ (Spinach Ravioli) ఆర్డర్ చేసాను. తను ఏదైనా ఫుడ్ విత్ నో మీట్ తెమ్మన్నారు. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, చూస్తే అందులో షెల్స్ ఉన్నాయి.
మేము మీట్ వద్దన్నాము కదా అని వెయిటర్ ను అడిగాము. అతను ఎస్, నో మీట్ అని షెల్స్ చూపించాడు. మేము ఆశ్చర్యంగా చూస్తున్నాము, అతను అయోమయంగా చూస్తూ నో మీట్ ఓన్లీ సీ ఫుడ్ అని చెప్పాడు. మరో పాఠం నేర్చుకున్నాము. యూరప్ లో నో మీట్ కాదు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పాలని. ఇక చేసేదేం ఉంది, బుట్టలో ఇచ్చిన బ్రెడ్, స్పినాచ్ రావియ్యోలీ ఇద్దరం చెరి సగం తిన్నాము.
ఫ్లోరెన్స్ బావుంది, ఇంకో రెండు మూడు రోజులు ఉండగలిగితే ఎంతో బావుండేది. ముఖ్యంగా టస్కని (Tuscany) ప్రాంతంలోని వైనరీస్(Vineries)కు వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు. చూద్దాం మరెప్పుడైనా అక్కడకు వెళ్ళే అవకాశం వస్తుందేమో! బై బై ఫ్లోరెన్స్.
తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు, ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
మైకెలేంజెలో చిత్రాలు శిల్పాలు, మెడిచి కుటుంబం వారి కళాపోషణలతో విలసిల్లిన ఫ్లారెన్స్ నగరాన్ని సందర్శించిన మీరు చాలా అదృష్టవంతులు 🤨.
ReplyDeleteడేవిడ్ శిల్పం దగ్గర కనిపిస్తున్న (మీ ఫొటోలో) సీను మాత్రం ఈ కాలపు జనాల మనస్తత్వాలకు చక్కటి ప్రతిబింబం. ఫొటోలు తప్ప వేరే ధ్యాస వుండడం లేదు. పారిస్ లోని Louvre Museum లోనూ ఇదే సీను చూశాను. మోనాలిస వంటి చిత్రం, వీనస్ (చేతుల్లేని) లాంటి శిల్పం దగ్గర వాటిని ఆస్వాదించడం, అక్కడ వ్రాసున్న వివరాలు చదవడం - ఇవేమీ లేవు. ముందు ఫొటో తీసేసుకుందాం, ఇంటికి వెళ్ళి తీరిగ్గా చదువుకుందాం అన్నట్లు తోస్తుంది వాళ్ళ ఫొటోల హడావుడి చూస్తుంటే. ఫొటో తీసుకోవలసిందే తప్పు లేదు, కానీ దాంతో బాటు అక్కడ వ్రాసున్న వివరాలు, చరిత్ర కూడా అక్కడే ఓసారి చదువుకుంటే బాగుంటుంది కదా. అది చెయ్యరు, చదువుదామనుకునే వారికి దారియ్యరు.
Raviola కోసం మీరు ఆర్డర్ చేసిన ప్రహసనం బాగుంది 🙂. మేం కూడా యూరప్ లో (స్విట్జర్లాండ్ లో) Risotto అనే ఇటాలియన్ రైస్ వంటకం తెమ్మన్నాం. ఓన్లీ వెజిటేరియన్ అని కూడా నొక్కి వక్కాణించాం. కాసేపటికి సర్వారాయుడు తీసుకొచ్చాడు. ఎందుకైనా మంచిదని వెజిటేరియనే కదా అని మరోసారి అడిగాం. ఆఁ, ఆఁ, వెజిటేరియనే, బాగుటుందని కాస్త చికెన్ కూడా కలిపాం అన్నాడు 😏😏. అప్పుడనుకున్నాం ఇక నుంచీ నో మీట్ అని చెప్పడం మంచిదేమో అని. అది కూడా పని చెయ్యదని ఇప్పుడు మీ అనుభవం గురించి చదివి తెలుసుకున్నాం. ఫారిన్ రెస్టారాం లలో ఎలా చెప్పాలో బోధపడడం లేదు 😞.
ధన్యవాదాలండి. ఫ్లోరెన్స్ వెళ్ళే ముందు పెద్దగా అనిపించలేదు కానీ ఆ ఊరు చూసాక మాత్రం ఎంతో నచ్చేసింది. మరో రెండు రోజులైనా అక్కడ ఉంటే బావుండేది అని కూడా అనుకున్నాము.
Delete