ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ప్రయాణం మొదటి నుండి చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్(Mighty Five National Parks) లో జ్సయాన్ నేషనల్ పార్క్ (Zion National Park) ఒకటి. మేము జ్సయాన్ కు వెళ్ళేసరికి సూర్యాస్తమయం అవడంతో నీరెండ ఆ కొండలపై బంగారు పూత పూస్తూ ఆ ప్రాంతం అంతా అద్భుతంగా ఉంది.
కాసేపటికి సూరీడు వెళ్ళిపోయి చంద్రోదయం అయింది. వెన్నెల వెలుగుల్లో ఆ కొండలు మరింత అందంగా ఉన్నాయి. అలా వెన్నెల్లో ఆ కొండల అందాలు చూస్తూ ఘాట్ రోడ్ మెలికల్లో దాదాపుగా ఒక అరగంట ప్రయాణం చేశాము.
అక్కడ కొండలు, మాన్యుమెంట్ వ్యాలీలోని కొండల్లా ఎరుపు రంగులో కాక తెల్లగా ఉన్నాయి. దానికి కారణం నవాహో శాండ్ స్టోన్. ఆ ఇసుకలో ఐరన్ ఆక్సైడ్ శాతం తక్కువ.
జ్సయాన్ నేషనల్ పార్క్ కు కొంచెం దూరంలో వున్న ‘హిల్టన్ ఆటో క్యాంప్’ సైట్ లో ఆ రోజు మా బస. చుట్టూ కొండలు కొండ కింద దూరంగా క్యాబిన్స్, ట్రైలర్స్ లో వసతి ఏర్పాటు చేశారు. క్యాంప్ సైట్ లోనే స్విమ్మింగ్ పూల్, రిసెప్షన్, రెస్టరెంట్ ఉన్నాయి. ప్రతి ట్రైలర్స్ లో ఒక క్వీన్ బెడ్, సోఫా బెడ్, మైక్రోవేవ్, ఫుల్ బాత్ ఉన్నాయి. ట్రైలర్స్ లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలం మాకు ఆ విధంగా తీరింది. విశాలమైన ఆకాశం కింద ఫైర్ ప్లేస్ వెచ్చదనం అనుభవిస్తూ ప్రకాశవంతమైన చుక్కల్ని చూడడం మాత్రం గొప్ప అనుభూతి.
పూర్తిగా తెల్లవారక ముందే నిద్ర లేచి నేషనల్ పార్క్
కు వెళ్ళడానికి తయారయిపోయాము. రాత్రి చీకట్లో కనిపించని అందలన్నీ తొలి పొద్దు వెలుగుల్లో తేటతెల్లం అవుతుంటే ఆ దృశ్యం ఎంతో బావుంది.
జ్సయాన్ పార్క్ లోపలకు వెళ్ళడానికి ప్రయివేట్ వాహనాలకు
అనుమతి లేదు. టూరిస్ట్స్ కోసం షటిల్ బసెస్ తిరుగుతూ ఉంటాయి. ఆలస్యం చేస్తే షటిల్ బస్
షెల్టర్ దగ్గర పార్కింగ్ దొరకడం కష్టమని, ఉదయం ఆరున్నరకే రిసెప్షన్ దగ్గరున్న కఫే లో
కాఫీ తీసుకుని విజిటర్ సెంటర్ దగ్గరకు బయలుదేరాము. అన్నట్లు నేషనల్ గవర్నమెంట్ షట్
డౌన్ అయినా కూడా యూటా స్టేట్ గవర్నమెంట్ ఆ పార్క్ ను మూసివేయలేదు. ఒకవేళ మూసివేస్తే
మా ప్రయాణంలో చాలా ముఖ్యం అనుకున్న ఆ పార్క్ ను చూడలేకపోయేవాళ్ళము.
కార్ పార్క్ చేసి బస్ షెల్టర్ దగ్గరకు వెళ్ళేసరికి
షటిల్ బస్ రెడీగా ఉంది. ఆ షటిల్ ఎక్కి చివరి స్టాప్, టెంపుల్ ఆఫ్ సినవావా(Temple
of Sinawawa) దగ్గరకు దిగాము. ‘సినవావా’ ఆదివాసుల దేవుడు. అక్కడ ఎత్తైన కొండల మధ్యలో
విగ్రహం వెలసినట్లుగా ఉన్న ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు.
‘
షెల్టర్ దగ్గర బస్ దిగి నడవడం మొదలుపెట్టాము. చుట్టూ
ఎత్తైన కొండలు, ఒక వైపు ఏవో పసుపు రంగు పువ్వులు, మరో వైపు చిన్న కాలువలా ప్రవహిస్తున్న
నది (Virgin River), అలా నడుస్తూ వెళుతుంటే హఠాత్తుగా మలుపు తిరిగే కొండ దారి, వీటన్నింటితో
ఆ ఉదయపు నడక ఎంతో ఆహ్లాదంగా ఉంది.
సుమారుగా ఒక మైలు దూరం నడిచాక ఆ దారి ఆగిపోయి, రెండు కొండల మధ్యలో వర్జిన్ నది వొరుసుకుని ప్రవహిస్తూ ఉంది. అక్కడి వరకు వెళ్ళిన వారు కొందరు వాటర్ షూస్ వేసికుని, స్టిక్స్ పట్టుకుని నడుస్తూ వెళ్లిపోతున్నారు. ఆ ప్రాంతాన్ని ‘నారోస్ (Narrows)’ అంటారు. అలా నీళ్ళలో నడవడం పెద్ద ప్రమాదమేమీ కాదు కానీ, మేమది చేయాలని అనుకోలేదు. అన్నట్టు, ఈ వర్జిన్ నది కొలరాడో నదికి ఉపనది. వర్జిన్ నది, లేక్ మీడ్ (Lake Mead) దగ్గర కోలారాడో నదిలో కలసిపోతుంది.
వెళ్ళిన దారిలోనే వెనకకు వచ్చి సినవావా స్టాప్ దగ్గర షటిల్ బస్ ఎక్కి ‘బిగ్ బెండ్’ స్టాప్ దగ్గర దిగాము. ఆ ప్రాంతంలో కొండ పెద్ద వంపు తిరిగి ఉండంతో దానికి ఆ పేరు పెట్టారు. అక్కడి నుండి దాని పక్క స్టాప్ ‘వీపింగ్ రాక్(Weeping Rock)’ వరకు నడవడం మొదలు పెట్టాము. ఎత్తైన కొండల మధ్య నున్న విశాలమైన ఆ మైదానంలో మాలాగా నడుస్తున్న వాళ్ళు ఒకరిద్దరు తప్ప మరెవ్వరూ లేరు. కొండల మధ్య నిశ్శబ్దంలో నడుస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది.
వీపింగ్ రాక్ దగ్గరకు వెళ్ళడానికి కొంత ఎక్కాల్సి
వచ్చింది కానీ మరీ పెద్ద హైక్ ఏమీ కాదు. అక్కడకు వెళ్ళి చూస్తే కొండ వంపు తిగిరి ముందుకు
చొచ్చుకుని వచ్చి దానిపైనుండి నీటి చుక్కలు బొట్టు బొట్టుగా జారి పడుతున్నాయి. ఆ రాలుతున్న
నీటి చుక్కల్ని వేలి చివర నిలబెట్టే ప్రయత్నం సరదాగా అనిపించింది. ఇంతకూ దానిని వీపింగ్
రాక్ అని ఎందుకన్నారో ఆనంద భాష్పాలు అయి ఉండొచ్చుగా మనం ఆనందిని అని పేరు పెడదాం.
అక్కడ షటిల్ ఎక్కి జ్సయాన్ లాడ్జ్ దగ్గర దిగి, ‘ఎమరాల్డ్
పూల్స్’(Emarald Pools) వైపుకు నడవడం మొదలుపెట్టాము. అక్కడకు వెళ్ళాలంటే కొండ పైకి
ఎక్కాలి కానీ దారంతా చెట్ల నీడ పడుతూ ఉండడంతో పెద్ద కష్టం అనిపించలేదు. పైకి వెళ్ళాక
కొండ పై నుండి జారుతున్న నీళ్ళు చిరుజల్లుగా నేలను తడిపేస్తున్నాయి. హఠాత్తుగా వీచిన
గాలికి ఆ జల్లు కాస్తా మమ్మల్ని మొత్తంగా తడిపేసింది. లేత ఎండ ఆ నీళ్ళ మీద ఇంద్రధనస్సులు
పూయిస్తే, జారి పడిన నీళ్ళు లోయలో పచ్చలు మెరిపించాయి.
ఎమరాల్డ్ పూల్స్ చూసి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం
పన్నెండు దాటుతోంది. జ్సయాన్ లాడ్జ్ దగ్గర ఉన్న క్యాజల్ డోమ్ కేఫ్ (Castle Dome
Café) దగ్గరకు వెళ్ళాము. అక్కడ వేడి వేడిగా బర్గర్స్, హాట్ డాగ్స్, చికెన్ టెండర్స్,
పిజ్జా పాక్ చేసి ఉన్నాయి. ఆర్డర్ చేసి వేచి చూడవలసిన అవసరం లేకుండా ఈ పద్దతి బావుందే
అనుకుంటూ బర్గర్స్, చికెన్ టెండర్స్ తీసుకుని లంచ్ చేసి తిరిగి షటిల్ ఎక్కి విజిటింగ్
సెంటర్ కు వెళ్ళాము.
ప్రతి నేషనల్ పార్క్ విజిటర్ సెంటర్ లో ఆ నేషనల్ పార్క్ స్టాంప్ ఉంటుంది. పార్క్ చూసిన వారు తమ నేషనల్ పార్క్స్ పాస్పోర్ట్ లో ఆ స్టాంప్స్ వేసుకుంటారు. పండు కూడా తన పాస్పోర్ట్ లో స్టాంప్ వేసుకున్నాడు. దాదాపుగా ఒంటి గంట ప్రాంతంలో అక్కడ నుండి బయలుదేరి వ్యూపాయింట్స్ దగ్గర ఆగి చూస్తుంటే ఆ కొండలు అద్బుతంగా కనిపించాయి.
మేము ఊహించిన దానికన్నా జ్సయాన్ పార్క్ చాలా బావుంది.
మరోసారి వచ్చి, అక్కడే మూడు రోజులు ఉండి హైకింగ్ చేయాలని అనుకుంటూ బ్రైస్ కెన్యన్ నేషనల్
పార్క్(Bryce Canyon National Park)కు బయలుదేరాము.
No comments:
Leave your Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.