Wednesday, February 1, 2012

లలలా..లలలా

ఏమైందీ ఈ వేళ
ఎదలో ఈ సందడేల
మిలమిలమిల మేఘమాల
చిటపట చినుకే ఈవేళ!

      ఇంతకూ ఎందుకీ సంతోషం అంటున్నారా....నేనో కథ రాసే సాహసం చేశాను. ఏదో ఓ రోజు కథ రాయాలి, అది పత్రికలో అచ్చవ్వాలనే కోరిక ఇవాళ తీరింది. నా తొలి కథ 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'ఫిబ్రవరి' సంచికలో ప్రచురితమైంది. నా కథను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగం మరిచా
మొదటి సారి మెరుపు చూశా
కడలిలాగే ఉరకలేశా!!
                                       
                           మధురక్షణాలు 

         కారు మలుపు తిరిగి, ఇంటిముందుకు వచ్చింది. పచ్చటి లాన్, ఆ చివరగా బంతిపూలు అందంగా తలలూపుతున్నై. కారు గరాజ్ లో పార్క్ చేసి తలుపు తీసి లోపలికి వచ్చింది కృష్ణ. వాజ్ లోని రోజాపూలు తాజాగా ఆహ్లాదంగా వున్నాయి. గోడమీది బాపుబొమ్మ, టీవీ పక్కగా ఉన్న కొంటె కృష్ణుడు, కుండీలోని మనీ ప్లాంట్ ఇవాళ మరీ అందంగా కనిపిస్తున్నాయ్. సరాసరి బెడ్ రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి తన కిష్టమైన వైట్ స్కర్ట్, పింక్ టాప్ వేసుకు౦ది. అప్పటికి టైం ఆరవుతోంది. “మధు ఇవాళ  ఎప్పుడొస్తాడో” అనుకుంటూ ఫోన్ చేసింది, అవతల నుండి మెస్సేజ్. ఈ లోగా వంట చేద్దామని కిచెన్ లోకి వెళ్లి ‘ఈ వేళ బయట తినేద్దా౦లే’ అనుకుంటూ బయటకు వచ్చింది కృష్ణ.

          సమ్మర్ లాంగ్ ఈవినింగ్, అప్పుడే ఎండ తగ్గుముఖం పడుతోంది. ఉదయం నుండి వెయిట్ చేస్తున్న పిల్లలు సైకిళ్ళు, స్కూటర్ల తో ఒక్కక్కరే బయటకు వస్తున్నారు. క్రిస్టీన్, అమేండా వాకింగ్ కి వెళ్తూ కృష్ణను చూసి విష్ చేశారు.  కుక్క పిల్లతో ఆడుతూ ఉన్న ఎదురింటి జాస్మిన్ ను చూసి పలకరింపుగా నవ్వింది కృష్ణ. ఆ పాప సిగ్గుగా నవ్వి మళ్ళీ ఆటల్లో పడింది. “మూడేళ్ళు౦టాయేమో బొద్దుగా, రింగుల జుట్టుతో ఎంత బావుంటుందో” అనుకుంటూ మొక్కలకు నీళ్ళు పెట్టడానికి పైప్ తీసికుంది. ఈ లోగా సెల్ ఫోన్ మోగింది. 

నెంబరు చూసి “హాయ్ మధూ బయలుదేరావా?” అంది ఉత్సాహ౦గా.
“లేదురా ఇవాళ రిలీజ్ ఉంది లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చెయ్యకు.”
“అదికాదు ఇవాళ...”
“సారీ కృష్ణా, అర్జంట్ పనుంది మళ్ళీ మాట్లాడదాం.” కృష్ణను కట్ చేస్తూ ఫోన్ పెట్టేసాడు మధు. 

          పైప్ కట్టేసి మెల్లగా లోపలికి వెళ్లి సోఫాలో కూర్చుంది. మధ్యాహ్నం ఫోన్ వచ్చి౦దగ్గర్నుండీ మధు కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తోంది కృష్ణ. ఏం చెయ్యాలో తోచక టీవీ చూస్తూ, ఎన్నాళ్ళుగానో ఈ విషయం మధుతో ఎలా చెప్పాలో ఈ సాయంత్రం ఎలా గడపాలో అని వేసుకున్న ప్లాన్స్ ఇలా అప్సెట్...అవ్వడం నిరాశగా నిట్టూర్చింది. ఎలాగూ మధు రావడం లేటవుతు౦దిగా అనుకుంటూ ఫ్రిజ్ లో మిగినకూరలు, రెండు చెపాతీలు  తీసి వేడి చేసి ప్లేటులో పెట్టుకుని టేబుల్ దగ్గర కూర్చుంది. పోనీ అమ్మతో మాట్లాడితేనో, అనుకుంటూ ఫోన్ తీసికుంది.

“హలో అమ్మలూ ఏంటి౦త పొద్దున్నే ఫోన్ చేసావ్?”
“ఏం లేదు మధు ఇంకా రాలేదు... అందుకని” విషయం ఎలా చెప్పాలో తెలియక ఏదో చెప్పేసింది.
“సరే, అలాగయితే నాన్న వెళ్ళాక చెయ్. ఈ పూటసలే  పనితెమలడంలా.”
“అలాగేలే” అంటూ ఫోన్ కట్ చేసింది. ఏమీ తినాలనిపించలేదు. బెడ్రూం లోకి వెళ్లి పడుకుని పుస్తకం తెరిచింది ఏవేవో ఆలోచనలు.

                    *              *           *             *

       నిద్రలేమితో  ఎర్రబడిన కళ్ళు బలవంతంగా తెరుస్తూ టైం చూసింది కృష్ణ. “మైగాడ్ అప్పుడే ఎనిమిదయ్యిందా” అనుకుంటూ లేచింది కృష్ణ. మధు పక్కనే గాఢనిద్రలో ఉన్నాడు. అలసిపోయి నిద్రపోతున్న మధు మొహం పసిపిల్లాడిలా కనిపించింది. మెల్లగా చప్పుడు చేయకుండా రెస్ట్ రూమ్ కి వెళ్లి మొహం కడుక్కుని,  సీరియల్ బౌల్ లో పెట్టుకుని ఈవేళ ‘వర్క్ ఫ్రం హోం’ తీసికోవాలనుకుంటూ మెయిల్  ఓపెన్ చేసింది. ఆఫీసులో ఏదో ప్రాబ్లం తప్పనిసరగా వెళ్ళాలని మెయిల్. 'అన్నీ ఒక్కసారే వస్తాయనుకుంటూ' మధు కోసం కొంచం నూడుల్స్ చేసి అతన్ని లేపకు౦డానే ఆఫీసుకి బయలుదేరింది. 

మధ్యాహ్నమవుతు౦డగా మధు ఫోన్ చేసాడు.
“గుడ్ మార్నింగ్ మధూ”
“నన్ను లేపకు౦డానే ఆఫీసుకి వెళ్లిపోయావేం?”
“పాపం రాత్రంతా వర్క్ చేసి వుంటావ్ కదా! ఎందుకులే అని, నువ్వివాళ ఆఫీసుకెళ్ళాలా?”
“ఇంకో గంటలో ఫ్లైట్ ఉంది. డెన్వర్ వెళ్ళాలిగా మరచిపోయావా?”
“అస్సలు గుర్తే లేదు. నువ్వెళ్ళాల్సిందేనా తప్పదా?” దిగులుగా అడిగింది.
“నువ్వలా అంటే నేనసలు వెళ్ళలేను బేబీ. ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ తప్పకు౦డా వెళ్లి తీరాలి ఎంత త్రీ డేస్ లో వచ్చేస్తాగా.”
“ఓకే మరి, నా మీటింగ్ కి టైం అవుతోంది ఫ్లైట్ ల్యాండ్ అవగానే ఫోన్ చేయి.”
“బై బాబీ, ఐ లవ్ యు.”
“బై”

                                *                *             *             * 

        ఆఫీసు లో పని అయ్యేప్పటికి రాత్రయింది.  ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి కాఫీ తాగి ఈ విషయం ముందుగా అమ్మకు చెప్పాలనుకుంటూ ఫోన్ చేసింది.

“ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నా, నిన్న మళ్ళీ ఫోన్ చెయ్యలేదేం?”
“పడుకు౦డి పోయానమ్మా. ఏంటి కబుర్లు?”
“ఎప్పుడూ ఉండేవే. నిన్న మీ పెద్దమ్మఏం చేసిందో తెలుసా?" అంటూ ఇంట్లో ఏదో గొడవ గురించి చెప్పుకుపోతూ ఉంది. ఆ ప్రవాహం ఓ అరగంటక్కానీ ఆగలేదు.
అంతా అయ్యాక కృష్ణకి ఇ౦కేమీ చెప్పాలనిపించలేదు “నువ్వవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. సరే అమ్మా నిద్రొస్తుంది, మళ్ళీ మాట్లాడదా౦!” అంటూ ఫోన్ కట్ చేసింది.
ఉదయం నుండి పొంచి ఉన్న ఒంటరితనం మెల్లగా పక్కకు చేరింది. దాన్ని తరిమేయడానికి ఏవో టీవీ ప్రోగ్రామ్స్ తో కాలక్షేపం చేసి ఆ రాత్రిని దాటించింది.

                                 *           *            *            *
         సాయంత్రం ఇంటి దగ్గరకు రాగానే మధు కార్ చూసి మూడు రోజులుగా దాచుకున్న ఉత్సాహం నిలువెల్లా ఆవరించగా ఒక్క ఉదుటన లోపలికి వచ్చింది. మధు విశ్రాంతిగా సోఫాలో  కూర్చుని లాప్ టాప్ లో ఏవో బ్రౌజ్ చేస్తున్నాడు. 

“అదేంటి అప్పుడే వచ్చేశావ్? రేపు కదా నీ ఫ్లైట్?  అంటూ పక్కన కూర్చుంది.
“నువ్వు వెళ్ళాలా? అని దిగులుగా అడిగావుగా, అందుకే త్వరగా వచ్చేసాను” అన్నాడు దగ్గరకు తీసుకుంటూ.
“నీ కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా” అంది మధు గుండెల్లో ఒదిగిపోతూ.
ఈ లోగా ఫోన్ మోగింది. మధు ఫోన్ తీసుకుంటూ నంబర్ చూసాడు. “అన్నయ్య ఫోన్.. నువ్వు త్వరగా ఫ్రెష్ అయిరా డిన్నర్ కి బయటకెళదాం.” అన్నాడు మధు.
“జస్ట్ ఫైవ్ మినిట్స్” హుషారుగా బెడ్ రూంలో దూరింది మధు.
రెడీ  అయి తనకిష్టమైన  'ఎస్టీలాడర్' స్ప్రే  చేసికు౦టు౦డగా కంగారుగా మధు గొంతు వినిపించింది.

“డాక్టర్ గారు ఏమన్నారు?”
******
“కంగారేమీ లేదుగా?”
******
“అమ్మెలా ఉంది?”
******
“మేము వెంటనే వచ్చేస్తాము.”
*****
“అలాగే ఓ గంట తరువాత ఫోన్ చేస్తాను.”

విషయం అర్ధం గాక అయోమయంగా చూస్తూ  “ఏమిటి అత్తయ్యగారికి ఏ౦ అయింది?” అడిగింది కృష్ణ.
“అమ్మకి కాదు నాన్నకి రాత్రి ‘స్ట్రోక్’ వచ్చిందంట డాక్టర్ స్టంట్ వెయ్యాల౦టున్నారట. ఇప్పుడు నాన్న ‘ఐసియు’ లో ఉన్నారట.”
“మరి వెంటనే టికెట్స్ చూడు,  నీకు ఆఫీసులో లీవ్ దొరుకుతుందా?”
“లేదు ఇండియా నుండి వర్క్ చెయ్యొచ్చు.” అంటూ టికెట్స్ చూడడం మొదలుపెట్టాడు.
“ఇప్పుడేమన్నా సర్జరీ చెయ్యాలట్నా? అడిగింది కృష్ణ.
 “అక్కర్లేదట అంత ప్రమాదం ఏమీ లేదన్నారట అన్నాడు మధు”
“మధూ మన గ్రీన్ కార్డు ఇప్పుడు స్టేజి ౩ లో వుంది కదా. మనం ఇప్పుడు వెళ్ళాలంటే అడ్వాన్స్ పెరోల్  తీసికోవాలేమో? సందేహం వెలిబుచ్చింది కృష్ణ.
ఒక్కసారిగా నిస్త్రారణ ఆవహి౦చింది, లాప్ టాప్ మూసి పక్కన పెడుతూ, “నాకా విషయమే గుర్తు రాలేదు. ఇప్పుడెలా? తనలో తాననుకున్నట్లు మెల్లగా అన్నాడు మధు.
“డాక్టర్ గారు ఫరవాలేదన్నారుగా.  పైగా మూడు నెల్ల క్రితం మా మామయ్యక్కూడా  ఇలాగే బాగాలేకపోతే స్టంట్ వేశారుగా, ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. రేపుదయం పర్మిషన్ కి అప్లై చేసి వెంటనే వెళదాం. సరేనా” అనునయంగా అంది కృష్ణ.
“అలాగే ఇంక చేసేదేం ఉందీ” అని దిగులుగా కూచున్నాడు.

        మధు ఎంత వద్దన్నా కొంచెం అన్నం కలిపి బలవంతంగా తినిపించింది కృష్ణ. ఆ రాత్రంతా మధు వాళ్ళ నాన్నగారి గురించి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి కృష్ణకు చెప్తూనే ఉన్నాడు. పర్మిషన్ కు అప్లై చేస్తే ఓ వారం దాకా రాదని తెలిసింది. ఏం చెయ్యాలో తోచలేదు. అప్పటికీ మధు వాళ్ళ నాన్నగారికి స్టంట్ వెయ్యడం పూర్తయ్యింది. ఆయన మధుతో మాట్లాడి ప్రయాణాన్ని వారించాడు. ఆ తరువాత ఓ వారానికి వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చాక్కాని మధు మామూలు మనిషి కాలేకపోయాడు.

                             *           *            *            *

శనివారం పొద్దున లేస్తూనే, నాన్న ఆరోగ్యం గురించి కనుక్కుని కిచెన్ లోకి వచ్చాడు మధు.
మధు కిచెన్ టేబుల్ దగ్గర కూచుని మౌనంగా బయటకు చూస్తూ ఉంది.
“ఈ మధ్య కృష్ణ ఎందుకో డల్ గా ఉంటోంది. ఏమై ఉంటుంది?” అనుకుంటూ, “బయటకు వెళ్లి చాలా రోజులై౦ది కృష్ణా, ఎక్కడికైనా వెళదామా?” అడిగాడు మధు.
కృష్ణ లేచి ఫ్రిజ్ లో మిల్క్ కాన్ బయటకు తీస్తూ, “ఎక్కడి కెళదాం?” అంది.
‘స్మోకీస్ కి వెళదాం ఫాల్ కలర్స్ చూడొచ్చు’ అన్నాడు కాఫీ పౌడర్ తీస్తూ...
అలాగే అని అర్ధం వచ్చేలా మౌనంగా తలూపింది.
కృష్ణకు సైట్ సీయింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ‘బయటకు వెళ్దాం’ అంటే ఎగిరి గంతేసేది. “ఒంట్లో బాగాలేదా?” అనడిగాడు కృష్ణ.
“బాగానే ఉంది” అంటూ కళ్ళలో తడి కనపడనీయకునా కాఫీ కలిపే నెపంతో తల వంచుకుంది.
"సరే అయితే నేను స్నాక్స్ అవీ పెడతాను" అంటూ లేచి పాంట్రి తలుపు తెరిచాడు మధు. కావలసినవి ఒక్కటొక్కటే బయటకు తీస్తున్నాడు. అప్పుడు కనిపించింది ప్రీనాటల్స్ డబ్బా, ఆశ్చర్యంగా చేతిలోకి తీసికుని, సాలోచనగా కృష్ణ వైపు చూసాడు. కృష్ణ కిటికీలోంచి సూన్యంలోకి చూస్తూ కనిపించింది. జరిగినదేమిటో మధుకు అర్ధమయ్యింది. మెల్లగా వచ్చి కృష్ణ ఎదురుగా నిలబడి దగ్గరకు తీసికున్నాడు. కృష్ణ కళ్ళలో దాచుకున్న తడి మధు ఎదను తడిపేసింది.

                                   *           *            *            *

23 comments:

  1. enduko kallaventa neellu vachaayandi
    baagaa raasaaru.

    ReplyDelete
  2. congratulations. Good story and eloquently written.

    ReplyDelete
  3. మీ కథ చాలాబాగుంది.
    ఎంతో మధురమైన క్షణాలు పంచుకోవడంలోని ఆనందాన్నిపరిస్థితులు మింగేస్తే తన నిస్సహాయతను తనలోనే దాచుకున్న వైనం మనసుని తాకింది.
    అభినందనలు..

    ReplyDelete
  4. Congratulations!
    చదివొచ్చి అభిప్రాయం చెబుతా!

    ReplyDelete
  5. కధలా లేదు.వాస్తవం అని అనిపించింది
    అంత చక్కగా రాసారు.
    ఆ అమ్మాయి పరిస్థితికి చివరికి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    చాలా రోజుల తర్వాత చాలా మంచి కధ చదివాను.
    మీకు అభినందనలు.

    ReplyDelete
  6. ఎంత చక్కగా రాసారండీ.....
    కొన్ని సంతోష క్షణాలని ఆత్మీయులైన వారితో పంచుకోలేకపొతే ఉండే బాధను చాలా బాగా వివరించారు....

    ReplyDelete
  7. @ శ్రీకాంత్ గారూ ధన్యవాదాలు.

    @ అజ్ఞాత గారూ మీ పేరు చెపితే బావుండేదండీ. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    @ బాబాయి గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  8. @ శ్రీ లలిత గారూ మీకు నచ్చిందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    @ సౌమ్య గారూ మళ్ళీ వచ్చి తప్పకుండా చదవండి మరి. ధన్యవాదాలు.

    ReplyDelete
  9. అభినందనలు జ్యోతిర్మయి గారూ.. కధబాగుంది..

    ReplyDelete
  10. ఇంకా వ్రాస్తూ ఉండండి...కధలు ఇష్టపడే వాళ్ళం ఉన్నాం...చాలా బాగుంది...

    ReplyDelete
  11. @ వేణు శ్రీకాంత్ గారూ మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    @ ఆజ్ఞాత గారూ మీ పేరు చెపితే బావుండేది. కథలు వ్రాయలనే నా కోరిక కూడానూ, తప్పకుండా ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  12. !! జ్యోతిర్మయి !! గారూ అభినందనలు.. కధబాగుంది..ఎక్కడనో టచ్ చేశారు అండి..

    ReplyDelete
  13. చక్కగా వ్రాసారు. అభినందనలు. ఇంకా వ్రాయండి.

    ReplyDelete
  14. @ జ్యోతిర్మయి గారూ..
    Sweet story! :)
    అబ్బ.. మీకు నేనంటే ఎంత ప్రేమో కదా.. నా పేరే పెట్టారుగా మీ మొదటి కథకి.. just kidding! :)))
    మీరిలాగే మరిన్ని మంచి కథలు రాయాలని కోరుకుంటున్నా.. అభినందనలు.

    ReplyDelete
  15. అభినందనలు. మీ కధ చాలా బాగుంది.

    ReplyDelete
  16. మీ కథ చాలాబాగుంది.
    Congratulations జ్యోతిర్మయి గారూ..

    ReplyDelete
  17. @ తెలుగు పాటలు గారు మీకు కథ నచ్చిందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    @ శైలజ గారూ ఏదో భారమైన కథ వ్రాయాలని మొదలు పెట్టాను. పూర్తయ్యేసరికి చూస్తే ఇదీ కథ. నా కలం నా మాటవినే వరకూ వ్రాయాలని ఉందండీ. తోడుగా మీ ప్రోత్సాహం కూడా ఉందిగా. చూద్దాం ఈసారి ఏం కథ వస్తుందో..ధన్యవాదాలు.

    ReplyDelete
  18. @ మధురవాణి గారూ ఎన్నాళ్ళకు అర్ధం చేసుకున్నారండీ..కథ పేరేంటి కథలో పేర్లూ కూడా మీవే....మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు.

    @ సుబ్రహ్మణ్యం గారూ కథ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    @ రాజి గారూ మీరిస్తున్న ప్రోత్సాహమేనండీ ఇది. ధన్యవాదాలు.

    ReplyDelete
  19. జ్యోతిర్మయీ గారు,

    కథ కౌముది అంత బాగుంది.

    కొన్ని వాక్యాలు చాలా బాగున్నాయి.

    అవి కాపీ చేసి కోట్ చేద్దామను కుంటే, మీరూ 'కాపీ' లెఫ్ట్ అనేసారు!!

    అందరూ ఇలా తాళాలు వేసేస్తే, జిలేబీ కి మేటరు ఎలా దొరుకును చెప్మా బుజ్జి పండు కథలు కొనసాగించ డానికి!!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  20. జిలేబిగారూ మీరు కాపీ కొట్టడం ఏంట౦డీ.. ఏది తలచుకుంటే అది అలవోకగా అలా ఒలికించే సామర్ధ్యం ఉన్నవాళ్ళు. చందమామలా నిండు మనసున్నవారు చదివితే కథ కౌముదే అవుతుంది మరి. ధన్యవాదాలు.

    ReplyDelete
  21. అభినందనలు జ్యోతిర్మయి గారూ.. మీ కథ ఇప్పుడే చదివాను... బాగుంది.

    ReplyDelete
  22. సురేష్ గారూ స్వాగతం...కథ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.