Sunday, February 12, 2012

మీ ప్రేమ పరిభాష ఏమిటి?

       “ఏమిటీ...ప్రేమకు భాషా?” సందేహంగా ఉంది కదూ! ఉంటుందనే చెప్తున్నారు డా. గేరి చాప్మన్. ఈ ప్రేమ భాష గురించి వారు వ్రాసిన పుస్తకం “ఫైవ్ లవ్ లా౦గ్వేజస్". ప్రశంస, కబుర్లు, పనిలో పాలుపంచుకోవడం, బహుమతులు, స్పర్శ ఇలా ఐదు భాషల ద్వారా ప్రేమను వ్యక్తం చెయ్యొచ్చ౦టున్నారు ఆ రచయిత.

         ఓ ఇల్లాలు కోపంగా ఉన్నారు. “పాపం ఇంట్లో పని ఎక్కువై౦దేమో! సహాయం చేద్దామని” ఆ ఇంటాయన తనవంతుగా కూరలు తరిగేస్తున్నారు,
అన్నం వార్చేస్తున్నారు. ఇంటా బయటా తనే అయి పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. మార్పేమీ లేకపోగా చిర్రుబుర్రులు మరింత ఎక్కువయ్యాయి. సరదాగా సినిమాకి వెళదామన్నారు. కాంతామణికి చిరాకు తగ్గనే లేదు. “నేనింత సహాయం చేస్తున్నా పట్టించుకోవడంలేదని’ ఆ కాంతునకు కూడా కోపం వచ్చేసింది. తరచి చూడగా తెలిసి౦దేమిటంటే ఆ ఇంతికి తన పెనిమిటి సమక్షమే స్వర్గమట. సినిమాలు, టివీల అంతరాయం లేకుండా రోజూ కాసింత సేపు చక్కగా కబుర్లు చెప్పుకుంటే చాలట. ఇక అప్పట్నుంచీ ఆ ఆర్యుడు రోజులో కొంత సమయం తన అర్ధాంగి కోసమే కేటాయించారు. ఆ ఆలుమగల జీవితం న౦దనవనం.


The 5 Love Languages: The Secret to Love That Lasts [Book]ఓ శ్రీమతి పరాకుగా ఉంటున్నారు, తెగ చిరాకు పడిపోతున్నారు. వంటి౦ట్లో గిన్నెలన్నీ కొత్త శబ్దాలు చేస్తున్నాయ్. శ్రీవారు బాగా అలోచించి ఉప్పాడ చీర పట్టుకొచ్చారు, సినిమాకి షికారుకి తీసుకెళ్ళారు. వంటిట్లో గిన్నెలతో పాటు పెరట్లో వస్తువులూ చప్పుడు చేయడం మొదలుపెట్టాయి. రోజులు గడిచేకొద్దీ అమ్మగారి విసుర్లు అయ్యగారి కసుర్లు ఎక్కువవుతున్నాయి. చల్లని సంసారంలో మంటలు రేగాయి. ‘ఎలా ఆర్పాలా’ అని అరా తీస్తే తెలిసి౦దేమంటే, ఆ శ్రీమతి తన బాధ వెళ్ళబోసుకునే సమయాన సదరు శ్రీవారు సలహాలు గట్రాలు ఇవ్వక “అవునా”, “అయ్యో”, “నిజమే సుమా”లతో సరిపెట్టేస్తే చాలునట పట్టుచీరలూ, వెండిమెట్టెలు లాంటి బహుమతులేమీ అఖ్ఖరలేదట. కథ సుఖాంతం.

        పై ఇద్దరి కథలూ విన్న ఓ పతిదేముడు తన సతీమణి కోపంగా, చిరాకుగా ఉన్న సమయంలో స్నేహితుల సలహాలు పాటించారు. ఏమైందటారా? హ హ..పనిచేయలేదు. ఆ మగనికి ఏం చెయ్యాలో తోచలేదు. తల పట్టుక్కూర్చున్నారు, 'కారణమేమయివుంటుందా?' అని ఆలోచనలతో సతమమైపోయారు. ఎన్నో అష్టకష్టాలకోర్చి తెలుసుకున్నదేమంటే, సదరు సతీమణికి బహుమతులంటే అంటే ఇష్టమట. అది తెలిసిన పతిదేముడు సతీమణి కోసం అప్పుడప్పుడు ఓ మిఠాయి పొట్లం, ఓ మూర పువ్వులు, ఓ పుస్తకం... తీసుకురావడం మొదలు పెట్టాడు. ఇక తరువాతేముందీ వారి జీవింతం ముళ్ళదారి వదిలి పువ్వులనావలో సాగింది.

         ఓ తండ్రి ఇంటికి రావడమే టివి చూస్తున్నాడని కొడుకు మీద ఎగిరిపడ్డాడు. “ఇప్పటివరకూ చదువుకున్నాడు ఇప్పుడే చూస్తున్నాడని” శ్రీమతి చెప్పబోయినా చాల్లే “నీ వల్లే చేడిపోతున్నాడని” శ్రీమతినీ విసుక్కున్నాడు. మొహం ముడుచుకుని పిల్లాడు గదిలోకి, శ్రీమతి పెరట్లోకి వెళ్లారు. ఈ మధ్య ప్రతి రోజూ జరిగే ఇలాంటి విసుర్లకు అర్ధం తెలియక ఆ శ్రీమతి తల్లడిల్లిపోతూంది. ఆ శ్రీవారికి కావలసిందేమిటి? ఎందుకలా కోపంగా ఉంటున్నారు?
         
         ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఓ సంవత్సరం తిరిగేసరికి “అసలు నీలాంటి వాణ్ని చేసుకున్నాను నాకు బుద్దిలేద”ని ఆవిడంటే, “ఆ లేదన్న విషయం ఇప్పటి వరకూ దాస్తావా” అని అతను. ‘ఛీ’ అంటే ‘ఛీఛీ’ అని ‘ఛా’ అంటే ‘ఛాఛా’ అని అనుకున్నారు. వారిద్దరిమధ్య తేడా ఎక్కడొచ్చింది?

        ఈ ప్రేమ భాష భార్యాభర్తలకో, ప్రేమికులకో పరిమితం కాదండోయ్! పిల్లలకు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. పిల్లలు మన మాట వినట్లేదని బాధపడిపోతూ ఉంటాం. అసలు మనం వాళ్ళ భాషలో చెప్తున్నామా? వాళ్లకు కావలసిన ఆసరా మనమిస్తున్నామా?

       ఒకరికి ఒక భాషే ఉంటుందా, ఉంటే తరచు అది మారుతుందా? భార్యా భర్తలిద్దరిదీ ఒకటే భాష అయితే సమస్య ఉండే అవకాశం ఉందా? ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి? మన ప్రేమభాష తెలుసుకోవడం ఎలా? ఇలా అనేక విషయాల మీద ఈ పుస్తకంలో చక్కని విశ్లేషణ ఉంది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం “ఫైవ్ లవ్ లాంగ్వేజస్”.




14 comments:

  1. ఆసక్తికరంగా ఉందండీ..

    ReplyDelete
  2. హృదయాల భాషకి లిపి, పలుకు లేదు తల్లీ!!! అది నేర్చుకోగలిగితే, మనసు ఒకరిదొకరు తెలుసుకోగలిగితే, మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ.....

    ReplyDelete
  3. బాగుంది....పుస్తక పరిచయం!

    ReplyDelete
  4. @ వనజ గారూ audible.com లో పుస్తకము డౌన్ లోడ్ చేసుకుని వినొచ్చు, అయితే అందులో సభ్యత్వము తీసుకోవాల్సి ఉంటుంది. amazon.com లో పుస్తకము దొరుకుతుదండీ..ధన్యవాదాలు.

    @ వేణుగారూ పుస్తకము చదివేప్పుడు 'మనం ఇలా ఆలోచించలేదు నిజమే కదా' అనిపిస్తుందండీ...మీకు వీలయితే చదివి మీ అభిప్రాయం చెప్పండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. @ బాబాయి గారూ పుస్తకము చదవకముందు నాదీ మీ అభిప్రాయమే..కానీ చదివాక చాలా మార్పు వచ్చిందండీ. అసంతృప్తికి కారణం కావలసినది దొరకకపోవడం, ఆ కావలసినదేమిటో తెలుసుకోగలిగితే పరిష్కారం అలోచి౦చవచ్చనే సిద్ధాంతం మీద వ్రాసిన పుస్తకం ఇది. ధన్యవాదాలు.

    @ పద్మార్పిత గారూ మా బుక్ క్లబ్ సభ్యులందరికీ నచ్చిన పుస్తకం ఇది. మనవాళ్ళు చదివితే బావుంటుందనిపించి నేను పరిచయం చేశాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారండీ..
    బాగుంది!

    ReplyDelete
  7. పాంచాలీ
    పంచ భర్తృక!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. జ్యోతి !
    ప్రేమ పరిభాష కొత్త కోణంలో చదివాను. ఎంతో సరదాగా విజ్ఞాన దాయకంగా ఉంది.
    ఇలాటి విషయాలు, పరిజ్ఞానం, నేటి యువతరానికి ఇక్కడ- ముఖ్యంగా ఇండియాలో అవసరం అనిపిస్తోంది
    అన్యోన్య దాంపత్యం కనుమరుగై విడాకులు పెరిగిపోతున్న తరుణంలో, ఇలాంటి రచనలు ఎంతో అవసరం
    మంచి రచన అందించినందుకు అభినందనలు .

    ReplyDelete
  9. @ రాజీ గారూ ధన్యవాదాలండీ..

    @ జిలేబిగారూ :):) ధన్యవాదాలు.

    @ మాధవిగారూ ధన్యవాదాలు.

    @ నాన్నా నేను చెప్పకుండా వదిలివేసింది నువ్వు పూర్తి చేశావు. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. తెలుసుకోవాల్సిన విషయాలే సుమా! బాగా చెప్పారు.

    ReplyDelete
  11. చక్కగా రాసారు జ్యోతి గారూ! పుస్తక పరిచయం ఇలా కూడా చెయ్యవచ్చని తెలిసింది!

    ReplyDelete
  12. @ జయ గారూ ధన్యవాదాలు.

    @ నాగలక్ష్మి గారూ స్వాగతం. మీ లాంటి రచయిత్రి మెచ్చుకోవడం...మీ వ్యాఖ్య చూసి౦దగ్గర్నుంచీ మేఘాల్లో తేలిపోతున్నాను. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.