యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్(Mighty Five National Parks) లో బ్రైస్ కెన్యన్ నేషనల్ పార్క్ (Bryce Canyon National Park) ఒకటి.
జ్సయాన్ నేషనల్ పార్క్ నుండి బ్రైస్ కెన్యన్ నేషనల్ పార్క్ కు
వెళ్ళడానికి దాదాపుగా రెండు గంటలు పట్టింది. ముందుగా విజిటర్ సెంటర్ దగ్గర స్టాంప్ వేసికుని
అక్కడి నుండి పార్క్ దగ్గరకు వెళ్ళాము. పార్కింగ్ లాట్ నుండి నాలుగడుగులు వెయ్యగానే ఎత్తుగా పాండురోజా(Ponderosa Trees) చెట్లు. వాటి మధ్యగా నడుస్తూ వెళితే అంత దూరాన
పెద్ద లోయ కనిపించింది. దగ్గరగా వెళ్ళి చూస్తే ఒక అద్భుతమే!
పాండురోజా చెట్లు సవ్వడి చెట్లూ గాలి పాట పడుతున్నాయి. ఆ పాటను ఆస్వాదించడానికి పగడపు
తొడుగు వేసుకుని తరలి వచ్చినట్లుగా ఉంది లోయ.
బ్రైస్ కెన్యన్ లో సన్నగా పొడవుగా విగ్రహాలు నిలబడినట్లు ఉన్న ఆ రాళ్ళను ‘హుడూస్’ అంటారు. గాలి, నీరు, మంచు వలన రాళ్ళు అంత అందంగా తయారవుతాయా అని ఆశ్చర్యపోయాం. ఆ పార్క్ లో ఎన్నో హైకింగ్ ట్రెయిల్స్ ఉన్నాయి. మేము వెళ్ళాము. సమ్మోహనమైన ఆ లోయ అందాలు చూస్తూ క్వీన్స్/నవాహో కాంబినేషన్ లూప్ (Queen’s/Navajo Combination Loop) ట్రైయిల్ వెంబడి నడవడం ఎంతో బావుంది.
ఆ దారి లోయ చుట్టూ తిప్పి కింద వరకూ తీసికెళ్ళిపోయింది. తిరిగి పైకి ఎక్కడానికి కొండల మధ్యగా కట్టిన మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. ఆ కొండలు పెద్ద గోడలాగా ఉండడంతో దాన్ని వాల్ స్ట్రీట్ అంటారు. ఆ మెట్లు ఎక్కడం మాత్రం కొద్దిగా కష్టమే అయింది.
చివరగా ‘ఇన్స్పిరేషన్ పాయింట్’ కు కూడా వెళ్ళి ఆ లోయ అందాలు మరోసారి చూసి అక్కడి నుండి క్యాపిటల్ రీఫ్ (Capitol Reef) కు బయలుదేరాము.