Sunday, November 2, 2025

క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్ (Capitol Reef National Park)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్(Mighty Five National Parks)లో క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్ (Capitol Reef National Park) కూడా ఒకటి.

బ్రైస్ కెన్యన్ నుండి క్యాపిటల్ రీఫ్ కు వెళ్ళడానికి సీనిక్ రౌట్ తీసుకున్నాము. బయలుదేరిన కాసేపటికే చీకటి పడింది కానీ, పౌర్ణమి ముందు రోజులవడంతో మసక వెన్నెల్లో కొండల మధ్య ప్రయాణం అద్బుతంగా ఉంది. 

ఆ రోజు రాత్రికి క్యాపిటల్ రీఫ్ రిసార్ట్(Capitol Reef Resort) కు చేరుకున్నాము. రిసార్ట్ మరీ ఫ్యాన్సీగా లేదుకానీ పయనీర్ డెకరేషన్ తో అదొక అందంగా ఉంది. ఉదయాన్నే కర్టెన్ తెరిచి చూస్తే తోలివెలుగులో మెరిసి పోతున్న ఎఱ్ఱని కొండలు, విశాలమైన ఆకాశం. చిరు చలిగా ఉన్నా రిసార్ట్ అందాలు చూడాలని జాకెట్స్ వేసుకుని ఉత్సాహంగా బయటకు వెళ్ళాము. రిసార్ట్ లో రూమ్స్ తో  పాటు టీపీ, వేగన్ లలో ఉండే సౌకర్యం కూడా ఉంది. చుట్టు పక్కల ఏవో కొన్ని హోటల్స్, రెస్టరెంట్స్ ఉన్నాయి తప్ప అక్కడ ఊరేమీ లేదు. 

 

ఆ రిసార్ట్ లోని రెస్టరెంట్ ‘ది పయోనీర్ కిచెన్’ (The Pioneer Kitchen) లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడకు దగ్గరలోనే ఉన్న “పానొరమ పాయింట్ (Panorama Point)”, గూస్ నెక్ ఓవర్ వ్యూ పాయింట్స్ (Gooseneck Over viewpoint) దగ్గరకు వెళ్ళాము. పానొరమ పాయింట్ దగ్గర నుండి చూస్తే చుట్టూ ఏ అడ్డంకి లేకుండా ఎంతో దూరం వరకు విశాలంగా కొండలు. 

గూస్ నెక్ ఓవర్ వ్యూ పాయింట్ దగ్గర ఎన్నో అడుగుల కింద సల్ఫర్ క్రీక్(Sulfur Creek) కొండ చుట్టూ తిరుగుతూ గూస్ నెక్ ఆకారంలో ప్రవహిస్తూ ఉంది. ఆ క్రీక్ లో నీళ్ళు సల్ఫర్ వాసనలు వస్తాయట అందువలనే దానికి ఆ పేరు పెట్టారు. 

నేషనల్ పార్క్స్ లో చెట్లు, కొండలు, లోయలే అనుకున్నాను కానీ వాటికి ముడిపడి కొన్ని జీవితాలు ఉంటాయని క్యాపిటల్ రీఫ్ కు వెళ్ళాక తెలుసుకున్నాను. వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఆప్రాంతంలో ఫ్రీమాంట్ ఆది వాసులు ఉన్నట్లు గుర్తుగా అక్కడ రాళ్ళ మీద చెక్కిన బొమ్మలు ఉన్నాయి. రాళ్ళ మీద కొంత భాగం ఊడిపోయి ఉంది. వాటి మీద ఏం చెక్కారో, వాటి ద్వారా ఏమి చెప్పాలనుకున్నారో.

 

అక్కడి నుండి ‘హిక్మన్ బ్రిడ్జ్(Hickman bridge)’ చూడడానికి బయలుదేరాం. అంతా కొండ దారి కొంచెం పైకి వెళ్ళాక కిందకు చూస్తే పచ్చని చెట్లు, మధ్యలో పారుతున్న ఫ్రీమాంట్ నది, చుట్టూ ఎరుపు, తెలుపు రంగులలో ఎత్తైన కొండలు మిగిలిన పార్క్స్ కంటే భిన్నంగా ఉంది క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్. ఆ ఉదయం మబ్బేసి వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో కొండలు ఎక్కుడానికి ఎక్కువ ఇబ్బందిఅనిపించలేదు.
    

పంతొమ్మిదవ శతాబ్దంలో మోర్మన్స్(Mormons) పది కుటుంబాల వారు ఎక్కడి నుండో వచ్చి ఆ ఏడారిని సాగు చేసుకుని సారవంతమైన భూమిగా మార్చి పండ్ల  చెట్లను నాటి జీవనోధారం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఫ్రూటా(Fruita) అంటారు. ప్రస్తుతం ఫ్రూటా లో రెండు వేల కు పైగా పండ్ల చెట్లున్నాయి. గ్రిఫర్డ్ హౌస్ లో ఆ పండ్లతో చేసిన ఆపిల్, పీచ్ పై (pie) లను అమ్ముతారు. సీజన్ లో వెళితే ఆ పండ్లను రుచి చూడచ్చు కూడా.అప్పట్లో కట్టుకున్న గ్రిఫర్డ్ (Gifford Homestead), బెహునిన్ (Behunin) ఇళ్ళు, ఫామ్, వాళ్ళ చిన్న స్కూల్ ను అక్కడ ఇంకా ఉన్నాయి. వారి గురించి తెలుసుకున్నప్పుడు లోరా ఇంగిల్స్ వైల్డర్(Laura Ingalls Wilder) రాసిన లిటిల్ హౌస్ ఆన్ ది ప్రెయిరీ(Little House on the Prairie) గుర్తొచ్చింది.

అక్కడ నుండి గ్రాండ్ వాష్(Grand Wash)కు వెళ్ళాము. అక్కడ హైక్ చేస్తే బావుంటుంది కానీ అప్పటికే మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండడంతో కొంత దూరం వెళ్ళి తిరిగి వెనక్కు వచ్చేశాము. 

ఇప్పటి వరకు చూసిన నాలుగు పార్క్ లు దేనికదే బిన్నంగా ఉన్నాయి. క్యాపిటల్ రీఫ్ లో ఆదివాసులు జీవనం గురించి పెద్దగా తెలియదు కానీ, ఎన్నో కష్టాల కోర్చి జీవనం సాగించిన మోర్మన్స్ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం క్యాపిటల్ రీఫ్ మీద ప్రత్యేకమైన అభిమానం కలిగింది.

ఈ ప్రయాణం లోని తరువాత భాగం చదవలనుకుంటే ఇక్కడకు వెళ్ళండి. 

1 comment:

  1. What a lovely and detailed narration Jyothi, feels like we’re also travelling with your family, keep going and thanks for sharing 💐💕

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.