Monday, March 12, 2012

చూసిచూడనట్టు పోవాలి

"సినిమాకి వెళదాం వస్తావా?"
"ఎందుకో?"
"ఎందుకేమిటి సరదాగా ఎ౦టర్టైన్ మెంటూ..."
"సరే పద...".
"థూ..యాక్..అది సినిమానా. ఆ బూతులూ..సగం సగం వేసే ఆ అమ్మాయిల బట్టలూ..."
"వాళ్ళ బట్టలూ వాళ్ళిష్టం."
"ఆ నరకడాలు ..కొట్టడాలు.."
"అదే మరి హీరోఇజం.."
"రెండర్ధాల మాటలూ, పాటలూ.."
"రాసేవాళ్ళకూ, చేసే వాళ్ళకూ లేని ఇబ్బంది మనకెందుకు!"
"కాని అది లక్షల మంది చూసే సినిమా కదా..విజ్ఞులూ ప్రాజ్ఞులూ ఉంటారుగా..." 
"చూడ్డం ఇష్టంలేని వాళ్ళు  సినిమాల కెళ్లడం మానేస్తారు.."
"చౌకబారు సినిమాలకూ, సాహిత్యానికీ పెద్దపీట వేసి..మనం అభివృద్ధి ఏవైపు సాగిస్తున్నాం?"
"చూసిచూడనట్టు పోవాలి...అన్నీ పట్టించుకోకూడదు."

"ఎలక్షన్లలో అతనెలా గెలిచాడు?"
"మనిషెవరైతేనేం కులం ప్రధానం."
"కులానికి అంతటి ప్రాధాన్యతనివ్వాలా..."
"కులానికి నాయకులేంటి సామాన్యులేంటి పసిపిల్లల దగ్గరనుండీ పెద్దవాళ్ళ దాకా అందరూ దాసులే"
"అయితే మాత్రం..దేశాన్ని పాలించవలసిన నాయకులు..కులాల కుమ్ములాటలో..."
"చూసిచూడనట్టు పోవాలి..అన్నీ పట్టించుకోకూడదు."

"పెళ్లి బాగా జరిగింది కదూ.."
"విందులో మిగిలిన వంటలతో మన ఊరికి ఓ వారం భోజనం పెట్టొచ్చు.."
"ఉన్నవాళ్ళ పెళ్ళిళ్ళు మరీ...పెళ్లి చీర పది లక్షలూ, పెళ్లి కూతురి నగలు మూడు కోట్లూనట. పెళ్ళికి పెద్దపెద్దవాళ్ళు వచ్చారు చూశావా.."
"అతనేదో కాంట్రాక్టరు అనుకుంటానే.."
"ఆ..పోయినేడాది 'మాదారం' బ్రిడ్జి కట్టించాడు."
"ఆర్నెల్ల క్రితం బ్రిడ్జి కూలి ఎనభై మంది చచ్చిపోయారనుకుంటాను.."
"చూసిచూడనట్టు పోవాలి..అన్నీ పట్టించుకోకూడదు."

"గిరిజ మంచి పిల్ల. పాపం సీత ఎలా తట్టుకుంటుందో..ఎంతైనా తల్లి మనస్సు.."
"ఏమైంది?"
"వాడెవడో ప్రేమించమన్నాట్ట. ఈ పిల్లేమో నాకు చదువే ముఖ్యమన్నదట."
"దానికి బాధె౦దుకూ?"
"పూర్తిగా వినూ..వాడికి ఒళ్ళు మండి మొహం మీద ఆసిడ్ పోశాడట." 
"అయ్యో అయ్యో...వాడికి అమ్మా నాన్నా ఉన్నారా?"
"అలా ఆవేశపడిపోకు. వాళ్ళ గురించి మనకెందుకు? మన ప్రదీపు అలా లేడుగా.."
"అయితే?' 
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."

"సాగర్ ని రాత్రి పోలీసులు పట్టుకున్నారట."
"ఎందుకు?"
"స్నేహితులతో కలసి క్లబ్బుకెళ్ళి వస్తుంటే.."
"అదేం తప్పు కాదుగా"
"చెప్పనీ..దారిలో ఒక బిచ్చగాణ్ణి గుద్దేశార్ట."
"రోడ్డుకడ్డంగా వచ్చుంటాడు..చీకట్లో కనిపించలేదేమో.."
"అదేం కాదట..బాగా తాగేసున్నార్ట..పేవ్మెంట్ మీదకు బండి ఎక్కించేసార్ట."
"అయ్యో ఈ తాగుడలవాటు ఎక్కడిది వీళ్ళకు?"
"చిన్నప్పట్నుంచీ నాన్ననూ, మామయ్యలనూ చూడట్లా.."
"అయ్యో మంచి పిల్లలు ఎలా పాడయిపోయారు.."
"ఆ సావిత్రి ఇప్పుడు పిల్లల కోసం కూడా ఏడవాలి."
"అసలా మద్యం అమ్మడమెందుకూ?"
"సర్కారుకి డబ్బులెలా వస్తాయి మరి.."
"జీవితాలు నాశనమయ్యాక డబ్బెవరికోసం.."
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."

"ఆ గీతింట్లో విజయ్ మకాం పెట్టాడట..."
"అదేం పనీ..ఇంట్లో దేవతలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని.."
"తెల్లారి ఇంటికి వస్తున్నాట్టలే.."
"ఛీ..ఛీ సుగుణెలా రానిస్తోంది" 
"ఏం చేస్తుంది పాప౦?"
"తన్ని తరిమెయ్యొద్దూ."
"అవన్నీ పట్టించుకోకూడదు నెలకు ఇంట్లోక్కావలసిన డబ్బిస్తున్నాడుగా"
"ఇస్తే?" 
"పెళ్ళానికి తెలియకుండా వెధవ తిరుగుళ్ళు తిరిగే వాళ్లె౦తమంది లేరు?"
"ఉంటే?" 
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."

"ఏవీ పట్టించుకోకుండా..ఎలా ఉండను?
పిల్లలు ఆ సినిమాలే చూస్తున్నారు..
ఆ దేశంలోనే మనమందరమూ ఉంటున్నా౦.
ఆ బ్రిడ్జిల మీద రోజూ వందల కొద్దీ వాహనాలు తిరుగుతున్నాయి. 
పిల్లలంతా అలాంటి కాలేజీల్లోనే చదువుతున్నారు.
గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ సీసాల మత్తులో జరిగిపోతున్నాయి.
మంచేదో తెలియని పెద్దల మధ్య పసిపిల్లలు పెరుగుతున్నారు."

"చూసి చూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు.."
"ఎలా?"
"లేచామా..తిన్నామా..పడుకున్నామా.."
"అంతేనా..."
"కావాలంటే చందామామ, వెన్నెల అంటూ కవితలు వ్రాసుకో.."
"నన్నవమానిస్తున్నావ్.."
"తెలుగు భాష, నీతులు అంటూ పిల్లలకు నూరిపొయ్యి." 
"దిస్ ఈజ్ టూ మచ్.."
"చూసిచూడనట్టు పోవాలి అది మనకలవాటేగా!"




28 comments:

  1. మన దౌర్భాగ్యం ఇలాగే ఉంది. పెద్దల జీవన విధానమే..పిల్లలకి మార్గదర్శకత్వం అయి కూర్చుంటే.. చూసి చూడనట్లు పోవడమే! కాస్త మంచి చెప్పడానికి ప్రయత్నించితే..కాకమ్మ కబుర్లు,తోచి తోయనమ్మ తోడికోడలు పుట్టింటి కెళ్ళి నట్లు ..నూ..

    కన్నులుండి చూడలేని ఈ ద్రుతరాస్త్రుల లోకంలో
    నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే
    ఏమైపోతుందీ సభ్యసమాజం
    ఏమైపోతుందీ మానవధర్మం
    ఏమైపోతుందీ ఈ భారతదేశం... ..ఆ మహానుభావుడిని .. గుర్తుకుచేసుకుంటూ..
    :)))))))

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు. ఇందాకనే ఎవరో రాయగా చదివాను - అసలుకి జీవితంలోనే నాణ్యత తక్కువైంది

    ReplyDelete
  3. నిజంగా బాగా చెప్పారు.... కానీ చేయగలిగింది ఏముందో ....ఎవరూ చెప్పలేరు...
    చెప్పినా చేయలేరు...

    ReplyDelete
  4. బాగుంది. ఉన్న విషయాన్ని ఎంత సున్నితంగా చెప్పావమ్మాయ్! ఆన్నీ చూసీ చూడనట్లు పోతేనే పెద్దరికం మిగుల్తుంది కదా!

    ReplyDelete
  5. రాసీ రాయనట్లు గా ఉండాలిగానీ
    మరీ ఇలా అన్ని విషయాలు పూస గుచ్చి
    మేడలో వేస్తే మోయటం కష్టమే
    ఎందుకంటే ఎక్కడో అక్కడ తెలిసిన వాళ్ళే కనపడతారు
    అంతెందుకు మనమే కనపడతాం ..
    అందుకే రాసీ రాయనట్లు గా ఉండాలి
    మోసీ మోయనట్లుగా ఉండాలి
    ఆలోచనా పువ్వు
    పూసీ, విడవ నట్లుగా ఉండాలి

    ReplyDelete
  6. చాలా బాగుందండి. ఈ టపా బుజ్జిపండు వాళ్ళమ్మ రాసినట్టులేదు. ఇవాళ మరో అవతారం ఎత్తినట్టున్నారు!

    ReplyDelete
  7. చురకలు పెట్టీ పెట్టనట్టు పెట్టారు కదండీ.. ఐనా సరే చీమ కుట్టీ కుట్టనట్టు ఇలాగే ఉంటాం మేము.. భరత మాత ముద్దు బిడ్డలం కదా! ఏదేమైనా మేమింతే..చూసీ చూడనట్టు పోతుంటాం!!

    ReplyDelete
  8. నేను మీ టపా ఒట్టేసి చూళ్ళేదండీ

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. చెడు ఎక్కినంత తొరగా మంచి ఎప్పుడు ఎక్కదు... తిన్నామా పడుకున్నామా తెల్లారిందా.. అంతే

    ReplyDelete
  10. ఏడ్చీ ఏడవనట్టు నవ్వకుండా నవ్వాలేమో.

    ReplyDelete
  11. చూసి చూడనట్టు పోకుంటే గుండె పోటు తప్పదు
    అన్ని పట్టించుకుంటే అనారోగ్యం రాక తప్పదు
    'తప్పించుక తానొవ్వక తిరుగు వాడు ధన్యుడు సుమతీ' అని ఉరికే అన్నారా ..
    కాలుష్యం కోరల్లో ఉన్నాం -కల్మషాల దారుల్లో ఉన్నాం
    మంచి సలహా ఇచ్చి నందుకు అభినందనలు

    ReplyDelete
  12. ప్రతిదానికీ సంజాయిషీలు వుంటాయి, సమాధానాలు వుంటాయి. కానీ మనస్సాక్షి అనేది వుంది అని నమ్మేవాళ్ళకి మీరు రాసింది కొంచెం గట్టిగానే తగులుతుంది.చాలా బాగా రాసారు జ్యోతిర్మయి గారు.

    ReplyDelete
  13. @ వనజ గారూ ఆ పాటలో "కన్నులుండి చూడలేని దృతరాష్ట్రుల లోకం" బాగా వ్రాశారు కదూ.....ధన్యవాదాలు.

    @ నారాయణస్వామి గారూ అంతా 'టేక్ ఇట్ ఈజీ' పాలసీ..దేన్ని తేలిగ్గా తీసుకోవాలో దేన్ని పట్టించుకోవాలో ఆ రేఖ ఎప్పుడో చెరిగిపోయింది. ధన్యవాదాలు.

    @ మధురవాణి గారూ :(:( ధన్యవాదాలు

    ReplyDelete
  14. @ మాధవి గారూ నిజమేనండీ...ధన్యవాదాలు

    @ పెద్దవాళ్ళుగా పిల్లలకు మంచిచెడ్డ నేర్పి సరైన జీవితాన్ని ఇవ్వలేనపుడు పెద్దరికం ఏమి చేసుకోను బాబాయి గారూ..ధన్యవాదాలు.

    @ ఆత్రేయగారూ సూటిగా వ్రాసినా నవ్వుకుని వెళ్లిపోగలరు ఇక చెప్పీ చెప్పనట్లుగా చెప్తే..మీచేత మల్లెపూదండ వేయించుకున్న వాళ్ళ గురించి ప్రచారం చేయాలిగాని ఇలాంటివి ఎందుకు లెండి. మనసూరుకోక వ్రాసాను. ఏదో జరుగుతుందన్న ఆశతో కాదు. ధన్యవాదాలు.

    ReplyDelete
  15. @ తెలుగు భావాలు గారూ రేపు బుజ్జిపండు లాంటి పండులు పెద్దైతే మన సంస్కృతి, సాంప్రదాయం అని చెప్పడానికి ఏమైనా మిగలాలి కదండీ..బుజ్జిపండు వాళ్ళ అమ్మగానే వ్రాశాను. ధన్యవాదాలు.

    @ సుభా అవును మనం భారత మాత ముద్దుబిడ్డలమే అందుకే ఈ తపనంతా మన కుటుంబాన్ని మనమే బాగు చేసుకోవాలి. ధన్యవాదాలు.

    @ జిలేబిగారూ నేను ఈ విధంగా వ్రాయడం మీకు నచ్చలేదా చూడలేదంటున్నారు. చూడకపోయినా వచ్చారుగా చాలు. ధన్యవాదాలు.

    ReplyDelete
  16. @ తెలుగు పాటలు గారూ ఆ చెడుకు విపరీతంగా ఇచ్చే ప్రచారం మాని మంచితనాన్ని ప్రచారం చేస్తే మంచిదేమో.. అందరం స్వచ్ఛమైన ఆనందాన్ని చవిచూడొచ్చు. ధన్యవాదాలు.

    @ ఫణీంద్ర గారూ హాయిగా నవ్వేరోజు వస్తుందని ఆశిద్దాం. అందుకోసం కృషి చేద్దాం..ధన్యవాదాలు.

    @ నాన్నా గుండెపోటు వస్తుందనో, ఆనారోగ్యం అంటుతు౦దనో ఎదురుగా జరుగుతున్నదాన్ని ఖ౦డి౦చలేకపోతే ఇక జీవించి ప్రయోజనమేమిటి?

    ReplyDelete
  17. నాగమణి గారూ ఇక్కడ ఒకరి తప్పు వేలిత్తి చూపించడం కాదు. సినిమా తీస్తున్నది, ఆసిడ్ పోస్తున్నది, మద్యానికి బానిసలౌతున్నది, అనైతికానికి పాల్పడుతున్నది వేరేవ్వరో కాదు. మన అన్న, తమ్ముడు, బాబాయి, మామయ్య, వదినమ్మలే..మన వేలితో మన కంటినే పోడుచుకు౦టున్నాం. స్వల్ప ప్రయోజనానికి ఆశించి భావితరానికి రేపటి రోజు సుఖంగా బతికే అవకాశం లేకుండా చేస్తున్నాం. మనం పరిగెడుతున్నది ఎండమావులకోసం కూడా కాదు. ఎందుకో మరి అర్ధమే తెలియదు. ధన్యవాదాలు.

    ReplyDelete
  18. జ్యోతిర్మాయీ గారు,

    ఎంత మాటన్నారు !

    మీరు చూసీ చూడనట్టు పోవాలి అంటే, నేను చూళ్ళే దండీ అన్నా !! అంతే !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  19. జిలేబిగారూ ధ్యాస వేరుగా ఉన్న మూలాన గ్రహించలేక పోయాను. ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే అన్నారు కదండీ..అందుకే అలా వ్రాశాను.

    ReplyDelete
  20. చాల బాగుందండి, వీపు మీద చిన్న ,చిన్న దెబ్బలు వేసే పరిస్థితి దాటి, చెర్నాకోల తో చెల్ చెల్ మని ,దెబ్బలు, వేసినా, రక్తాలు ఓడుతున్న, నరం, పుండు లా సలుపుతున్న, అన్నిటికి ఓర్చుకుని, సహించి , నవ్వుతూ బతక గలిగే స్థితి లో ఉన్నాం అండీ, మనం..మన సమాజం..అంటే మళ్లీ మనమే..సమాజం అంటే ,ఎవరో అని ఒక వేలు ఎత్తి ఎదుట వాడిని చూపిస్తాం..నాలుగు వేళ్ళు మన వేపు చూపిస్తున్న ,చూడ లేని గుడ్డి వాళ్ళం అండీ..భలే చురకలు వేసారు..చర్ర్ మానే ఈ చురకల నొప్పి ,భలే హాయిగా ఉండండి..హీ..హీ .హాయ్..
    వసంతం.

    ReplyDelete
  21. వసంతం గారూ స్వాగతం. చెర్నాకోలు వాడడం నా అభిమతం కాదండీ..ఏమైనా చేయగలమా అని ఆలోచించమంటున్నాను..అశ్లీల దృశ్యాలు, దుస్తులు గురించి సినిమాల దాకా వెళ్లేము౦దు కనీసం తెలుగు సైట్ లలో బ్లాగుల్లో అసభ్యత నిర్మూలి౦చగలమేమో
    మన మనదరమూ ఆలోచించాలి. మార్పు చిన్నగా మొదలవుతుంది. మనసు మండితే వచ్చే బాధ కదండీ అనుభవించే వాళ్ళకు హాయిగానే ఉంటుంది. ధన్యవాదాలు.

    అన్నట్టు పాఠశాల బ్లాగులో మీ వ్యాఖ్య మంచి స్పూర్తినిస్తోంది ధన్యవాదాలు.

    ReplyDelete
  22. ప్రజల యాలోచనల యందు , పాలకులలొ ,
    పూని పాఠ్యాంశముల యందు , బోధ నందు ,
    పిల్లలను పెంచు పెద్దల యుల్లమందు
    మార్పు జ్యోతిర్మయీ ! వచ్చు , మంచి జరుగు .

    బ్లాగు: సుజన-సృజన

    ReplyDelete
  23. వెంకట రాజారావు గారూ నమస్కారం..స్పందించి పద్యరూపంలో అనునయవాక్యాలు పలికారు. నిజమేనండీ మార్పు తప్పకుండా వస్తుంది..మనం ఎన్ని సమస్యలను దాటుకుని రాలేదు..నేడు మనసు కోతిగంతులు వేస్తుంది. బుద్ధి బద్దకంగా విశ్రాంతి తీసుకుంటోంది..నేను వ్రాసినవన్నీ అందరికీ తెలిసినవే..బుద్దిని నిద్రలేపే ప్రయత్నం చేశాను అంతే.. ధన్యవాదాలు..

    ReplyDelete
  24. చాలా బాగుందండి..చూసీచూడనట్లు కాకుండా పూర్తిగా చదవాలనిపించింది సుమా :)..

    - రమేష్ బాబు

    ReplyDelete
  25. రమేష్ గారూ నా బ్లాగుకు స్వాగతమండీ.. చూసీచూడనట్లు కాకుండా...భలే చెప్పేరు..ధన్యవాదాలు.

    ReplyDelete
  26. జ్యోతి గారు, చాల బావుందండి. మన పరిధిలో మనం.. బాగా చెప్పారు. చూసి చూడనట్లు పోవటం అలవాటు అయిపోతోంది.. కాని ఎన్నాళ్ళు? ఎక్కడి వరకు? నిత్యం సంఘర్షణే! కాని ఎన్నాళ్ళు? ఎక్కడి వరకు...
    సుజాత

    ReplyDelete
    Replies
    1. సుజాత గారు నా ప్రశ్నే కూడా అదేనండీ. థాంక్యు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.