Wednesday, March 28, 2012

ఒకటే మాట

“ఆ వస్తున్న అమ్మాయిల్లో గులాబిరంగు చుడిదార్ వేసుకున్న అమ్మాయి ఎలా ఉందిరా?” తన్మయంగా చూస్తూ అన్నాడు గోపాలం.
“అటుపక్క నుండి రెండో అమ్మాయే కదూ! ఆ అమ్మాయెవరో నీకు తెలుసా?” పరీక్షగా చూస్తూ అన్నాడు మోహన్.
“లేదురా నెల రోజులుగా చూస్తున్నాను, నాకు విపరీతంగా నచ్చేసింది” అన్నాడు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. అమ్మాయిలు దగ్గరకొచ్చారు. గులాబిరంగు డ్రెస్ అమ్మాయి క్రీగంట చూస్తూ వెళ్ళిపోయింది.
“ఈ అమ్మాయి మా వీధిలోకి కొత్తగా వచ్చిన అమ్మాయిలా ఉందే” ఆలోచిస్తూ మోహన్.
“బాబ్బాబూ కనుక్కోరా ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్”. గోపాలం అభ్యర్ధన.
“కనుక్కు౦టాలే నువ్వంత బతిమాలాలా” అభయమిచ్చి మూడురోజుల తరువాత పూర్తి వివరాలతో వచ్చాడు మోహన్.
“ఆ అమ్మాయి పేరు రాధ, వాళ్ళ నాన్న బ్యాంకు లో మేనేజర్, వాళ్ళకు ఒక్కతే కూతురు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది” అంటూ ఏక బిగిన చెప్పాడు.
మూడు నెలలు గడిచాయి. ఆ తరువాత  ఏ సినిమా హాలులో చూసినా, పార్కులో చూసినా మన రాధా గోపాలమే..
పెద్దవాళ్ళకీ విషయం తెలిసింది. “టాట్ కుదరదన్నారు”.
రాధ గోపాలం ఇద్దరిదీ ఒకటే మాట “మేం ఇద్దరం ఒకరు లేకుండా మరొకరం ఉండలేం” అని.
ఓ ఏడాది తరువాత పెద్దవాళ్ళే సర్దుకుని ఇద్దరికీ పెళ్లి చేశారు.

                            *              *             *

పెళ్ళైన ఏడాది

“నాకు ఇంట్లో ఎక్కడి వస్తువులక్కడ వుండడం ఇష్టం రాధా” అన్నాడు గోపాలం కాఫీ తాగి కప్పు టీపాయి మీద పెడుతూ..
“నాక్కూడా గోపీ” అంటూ ఆ కప్పు తీసుకెళ్ళి సింక్ లో పెట్టి వచ్చింది రాధ.
“నా సాక్స్ ఎక్కడున్నాయ్ రాధా?” అన్నాడు టీపాయ్ మీద ఓ పక్కగా పెట్టిన పేపర్ చేతిలోకి తీసుకుంటూ..
“ఇదుగో షెల్ఫ్ లోనే ఉన్నాయ్” అంటూ తెచ్చిచ్చింది రాధ.
చదువుతున్న పేపర్ సోఫాలో పెట్టి “నేనాఫీసుకెళ్ళొస్తా రాధా, సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండు సినిమా కెళదాం” అంటూ గుమ్మ౦ వైపు నడిచాడు. ప్రేమగా వెనుకే వెళ్ళి తలుపు గడియ వేసి వస్తూ సోఫాలో విడివిడిగా ఉన్న పేపర్లను తీసి టీపాయ్ మీద సర్దిపెట్టింది.
సాయంత్రం గోపాలం వచ్చేసరికి ఇస్త్రీ చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని తయారుగా ఉంది రాధ. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని సినిమా కెళ్ళారు. "చిలిపికనుల తీయని చెలికాడా..నీలి కురుల వన్నెల జవరాలా" అని పాటలు కూడా పాడుకున్నారు.

రెండేళ్ళ తరువాత

“నాకు ఇంట్లో ఎక్కడి వస్తువులక్కడ వుండడం ఇష్టమని నీకు తెలుసుకదా రాధా” హల్లో చుట్టూ పడి ఉన్న బొమ్మలు, వస్తువులను చూస్తూ అన్నాడు గోపాలం.
“బాబిగాడు ఒక్క క్షణం ఊరుకోడు కదా, ఎన్ని సార్లు సర్దినా మళ్ళీ అన్నీ తెచ్చి ఇంటి మధ్యలో పడేస్తాడు” అంటూ హడావిడిగా సర్దేసింది రాధ.
“నా సాక్స్ తెచ్చివ్వు రాధా” అన్నాడు టీపాయ్ మీద ఓ పక్కగా పెట్టిన పేపర్ చేతి లోకి తీసుకుంటూ..
పిల్లాడికి ఇడ్లీ పెడుతున్న రాధ ప్లేట్ పక్కన పెట్టి వెంటనే తెచ్చిచ్చింది.
గోపాలం చదువుతున్న పేపర్ సోఫాలో పెట్టి “నేనాఫీసు కెళ్ళొస్తా రాధా, సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండు సినిమా కెళదాం” అంటూ గుమ్మ౦ వైపు నడిచాడు. అతని వెనుకే వెళ్ళి తలుపు గడియ వేసి వచ్చేసరికి పది పేపర్లను ఇరవై ముక్కలు చేశాడు చంటాడు.
సాయంత్రం వచ్చేసరికి నలిగిన చీరతో రాధ, బట్టల్లేకుండా చంటాడు..
“ఇంకా తయారవలేదా?” కొంచెం అసహనంగా గోపాలం..
“పిల్లాణ్ణి తయారు చేసి నేను చీర కట్టుకునేంతలో వీడు బట్టలు పాడుచేసుకున్నాడు. వీడికి ఒళ్ళంతా కడిగి ఇదుగో ఇప్పుడే వేరే బట్టలు మారుస్తున్నాను” అంది రాధ.
“సినిమా టికెట్లు దొరుకుతాయో లేదో” గోపాలం గొంతులో కనీ కనిపించని కోపం. పది నిముషాల తరువాత ఇద్దరూ చంటాడితో కలసి సినిమా కెళ్ళారు.

ఐదేళ్ళ తరువాత

“ఎన్నిసార్లు చెప్పాలి రాధా ఎక్కడి వస్తువులక్కడ పెట్టమని” చిందర వందరగా ఉన్న హాల్ చూస్తూ కొంచెం హెచ్చు స్థాయిలో అన్నాడు గోపాలం.
“ఉదయం పూట పిల్లలతో క్షణం తీరిక లేదు, కొంచెం అవన్నీ తీసెయ్ గోపీ” అంది రాధ, గదిలో పిల్లాడికి యూనిఫాం వేస్తూ...
హాలంతా కలియచూసి పేపర్ తీసి చదువుతూ “నాకు టైమవుతోంది రాధా, సాక్స్ తీసుకురా”
“చంటిదానికి ఇడ్లీ పెడుతున్నా గదిలో ఉన్నయ్ తీసుకో గోపీ”.
చదువుతున్న పేపర్ విసురుగా సోఫాలో పెట్టి గదిలో కెళ్ళి “ఎక్కడా?”
“అబ్బా ఎందుకలా అరుస్తావ్ గోపీ, నీ బట్టల కింద అరలో”
“నేనాఫీసు కెళ్ళొస్తా, సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండ౦డి సినిమా కెళదాం” అంటూ విసురుగా గుమ్మ౦ వైపు నడిచాడు.
“అలాగే” వంటగదిలో నుండి ఓ అరుపు.
తలుపు దగ్గరకులాగి వెళ్ళిపోయాడు. తలుపు గడియ వేసి వచ్చేసరికి ఇల్లంతా కిష్కిందకాండ.
సాయంత్రం వచ్చేసరికి స్నానం చేయని ఒళ్ళు, నలిగిన చీరతో రాధ, మురికి బట్టలతో చంటాడు, నిద్రలో చిన్నది.
“ఇంకా తయారవలేదా?” అసహనంతో కూడిన కోపంతో గోపాలం.
“ఉదయం నుండి పని తెమిల్తేగా అసలు” విసుగుతో రాధ.
ఎవరిమీదో తెలియని కోపంతో మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు గోపాలం.


                           *              *             *
                                       
“రాధకు నా మీద ప్రేమ తగ్గిపోయిందిరా మోహన్. ఒకప్పుడు నేనంటే ప్రాణంలా ఉండేది, ఇప్పుడు నేనంటే ఎంత నిర్లక్ష్యమో.” గోపాలం.
“ఏం చెప్పమంటావ్ రాణీ, ఒకప్పుడు గోపాలాన్ని చూస్తే ఈ మనిషికసలు కోపమొస్తుందా అనిపించేది..ఇప్పుడంతా చిర్రుబుర్రులే” రాధ.
ఇప్పుడూ రాధ, గోపాలం ఇద్దరిదీ ఒకటే మాట “జీవితం నరకమైపోయిందనుకో...”.

                    #             #             #
     
       తరువాతేమై౦దంటారా ఏముందీ..స్నేహితులూ బంధువులూ హితోపదేశం చేసి వారికి చేదోడు వాదోడుగా ఉండి, ఆ తరువాత రాధాగోపాలం పిల్లల పెళ్లిళ్లకు కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు రాధాగోపాలం ఇద్దరూ మిధునంలో అప్పదాసు, బుచ్చిలక్ష్ముల్లా కాలం గడుపుతున్నారు. ఇది ఓ ఇరవైయేళ్ళ క్రితం మాటలెండి.

       ఈ మధ్యే ఇలాటి సమస్యకు రాణి, రాధతో "అసలీ అన్యాయం సహించకే, ఇల్లు చక్కదిద్దేది నువ్వూ, పిల్లల్ని చూసేది నువ్వూ. గోపాలం నీమీద అధారటీ చెలాయిస్తున్నాడు. నువ్వే౦ ఒంటరిగా బ్రతకలేవా" అనీ, మోహన్ గోపాలంతో, "జీవితం నరకం అయ్యాక కలసి బ్రతకడ౦లో అర్ధం లేదు." అనీ చెప్పేశారు. ఇరువైపుల పెద్దలు కూడా "మీ అబ్బాయి ఇలా అంటే మీ అమ్మాయి ఇలా" అనేసుకుని అగ్నిలో ఆజ్యం పోశారు. ఎవరైనా చేదోడు వాడుగా ఉంటే, అంటారా ఈ స్పీడు యుగంలో ఎవరి గోల వారికి సరిపోతుంటే ఇక చేదోడ౦టారేమిటండీ ..ఫలిత౦.. విడాకులూ, విస్తరాకులూ, కోపాలూ, బాధలూ, ఒంటరితనాలూనూ..మధ్యలో పిల్లలు 'కోడి ఒక కోనలో పుంజు ఒక కొనలో పిల్లలేమో తల్లడిల్లె ప్రేమలేని కానలో...

28 comments:

  1. మీరు బలే రాస్తారు అండి.. కంటికి చూపిచేస్తారు... ఏమి జరుగుతుంది అసలు.. జలతారు గారు ప్రేమ పెళ్లి అంటారు... జిలేబి గారు విడాకులు అంటారు... మీరు జీవితం రాసేస్తున్నారు.. ఇంక ఏమి ఏమి చూడాలో?

    ReplyDelete
  2. మిథునం చక్కటి కథ,మీ రాధాగోపాలం ప్రహసనం వర్ణచిత్రంలా అలరించింది.నెల్లూరు నేను వస్తే?ఉంటారా?మెయిల్ ఇవ్వండి.

    ReplyDelete
  3. ప్రస్తుతం జరుగుతున్నదే వ్రాశారు.అవగాహన లేకపోతే ఇదే పరిస్థితి

    ReplyDelete
  4. జ్యోతిర్మయిగారు. బాగా రాసారు.భార్యా భర్తల మధ్య గొడవలు, తగాదాలు, మనస్పర్దలు మూడో మనిషితో పంచుకోవటమే తప్పు.Both of them should open up themselves without any ego problems and just let the other person know how frustated they are with changing situations and see how they can make things/relationship better. After few years of marriage changes are inevitable. Both of them should understand that. Nice post!

    ReplyDelete
  5. ఈ కాలంలో కూడా ఇలాంటి మగవాళ్ళు ఉన్నారంటారా? ఇప్పటి అబ్బాయిలకి కాస్త అవగాహన పెరిగింది. పిల్లలు పుట్టాక ఆ ఇంటి ఇల్లాలికి ఎన్ని పనులో తెలుసుకుని చేదోడు వాదోడుగా ఉంటున్నారే కాని ఇలాంటి వాళ్ళు చాలా తక్కువనే చెప్పచ్చు. చక్కని కథనం.

    ReplyDelete
  6. @ తెలుగు పాటలు గారూ ఏం జరుగుతున్నదంటేనండీ, మేం ఎవరం చెప్పినా...మీ భాషలో చెప్తానుండ౦డి "పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్" అదన్నమాట..ధన్యవాదాలు.

    @ ఉమాదేవి గారూ..మా రాధాగోపాలం మిమ్మల్ని అలరించినందుకు చాలా సంతోషం. ఈసారి ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. నన్ను కలవాలనుందన్న మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషపడ్డాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. @ రవిశేఖర్ గారూ అవగాహన, కొంచెం సహనం..అంతేనండీ..అన్నీ అలా అనలేముకాని, పెద్దవాళ్ళను చూసి నేర్చుకునే పద్ధతి కనిపించడంలేదు.
    మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    @ వెన్నెల గారూ "భార్యా భర్తల మధ్య గొడవలు, తగాదాలు, మనస్పర్దలు మూడో మనిషితో పంచుకోవటమే తప్పు" ఈ విషయంలో మీతో నేను పూర్తిగా ఏకీభావిస్తున్నాండీ..మూడో మనిషితోనే పంచుకోలేని విషయాలు లాయర్లదగ్గరా కోర్టుల్లోనూ పంచేసుకు౦టున్నారు. అదే సమస్య అంతానూ... ధన్యవాదాలు.

    @ రసజ్ఞా ఈ కాలంలో ఇలాంటి మగవాళ్ళు కొంచెం తక్కువనే చెప్పొచ్చు. కాకపోతే స్కూల్ పిటిఏ మీటింగ్ లలోనూ, పిల్లల ప్రోగ్రామ్స్ దగ్గర ఎక్కువ శాతం అమ్మలే కనిపిస్తుంటారు. ఇండియన్స్ అయినా, అమెరికన్స్ అయినా కూడా..కథనం నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  8. జీవిత్ంలో మార్పులొస్తాయని అర్ధం చేసుకోడానికి ఇష్టపడకపోవడం అసలు సమస్య, బాగా చెప్పేరు.

    ReplyDelete
  9. క్లుప్తంగా ,ఉన్న మాట చెప్పేరు, విడి పోవడానికే నిర్ణయించుకుని మొదలు పెడుతున్నట్టున్నారు, ఈ కాలం దంపతులు.

    భాగ్యస్వాం ,అంటే నువ్వు ఒక పని, నేనొక పని, అని వంతులు వేసుకుని, గిరి గీసుకుని , చెడ మడ, చెడుగుడు ఆదేయడానికి

    తయారుగా ఉన్నారు..ఏమిటో? ఈ వరస, సమాజం ని ఎక్కడికి తీసుకు వెళుతుందో?

    న్యాయం చెప్పాల్సిన తల్లీ తండ్రులే ఆజ్యం పోస్తున్నారు, మీరు చెప్పినట్టు..టోటల్ గ బాగుంది..

    వసంతం.

    ReplyDelete
  10. జ్యోతిర్మయి గారు..మంచి పోస్ట్. బావుంది. అలాగే మన మిత్రుల స్పందనలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  11. కధా, నడిపిన తీరు రెండూ బాగానే ఉన్నాయి. ఇలాంటి కధలు (ఇంత బాగా కాకపోయినా)ఈ మధ్య చాలా నే వస్తున్నాయి.లోపం ఎక్కడ ఉంది. మగవాడి అభద్రత వల్లా, సహనం, ఓర్పు తగ్గడం వల్లా లేక స్త్రీ ఆలోచనా ధోరణి మారడం వల్లా, మరేదైనానా.

    ReplyDelete
  12. @ బాబాయిగారూ సారా౦శాన్ని ఒక్క వాక్యంలో చెప్పారు. ఆ మార్పులకనుగుణంగా జీవితాన్ని మలచుకునే నేర్పు లేకపోవడం కూడా ఒక కారణం. ధన్యవాదాలు.

    @ వసంతం గారూ ఓడిడుకులలో నలుగుతున్నవి మన జీవితాలే అని అర్ధం చేసుకునే పరిణితి యువతలో కలిగినరోజు ఈ సమస్య తెలిపోతు౦దండీ..అది ఎప్పుడో ఏ విధంగానో తెలియదు మరి. ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ వనజ గారూ ధన్యవాదాలు.

    @ సుబ్రమణ్య౦ గారూ కథ నచ్చినందుకు చాలా సంతోషం. 'మగవాడి అభద్రత'.. కొత్త కోణం చూపించారు. ఈనాడు పిల్లలు పెరుగుతున్న వాతావరణంలో వారికి జీవితానికి అవసరమయ్యే పాఠాలు నేర్చుకునే అవకాశాలు తక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి, జీవన వేగానికి అలవాటుపడక ముందే భార్యాభర్తలిద్దరూ ఒకరిమీద ఒకరు నెపం వేసుకుని సమస్యను జఠిలం చేసుకుంటున్నారానిపిస్తుంది. ఆడ, మగ ఇరువురిలో సహనం తగ్గడం కూడా ఇందుకు కారణాలనిపిస్తుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  14. ధన్యవాదాలు మాలాకుమార్ గారూ..

    ReplyDelete
  15. జ్యోతిర్మయీ,
    నేను నీ పోస్టు ఆలస్యంగా చూసినందుకు క్షమించు. నాకు ఇందులో బాగా నచ్చిన అంశం ఏమిటంటే, సమకాలీన సమస్యను తీసుకుని దాన్ని present చేసిన తీరు. ఆకట్టుకునే విధంగా చెప్పగలిగే కథనం నీకు చాలా అలవోకగా అబ్బింది.
    పాఠకుడిని ఆలోచింపచెయ్యగలిగితే, బ్లాగుకి సామాజిక పరమార్థం కూడా నెరవేరినట్టే. తరాల మార్పుతో కుటుంబానికి ఎవరు ఆదాయం సంపాదించిపెట్టాలి ఎవరు నిర్వహించాలి అన్న సరళ రేఖ చెరిగిపోయింది. కనుక, కుటుంబమనే బండిని అక్షరాలా కాడి ఎద్దులులాగ ఇద్దరూ సమానంగా మొయ్యవలసిందే. ఒకరు ఎక్కువా కాదు. ఒకరు తక్కువా కాదు. ఆ తెలివి ఎంత త్వరగా మనసులో ఉదయిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. (ఇది ఇంట్లో ఉండే పెద్దలకు కూడా వర్తిస్తుంది. ఆ సత్యాన్ని గమనించి వాళ్ళు పిల్లల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉంటే, వాళ్ళు సుఖపడతారు). మంచి విషయం తీసుకున్నందుకు అభినందనలు.

    ReplyDelete
  16. మూర్తిగారూ మీరు క్షమాపణ చెప్పడమేమిట౦డీ. ఆలస్యంగా చూస్తేనేం మీ అభిప్రాయం చెప్పారు, చాలా సంతోషం. ము౦దుచూపులేక తొందరపాటుతో జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నవారిని చూశాక ఈ టపా వ్రాయాలనిపించింది.
    మీరు చెప్పింది అక్షరాలా నిజం. మారుతున్న పరిస్థితులను ఎంత త్వరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది. ధన్యవాదాలు.

    ReplyDelete
  17. రియలిస్టిక్ గ జీవితం చూడ లేక పోతే వచ్చే బాధల చిత్రీకరణ క్లుప్తంగా బాగుంది.

    ప్రతీ వాళ్ళ జీవితంలో చదువు, తల్లి తండ్రులు, ఉద్యోగం, భార్య (భర్త), పిల్లలు, డబ్బు, వరసాగ్గా వచ్చి కొన్ని కుదుపులు (aberrations ) కలిగిస్తాయి. వాటికి తట్టుకునే శక్తి, ఉపాయాలు ఉంటె జీవితం సుఖంగా ఉంటుంది లేకపోతే బట్టబయలవుతుంది.

    ReplyDelete
  18. లక్కరాజు గారూ నమస్కారం. జీవితంలో వచ్చే వడిదుడుకుల గురించి చక్కగా వివరించారండీ....వాటిని తట్టుకునే శక్తి వుండాలంటే చాలా ఓపిక కావాలి. నేటి స్పీడు యుగంలో అది లోపిస్తోంది....ధన్యవాదాలు.

    ReplyDelete
  19. చాలా ప్రాక్టికల్ గా జరిగేదే ఎక్కడ చూసినా...కాసిన మీరు ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ఒకటే సీన్, సంవత్సరం, రెండు, ఐదు తరువాత ఎలా మారుతుందో...మార్పు లేనిది జీవితం కాదేమో కదూ!

    ReplyDelete
  20. జ్యోతిర్మయి గార్కి శ్రీరామ నవమి శుభాకాంక్షలు .

    ఓర్పు తక్కువ , ఊహల ఊయెల దిగి ,
    జీవితపు నేలపై బడి , చెరిగి కలలు ,
    కొట్టు మిట్టాడు యువతను గూర్చి జ్యోతి
    గారు ! మీ కథ కను విప్పు కలుగ జేయు .

    ReplyDelete
  21. జ్యోతిర్మయి గారు,
    నమస్తే.
    ముందుగా
    మీకు, మీ కుటుంబ సభ్యులందరకు ఆనంద, ఆయురారోగ్య, ఐశ్వర్యాలను ఇవ్వాలని
    ఈ "శ్రీ రామ నవమి" సంధర్భముగా మనసారా కోరుకుంటున్నాను.
    ప్రస్థుత కాలపు దంపతులలో (ఎక్కువగ) దాంపత్యం మీద అవగాహన కన్నా భౌతికమయిన సుఖాల మీద అవగాహన ఎక్కువ ఉండటం ఒక కారణమనుకుంట. పూర్వం సమిష్ఠి కుటుంబ వ్యవస్థలో పెద్దవాళ్ళు మార్గదర్శకులుగా ఉండే వారు. ఇప్పుడో! పెళ్ళయిన వెంటనే వేరే కాపురం. అదేమిటంటే ఆధునిక జీవనంలో "జీవితాన్ని" సుఖమయం చేసుకోవడం అంటారు. అంటే ఏమిటో వారికే తెలియాలి.

    ReplyDelete
  22. @ చిన్నిఆశ గారూ మార్పులేని జీవితం నిస్తేజంగా ఉంటుందండీ...మార్పులకు తగినట్లుగా మన జీవితాన్ని మలచుకోవడంలోనే ఆనందం ఉంటుంది. కథనం నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    @ రాజారావు గారూ మీక్కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలండీ..పెద్దవారు నన్ను మీరు అని మన్నించకండి.
    ప్రతి టపాకు వ్యాఖ్య రూపంలో మంచి పద్యాలందిస్తున్నారు. అన్నింటినీ పదిలంగా దాచుకుంటాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  23. మూర్తిగారూ నమస్కారం. మీక్కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనుష్యులలో పెరుగుతున్న అభద్రతాభావం, ఒంటరితనం లాంటివి గమనించాక మళ్ళీ సమిష్టి కుటుంబాలు వస్తే బావుంటుందనిపిస్తు౦దండీ...
    ధన్యవాదాలు.

    ReplyDelete
  24. అవును మీరు చెప్పింది నిజం...కొందరైనా కాపురం నిలుపుకొనే మార్గాలు వెతుక్కుంటే బాగుండును

    ReplyDelete
  25. శశి గారూ మెల్లగా మార్పు వస్తుందనే ఆశిద్దాం. ధన్యవాదాలు.

    ReplyDelete
  26. బాగా వ్రాసారు. అందుకే నేనంటాను. ఉద్యోగంలో చేరేముందు soft skills నేర్పే తరగతులు వున్నట్టే, ఈ కాలం పిల్లలికి పెళ్ళికి ముందు అవగాహనా తరగతులు వుంటే కొంతవరకు మంచిదేమో! మీరేమంటారు?

    ReplyDelete
  27. సురేష్ గారూ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానండీ. ఇంతకూ పూర్వం ఇంట్లో వాళ్ళను చూసి చుట్టూ ఉన్నవారిని చూసి ఎలా మెలగాలో, జీవితం ఎలా ఉండాలో తెలిసేది. ఈ స్పీడు యుగంలో చదువులకే ఎక్కడి సమయం చాలట్లేదు. ఇంకా సమయముంటే సరదాలు. భాద్యతలు తెలిసే అవకాశమే లేకుండా పోతో౦ది. ఇక ఇలాంటి విషయయాలు తెలియాలంటే బోధనా పద్దతులే మంచి మార్గమేమో..ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.