Friday, March 16, 2012

నడివేసవి..నిమ్మకాయ మజ్జిగ..పెన్నానది

      అన్ని కాలాల్లోకి నాకు వేసవి కాలం అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎండలు మండే వేసవి అంటే ఇష్టమేంటి అనుకుంటున్నారా. ఎండలు ముదిరితేనే కదా బడికి సెలవులిచ్చేది, అమ్మమ్మగారింటికి వెళ్ళేదీ, నాన్నమ్మ దగ్గర గారాలు పొయ్యేదీనూ. ఇంకా అలాంటి జ్ఞాపకాల కలలు ఎన్నెన్నో...

     మా చిన్నప్పుడు వేసవి సెలవలు ఎక్కువగా మా అమ్మమ్మగారి ఊరైన నెల్లూరులో గడిపేవాళ్ళం. సెలవలివ్వగానే నేను నెల్లూరికి వెళ్లి పోయేదాన్ని తరువాత అమ్మ, నాన్న, తమ్ముడు వచ్చేవాళ్ళు. అమ్మావాళ్ళు వచ్చాక అందరం కలసి కొన్ని రోజులు నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం. ఆఖరి పరీక్ష వ్రాసి ఇంటికోచ్చేసరికే మా తాతయ్యో, పిన్నో నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా వచ్చేసు౦డేవాళ్ళు. అంటే తరువాత రోజు తెల్లారగట్లే అమ్మమ్మగారింటికి ప్రయాణమన్నమాట. 


     నేను ఇంటికి వచ్చీ రావడం తోటే అమ్మను కంగారు పెట్టేసి బట్టలూ అవీ చిన్న విఐపి సూట్కేస్ లో సర్దేసుకుని త్వరగా అన్నాలూ అవీ తినేసి ఎనిమిది గంటలకల్లా ఆరుబయట మంచాలేసుకుని పక్క ఎక్కేసే వాళ్ళం. రాత్రి త్వరగా పడుకు౦టే ఉదయం త్వరగా లేవొచ్చని. ఆ ఉత్సాహంతో నిద్ర ఎక్కడ పట్టేదీ..గంట గంటకూ లేచి ఆకాశం వంక చూడ్డమే. "శ్రీ సూర్యనారాయణా మేలుకో మేలుకో" అనే భానుమతి గారి పాటలో లాగా సూర్యుణ్ణి లేపే ప్రయత్నాలు చేసేదాన్ని. చివరకు ఎప్పటికో ఓ యుగం తరువాత చుక్క పొడిచేది. ఆ చీకట్లో బ్రాయిలర్ లో కాగిన వేడినీళ్ళు పోసుకుని, రాత్రే తీసి పక్కన పెట్టుకున్న బట్టలు వేసుకుని, రెండు జడలు వేయించుకుని, రాత్రి  తడిగుడ్డలో చుట్టి మంచులో పెట్టిన మల్లెపూలు పెట్టించుకుని అమ్మ పెట్టిన ఇడ్లీలు తినేప్పటికి తెల్లగా తెల్లవారిపోయేది.

     అప్పుడు మేం ఉండే ఊర్లో బస్టాండ్ గట్రాలు లేవు. ట్రంక్రో రోడ్డ్ దగ్గరకు వెళ్లి రోడ్డుపక్కనున్న జమ్మిచెట్టు దగ్గర నిలబడితే బస్ వచ్చి ఆగుతుంది. ఆగిన బస్ ఎక్కేసి సింగరాయకొండో, కావలో వెళితే అక్కడి నుండి నెల్లూరికి ఎక్స్ ప్రెస్ బస్సు దొరకొచ్చు. ఆ రోడ్ మీదకు బస్సు పదినిముషాలలో రావొచ్చు, లేకపోతే బస్సు రావడానికి గంటైనా పట్టొచ్చు, అడపా దడపా 
ఎక్స్ ప్రెస్ బస్ కూడా అక్కడ ఆగొచ్చు. అదంతా మనం లేచిన వేళా విశేషం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ రోడ్ మీద రయ్యిన ఇటూ అటూ లారీలు వెళుతూ ఉండేవి. ఆ లారీల వెనుక రాసిన సినిమా పేర్లు, వాక్యాలు భలే సరదాగా ఉండేవి. నేనూ, తమ్ముడూ ఆ రోడ్ మీద ఒక ఆట ఆడేవాళ్ళం చెరొక అంకె అనుకునేవాళ్ళం. ఎవరి అంకె నెంబర్ ప్లేట్ మీద ఉంటే ఆ నంబర్ వున్న లారీలూ, బస్సులూ అన్నీ వాళ్లవన్నమాట. ఈ ఆటతో బస్సు ఆలస్య౦గా  వచ్చినా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. మేం అల్లరి చేయకుండా ఎదురుచూడడం కోసం మా నాన్న కనిపెట్టిన ఆట ఇది. ఆ ఆటలో ఉండగానే వచ్చిన బస్సులో కూర్చుని నాన్నకు తమ్ముడికి టాటా చెప్పాక బస్సు కదలుతుంది కదా...అది రోడ్డు మీద వెళుతుందనుకున్నారేమిటి, అబ్బే మేఘాల్లోనే కదూ ప్రయాణం. ఉదయాన్నే ప్రయాణం పెట్టుకోవడం వల్ల బస్సంతా దాదాపుగా ఖాళీగా ఉంటుంది, తమ్ముడెలాగూ రాలేదు కాబట్టి కిటికీ పక్క సీటు మనకే ప్రత్యేకం. 

     కాసేపు వెనక్కి వెళుతున్న చింత చెట్లనూ, బ్రిడ్జినీ, పామాయిల్ తోటలనూ చూస్తూండగానే, పొగాకు బారెన్లు కనిపిస్తాయి. అవి దాటగానే రెండు బ్రిడ్జిలు వస్తాయి. అవన్నీ చూసి బుట్టలోంచి చందమామ పుస్తకం తీసి ఒక కథ చదవి పైకి చూస్తే జామ, మామిడి తోటలు వచ్చేస్తాయి. సింగరాయకొండ దగ్గర బస్సు ఆగగానే "జామకాయలు, జామకాయాల్ రూపాయికి ఆరు జామకాయాల్, జామకాయల్", "మామిడి కాయలమ్మా మంచి రసాలు తీసుకో౦డమ్మా", "వేర్సెనక్కాయాల్ వేర్సెనక్కాయాల్ ", "ఈతకాయలో" అంటూ బస్సు దగ్గరకు అమ్మడానికి వచ్చేవాళ్ళు. బస్సు బయలుదేరాక చందమామను ఒళ్లో పెట్టుకుని ఒక్క కునుకు తీయగానే కావలి వచ్చేసేది. కావలి బస్టాండ్ లో స్పెషల్, అల్లం నిమ్మరసం వేసిచేసిన చల్లని మజ్జిగ. డ్రైవర్  కండక్టర్ టిఫిన్ చేసి వచ్చేలోగా తాతయ్య నేను మజ్జిగ తాగేసి, అక్కడ షాపుల్లో వేలాడుతున్న పుస్తకాల దగ్గరకు వెళ్ళేవాళ్ళం. తాతయ్య నాకు బాలమిత్ర, బొమ్మరిల్లు కొనిపెట్టేవాళ్ళు. 

      కావలిలో బస్ బయదేరేప్పటికి బస్సు పూర్తిగా నిండి పోయేది. కాసేపు పక్క సీట్లో కూచున్న చిన్నపిల్లల్నీ..ఎదురు సీట్లో కూచున్న ముసలమ్మల్నీ చూస్తూ వాళ్ళ కబుర్లు మీద ఓ చెవి వేసి మళ్ళీ పుస్తకంలో తల దూర్చేసేదాన్ని. కథకూ, కథకూ మధ్య తల ఎత్తితే నీళ్ళు నిండిన చెరువులు, వేసవి అవడం మూలాన ఖాళీగా వున్న పొలాలు, వాటి గట్లమీద తాటిచెట్లు కనిపించేవి. చెట్లకి వేలాడుతూ తాటిగెలలు. అసలు తాటికాయల గురించి చెప్పాలంటే మనం నాన్నమ్మగారి ఊరు వెళ్ళాలి. ఆ కబుర్లు తరువాత చెప్పుకుందాం. 


        చివరాఖరకు మనం ఎదురుచూస్తున్న పెన్నానది కనిపించేది. బ్రిడ్జి మీద నుండి చూస్తే దూరంగా రంగనాయకుల గుడి కనిపిస్తూ ఉండేది. అవి రెండూ కనిపించాయంటే మనం నెల్లూరు వచ్చేశామన్నమాట. బస్సు దిగి తాతయ్యతో కలసి రిక్షా ఎక్కి రోడ్డుకు రెండువైపులా కనిపించే ఇళ్లూ, చెట్లూ, అక్కడా కనిపించే సినిమా పోస్టర్లూ, వాటిమీద నాగేసర్రావులూ, వాణీశ్రీలూ, చిరంజీవులని చూస్తూండగా మన వీధి ఆ చివర మలుపులో కనిపించేది. పుచ్చకాయల బండ్లు, కూరగాయల బుట్టలూ దాటుకుంటూ వెళితే వీధి మొదట్లో ఉండే సెట్టికొట్టు వచ్చేది. ఆ తరువాత డేగా వాళ్ళ ఇల్లు, పక్కనే పారిజాతం చెట్టు ఉండే ప్రసూనమ్మమ్మ గారిల్లు వెంట వెంటనే వచ్చేసేవి. ప్రసూనమ్మమ్మ గారెమీ మనకు చుట్టాలు కారు, కాని వీధిలో వాళ్ళందరినీ ఏవో వరసలు కలిపే పిలిచేవాళ్ళం ఇంతట్లో రిక్షా ఇంటి ముందు ఆగేది.

    గబుక్కున ఒక్క గంతులో రిక్షాలోనుండి దూకేసి ఇనుపగేటు గడి తీసేదాన్ని. ఆ శబ్దానికి ఇంట్లో నుండి రాధాకృష్ణుల బొమ్మ కుట్టివున్న తెల్లని కర్టెన్ పక్కకు తీసుకుంటూ చిన్నపిన్ని వచ్చేసేది. నన్ను చూడగానే తన మొహం మతాబులా వెలిగి పోయేది. "మా...బాబు, జ్యోతి వచ్చారు" అని ఓ చిన్న సైజు కేక పెట్టేది. మా అమ్మావాళ్ళు వాళ్ళ నాన్నను 'బాబా' అని పిలిచేవారులెండి. ఆ కేకకి వంటింట్లో ఉన్న అమ్మమ్మ రావడానికి ముందే ఇంటిపక్కనున్న సుగుణత్త గోడమీద నుండి తొంగి చూసి "ఏం మావా ఊరికి బోయి మనవరాల్ని తీసుకొచ్చా" అని తాతయ్యనూ "ఏం జోతా బావు౦డా" అని నన్నూ ఒక్కసారే పలకరించేది. ఈవిడ మనత్తే లెండి, పెద్దతాతయ్య కోడలు వాళ్ళింటికీ మనింటికీ మధ్య గోడే అడ్డం. ఈలోగా అమ్మమ్మ "ఏకోజావునే బయలుదేరినట్టున్నారే! అమ్మా వాళ్ళు బావుండారా?" అంటూ వరండాలోకి వచ్చేది. ఇంతట్లో పక్కింట్లో నుంచి రయ్యిన కరుణ గేటు తోసుకుని వచ్చేసేది. అచ్చుతప్పు కాదండీ తోసుకునే వచ్చేది. ఈలోగా వీధిలో వెళుతున్న చిన్నమ్మమ్మ "ఏమ్మే ఇపుడేనా రావడం..మీ అమ్మ రాలా?" అంటూ అక్కడ నుండే పలకరించేది. 

       బోల్డంత దూరం ప్రయాణం చేశాం కదా, కాస్త బడలిక తీర్చుకుని మిగిలిన కబుర్లు రేపు చెప్పుకుందాం.

30 comments:

  1. చాలా బాగా వర్ణించారు. చిన్ననాటి ముచ్చట్లు మరలా ఒకసారి మదిలో మెదిలాయి

    ReplyDelete
  2. "బోల్డంత దూరం ప్రయాణం చేశాం కదా, కాస్త బడలిక తీర్చుకుని మిగిలిన కబుర్లు రేపు చెప్పుకుందాం."

    నిజంగా మీతో పాటూ మేము కూడా ప్రయాణం చేసినట్లుగా అనిపించేటట్లు చెప్పారండీ మీ వేసవి ప్రయాణం కబుర్లు.. చాలా బాగున్నాయి.

    ReplyDelete
  3. చాలా బాగా నెల్లూరు ప్రయాణ ముచ్చట్లు తెలియ జేశారు కానీ చివరలో వ్రాసినట్లుగా మొత్తం నెల్లూరు మాండలీకం లో వ్రాసి వుంటే ఇంకా బాగా వుండేది

    ReplyDelete
  4. మీ చిన్ననాటి ముచట్లతో నా చిన్ననాటి జ్ఞాపకాల దొంతరలో చిరు కదలిక. నన్ను చాలా సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళి మా అమ్మమ్మ, తాతయ్యగారి ఇంటిలోనికి పంపేశారు కదా! ఆ జ్ఞాపకాల వర్షంలో తడిచి తన్మయత్వంతో ముద్దవుతున్న నేను ఏమని వ్యాఖ్యానించను? చాలా బాగుంది మీ శైలీ,మురిపమైన ముచ్చట.

    ReplyDelete
  5. oh..meeru nellore ammenaa!? mee tatimaa kaburluki vechi choosthoo..

    ReplyDelete
  6. @ కృష్ణ గారూ స్వాగతమండీ. మీకు విశేషాలు నచ్చాయన్నమాట. ధన్యవాదాలు.

    @ ప్రతాప్ గారూ స్వాగతం. అప్పటి విశేషాలు ఎప్పుడు తలచుకున్నా ఆనందమే. మీ చిన్ననాటి ముచ్చట్లు గుర్తోచ్చాయన్నమాట. చాల సంతోషం. ధన్యవాదాలు.

    @ అజ్ఞాత గారూ మీ పేరు చెపితే బావుండేది. మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. @ రాజిగారూ నాకూ మళ్ళీ వెళ్లి వచ్చినట్లుగా ఉంది. ఇలా మంచి విషయాలు పదే పదే గుర్తుతేచ్చుకోవడం బావుంటుంది కదూ..ధన్యవాదాలు.

    @ సుభా మూడు స్మైలీలిచ్చావ్ ఇవాళ. ధన్యవాదాలు.

    @ విజయ్ భాస్కర్ రెడ్డి గారూ నా బ్లాగుకు స్వాగతమండీ. తరువాత విశేషాలు మాండలీకంలోనే వ్రాయబోతున్నాను. మీ సూచనకు బోలెడు ధన్యవాదాలు. మీకు వీలయితే ఈ నాటికను చూడండి. అందులో శ్రీకాకుళం, నెల్లూరు భాషల మండలీక౦లో కొన్ని సంభాషణలు వ్రాశాను.

    http://themmera.blogspot.com/2011/10/blog-post_14.html

    ReplyDelete
  8. @ భారతి గారూ స్వాగతం..మీరూ మీ చిన్ననాటికి వెళ్లిపోయారా చాలా సంతోషం. మీ ముచ్చట్లు మాతో పంచుకోండి మరి. ధన్యవాదాలు.

    @ వనజ గారూ మా అమ్మమ్మ వాళ్ళది నెల్లూరండి. హైస్కూల్ దాటేవరకూ వేసవులన్నీ అక్కడే..ఆ ముచ్చట్లన్నీ త్వరలోనే వ్రాస్తాను.
    ఒక్క విషయం చెప్పనాండీ ఈ బ్లాగు మొదలెట్టే వరకూ నా జీవిత౦లో ఇన్ని మధురఘట్టాలున్నని గ్రహించలేకపోయాను. ఈ బ్లాగ్ ప్రపంచానికి, నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. * "ఏం జోతా బావు౦డా" * ఏమ్మే ఇపుడేనా రావడం..మీ అమ్మ రాలా?" అంటూ అక్కడ నుండే పలకరించేది.ఏం మావా ఊరికి బోయి మనవరాల్ని తీసుకొచ్చా*
    నెల్లురి యాసను బాగా రాశారు. వాటితో పాటుగా
    అదిగాదు అబ్బయా, ఏమ్మా ఇంట్లో రెడ్డి ఉండడా?, అల్లక్కడ, ఆసందు మొగదాల :) అనే పదాలను ఉపయోగిస్తూ రాయండి.

    ఈ ప్రయణాం ఏవురి నునంచి మొదలు పెట్టారో రాయలేదు.డేగా వారి ఇల్లు రాశారు. రామముర్తి నగర్ లో ఉండేవారా?

    ReplyDelete
  10. జయహో గారూ స్వాగతం.. మీరు చెప్పిన పదాలను తరువాత టపాలో ఉపయోగించి వ్రాస్తాను. మా ఊరు గురించి మరోసారి చెప్తాను. అలాగే 'డేగా వాళ్ళ ఇల్లు' అది అసలు పేరు కాదండీ..మాది రామ్మూర్తి నగర్ కాదండీ..మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  11. కళ్ళింత లాయె జదువగ
    నెల్లూరన్నంత నాకు నిజమిది తల్లీ !
    అల్లదె “ రామ్మూర్తి నగరు “
    కళ్ళకు గన్పించె జ్యోతి గారూ ! యెదుటన్

    బ్లాగు: సుజన-సృజన

    ReplyDelete
  12. నా బాల్యం కూడా గుర్తుకుతెచ్చారు.
    బాగా రాసారు.

    ReplyDelete
  13. @ వెంకట రాజారావు గారూ మీలాంటి పెద్దలకు నచ్చి పద్యం కానుకగా ఇవ్వడం నా అదృష్ట౦గా భావిస్తున్నాను. ధన్యవాదాలు.

    @ జలతారువెన్నెల గారూ స్వాగతం. మీరు కూడా బాల్యాన్ని గుర్తుచేస్తుకున్నారా... చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  14. ఏమండోయ్,

    మీకూ ఉన్నదన్న మాట ఈ అలవాటు!

    "కాసేపు పక్క సీట్లో కూచున్న చిన్నపిల్లల్నీ..ఎదురు సీట్లో కూచున్న ముసలమ్మల్నీ చూస్తూ వాళ్ళ కబుర్లు మీద ఓ చెవి వేసి మళ్ళీ పుస్తకంలో తల దూర్చేసేదాన్ని. "

    ఇంతకీ చివరాఖరు అనగా ఏమిటండీ !

    లేటాలస్యం లాగానా ?

    మంచి ప్రయాణానుభవం పంచుకున్నారు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  15. జిలేబిగారూ చిన్నప్పటి ప్రయాణం అంటే అంత సరదాగా ఉండేది. ఇక ఊరి విశేషాలు సరే సరి. ధన్యవాదాలు.

    ReplyDelete
  16. మీ ముంగిట ముగ్గు మనసుకు పలకరింపు.వేసవి వేళ చల్లని చలివేంద్రం మీ నడివేసవి...!బాల్యపు ఊసులు నిత్య పచ్చతోరణాలే.వసివాడని జ్ఞాపకపరిమళం బాల్యం.ప్రయాణం మీది,బడలిక తీరింది మాకు!

    ReplyDelete
  17. ఉమాదేవి గారూ ముగ్గుచూసి ముచ్చటపడి గొబ్బెమ్మపై గుమ్మడి పువ్వంటి వ్యాఖ్యపెట్టి మురిపించారు. ఊసులేవో చెప్పేవేళ ఊ కొడుతూ ప్రోత్సహించే మీ సహృదయానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  18. ఎంత బాగా మీతో పాటు మమ్మల్నందరినీ మీ అమ్మమ్మగారి ఊరు తీసుకెళ్ళారండీ....
    మరి మిగితా కబుర్ల కోసం ఎదురుచూపులే....

    ReplyDelete
  19. నెల్లూరు కబుర్లు చాలా బావున్నాయండి

    ReplyDelete
  20. @ మాధవిగారూ త్వరలోనే కబుర్లన్నీ చేపుతానండీ..మీతో చెబుతుంటే మళ్ళీ ఊరెళ్ళినంత ఉత్సాహంగా ఉంది. ధన్యవాదాలు.

    @ లోకేష్ శ్రీకాంత్ గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  21. ఏమైనది
    ఏల ఈ వేళ ఈ లీల నా కలం మూగవోయింది ..
    ఎవరు నన్ను
    గత జన్మ బంధాల గంధర్వ లోకాలకు మోసుకెళ్ళింది ..
    ఏ మృదు మధుర జ్ఞాపకం
    సుమ దళాల పరిమళాల వానలో ముద్దగా తడిపింది ..
    ఆనాడు సిరి మువ్వల చిరునవ్వులు
    కురిపించిన నువ్వే కదూ
    ఈనాటికి నన్ను నిండుగా పలకరించే నీ నవ్వే కదూ
    నిన్ను హాయిగా నడిపిస్తున్న కాలానికి,
    వెన్నెల సంతకాలు చేస్తున్న నీ కలానికీ
    ఇవే జోతలు --

    ReplyDelete
  22. ఎంత బాగా చెప్పావు నాన్నా..

    ReplyDelete
  23. Nellore tho naaku relation undi..Maa peddamma untundi..Mee blog chaduvutunte aa vishayalanni gurtuku vastunnayi..Maa sontha ooru kuda Singaraya konda daggare.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు నాకూ అలాంటి అనుబంధమేనండీ. ఆ ఊరి కబుర్లు తలచుకుంటే ఆ భాషలోనే గుర్తొస్తాయి. మీ ఊరు మాకు దగ్గరేనన్నమాట. ధన్యవాదాలు.

      Delete
  24. asalu ela rastarandi intha baganu

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానం అండి సుబ్రహ్మణ్యం గారు. థాంక్యు.

      Delete
  25. ఆ ఉత్సాహంతో నిద్ర ఎక్కడ పట్టేదీ..గంట గంటకూ లేచి ఆకాశం వంక చూడ్డమే.asalu ela rastarandi intha baganu.enni sarlu chadivina tanivi teeradu.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.