Wednesday, April 4, 2012

బుజ్జిపండు...పెరడు...పైప్ మేఘాలు

     "బుజ్జిపండూ రా నాన్నా బాక్ యార్డ్ లోకి వెళ్లి మొక్కలకు నీళ్ళు పెడదాం." అంటూ అమ్మ పెరటి తలుపు తీసింది. బుజ్జిపండు కిచెన్ సెట్ తో ఆడుతున్నవాడల్లా రయ్యిన పరిగెత్తుకొచ్చాడు. మరి పండుకి నీళ్ళంటే ఇష్టం కదా! అమ్మ నీళ్ళు పెట్టినంతసేపూ తను కూడా పైప్ కి అడ్డం వెళ్లి నీళ్ళతో ఆడుకుంటూ బట్టలు తడిపేసుకుంటాడు. అమ్మ కూడా 'ఆడుకోనీలే పాపం' అని పండును ఏమీ అనదు.

     ఆ రోజు బయట ఆకాశం మబ్బు పట్టి బాగా వర్షం వచ్చేలా ఉంది. చల్లగా గాలి కూడా వీస్తోంది. కొత్తగా వేసిన మొక్కలన్నీ ఆనందంగా తలలూపుతున్నాయి. ఓ పక్కగా ఉన్న నారింజ చెట్టుకి కాసిన ఆఖరి కాయలు అక్కడక్కడా తళుక్కుమంటున్నాయి. ఆ చెట్టు మొన్న జనవరిలో ఎన్ని కాయలు కాసిందనీ, తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చినా కూడా చెట్టు నిండా కాయలు ఉండేవి. బుజ్జిపండు, అక్క ఆడుకోవడానికి పెరట్లోకి వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్లకు కాయలు కోసి ఒలిచి పెట్టేది. నాన్న, బుజ్జిపండును భుజాల మీద ఎత్తుకుంటే, పండు కాయలు కోసేవాడు. అందుకే పండుకు ఆ చెట్టంటే భలే ఇష్టం.

     పెరట్లో ఈశాన్యం మూలగా ఉన్న 'పింక్ జాస్మిన్' పందిరి అంతా మొగ్గలే. "పండూ ఇవాళ నీళ్ళు పెట్టొద్దులే నాన్నా బాగా వర్షం వచ్చేలా ఉంది. నువ్వు సైకిల్ తో ఆడుకో నేను పూలు కోస్తాను" అంది అమ్మ చెట్టు వైపు వెళ్తూ. ఈ లోగా అక్క కూడా హోం వర్క్ పూర్తి చేసుకుని పెరట్లోకి వచ్చింది. "వచ్చం వచ్చు౦దా" అనుకుని మేఘాల వైపు ఆశ్చర్యంగా చూశాడు బుజ్జిపండు. ఆకాశం కొత్తగా కనిపించింది. తరువాత అమ్మ వెనకాలే పందిరి దగ్గరకు వెళ్లాడు. అమ్మ చిన్న గిన్నెలోకి మొగ్గలు కోస్తూ ఉంది. పండుకు కూడా కోయాలని ఉంది కాని పందిరి మరీ ఎత్తుగా ఉంది. "అమ్మా నన్నెత్తుకో నేనూ కోత్తాను" అన్నాడు పండు. అమ్మ బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఏ మొగ్గలు కోయాలో చెప్పింది. పండు ఒక్క మొగ్గ పట్టుకుని లాగగానే పసిమొగ్గలు కూడా తెగిపోయాయి. అమ్మకసలే పూలంటే ప్రాణం. పండును కిందకు దించి "పండూ నువ్వు అక్కతో ఆడుకో" అని పండుతో  చెప్పి"అమ్మలూ, పండును పిలువమ్మా" అని అక్కకు చెప్పింది.

     "పండూ ఇలా రా సైకిల్ ఆట ఆడుకుందాం" అని పిలిచింది అక్క. పండు దగ్గరకు రాగానే " నీ సైకిల్ లాన్ లోకి రాకూడదు, నా సైకిల్ ఫ్లోర్ మీదకు రానివ్వను" అని చెప్పి సైకిల్ మీద రౌండ్ గా తిరగడం మొదలెట్టింది. పండుకు అక్కని అలా చూడడం చాలా ఇష్టం. అమ్మ పూలు కోసినంతసేపు ఇద్దరూ అలా ఆడుకున్నారు. పూలు కోయడం అవగానే అమ్మ పూలగిన్నె గట్టు మీద పెట్టి కూరగాయల మొక్కల దగ్గరకు వెళ్ళింది. పండూ, అక్క కూడా అమ్మ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళిద్దరికీ అమ్మతో కలసి కూరగాలయాలు కోయడం చాలా సరదా. గోంగూర ఆకులు తుంచి ఒక పెద్ద గిన్నెలో వేశారు. అందులోనే రెండు టమాటోలు, వంకాయలు, పచ్చి మిరపకాయలు, ఓ నాలుగు బెండకాయలు కోసి వేశారు. అమ్మ పండుకు బీన్స్ కోసి ఇస్తే పండు చేతిలో పట్టుకుని తింటూ చూస్తున్నాడు. అసలు అమ్మ పెరట్లోకి రాకపోయినా పండు బీన్స్ కోసుకుని తినేస్తూ ఉంటాడు. అక్కకి మాత్రం అలా పచ్చివి తినడం ఇష్టం ఉండదు. అక్కకి కారెట్లిష్టం. మొన్న ఫాల్ లో తాతయ్య వచ్చినప్పుడు కారెట్ చెట్లు తవ్వి కారెట్లు బకెట్లో వేసి మట్టంతా పోయేలా బాగా కడిగి అక్కకూ, పండుకూ తినమని ఇచ్చారు.

     ఎగురుతున్న తూనీగను చూస్తూ దాని వెంట సొర చెట్టు దగ్గరకు వెళ్లాడు పండు. తూనీగ వాలినవైపు మోకాళ్ళ మీదకు వంగి చూస్తూ "అమ్మా లుక్ లుక్" అరిచాడు పండు. అక్క పరిగెత్తుకెళ్ళి చూసింది, సొరపాదు దగ్గర  బుల్లి సొరపిందె ముద్దుగా కనిపించింది. నిన్నటి దాకా ఉన్న పువ్వు కనిపించలేదు. అమ్మకూడా వచ్చి ఎన్ని పువ్వులున్నాయో చూసి తీగలను తోటకూర వైపు రాకుండా నేలపైకి మళ్ళించింది. ఆ పక్కనే ఉన్న స్వ్కాష్ ఇవాళ ఓ రెండు పే...ద్ద కాయలు కాసింది. ఈ లోగా చిన్నగా చినుకులు మొదలయ్యాయి. పూవ్వుల గిన్నె, కూరల గిన్నె తీసుకుని అందరూ లోపలకు వెళ్ళారు. అక్కా, పండు ఇద్దరూ గ్లాస్ డోర్ వెనుక వర్షం చూస్తూ నిలబడ్డారు.

     రెండు గ్లాసులలో పాలు తీసుకొచ్చి పిల్లలకిచ్చి, టీ తెచ్చుకోవడానికి లోపలకు వెళ్ళింది 
అమ్మ. "అక్కా, నీకు వచ్చం ఎలా వచ్చుందో తెలుచా?" అడిగాడు పండు పాలు తాగుతూ. "మేఘాలు..." అని అక్క మొదలు పెట్టగానే, "నేను చెప్తా నేను చెప్తా" అని అరిచి పాల గ్లాసు కాఫీ టేబుల్ మీద పెట్టి "చీ(సీ)లో వాతర్, పైప్ మేగాల్లో గుండా ఆకాచంలో ఉన్న మేగాల్లోకి వెల్తుంది. అప్పుడు బయట మనం ఏమైనా పెట్టామనుకో అది క్లౌడ్ మేగాలకు తెలిసిపోతుంది, అవి వచ్చం పడేలా చేత్తాయి." చెప్పాడు పండు. టీ తాగుతూ వాళ్ళ సంభాషణ వింటున్న అమ్మ "ఈ పైప్ మేఘాల గురించి నీకెవరు చెప్పారు పండూ?" అడిగింది. పండు ఒక్క నవ్వు నవ్వి, "నేనే చెప్పుకున్నా" అన్నాడు. 

      అమ్మ, అక్క, పండు వర్షం చూస్తూ కబుర్లు చెప్పుకుంటుండగా నాన్న ఆఫీసు నుండి వచ్చాడు. అమ్మ పైప్ మేఘాల కబుర్లూ, కూరగాయల కబుర్లూ అన్నీ నాన్నకు చెప్పింది. అక్క స్కూల్ విశేషాలు, పండు తోటలో చూసిన తూనీగ కబుర్లు చెప్పాడు.



24 comments:

  1. జ్యోతిర్మయి గారూ..
    మీ పెరడు విశేషాలు,అమ్మ,బుజ్జిపండు,అక్క
    తోట లో విహారాలు,పైప్ మేఘాల కబుర్లు బాగున్నాయండీ..

    ReplyDelete
  2. బుజ్జి పండు భలే ముద్దు ముద్దు మాటలు.. యెంత బాగున్నాయో! పైపు మేఘాలు.. బాగున్నాయి. క్లౌడ్ సీడింగ్ లా .

    ReplyDelete
  3. sweet! Loved the post! పిల్లలు చిన్నప్పుడు ఎంత అమాయకంగా, ముద్దుగా ఉంటారో!

    ReplyDelete
  4. బలే ఉందే అన్నట్లు ఇవాలా మాదేగ్గర కూడా వర్షం పడిందోచ్...

    ReplyDelete
  5. బుజ్జి పండు కబుర్లు ఆహ్లాదం గా ఉన్నాయి.

    ReplyDelete
  6. వామ్మో,

    రాబోయే కాలానికి న్యూటన్ అన్న మాట !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. మీ తోట లో నిజంగా అన్ని చెట్లు వున్నాయా ? పింక్ జాస్మిన్ అంటే చంబేలీలా ? మీ తోట కబుర్లు బాగున్నాయి .

    ReplyDelete
  8. జ్యోతిర్మయి గారూ,
    మీ పిల్లల ముచ్చట్లు ఎంత బావున్నాయో, మీరు వాటిని కథ అల్లి చెప్పే తీరు అంతకన్నా చాలా బావుంది. ఇలాంటి విషయాలు మీరు పిల్లల కథల పుస్తకంలా తయారు చెయవచ్చు. ఎంతో బావుంటుంది. తెలుగులో నేరుగా పిల్లల కథలు చెప్పే పుస్తకాలు చాల తక్కువ కనిపించాయి నాకు. కొత్తవి ఎప్పుడూ వస్తూ ఉంటే బావుంటుంది. ఎవరైనా పూనుకుని ఇవి పుస్తకంగా తెస్తే బావుంటుంది. ఒక కథ తెలుగు4కిడ్స్ కోసం అప్పుడే అడిగాను మిమ్మల్ని. తెలుగు4కిడ్స్ లో మీ కథలన్నీ ఉంచినా నాకు ఇష్టమే, మీకు అభ్యంతరం లేకపోతే. ఐతే పుస్తకంలాగా కూడా వస్తే బావుంటుంది.

    ReplyDelete
  9. @ రాజి గారూ మా కబుర్లనీ వినేసి మాకో కబురందించినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

    @ కృష్ణ గారూ స్వాగతం. మీ వ్యాఖ్య నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ధన్యవాదాలు.

    @ మౌళి గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  10. @ వనజ గారూ పిల్లల మనసులో ఎన్ని ఆలోచనలో కదా..బుజ్జిపండు మేలుకుని వున్న౦తసేపూ అమ్మతో కబుర్లు చెపుతూనే ఉంటాదండీ..ధన్యవాదాలు.

    @ వెన్నెల గారూ అవునండీ..పిల్లలతో ఉంటే ప్రపంచమే తెలియదు. ధన్యవాదాలు.

    @ తెలుగు పాటలు గారూ కాగితం పడవలు చేసి నీళ్ళలో వేశారా లేదా.... :) ధన్యవాదాలు.

    ReplyDelete
  11. @ సుబ్రహ్మణ్యం గారూ ఆ కబుర్లు ఎప్పుడు తలచుకున్నా నాకూ అదే భావన అండీ..ధన్యవాదాలు.

    @ జిలేబి గారూ బుజ్జిపండును భలే దీవించారే.. ధన్యవాదాలు.

    @ మాలా కుమార్ గారూ అవన్నీ ఉండేవండీ..ఇంకా కాప్సికం, చిక్కుళ్ళు, బీరకాయలు కూడా ఉండేవి. పింక్ జాస్మిన్ అంటే చమేలీయేనండీ. ఓ మూడు వారాలు పువ్వులు బాగా పూస్తుంది. ఇప్పుడు వేరే ఊరికి వచ్చాము. ఇక్కడ కూడా మొక్కలు నాటుతున్నాము. ధన్యవాదాలు.

    ReplyDelete
  12. లలితగారూ మీరు చెప్పింది నిజమేనండీ తెలుగులో కథల పుస్తకాలు చాలా తక్కువ. అందులోనూ వాడుక భాషలో ఇంకా తక్కువ. ఇప్పుడు నేను వ్రాస్తున్నవన్నీ నా జ్ఞాపకాలు. కథ అనేసరికి ఓ సందేశమో, నీతో వుంటే బావుంటుంది. అలా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మా విశేషాలు నచ్చి మీరు బ్లాగులో పెట్టుకు౦టానంటే అంతకంటేనా..అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయం గుర్తుంది. ఈ మధ్య పని వత్తిడి మరీ ఎక్కువగా ఉందండీ..త్వరలో ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  13. "కథ అనేసరికి ఓ సందేశమో, నీతో వుంటే బావుంటుంది."
    అలా లేని సరదా కథలు కూడా కావాలనే నేను మీ కథలు ఇష్టపడేది. ఒక వేళ సందేశమే కావాలనుకుంటే అది "ఊహా శక్తి" ని ప్రోత్సహించడం. ఇంకా మాట్లాడితే తోటపనులలో అమ్మకు సాయం చెయ్యడం అనుకోవచ్చు. చిన్న పిల్లల కథకి కావలిసినవన్నీ ఉన్నాయి ఇందులో. ఆంగ్ల సాహిత్యంలో పిల్లల పుస్తకాలు ఇలాంటి ముద్దొచ్చే విషయాలతో ఉంటాయి. అవి పిల్లలు ఎంత ఇష్టపడుతుంటారో మీకు తెలిసే ఉంటుంది కదా. అదీ నా ఉద్దేశ్యం. అన్నిటికన్నా మించిన ప్రయోజనం పిల్లలు ఇష్టంగా చదివితే భాష, సృజనాత్మకత అలవడుతాయి. నాకు కూడా కొన్ని రోజులు పిల్లల సెలవుల మూలంగా తీరిక దొరకకపోవచ్చు. మీతో సెలవుల తర్వాత మాట్లాడతాను.

    ReplyDelete
  14. మీరంత ప్రోత్సాహిస్తుంటే నాకూ ఉత్సాహం వచ్చేస్తోంది. తప్పకుండా చేద్దాం లలితగారూ..

    ReplyDelete
  15. చాలా చాలా చాలా బాగుందండీ....

    ఎందుకో ఈ పోస్టు మనసుకి ఆహ్లాదకరంగా ఉంది..

    ReplyDelete
  16. నేను కామెంటు పెట్టి మిగితావారి కామెంట్లు చూస్తుంటే బులుసు వారి 'ఆహ్లాదం' కనబడింది....
    బులుసువారికి,
    కాపీ కొట్టలేదు మాస్టారు... నాకు అనిపించింది చెప్పానంతే...

    ReplyDelete
  17. మాధవి గారూ మీకూ ఆహ్లాదంగా అనిపించిందా! సుబ్రహ్మణ్యంగారికి మీకూ ఒకే అనుభూతి కలిగిందన్నమాట. ప్రతి టపా చదివి వ్యాఖ్యలతో ప్రోత్సహిస్తున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  18. మీ బుజ్జిపండు కబుర్లు చాలా ముద్దుగా ఉన్నాయండీ!
    keep writing!

    ReplyDelete
  19. కొన్ని సాంకేతిక కారణాల వలన మీ బ్లాగు కు రావటం ఆలస్యము అయింది .కాని మీరు జరిగిన సంఘటనలను భలే వర్ణిస్తారు.వున్నదున్నట్టుగా !కబుర్లు చెబుతున్నట్టు.ఈ వేగ జీవితం లో పిల్లల ముచ్చట్లు బాగున్నాయి.

    ReplyDelete
  20. @ చిన్ని ఆశ గారూ మా పండు కబుర్లు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    @ రవిశేఖర్ గారూ పని ఒత్తిడిలో నాకూ వెంటనే సమాధానం ఇవ్వడానికి కుదరలేదండీ..మా కబుర్లు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  21. ఉన్నపళంగా నా చిన్నతనానికి వెళ్లిపోయా.. నా కజిన్ తమ్ముడితో ఆడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. నైస్ పోస్ట్ :)

    ReplyDelete
  22. అపర్ణ గారూ మా పిల్లల కబుర్లు మీ బాల్యాన్ని గుర్తుచేశాయన్నమాట. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.