Friday, January 27, 2012

కథాజగత్ - ధనలక్ష్మి

కథాజగత్ కథా విశ్లేషణకు నేనెంచుకున్నకథ 'శ్రీరమణ' గారు రచించిన 'ధనలక్ష్మి'.

      ఆత్మవిశ్వాసం, పట్టుదల, లోక్యం ముడిసరుకులుగా రూపొందిన కథ 'ధనలక్ష్మి'. 'శ్రీరమణ' గారు ఈ కథని నడిపించిన తీరు అనితరసాధ్యం. మొదటి వాక్యం నుండి చివరి అక్షరం వరకూ ఆపకుండా చదివించి "ఔరా!" అనిపించుకు౦టు౦దీ కథ. 

        ఈ కథలో ముఖ్య పాత్ర 'ధనలక్ష్మి', పరిస్థితుల కారణంగా ఆస్థి మొత్తం పోయినా, తరగని ఆత్మవిశ్వాతంతో జీవనం సాగించి, పూర్వ వైభవం సంపాదించుకోవడమే కాక జీవితాన్ని నందనవనం చేసుకున్న స్త్రీ . రచయిత 'ధనలక్ష్మి' ద్వారా చెప్పించిన వ్యాపారసూత్రాలుహారంలో పొదిగిన వజ్రల్లా అందంగా అమిరాయి. 

      ధనలక్ష్మి, సీతారామాంజనేయులు వారు కలసి జీవితం మొదలు పెట్టేనాటికి ఉన్న ఆస్థి పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటారు. రామాంజనేలు ఏదో ఒక చిన్న పనిచేసి జీవితం సాగిద్దాం అనుకుంటాడు. ధనలక్ష్మి అ౦దుకు ఒప్పుకోక వ్యాపారం చేసే ఆలోచన చేస్తుంది. అందుకు సమర్ధులైన వారి సహాయం తీసికుంటారు. ఈ కథలో రచయితే ఆ పాత్ర పోషిస్తారు, వారి ద్వారానే మనకు కథ చెప్పడం జరిగింది. 

      ధనలక్ష్మి రామాంజనేయులు పిండి మరతో వ్యాపారం మొదలు పెడతారు. పిండిమర నడపడం, దాని రిపేర్లు నేర్చుకోవడం ద్వారా మనకు ధనలక్ష్మి తెలివి తేటలు, దాని ద్వారా దొరికిన పిండిని సున్నుపిండిగా మార్చి అమ్మడం, చిల్లర అమ్మడం లాంటి వాటిల్లో ధనలక్ష్మి వ్యాపారదక్షత తెలుస్తుంది. మెల్లగా అప్పులు తీర్చి, అవసరమైన వాటిని జత చేసుకుంటూ చిన్న దుకాణం ఏర్పరచుకునే స్థాయికి ఎదుగుతారు. ఆ సందర్భంగా ధనలక్ష్మి చిన్న వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పిన విషయాలు చదివి తీరవలసినవి. యాత్రాబస్సులు ఏర్పాటు చేసి ఊరి ప్రజల మెప్పు పొందడమే కాకుండా, యాత్రల కవసరమైన వస్తుసామాగ్రిని తమ దుకాణం నుండే బస్సులో వేయించి,  వెళ్ళిన ప్రదేశాల్లో చౌకగా దొరికే వస్తువులను తమ ఊరికి తెచ్చి అమ్మి లాభాలు కూడా పొందుతారు. 

       శకుంతల మాటల్లోని వ్యంగం లోకరీతికి అద్దం పడుతుంది. ఎరువుల వేగన్ దాచి పెట్టడంలోనూ, సదరు వ్యక్తికి సొమ్మందించే విషయంగా ధనమ్మ వ్యవహరించిన విధానం ధనమ్మ యుక్తికి నిదర్శనాలు. అలాగే పనికిరాదనుకున్న స్థలాన్ని తీసుకుని తమకనుగుణంగా మార్చుకోవడంలో కూడా. ఈ విషయం దగ్గర తన భర్త అహాన్ని తృప్తి పరచి సంసారం నిలబెట్టుకోవడంలో మనకు పట్టూవిడుపూ తెలుసున్న ధనలక్ష్మి కనిపిస్తుంది. చివరగా తన కొడుకు విషయంలో తీసుకున్న నిర్ణయం, తదనుగుణంగా వ్యవహారం నడిపి తనకు కావలసిన విధంగా జరిపించుకోవడంలో ధనమ్మ లౌక్యం అమోఘం. సైన్సు మాష్టారుకు ఉద్యోగం రూపేణా ధన సహాయం చేయడం, తమకు వ్యాపారంలో సహాయం చేస్తున్నవారికి ఉచిత యాత్రాసౌకర్యాలు కల్పించడం ఆ దంపతుల పరోపకారానికి నిదర్శన౦.  
  
    చిన్న చిన్న విషయాలక్కూడా  బెంబేలుపడే మనస్తత్వానికి విరుద్దంగా రచయిత ధనలక్ష్మి పాత్రను మలచి, తద్వారా సంకల్పం, ఓపిక, పట్టుదల, తెలివి తేటలు, వ్యవహార దక్షతలన్ని౦టినీ మనకు చూపిస్తారు. ఈ కథలోసంభాషణల తీరూ, కథ చెప్పే విధానం ప్రతిభావంతమైన రచయత శైలిని సుస్పష్టం చేశాయి. ఈ కథ ఆశావాదానికి మారుపేరని కూడా చెప్పొచ్చేమో. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సినదీ కథ.

తూరుపు ముక్క కథాజగత్ లో ప్రచురితమైన 'ధనలక్ష్మి' కథను మీరు ఇక్కడ చదవొచ్చు

8 comments:

  1. నాకు చాల ఇష్టమైన కథ అండి ఇది ! మీ పరిచయం కూడా బావుంది !

    ReplyDelete
  2. శ్రావ్య గారూ నవోదయ పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసిన 'మిధునం' పుస్తకంలోని ఎనిమిది కథలూ చాలా బావుంటాయండీ..మీరు చదివేవుంటారేమో. మీకు సమీక్ష నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చదివేనుకాని వ్యాఖ్య వెంటనే పెట్టలేకపోయా. మంచి కధ చదివేను. పరిచయం కూడా బాగుంది.

    ReplyDelete
  4. నాకు కూడా చాలా ఇష్టమైన కథండీ.. బాగా రాశారు..

    ReplyDelete
  5. మీ పరిచయం పుణ్యమాని ఈ కథ ఈరోజే చదివాను. చాలా బాగున్నాయి, శ్రీరమణ గారి కథ, మీ సమీక్షా.. రెండూనూ..

    ReplyDelete
  6. @ బాబాయిగారూ కథా పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు.

    @ వేణూ శ్రీకాంత్ గారూ ధన్యవాదాలు.

    @ కృష్ణ ప్రియ గారూ మీరీ కథ ఇంతవరకూ చదవకపోవడం ఆశ్చర్యమే..సమీక్ష నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. Padmaja, Seattle, WA.April 17, 2012 at 3:36 PM

    Chaala years back ee story India Today special edition lo chadivanu. Writer name appudu anthaga chusokoledu. Kaani kadha maathram chaala baaga gurthu vundi. Ippdu ee kadha raasindi Ramana gaarani telisi bhale anandam anipinchidi. Thanks for the review. - Padmaja

    ReplyDelete
  8. పద్మజ గారూ రమణ గారి కథలు చదువుతుంటే మనసు ఈ లోకంలో ఉండదు. నేను ఆయన అభిమానిని. రమణ గారి ప్రతి కథా మనసులలో అలా నిలిచిపోతుంది. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.